కథ విన్నామా, ఓకే చేశామా, సినిమా పట్టాలెక్కించామా… ఇంత జోరుగా ఆలోచిస్తున్నారు ఈనాటి హీరోలు. అయితే ఇప్పటి ట్రెండ్‌ని మెగాస్టార్ చిరంజీవి ఇంకా అందుకొన్నట్టు లేదు. అందుకే తన150వ సినిమా వ్యవహారం ఏళ్ల తరబడీ సా…..గు….తూ….నే ఉంది. చిరు ఎటూ తేల్చక నెలలు నెలలు గడిపేశాడు. ఇప్పుడు వినాయక్ ఉన్నాడు, కత్తి రీమేక్ ఉంది, నిర్మాత ఉన్నాడు.. కానీ ఇప్పటికీ అదేనత్తనడక.
కత్తి కథని తెలుగు నేటివిటీకీ, చిరంజీవి ఇమేజ్‌కీ తగ్గట్టు పలుమార్లు మార్పులూ చేర్పులూ చేసి చూపించాడు వినాయక్. అయితే.. అది ఎంతకీ చిరంజీవికి ఎక్కడం లేదు. కూర్చుని డిస్కర్స్ చేద్దాం.. అంటే చిరంజీవి అందుబాటులో ఉండడం లేదు. దాంతో.. వినాయక్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదట.
''నాతో మాట్లాడండి నాన్నా'' అంటూ బొమ్మరిల్లులో సిద్దార్ద్, ప్రకాష్‌రాజ్‌తో అన్నట్టుగా ''నాతో డిస్కర్స్ చేయండి అన్నయ్యా.. చేస్తేనే కదా, తెలుస్తుంది'' అంటూ చిరు వైపు దీనంగా చూస్తున్నాడు వినాయక్. అసలు చిరుకే ఈ సినిమా చేయాలా, వద్దా.. పూర్తిగా రాజకీయాలవైపే దృష్టి పెట్టాలా అనే విషయం ఇంకా తేల్చుకోలేకపోతున్నాడని, అందుకే డిస్కర్షన్స్‌కీ దూరంగా ఉంటున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా స్టార్ ఎప్పటికి దిగివస్తాడో, ఈ కత్తిని ఎప్పుడు నూరతాడో..??