అద్బుతాలు జరుగుతాయి.. ఆ మాటొక్కటే అన్నాడు పాపం పవన్ కల్యాణ్. కానీ నిన్న అద్భుతం జరిగింది. పెద్దిరెడ్డి, బొత్స, అంబటి, జోగి రమేష్.. ఒకరేంటి.. మీడియా ముందుకొచ్చినోళ్లంతా ఆయనకు చాకిరేవు పెట్టారు. పనిలో పనిగా చంద్రబాబుకి కూడా గడ్డి పెట్టారు.
ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ కి ఈ రేంజ్ లో వాయింపుడు పడలేదు. బహుశా పొత్తులు అనే సరికి, అందులోనూ బాబుకి కచ్చితంగా మద్దతిస్తాను అన్నట్టు మాట్లాడే సరికి అందరూ ఫైరయ్యారు.
రాజకీయ వ్యభిచారి..
మంత్రివర్గ విస్తరణలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ యాదవ్ వంటి వారికి పదవులు తిరిగి రాకపోయే సరికి.. కొత్తవారిలో ఆ స్థాయిలో గట్టిగా మాట్లాడేవారు ఎవరూ లేకపోయే సరికి పవన్, చంద్రబాబు బతికిపోయారనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. అప్పుడే మేలు, కాస్తో కూస్తో పద్ధతిగా వాయింపుడు పడేది.
ఇప్పుడు ఏకంగా పవన్ ని రాజకీయ వ్యభిచారి అంటూ మంత్రి జోగి రమేష్ స్టేట్ మెంట్ ఇచ్చారు. బీజేపీ పక్కన ఉంటూ, చంద్రబాబుకి లైనేస్తున్న పవన్ ని ఏమనాలో మీరే చెప్పండి అంటూ సెటైర్ పేల్చారు. పవన్ ఎవరితో కలిసినా, ఏం చేసినా మాకు ఇబ్బందేమీ లేదంటున్న జోగి.. అక్రమ పొత్తులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.
జనసేన పెట్టింది ఎవరి కోసం పవన్..?
అసలు జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబుని సీఎంని చేయడానికేనా అంటూ సూటిగా ప్రశ్నించారు మరో మంత్రి అంబటి రాంబాబు. జగన్ కి వచ్చే ఆదరణ చూసి పవన్ హడలిపోతున్నారని అన్నారు. పవన్, బాబు పొత్తుల ప్రకటనలపై అంబటి కౌంటర్ ఇచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి కూడా పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం చంద్రబాబుతో అనైతిక కలయికలో ఉన్నారని, ఇక నైతికంగా కలిసి ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నారని అన్నారు. వారిద్దరూ కలసి వచ్చినా, విడివిడిగా వచ్చినా జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరంటున్నారు పెద్దిరెడ్డి. మరో మంత్రి బొత్స, స్పీకర్ తమ్మినేని.. ఇలా దాదాపుగా వైసీపీ నేతలంతా ఈ అక్రమ పొత్తులకు కౌంటర్లు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ కూడా ఈ దాడిని ఊహించి ఉండరు. తానేదో చంద్రబాబుతో పొత్తు అని హింట్ ఇచ్చే సరికి ఈ రేంజ్ లో వైసీపీ నేతలు ఫైరెందుకవుతున్నారా అని ఆలోచనలో పడ్డారాయన. పార్టీ పెట్టినప్పట్నుంచి పవన్ ది పొత్తు రాజకీయమే. సోలోగా పోటీ చేసే పరిస్థితి ఆ పార్టీకి ఇంకా రాలేదు.
కాకపోతే ఆ పొత్తుల్లో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పవన్ కల్యాణ్ నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. అందుకే వైసీపీ నుంచి ఈ స్థాయిలో ఎదురుదాడి.