ఎమ్బీయస్‌ : యూనివర్శిటీలా? యుద్ధభూములా? – 3/3

కశ్మీరు ప్రజలకు యితర భారతీయులతో సంపర్కం పెంచాలనే ఉద్దేశంతోనే 1960లో ఎన్‌ఐటిని శ్రీనగర్‌లో పెట్టారు. వేర్పాటు వాదం తలెత్తే అవకాశం వున్నచోట ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు పెట్టడం పరిపాటి. అలాగే అక్కడా పెట్టారు. ఇప్పటిదాకా…

కశ్మీరు ప్రజలకు యితర భారతీయులతో సంపర్కం పెంచాలనే ఉద్దేశంతోనే 1960లో ఎన్‌ఐటిని శ్రీనగర్‌లో పెట్టారు. వేర్పాటు వాదం తలెత్తే అవకాశం వున్నచోట ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు పెట్టడం పరిపాటి. అలాగే అక్కడా పెట్టారు. ఇప్పటిదాకా 8 వేల మంది పట్టాలు పుచ్చుకున్నారు. ప్రస్తుతం 2200 మంది అండర్‌గ్రాజువేట్లు, 300 మంది పోస్ట్‌ గ్రాజువేట్లు, 125 మంది డాక్టోరల్‌ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే ప్రస్తుతపు గొడవల్లో పాలు పంచుకున్నారు. ఆ మాత్రానికే సంస్థనెందుకు తరలించాలని, ఉగ్రవాదం తీవ్రస్థాయిలో వున్నపుడు కూడా కశ్మీరేతర విద్యార్థులపై ఏ దాడి జరగలేదని, యిప్పుడెందుకు భయపడుతున్నారని కశ్మీరులోని ఉపముఖ్యమంత్రి నుంచి సాధారణ ప్రజల దాకా అందరూ అడుగుతున్నారు. అసలే వాళ్లు కశ్మీరు పండితుల విషయంలో సిగ్గుపడుతూంటారు. సాధారణ భారతీయుడు బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎలాగైతే గిల్టీగా ఫీలవుతాడో, సాధారణ కశ్మీరు పౌరుడు పండితుల తరిమివేత విషయంలో గిల్టీగా ఫీలవుతాడు. దానికి తోడు యిప్పుడు యీ సంస్థ కూడా తరలించి వేస్తే వాళ్లపై మరింత నింద పడుతుంది. అందువలననే వాళ్లు చోటు మార్పును వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కూడా దానికి సుముఖంగా లేదు, తరలిస్తే కశ్మీరును భారతజనస్రవంతిలో కలిపే ప్రక్రియకు విఘాతం కలుతుందని వారి భయం. అయినా కొందరు విద్యార్థులు పట్టువదలటం లేదు. ధర్నాలు చేస్తున్నారు. వారి వెనక్కాల వున్నవారెవరో యిప్పటికి స్పష్టం కాలేదు. 

ఈ గొడవ కంతా మూలం – క్రికెట్‌ మ్యాచ్‌ ! పదిరోజుల్లో పరీక్షలు పెట్టుకుని, విద్యార్థులు క్రికెట్‌ మ్యాచ్‌లు చూడడమే కాదు, వాటిలో గెలుపోటముల గురించి కలహాలకు కూడా దిగేటంత తీరిగ్గా వున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. టి – 20 భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినపుడు ఎన్‌ఐటిలోని కశ్మీరేతర విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. క్రీడా స్ఫూర్తి వున్నవాళ్లు ఎవరు బాగా ఆడినా హర్షిస్తారు. కానీ యిటీవలి కాలంలో ఎలా ఆడినా సరే మా దేశం వాళ్లు, మా ప్రాంతం వాళ్లు గెలిచి తీరాలనే పట్టుదల పెరిగిపోయింది. అభిమానాన్నో, ద్వేషాన్నో వెళ్లగక్కడానికి అది ఒక మార్గం అయిపోయింది. భారత్‌ విజయం సాధించింది కాబట్టి భారత్‌ అభిమానులు గంతులేశారు, అంతటితో ఆగలేదు. ప్రస్తుతం దేశభక్తికి ట్రేడ్‌మార్క్‌ అయిపోయిన భారత్‌మాతాకీ జై నినాదాలు యిచ్చారు. భారత్‌ వ్యతిరేకులు ఏమీ చేయలేక పళ్లు నూరుకున్నారు. సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ ఓటమి చెందడంతో వాళ్లకు హుషారు వచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి. నెగ్గిన వెస్టిండీస్‌ జండా ఎగరేసినా అదో అందం. కానీ భారత్‌ శత్రువైన పాక్‌ జండాలు ఎగరేశారు. టపాసులు కాల్చారు. కశ్మీరులో యిలాటివి సహజం, పాకిస్తాన్‌ జిందాబాద్‌ నినాదాలు కొత్తవి కావు అని అనుకుని కశ్మీరేతర విద్యార్థులు వూరుకోలేదు. ఆ నినాదాలకు ఏప్రిల్‌ 1 న అభ్యంతరం తెలిపారు. పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ నినాదాలు యిస్తే, కశ్మీర్‌ విద్యార్థులు వచ్చి ''హమ్‌ క్యా చాహతే – ఆజాదీ'' అనే నినాదాలు యిచ్చారు. అందువలన వాళ్లు మన దృష్టిలో దేశద్రోహులయ్యారు. 

