ఎమ్బీయస్‌ : స్మార్ట్‌ సిటీలలో స్మార్ట్‌ భాగమెంత?

2022 నాటికల్లా దేశంలో 100 స్మార్ట్‌ సిటీలను తయారుచేస్తామని ప్రకటించి మోదీ శభాష్‌ అనిపించుకున్నారు. ఉన్న నగరాలను బాగు చేయడం దాదాపు అసాధ్యమని అందరికీ తెలుసు కాబట్టి చండీగఢ్‌ వంటి నగరాలను ప్రధాన నగరాల…

2022 నాటికల్లా దేశంలో 100 స్మార్ట్‌ సిటీలను తయారుచేస్తామని ప్రకటించి మోదీ శభాష్‌ అనిపించుకున్నారు. ఉన్న నగరాలను బాగు చేయడం దాదాపు అసాధ్యమని అందరికీ తెలుసు కాబట్టి చండీగఢ్‌ వంటి నగరాలను ప్రధాన నగరాల శివార్లగానో, దూరంగానో పర్యావరణ నియమాలకు అనుగుణంగా, ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకున్నట్లు  కొత్తగా సృష్టిస్తారేమోనని జనాలు అనుకున్నారు. తీరా చూస్తే స్మార్ట్‌ సిటీ జాబితాలో పాత నగరాల పేర్లే కనబడేటప్పటికి మతి పోయింది. మొదటి విడతగా ఎంపిక చేసిన 20 సిటీలపై ఐదేళ్లలో రూ.50,802 కోట్ల ఖర్చు పెట్టి స్మార్ట్‌ చేసేస్తామని వెంకయ్యనాయుడు ప్రకటించారు. దానిలో రూ.38,693 కోట్లు ఏరియా డెవలప్‌మెంటుకు, రూ.12,109 కోట్లు నగరసమస్యల పరిష్కారానికిట. రెండేళ్ల వ్యవధిలో తర్వాతి జాబితాలో 40 వస్తాయట. మూడో జాబితాలో 40 వస్తాయట. వాటికి ఎంతెంత ఎలాట్‌ చేస్తారో ప్రస్తుతానికి తెలియదు. 

ప్రస్తుత జాబితాలో అన్నిటికంటె మొదట వున్న పేరు భువనేశ్వర్‌. దాన్ని స్మార్ట్‌ చేయాలంటే ఎన్ని వేల కోట్లూ చాలవు, మరి ఎలా చేస్తారా అని ఆశ్చర్యపడుతూ వివరాల్లోకి వెళితే తెలిసిందేమిటంటే – మొత్తం నగరాన్ని స్మార్ట్‌ చేయరట! నగర విస్తీర్ణం 135 చ.కి.మీ.లైతే కేవలం 4 చ.కి.మీల ప్రాంతాన్ని  (అంటే దాదాపు 3%) 'స్మార్ట్‌'గా ప్రకటించి దాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దుతారట. భువనేశ్వర్‌ లో రైల్వే స్టేషన్‌ పక్కనున్న 985 ఎకరాలను (అంటే విస్తీర్ణంలో జెఎన్‌యు కంటె చిన్నదన్నమాట) ఎంపిక చేశారు. స్మార్ట్‌ సిటీ ప్లాను ప్రకటించినపుడు అక్కడ రోజంతా కరంటు, నీటి సరఫరా వుంటుందని, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు, హెల్త్‌ సర్వీసెస్‌, ఎడ్యుకేషనల్‌ సిస్టమ్‌, వైపా కనెక్టివిటీ, గార్బేజి, వేస్ట్‌ డిస్పోజల్‌, ఈ గవర్నెన్స్‌ యివన్నీ వుంటాయని చెప్పారు. అంటే యీ భోగాలన్నీ జస్ట్‌ యీ 4 చ.కి.మీ. జనాలకే అన్నమాట. పాత నగరానికి మెరుగులు దిద్దడానికి 'రెట్రోఫిట్‌' (యంత్రం తయారీలో లేని సామగ్రిని దరిమిలా అమర్చడం) అని పేరు పెట్టారు. ఓ యూనివర్శిటీ అంతటి ఏరియాను సింగారిస్తే దాన్ని 'స్మార్ట్‌ సిటీ' అని ఎలా అంటారో నాకు బోధపడటం లేదు. మహా అయితే స్మార్ట్‌ కాలనీ అనాలి. హైదరాబాదులో హైటెక్‌ సిటీని చూపించి యాడ్స్‌, హోర్డింగులు పెట్టినట్లే యీ 4 చకిమీల పార్కును చూపించి మొత్తం భువనేశ్వరంతా స్మార్ట్‌ సిటీ అనేయవచ్చా? 

