cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఈడోరకం ఆడోరకం

సినిమా రివ్యూ: ఈడోరకం ఆడోరకం

రివ్యూ: ఈడోరకం ఆడోరకం
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి.
తారాగణం: మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌, రాజేంద్రప్రసాద్‌, సోనారికా భాడోరియా, హెబ్బా పటేల్‌, రవిబాబు, పోసాని కృష్ణమురళి, అభిమన్యు సింగ్‌, సుప్రీత్‌, సత్య కృష్ణ తదితరులు
మాటలు: డైమండ్‌ రత్నం
సంగీతం: సాయికార్తీక్‌
కూర్పు: ఎమ్‌.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 14, 2016

భారీ ఎక్స్‌పెక్టేషన్లతో వెళ్లే సినిమాలు ఎంతో బాగుంటే తప్ప ఆకట్టుకోలేవు. ఏమంత ఆశించకుండా వెళ్లే సినిమాల్లో తగినంత వినోదముంటే హ్యాపీగా బయటకి రావచ్చు. భారీ అంచనాలు లేకపోవడమే 'ఈడోరకం ఆడోరకం' సినిమాకి పెద్ద ప్లస్సు. చాలా సినిమాల్లో చూసిన తరహా కన్‌ఫ్యూజన్‌ కామెడీనే అయినప్పటికీ టైమ్‌పాస్‌ చేసుకోవచ్చు. ఒకడి ప్లేస్‌లో మరొకడు చేరి అందరినీ అయోమయానికి గురి చేస్తూ నవ్వించడమనేది ఎన్నోసార్లు వాడుకున్న ఫార్ములానే. 

ఇవివి సత్యనారాయణ ఈ తరహా కామెడీలు చాలానే తెరకెక్కించారు. 'ఈ.ర.ఆ.ర' చూస్తుంటే కథాపరంగా ఎలాంటి కొత్తదనం కనిపించదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి ప్లేస్‌లోకి మరొకరు మారిన హీరోలు వేరేవాళ్లకి దొరక్కుండా ఎన్ని తిప్పలు పడతారు, దొరికిపోయిన ప్రతిసారీ ఎలా తప్పించుకుంటారు అనేదే ఈ సినిమా ప్లాట్‌. ఎక్కడో చూసిందే అనిపిస్తూనే ఉన్నప్పటికీ నవ్వించే సన్నివేశాలు, సంభాషణలు నిలకడగా వచ్చిపోతుండడం వలన కాలక్షేపానికి లోటుండదు. రాజేంద్రప్రసాద్‌కి కీలకమైన పాత్రనిచ్చి ఈ సినిమాకి పెద్ద బెనిఫిట్‌ చేసుకున్నారు. చిన్న చిన్న డైలాగుల్నే రాజేంద్రప్రసాద్‌ తనదైన టైమింగ్‌తో చెబుతుంటే నవ్వకుండా ఉండలేరెవరూ. రాజ్‌ తరుణ్‌ని ఉద్దేశిస్తూ.. 'కుర్రాడు కొంచెం హైట్‌ తక్కువే అయినా' అంటే, వాళ్లు మాట్లాడేది విష్ణు గురించి అనుకుని... 'హైట్‌ అంటే ఇంగ్లీష్‌లో ఎత్తే కదా' అని రవిబాబుని రాజేంద్రప్రసాద్‌ అమాయకంగా అడిగిన సందర్భంలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. 

ఇద్దరు హీరోలతో పాటు రాజేంద్రప్రసాద్‌ కూడా ఈ సినిమాకి హీరోనే అని చెప్పాలి. ఏదో ఒక డైలాగో, లేదా సీనో, కాకపోతే నటుడి టైమింగో ఇలా ఏదో ఒక దాంతో 'ఈడోరకం ఆడోరకం' దాదాపుగా వినోదాత్మకంగానే సాగుతుంది. పనిమనిషికి సంబంధించిన కామెడీతో పాటు, కోడలు అని అతనికి తెలియకపోయినప్పటికీ కానీ ఆమెపట్ల మావయ్య ఆకర్షితుడైనట్టు చూపించే కామెడీలాంటివి అవాయిడ్‌ చేసి ఉండాల్సింది. నవ్వించే ప్రయత్నంలో కొన్నిసార్లు అవధులు దాటారు కానీ ఓవరాల్‌గా చూస్తే నవ్వించిన సందర్భాలు అడపాదడపా వచ్చిపోతూనే ఉంటాయి. ఈ కన్‌ఫ్యూజన్‌ కామెడీకి తగ్గ పంచ్‌ ఉన్న క్లయిమాక్స్‌ ఉండుంటే ఇంకా బాగుండేది. చివర్లోకి వచ్చేసరికి అంతా రొటీన్‌గా మారిపోయి, పెద్దగా నవ్వించకుండానే శుభం కార్డు పడిపోతుంది. లోపాలు ఉన్నప్పటికీ నవ్వులు కూడా ఉన్నాయి కనుక ఒకసారి చూడ్డానికి ఇబ్బందేం అనిపించదు. 