పాకిస్తాన్‌ మనపై అనేక రకాలుగా దాడి చేస్తోంది కాబట్టి మనకా కోపం వుండడం సహజం. కానీ కశ్మీరీ పాకిస్తాన్‌ను అలా చూడడు. తాము భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న స్వాతంత్య్రపోరాటానికి మద్దతు యిస్తున్న ఆత్మీయ దేశంగా చూస్తాడు. పైన చెప్పిన కశ్మీరు వాతావరణం గుర్తు తెచ్చుకుంటే దానిలో అబ్బురమేమీ లేదు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌ గురు ఉరితీతను సాక్షాత్తూ ముఖ్యమంత్రే వ్యతిరేకించే ప్రాంతమది. అయినా కశ్మీరేతర విద్యార్థులు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అలా వదిలేస్తే విద్యార్థుల మధ్య గొడవలు ఎక్కువవుతాయనే దూరదృష్టితో డైరక్టరు క్లాసులు రద్దు చేసి, కాలేజీ మూసేశారు. రాజకీయపరమైన ఇలాటి పేచీల కారణంగా విద్యార్థులు క్షణికావేశాల్లో పొరపాట్లు చేసి జీవితాంతం బాధ పడకూడదని, తమ విద్యాభ్యాసం నుంచి దృష్టిమరల్చకూడదని ఏ టీచరైనా అనుకుంటాడు. అందుకే తక్షణం మూసేసి, ఏప్రిల్‌ 4 న మళ్లీ తెరిచాడు. 

సాధారణ పరిస్థితుల్లో యూనివర్శిటీల్లో ఆ పాటికి గొడవ సద్దు మణగాలి. కానీ ఆశ్చర్యకరంగా ఎక్కువైంది. కశ్మీరు విద్యార్థుల నుంచి కవ్వింపు మళ్లీ ఏమీ లేకపోయినా కశ్మీరేతర విద్యార్థులు గొడవ ప్రారంభించారు. మాకిక్కడ భద్రత లేదు, క్యాంపస్‌ విడిచి వెళ్లిపోతామని అంటూనే క్యాంపస్‌లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. పరిస్థితి అదుపు చేయడానికి స్థానిక పోలీసులతో బాటు కేంద్రం అజమాయిషీలో వుండే, కశ్మీరేతరులు వుండే సిఆర్‌పిఎఫ్‌ వారిని దింపారు, కానీ వీరు జాతీయ పతాకాన్ని ధరించి భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలిస్తూ, క్యాంపస్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. దాంతో లాఠీచార్జి చేశారు. లాఠీచార్జికి ముందు జరిగిన సంఘటనలపై పోలీసులు వీడియో తీశారని దానిలో విద్యార్థులు కళాశాల ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసులతో ఘర్షణకు దిగడం కనబడుతోందని వార్తలు వచ్చాయి. హింసకు పాల్పడిన 20 మందిని గుర్తించారు, ఎవరి పేరూ లేకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఇప్పుడు విద్యార్థులు కొత్త డిమాండు మొదలుపెట్టారు. తమపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, ఎన్‌ఐటిలో కేంద్ర బలగాలను శాశ్వతంగా నిలపాలి.. అని. వీళ్లకు జమ్మూలో మద్దతు ప్రకటించారు. ఓ రోజు బంద్‌ చేశారు. జాతీయ రహదారిపై రాకపోకలను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సంఘటనలపై ఏ యే రాజకీయ పార్టీలు ఎలా స్పందించాయో సులభంగా వూహించవచ్చు. 