జయపూరు విస్తీర్ణం 111 చకిమీ లైతే 2.5 చకిమీ (2.25%) స్మార్ట్‌ చేసుకోవచ్చన్నారు. దాంతో 600 ఎకరాల్లో టూరిస్టు ఎట్రాక్షన్లు పెడతానంది. అంటే మన రామోజీ ఫిల్మ్‌ సిటీలోె మూడో వంతు కంటె తక్కువ ఏరియాలో యాదగిరి కెళ్లే దారిలో వున్న కుందా సత్యనారాయణ సురేంద్రపురి మోడల్లో గుళ్లు కడతారేమో! దాంతో అదీ స్మార్ట్‌ సిటీయే! శభాష్‌! ఓ సారి తెరాస నాయకుడన్నాడు – హైదరాబాదంటే హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ మాత్రమే కాదు, భోల్‌పూర్‌, ధూల్‌పేట కూడా.. అని. చంద్రబాబుగారికి ఆ ముక్క తెలియలేదు. సైబరాబాదే సర్వస్వం అనుకున్నారు, దాన్ని చూపిస్తే చాలనుకున్నారు. చాలదన్నారు ప్రజలు, 2004లో అక్కడ కూడా ఓడించేశారు. అది చూసైనా మోదీగారు ఏమీ నేర్చుకోనట్లుంది. 

తక్కిన స్మార్ట్‌ నగరాల (పేటల) సంగతి చూద్దాం. 326 కి.మీ. విస్తీర్ణం వున్న సూరత్‌లో స్మార్ట్‌ ఏరియా 8.5 చకిమీ – అనగా 2.6%. 700 చ.కి.మీ.ల పుణెలో స్మార్ట్‌ ఏరియా 4. చ.కి.మీ.! 544 చకిమీల వైజాగ్‌లో స్మార్ట్‌ ఏరియా 7 చకిమీ (1.29%). 367 చకిమీల జబల్‌పూర్‌లో స్మార్ట్‌ ఏరియా 3 కిమీ.(0.82%). 530 చకిమీల ఇండోర్‌లో స్మార్ట్‌ ఏరియా 3.25 కిమీ. (0.61%)! సూరత్‌లో మోదీకి వలపక్షం లేదన్నదానికి నిదర్శనం 464 చకిమీల అహ్మదాబాదులో స్మార్ట్‌ చేయబోయేది కేవలం 3 చకిమీలు మాత్రమే అంటే 0.65% ఏరియా అన్నమాట. వారి పార్టీ పాలనలో వున్న మహారాష్ట్రలోని పుణెలో 700 చకిమీలలో స్మార్ట్‌ చేయబోయేది 4 చకిమీ. అనగా 0.57%! సరాసరిన చూస్తే నగరంలో 1% కి మాత్రమే సౌకర్యాలు యిచ్చి వాటిని స్మార్ట్‌ సిటీ అని పేరు పెట్టేసి, ఏదో సాధించినట్లు పోజు కొట్టేస్తే ఎలా? ఇంతోటి దానికి ఏటా పదివేల కోట్ల కేటాయింపా?

భువనేశ్వర్‌ విషయానికి వస్తే అది రెండు భాగాలుగా వుంటుంది. లింగరాజాలయం, రాజారాణి ఆలయం వంటి అనేక గుళ్లు వున్న పాత భువనేశ్వరం జనంతో బిలబిలలాడుతూ వుంటుంది. ఒడిశా ఏర్పడ్డాక అప్పటిదాకా కటక్‌లో వున్న రాజధానిని యిక్కడకు మారుద్దామనుకున్నారు. 1946లో ఓటో కోనిగ్స్‌బెర్గర్‌ అనే జర్మన్‌ ఆర్కిటెక్ట్‌ కొత్త భువనేశ్వరు ప్లాను తయారుచేశాడు. చండీగఢ్‌, జంషెడ్‌పూర్‌లలా యిది కూడా మన దేశంలో తొలి ప్లాన్డ్‌ సిటీలలో ఒకటి. చండీగఢ్‌లో సెక్టార్ల మాదిరిగానే ఊరంతా యూనిట్స్‌లా విడగొట్టి, ఒక్కో యూనిట్‌లో హై స్కూలు, షాపింగు సెంటరు, హాస్పటల్‌, ఆట స్థలం వుండేట్లు చూశారు. కొత్త భువనేశ్వర్‌లోనే అసెంబ్లీ, సెక్రటేరియట్‌ వగైరా ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. అది చూసే గాంధీనగర్‌ కట్టారు. ఆంధ్రకు కొత్త రాజధాని అన్నపుడు దాన్నే ఆదర్శంగా తీసుకోవచ్చు కదాని చాలామంది సూచించడానికి కారణం కూడా యిదే! ఎనిమిదిన్నర లక్షల జనాభా – అంటే హైదరాబాదులో పదో వంతు – మాత్రమే వున్న అలాటి అధునాతన నగరంలో కూడా కేవలం 3% ఏరియాను మాత్రమే స్మార్ట్‌గా చేస్తున్నామంటే గొప్పేముంది? 

ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకుని దానిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించడం అనేది ఎప్పుడో కామరాజు నాడార్‌ కాలంలోనే ప్రారంభమైంది. అప్పట్లో వాటిని ఇండస్ట్రియల్‌ ఎస్టేటు అనేవారు. గత దశాబ్దంగా సెజ్‌ (స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌) అంటున్నారు. అక్కడ పరిశ్రమలు పెట్టడానికి మాత్రమే ఏర్పాట్లు చేస్తూ వుంటే యీ స్మార్ట్‌ కాలనీల్లో పౌరులు నివసించే ఏర్పాట్లు కూడా చేస్తారన్నమాట. దీని కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో ఎస్‌పివి (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ కాలనీలపై స్థానిక ప్రభుత్వానికి, ప్రజాప్రతినిథులకు అధికారం వుండదట. వారి అధికారాలన్నీ ఎస్‌పివికి బదిలీ చేయాలట. దానిలో ప్రయివేటు వ్యక్తులు కూడా వుంటారు. ఇది రాజ్యాంగవిరుద్ధం అంటున్నారు కొందరు లాయర్లు.  అటు తిరిగి, యిటు తిరిగి యిదంతా మొత్తం రియల్‌ ఎస్టేటు వ్యాపారంగా మారుతుందేమోనన్న భయం కలుగుతోంది. 

భోపాల్‌లో స్మార్ట్‌ సిటీ ప్లానుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఎందుకంటే అక్కడ మార్క్‌ చేసిన స్థలంలో నిక్షేపంలా వున్న 4 వేల ప్రభుత్వం కట్టిన యిళ్లున్నాయి. 6 వేల కుటుంబాలున్నాయి. 40 వేల చెట్లున్నాయి. స్మార్ట్‌ పేరుతో చెట్లు కొట్టేసి, యిళ్లు కూలగొట్టి, కుటుంబాలను పంపించేసి 300 ఎకరాలను బిల్డర్లకు వేలం వేస్తారని వారికి సందేహం. ఎందుకంటే అంతకు పూర్వం రీ-డెన్సిఫికేషన్‌ ప్లాను పేర గామన్‌ ఇండియా వారికి అతి చౌక ధరలకు ప్రభుత్వభూమి కట్టబెట్టారు. అది గవర్నమెంటు క్వార్టర్సు పడగొట్టి బహుళ అంతస్తుల్లో టూ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు కట్టి ఒక్కోటి 1.40 కోట్లకు అమ్ముకుంది. ఇలాటి ఆచరణయోగ్యం కాని పథకాల కోసం ప్రభుత్వం అప్పులు చేసి, వడ్డీలు కోసం పన్నులు పెంచి బీదలను అవస్థలకు గురి చేస్తోందని ఇండోర్‌ సిటీ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ వాదిస్తోంది. భోపాల్‌ సామాజిక కార్యకర్తలు కూడా యిలాటి ప్రశ్నలు లేవనెత్తినపుడు అక్కడి మునిసిపల్‌ కార్పోరేషన్‌ 'మేం సర్వే నిర్వహించాం. 1.72 లక్షల మంది యీ ప్రాజెక్టును ఆహ్వానించారు.' అని చెప్పుకుంటున్నారు. సర్వేలో ప్రశ్నలెలా వున్నాయంటే 'మీకు 24 గంటల నీటి సరఫరా, ఉచిత వైఫై కావాలా? వద్దా?' అని. అందరూ సహజంగా 'యస్‌' అనే అంటారు. పథకంలో వున్న మంచి చెడ్డల గురించి దానిలో వివరణ లేదు. 'ఇదంతా పెద్ద ఫ్రాడ్‌' అంటాడు అక్కడి ఆర్‌టిఐ కార్యకర్త.

