జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వరం మారింది. ఒకవైపు చంద్రబాబుకు జనసేనాని దగ్గరవు తున్నట్టు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తమతో పొత్తులో ఉన్నానంటూనే, మరోవైపు టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న పవన్‌కల్యాణ్ వ్యవహారశైలిపై బీజేపీ గుర్రుగా ఉంది.
కుటుంబ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ఆదివారం సోము వీర్రాజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న నంద్యాల పర్యటనలో పవన్‌కల్యాణ్ వద్ద ప్రస్తావించగా, పకపక నవ్వడం తప్ప సమాధానం చెప్పక పోవడం గమనార్హం.
ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలంటే గౌరవం అని చెప్పే పవన్‌కల్యాణ్, ఆచరణకు వచ్చే సరికి చంద్రబాబుపై ప్రేమ కనబరుస్తున్నారు. ఇదే బీజేపీకి కోపం తెప్పిస్తోంది. టీడీపీతో పొత్తుపై ఇవాళ మరోసారి సోము వీర్రాజు మరింత స్పష్టత వచ్చారు. ఇదే సందర్భంలో జనసేనతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏలూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….
“2024లో మేమే అధికారంలోకి వస్తాం. జనంతో పొత్తులో ఉన్నాం. అవసరమైతే జనసేనతో పొత్తు వుంటుంది. జనసేన మాతోనే వుంది. ఇదే విషయాన్ని పవన్‌కల్యాణ్ చెప్పారు. నేనూ చెబుతున్నా, టీడీపీతో జనసేన పొత్తుపై పవన్‌కల్యాణ్‌నే అడగండి, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పాల్సిన విషయాలు నేను చెప్పడం భావ్యం కాదు. మా పార్టీ లైన్‌ని నేను చెప్పాను” అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
జనంతో పొత్తులో ఉన్నామని, అవసరమైతేనే జనసేనతో అని సోము వీర్రాజు చెప్పడం చర్చనీయాంశమైంది. జనసేనపై బీజేపీ ఆశలు వదులుకుందనేందుకు సోము వీర్రాజు తాజా అభిప్రాయాలే నిదర్శనమని అంటున్నారు. అంతేకాదు, పవన్ అంటే తమకేం సంబంధం లేదన్నట్టు వీర్రాజు మాట్లాడారు.
ఎవరో చెప్పాల్సిన విషయాలను తనను అడగడం ఏంటని ఆయన కాసింత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ అసహనం, ఆగ్రహం అంతా పవన్‌కల్యాణ్ మీదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పవన్‌కల్యాణ్‌తో తెగదెంపులకు బీజేపీ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది.