పవన్‌కు వత్తాసు పలికినా.. పొత్తు కుదరదు బాసూ!

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు చికెన్ నారాయణ మద్దతు పలుకుతున్నారు. సిపిఐ నారాయణ అనే పేరుతో కంటే చికెన్ నారాయణ అనే పేరుతోనే ఎక్కువ పాపులర్ అయిన ఈ వామపక్ష నాయకుడు పవన్…

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు చికెన్ నారాయణ మద్దతు పలుకుతున్నారు. సిపిఐ నారాయణ అనే పేరుతో కంటే చికెన్ నారాయణ అనే పేరుతోనే ఎక్కువ పాపులర్ అయిన ఈ వామపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆ అంశాన్ని ప్రశ్నించడం, ప్రస్తావించడం అనేది జగన్ చేస్తున్న తప్పుగా అభివర్ణిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజకీయంగా పసలేకపోవడం వల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత నిందలకు దిగుతున్నారని సిపిఐ నారాయణ పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా సరే జగన్ కుఎందుకు అంటూ వకాలత్తు పుచ్చుకుంటున్నారు.

ఈ తీరుగా అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ ను వెనకేసుకు రావడం వలన గ్రహాలు అనుకూలించి తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమో అని నారాయణ వ్యూహరచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే, చేగువేరా ఆదర్శం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మత వాదానికి ప్రతీకఅయిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా తప్పు అని ఆ స్నేహబంధం నుంచి ఆయన బయటకు రావాలని నారాయణ గతంలో చాలా సార్లు చెప్పారు. వామపక్షాలతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఏపీలో ఎన్నికలకు వెళ్లాలనే అభిలాషను కూడా వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలతో పాటు తెలుగుదేశాన్ని కూడా కలుపుకోవాలనే కోరిక కూడా నారాయణకు ఉంది. అయితే అవేమీ నెరవేరే అవకాశాలు మాత్రమే కనిపించడం లేదు.

అయినా సరే, దింపుడు కళ్లెం ఆశ చావనట్లుగా అయిన పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాటలు చెబుతున్న ట్లు అనిపిస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ గురించి సమర్థించే మాటలు మాట్లాడినంత మాత్రాన జనసేనాని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు వదులుకొని నారాయణ అభిలాష మేరకు వామపక్షాలతో జట్టు కడతారని అనుకోవడం ఒక భ్రమ.

పవన్ ఎంతటి అవకాశవాది అంటే ఆదర్శాల విషయంలో వామపక్ష సిద్ధాంతాలు ప్రవచిస్తూ, ఆచరణ విషయంలో మతవాద పార్టీల మోచేతి నీళ్లు తాగుతుంటారనేది జనంలో ఉండే అభిప్రాయం. కనుక సిపిఐ నారాయణ.. ‘‘మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా? ఇంట్లో బాబాయిని చంపడం ప్రమాదమా? అని వివేకా హత్యను ప్రస్తావించడం చవకబారు పని. బాబాయిని చంపడం నేరం కాదా అని ప్రశ్నిస్తూ, పవన్ విడాకులు తీసుకుని మరీ ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు అభ్యంతరం ఏమిటి? అని వాదించడం తన దిగజారుడుతనం అని తెలుసుకుంటే కనీసం పరువు దక్కుతుంది.