ముందే చెప్పుకున్నట్టు రాజేంద్రప్రసాద్‌ తన టైమింగ్‌తో మామూలు సన్నివేశాన్ని, తను పలికిన మామూలు డైలాగ్‌ని కూడా పండించారు. విష్ణు మంచు ఇంతకుముందు పలు కామెడీ సినిమాల్లో నటించి ఉన్నాడు కనుక ఇటీవలి కాలంలో చేసిన సీరియస్‌ సినిమాల నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌ పరంగా ఇబ్బందులేం పడలేదు. రాజ్‌ తరుణ్‌ క్యాజువల్‌గా నటించేస్తాడు. అదే అతని ప్లస్‌ పాయింట్‌. డైలాగ్‌ డెలివరీ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా సహజంగా అనిపిస్తాడు కనుక అతడితో ఈజీగా రిలేట్‌ కావచ్చు. హీరోయిన్లద్దరిలో హెబ్బా పటేల్‌కే ఎక్కువ మార్కులు. తన పాత్ర పరిధి తక్కువైనా కానీ హెబ్బా ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ సోనారికని డామినేట్‌ చేస్తుంది. ఇద్దరు హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించారు. పోసాని కృష్ణమురళి ఎప్పటిలానే లౌడ్‌ కామెడీ చేసాడు. రవిబాబు గురించి చెప్పుకోతగ్గ ప్రత్యేకత ఏమీ లేదు. మిగిలిన పాత్రధారులంతా తమ తమ పరిధుల మేరకు నటించారు. టైటిల్‌ సాంగ్‌లో సునీల్‌ మెరిపించాడు. 

బీట్‌ ప్రధానమైన పాటలు ఓకే అనిపించాయి. నేపథ్య సంగీత పరంగా ఈ సినిమాకి యాడ్‌ అయ్యేదేం లేదు. ఛాయాగ్రహణం పాటల వరకు ఆకట్టుకుంటుంది. సెకండ్‌ హాఫ్‌ కాస్త లెంగ్త్‌ తగ్గించుకోవాల్సింది. డైమండ్‌ రత్నం పంచ్‌లు అక్కడక్కడా పేలాయి. లిమిటెడ్‌ బడ్జెట్‌లో తీసే కథే కావడం నిర్మాతలకి కలిసొస్తుంది. దర్శకుడిగా నాగేశ్వరరెడ్డి తీసిన బ్యాడ్‌ సినిమాలు తక్కువే. మినిమమ్‌ గ్యారెంటీ సినిమాలందించే నాగేశ్వరరెడ్డి మరోసారి లో బడ్జెట్‌లో మాస్‌ చేత పాస్‌ మార్కులేయించుకునే ప్రోడక్టే తయారు చేసాడు. 

'క్యారీ ఆన్‌ జట్టా' అనే పంజాబీ చిత్రానికి రీమేక్‌ అయిన ఈ చిత్ర కథ చూస్తే దీనికోసం వేరే భాష నుంచి అరువు తెచ్చుకోవడం దేనికనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథలు మన వాళ్లకి కొట్టిన పిండి. గతంలో చాలా మంది దంచికొట్టిన కామెడీనే పంజాబీ వాళ్లు చేసుకున్న కథను తెచ్చుకుని మరీ ఇంకోసారి వండి వడ్డించారు. క్లాస్‌ కామెడీని, వెరైటీని కోరుకునే ప్రేక్షకుల నుంచి 'రొటీన్‌' అనే పెదవి విరుపులు కామనే కానీ సరదాగా కాలక్షేపమైతే చాలనుకునే మాస్‌ వర్గం నుంచి సపోర్ట్‌ ఉంటుంది కనుక ఇది నిర్మాతలకి డబ్బులొచ్చే రకం సినిమానే అనుకోవచ్చు. ప్రేక్షకులకి బాగా తెలిసిన రకమే కానీ పెట్టుబడిదార్లకి వర్కవుటయ్యే రకమన్నమాట.

బోటమ్‌ లైన్‌: టైమ్‌పాస్‌ రకం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!