స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసిన నగరాల మొత్తం జనాభా కలిపి చూస్తే 4 కోట్లు లేదు. ఊళ్లో 2-3 % ఏరియాలో పెట్టే స్మార్ట్‌ కాలనీల వలన కాస్కేడింగ్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చూసినా నగరంలో ఓ 10% మంది జీవితం మెరుగు పడవచ్చు. అంటే 40 లక్షల మంది. వీరి కోసం యింత భారీ యెత్తున డబ్బు ఖర్చు పెట్టాలా? అని కొందరు అడుగుతున్నారు. ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌, ఇండియా గేట్‌, చాణక్యపురి యిత్యాది ప్రదేశాలలో సైకిల్‌ ట్రాక్స్‌, సెన్సార్‌ బేస్‌డ్‌ కార్‌ పార్కింగ్‌, జియో డస్ట్‌ బిన్స్‌ పెట్టి స్మార్ట్‌ చేస్తామంటున్నారు. దీని మొత్తం విస్తీర్ణం 550 ఎకరాలు. లాభపడే జనాభా మొత్తం నగరజనాభాలో 3%. ఇదే నగరంలో 3 వేల మందికి 3 టాయిలెట్లు మాత్రమే వున్న ప్రాంతాలున్నాయని కెపిఎంజి కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. 

గుజరాత్‌లో మోదీ గిఫ్ట్‌ (గుజారత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌-టెక్‌) సిటీ అని అహ్మదాబాదు శివార్లలో కట్టాడు. అంబరాన్ని చుంబించే హర్మ్యాలతో, ఆఫీసులతో, అత్యంత ధనికుల నివాసంతో అలరారుతుందది. వాటినే యిప్పుడు స్మార్ట్‌ సిటీల పేరుతో దేశమంతా నెలకొల్పుతున్నారు.  స్మార్ట్‌ సిటీస్‌ కాన్సెప్టును అర్థమయ్యేట్లా మన హైదరాబాదు పరిభాషలో చెప్పాలంటే – మరో జూబిలీహిల్స్‌ను తయారుచేయడమనే అనాలి. ఒకసారి అది తయారైతే జూబిలీ హిల్స్‌ ఎక్స్‌టెన్షన్‌ అని, మరోటని పక్కనున్న ఏరియాలకు కూడా డిమాండ్‌ వచ్చేస్తుంది. భూమి ధరలు ఆకాశానికి అంటుతాయి. రియల్‌ ఎస్టేటు వ్యాపారస్తులు బాగుపడతారు. పేదలు కాదు కదా, మధ్యతరగతివాళ్లు కూడా అటు తిరిగి చూడలేరు. అయితే యిక్కడో తేడా వుంది. జూబిలీ హిల్స్‌లో కట్టుకున్నవాళ్లు సొంత డబ్బుతో కొండలు పిండి చేసి కట్టుకున్నారు, ప్రజల డబ్బుతో కాదు. స్మార్ట్‌ సిటీలు పన్ను చెల్లించేవారి డబ్బుతో తయారవుతున్నాయి. అది సరిపోకపోతే స్వచ్ఛభారత్‌ సెస్‌లా స్మార్ట్‌ సెస్‌కూడా విధించవచ్చు. ఏడాదికి పదివేల కోట్ల బజెట్‌. ఈ బజెట్‌లో 6 వేల కోట్లు కేటాయించారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే 100 కోట్ల రూ.లకు ఏమేం వస్తాయో ''ఔట్‌లుక్‌'' జాబితా యిచ్చింది. వంద కోట్లతో 300 బస్సులు వస్తాయి,లేదా 2 వేల ఆంబులెన్సులు వస్తాయి, లేదా లక్ష సోలార్‌ వీధిదీపాలు లేదా 700 కిలోల చెత్త పట్టే వెయ్యి మెకనైజ్‌డ్‌ జర్మన్‌ గార్బేజి బిన్లు, 10 వేల పబ్లిక్‌ టాయిలెట్లు వస్తాయి. ఇప్పుడు కేటాయింపులు మచ్చు చూడండి భువనేశ్వర్‌లో4 చకిమీలకు యిస్తున్నది 4537 కోట్లు, పుణెలో 4 చకిమీలకు 3 వేల కోట్లు, ఇండోర్‌లో 2.5 చకిమీలకు యిస్తున్నది 1897 కోట్లు, జయపూర్‌లో 2.5 చకిమీలకు యిస్తున్నది 2340 కోట్లు, జబల్‌పూర్‌లో 3 చకిమీలకు యిస్తున్నది 4 వేల కోట్లు, వైజాగ్‌లో 7 చకిమీలకు యిస్తున్నది మాత్రం 1938 కోట్లు! (ఆంధ్రపై దీనిలోనూ వివక్షత వున్నట్టుంది) మన దేశానికి ఏది అవసరమో, దేనికి ప్రాధాన్యత యివ్వాలో మీకూ నాకూ ఒక అవగాహన వుండవచ్చు, పాలకులకుండే అవగాహన పాలకులకుంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

[email protected]