ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎన్నికల్లో ఎప్పుడూ బయటి రాష్ట్రాలవారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. దాంతో వైసీపీ నాయకులకు సీట్లు కట్ అయిపోతున్నాయి. వాళ్లకు ఇచ్చిన హామీలు గంగలో కలిసి పోతున్నాయి. ఈసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం వస్తోంది.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడల్లా బయటి రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఉరుకులు పరుగులమీద ఏపీకి తరలి వస్తుంటారు. దీంతో వారి కోరికను జగన్ కాదనలేరు. దీంతో రాజ్యసభ సీట్ల మీద ఆశ పెట్టుకున్న వైసీపీ నాయకులు ఉసూరుమంటుంటారు. పాదయాత్ర సమయంలో పార్టీ నేతల్లో కొందరికి రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వారంతా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కానీ బయటి రాష్ట్రాలనుంచి వచ్చే పారిశ్రామికవేత్తల కారణంగా వీరు మరికొంతకాలం వేచిచూడక తప్పడం లేదు. రాజ్యసభ స్థానాల కోసం పారిశ్రామికవేత్తల నుంచి ఇంతస్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఊహించని ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ….గతంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌నత్వానీని వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనికోసం ముఖేష్ అంబానీ తాడేపల్లి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.
అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన సతీమణిని రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రితో సన్నిహితత్వం ఉండటంతో ఆయన దీనిపై ఇప్పటికే మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చిందా? లేదా? అనేదానిపై వీరు చెప్పలేకపోతున్నప్పటికీ ఒక సీటు అదానీకివ్వడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. విజయసాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపిస్తారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే…తెలంగాణ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముచ్చింతల్ లో రామానుజ విగ్రహం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి చినజీయర్ స్వామికి, సీఎం కేసీఆర్ కు పడకుండా పోయింది. చినజీయర్ ను దూరం పెట్టిన కేసీఆర్ చినజీయర్ కు సన్నిహితుడైన, ముచ్చింతల్ లో కీలక పాత్ర పోషించిన జూపల్లి రామేశ్వర్ రావును కూడా దూరం పెట్టారని అంటున్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో సంబంధాలు బెడిసికొట్టడంతో ఆయన వైసీపీ తరఫున ఎంపికవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అవసరమైతే తాను అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని, పార్టీలో చేరతానని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తం నాలుగు సీట్లలో ఒకటి అదానీకి, మరొకటి జూపల్లి రామేశ్వరరావుకు ఇస్తే మిగిలేవి రెండు సీట్లు. హైదరాబాద్ ఫార్మా రంగంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా రాజ్యసభకు వైసీపీ కోటాలో ఎంపికవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా మొదటి నుంచి దివంగత వైఎస్‌కు, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌కు సన్నిహితులే. మరి రాజ్యసభ సీట్ల పైన జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.