టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు అడ్డం తిరిగాయి. తన భయాందోళనలను ఇతరులపై నెట్టి గంభీరంగా వుండటం చంద్రబాబు ప్రత్యేకత. తాజాగా పొత్తుల విషయంలోనూ అంతే. పొత్తులు లేకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే త్యాగానికి సిద్ధమని మరీ ప్రకటించి, ప్రతిపక్షాలను ప్రాధేయపడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం.
కానీ తనపై విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో ఆయన తాజా వ్యాఖ్యలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే జనసేనతో పొత్తు లేకపోతే …టీడీపీ భవిష్యత్ ఏంటో ఆయన మాటల్లో భయాన్ని చూడొచ్చు. కాకపోతే వాటిని రివర్స్‌లో అర్థం చేసుకోవాల్సి వుంటుంది. తన పార్టీకి జరిగే ప్రమాదాన్ని, జగన్‌కు అంటగట్టి చెప్పడం చంద్రబాబు ప్రత్యేకత.
“జగన్ సింహం కాదు పిల్లి. భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చాను. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్టు వక్రీకరించారు. 2024లో ఓడిపోతే వైసీపీ వుండదని జగన్‌కు అర్థమైంది” అని చంద్రబాబు మాట్లాడ్డం విశేషం.
ఇంతకూ గత కొన్ని నెలలుగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నదెవరో ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే, ఇక ఆ పార్టీ చరిత్ర గతమని చెప్పుకునే దుస్థితి ఎదురవుతుందనే ఆందోళన చంద్ర బాబులో ఉంది.
వయసు పైబడుతుండడం, మరోవైపు కొడుకు సమర్థతపై బెంగ. పొత్తు కోసం పవన్, బీజేపీ కాళ్లావేళ్లా ఎవరు పడుతున్నారో, ఎందుకు పడుతున్నారో జనానికి బాగా తెలుసు. అయితే తన దిగజారుడుతనాన్ని జగన్‌పై నెట్టేయాలని అనుకోవడమే బాబు నైజం.
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలన్నానే తప్ప, పార్టీలను కాదని ఆయన చెప్పడం పెద్ద జోక్. ఈ మాటతో పవన్‌కల్యాణ్‌ను జోకర్ చేసినట్టు అర్థం చేసుకోవాలా? చంద్రబాబు పొత్తు హస్తం ఇస్తున్నారని భావించి పవన్‌కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.
మరి జనసేనతో పొత్తు కోసం కాకుంటే, ఒన్‌సైడ్ లవ్ లాంటి కవ్వింపు మాటలెందుకో చంద్రబాబు చెప్పాలి.