పాండవుల అజ్ఞాతవాసాన్ని విరాటపర్వం అంటారు. రానా హీరోగా ఆ పేరుతో వస్తున్న సినిమా ఇంతకాలం అజ్ఞాతవాసం గడిపింది. ఎట్టకేలకు జూలై ఫస్ట్‌కి రిలీజ్ అంటున్నారు.
2018లో ఈ సినిమా ప్రకటన వచ్చింది. 19లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కరోనాతో ఆగిపోయింది. 2021లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. చివరికి ఇప్పటికి కుదిరింది.
1990 నాటి తెలంగాణలో నక్సల్స్ ఉద్యమ నేపథ్యం కథాంశం. ఈ మధ్య నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఆచార్య జనాలకి కొంచెం కూడా ఎక్కలేదు. దానికి కారణం ఇప్పటి జనరేషన్‌కి నక్సలిజం గురించి తెలియదు. అది గత చరిత్ర. ఫ్యాక్షన్లాగే నక్సలిజం కూడా దాదాపు అంతరించిపోయింది.
ఒకప్పుడు ఊళ్లలో చిన్నచిన్న కాంట్రాక్టులు, సారా వేలం పాటల కోసం ఫ్యాక్షన్ నడిచేది. ప్రపంచీకరణ తర్వాత డబ్బు సంపాదనకి మార్గాలు పెరిగాయి. ఫ్యాక్షన్ పునాది ప్యూడలిజం. ఫ్యాక్షనిస్టుల పిల్లలకి హింస లేకుండా డబ్బు సంపాదించడం తెలుసు. తుపాకులు, కొడవళ్లు అవసరం లేదు.
ఇదే సూత్రం ఇంకో రూపంలో నక్సలిజానికి వర్తిస్తుంది. ఒకప్పుడు భూమి అతి పెద్ద ఉపాధి. భూమి కోసం పోరాటాలు జరిగేవి. తెలంగాణాలో ప్యూడల్ దొరలకి వ్యతిరేకంగా నక్సలైట్లు పుట్టుకొచ్చారు. దొరలు వూళ్లు వదిలి హైదరాబాద్‌కు వచ్చి బాగుపడ్డారు.
ఇక వ్యవసాయం బరువైంది. భూమి కోసం కాకుండా భూమిని వదిలించుకోడానికి పోరాటం అవసరమైంది. పల్లెల్లో యువకులెవరూ వ్యవసాయం వైపు లేరు. హైదరాబాద్‌లో ఎవరి స్థాయిలో వాళ్లు ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు చేయడానికి పని దొరకడమే కష్టం. ఇప్పుడు కొంచెం చదువుంటే సిటీలో ఏదో ఒక పని దొరుకుతుంది. బాగా బతకలేక పోవచ్చు. కానీ బతకడానికి ఢోకా లేదు. పైగా కెరిరీస్ట్ చదువులు సామాజిక అంశాలు చెప్పవు.
సంపాదించడమే విజయమని చెబుతాయి. దాంతో దళాల్లో చేరేంత ఆవేశం ఎవడికీ లేదు. దీనికి తోడు కమ్యూనికేషన్ సాధనాలు పెరిగి, నక్సల్ ఉనికి సులభంగా తెలిసిపోయే టెక్నాలజీ పోలీసులకి సమకూరింది. 1990 తర్వాతి జనరేషన్‌కి నక్సల్స్ మూలాలు తెలియవు. ఇప్పుడు సినిమాలు చూసే యువత వీళ్లే కాబట్టి నక్సలిజం పెద్ద ఆసక్తి కలిగించే అంశం కాదు.
అయితే సినిమాకి సమకాలీనత అవసరం లేదు. ఎమోషన్స్ పండితే చాలు అనే వాదన కూడా ఉంది. రానా, సాయిపల్లవి మంచి నటులు, వేణు వుడుగుల సమర్థుడైన దర్శకుడు.
నక్సలిజం గండాన్ని దాటి వీళ్లు సినిమాని గట్టెక్కిస్తారనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది.
జీఆర్ మహర్షి