జ‌గ‌న్ సాహ‌సం…స‌మీప బంధువు అరెస్ట్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సాహ‌సం చేశారు. స‌మీప బంధువుని కూడా చూడ‌కుండా అరెస్ట్ చేయించి బెదిరింపుదారుల‌కు హెచ్చ‌రిక పంపారు. కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించిన కేసులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువైన వైఎస్ కొండారెడ్డిని…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సాహ‌సం చేశారు. స‌మీప బంధువుని కూడా చూడ‌కుండా అరెస్ట్ చేయించి బెదిరింపుదారుల‌కు హెచ్చ‌రిక పంపారు. కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించిన కేసులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువైన వైఎస్ కొండారెడ్డిని చ‌క్రాయ‌పేట పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ప్ర‌స్తుతం ఈయ‌న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చ‌క్రామ‌పేట మండ‌ల వైసీపీ ఇన్‌చార్జ్‌.

పులివెందుల -రాయ‌చోటి మార్గంలో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అస‌లే వైఎస్సార్ కుటుంబ స‌భ్యుడు, పైగా చ‌క్రాయ‌పేట మండ‌లం వైసీపీ ఇన్‌చార్జ్ అనే అధికారంతో కాంట్రాక్ట‌ర్ల‌పై వైఎస్ కొండారెడ్డి బెదిరింపుల‌కు దిగిన‌ట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ప‌నులను ఎస్ఆర్‌కే క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తోంది. స‌ద‌రు సంస్థ య‌జ‌మానుల‌పై వైఎస్‌ కొండారెడ్డి బెదిరింపుల‌కు దిగారు. బెదిరింపుల‌కు అధికార పార్టీ నేత ఎందుకు దిగారో సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు.

అస‌లే వైసీపీ రౌడీయిజంతో పాటు స‌మ‌యానికి బిల్లులు రావ‌ని చాలా మంది కాంట్రాక్ట‌ర్లు ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో ప‌నులు చేసేందుకు ముందుకొచ్చిన త‌మ‌ను జ‌గ‌న్ స‌మీప బంధువు వైఎస్ కొండారెడ్డి బెదిరిస్తున్నార‌ని చ‌క్రాయ‌పేట పోలీస్‌స్టేష‌న్‌లో స‌ద‌రు కాంట్రాక్ట‌ర్లు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేశారు. సీఎం బంధువు కావ‌డంతో విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

త‌న పేరు చెప్పి కాంట్రాక్ట‌ర్ల‌ను బెదించ‌డాన్ని సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అదేశించిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజ‌రుప‌రిచిన‌ట్టు క‌డ‌ప ఎస్పీ అన్బురాజ‌న్ వెల్ల‌డించారు. స‌మీప బంధువ‌ని కూడా లెక్క‌చేయ‌కుండా కొండారెడ్డిని అరెస్ట్ చేయించ‌డంపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా వుండ‌గా గ‌తంలో వైఎస్ కొండారెడ్డి రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొన‌సాగారు. ఈయ‌న్ను భ‌రించ‌లేం బాబోయ్ అని రైల్వేకోడూరు వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు మొర పెట్టుకోవ‌డం, ఆ త‌ర్వాత చ‌క్రాయ‌పేట మండ‌లానికే ప‌రిమితం చేసిన‌ట్టు స‌మాచారం. అక్క‌డ కూడా బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డంతో అధికార పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని భావించి జ‌గ‌న్ అరెస్ట్ చేయించిన‌ట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు.