ట్రైలర్ ని కేవలం ప్రచార సాధనంగా మాత్రమే చూడట్లేదు. అదో బిజినెస్ ట్రిక్. ట్రైలర్‌ని ఎంత బాగా కట్ చేస్తే… అంత మంచి బిజినెస్ జరుగుద్ది. అదో సెపరేటు ఆర్టు. కేవలం ట్రైలర్‌తో హైపు తెచ్చి బిజినెస్ చేసుకొన్న సినిమాలు బోలెడున్నాయి. అయితే.. కొన్ని సినిమాలకు ట్రైలరే విలన్‌గా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు సరైనోడు విషయంలోనూ అదే జరుగుతోందని ట్రేడ్ వర్గాల టాక్. సరైనోడు ట్రైలర్ వచ్చి ఐదురోజులు దాటింది. మాస్‌కి పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ ట్రైలర్… ఫ్యామిలీ ఆడియన్స్‌ని మాత్రం భయపెట్టేలా ఉంది.
బోయపాటికి యాక్షన్ అంటే మక్కువ. ఆయన సినిమాలన్నీ యాక్షన్ దట్టించిన కథలే. ఆ మోతాదు సరైనోడులో మితిమీరిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూసి.. ఇప్పుడు ఓవర్సీస్ బయ్యర్ వణికిపోతున్నాడట. ఓవర్సీస్‌లో ఈ సినిమాని ముందే అమ్మేశారు. అయితే ఆ బయ్యరు సబ్ సెంటర్లలో సినిమాని అమ్ముకోవాలి. అయితే… కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. ట్రైలర్ చూసి ఇది ఫ్యామిలీ చూసే సినిమా కాదని అక్కడి జనాలు ఫిక్సయిపోవడమే దానికి కారణం.
పైగా బ్రూస్లీ, సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్టు ఓ రేంజులో ఉందక్కడ. ఈ రెండు సినిమాల్ని భారీ రేట్లకు కొని.. చాలామంది మునిగిపోయారు. ఆ ఎఫెక్టు ఇప్పుడు సరైనోడుపై కూడా పడింది. దాంతో ఓవర్సీస్ బయ్యరు.. అటు అరవింద్‌కీ, ఇటు బోయపాటికీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడట. 'ట్రైలర్ మార్చండి.. కొత్తగా ఏదైనా యాడ్ చేయండి.. యాక్షన్ తగ్గించండి' అని మొరపెట్టుకొంటున్నాడట.
పాపం.. ఇప్పటికే ఈ సినిమాపై యాక్షన్ ముద్ర పడిపోయింది. ఇక ఎన్ని చేసినా లాభం ఏముంది? మూమెంట్ చూస్తుంటే ఒకట్రెండు రోజుల్లో కొత్త ట్రైలర్ బయటకు వచ్చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.