ఇక్కడ మనకు అర్థం కానిదేమిటంటే విషయాన్ని యింత పెద్దదిగా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరో మాత్రం కావాలనే చేస్తున్నారని తోస్తోంది. యూనివర్శిటీలో జండా ఎగరవేయాలని అడగడంలో తప్పేముందని అమాయకంగా అడిగేవాళ్లుండవచ్చు. ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్సు భవనంపై 1950 నుంచి 51 ఏళ్లపాటు జాతీయపతాకం ఎగరవేయనే లేదు. 2001లో బలవంతంగా ఎగరేయడానికి ప్రయత్నించిన రాష్ట్రప్రేమీ యువదళ్‌ తాలూకు ముగ్గురు కుర్రాళ్లపై కేసులు పెట్టి పదకొండేేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పారు. అంతమాత్రం చేత ఆరెస్సెస్‌ వాళ్లకు దేశభక్తి లేదని తీర్మానించగలమా? ఇప్పుడీ జండా ఎగరవేయడం చుట్టూ యింత రగడ దేనికి? భారతమాతకు జై గురించి కూడా యింత వివాదం అవసరమా? 'మాకు దేశరాజ్యాంగంపై గౌరవముంది కానీ లేకపోతే భారతమాతాకీ జై అనని వాళ్లని లక్షల మందిని తలలు నరికేసేవాళ్లం' అంటాడు బాబా రామ్‌దేవ్‌. అతనమ్మే మందుల్లో కల్తీ వుందని ఓ పక్కన వార్తలు వస్తూంటాయి. కానీ యీ స్టేటుమెంటు యిచ్చి అతనూ  దేశభక్తుడై పోయాడు. అతను రాజకీయ ప్రముఖుడు కాదు. కానీ బిజెపి ప్రముఖ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి 'భారత్‌కి జై అననివారిని దేశంలో వుండనివ్వమ'ని అనవలసిన అవసరం వుందా? 

వీళ్లిలా అనగానే ప్రతీదానికి కులాన్ని పులిమే ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యగారు ఓ పరిశోధన చేసేశారు – 'బెంగాలీ బ్రాహ్మడు వందేమాతరం రాస్తే, దుర్గంటే పడని మరాఠీ బ్రాహ్మడు భారత్‌మాతాకీ జై అన్నాడు, బోసు కాయస్థుడు కాబట్టి జైహింద్‌ అన్నాడు' అంటూ! ఇక్కడ గుర్తుంచుకోవలసినది – బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమంలో ముస్లిములు కూడా పాల్గొన్నారు, వారందరూ వందేమాతరం అనే నినదించారు. బోసు జైహింద్‌ అన్నా, ఐఎన్‌ఏ మార్చింగ్‌ సాంగ్‌గా వందేమాతరాన్నే ఎంచుకున్నాడు. స్వాతంత్య్రానంతరం ముస్లిములు జాతీయగీతంగా వందేమాతరం వద్దన్నా జనగణమనకు అభ్యంతరం చెప్పలేదు. రెండిటినీ రాసినవాళ్లు బెంగాలీ బ్రాహ్మలే. భారత్‌మాతాకీ జై పై ఎవరి పేటెంటూ లేదు. అది ఆరెస్సెస్‌ వారి నినాదం కాదు. కాంగ్రెసు వారే దాన్నీ ప్రచారంలోకి తెచ్చారు. ఊళ్లల్లో భారతమాత విగ్రహాలు కాంగ్రెసు పాలనలోనే ఎప్పుడో వెలిశాయి. ఇవన్నీ ఐలయ్యగారికి తెలియవా? తెలిసే వుంటాయి. అయినా భారతదేశంలో ఏదో అల్లర్లు జరిగిపోతున్నాయి, దళితులు, మైనారిటీలు, పాలకవర్గంతో విభేదించేవారు బతికే పరిస్థితి లేదు అని అంతర్జాతీయంగా ప్రచారం చేయాలి. అందుకే దసరా వస్తే మహిషాసురుడు దళితుడంటారు, దీపావళి వస్తే నరకుడు దళితుడంటారు, హాస్టలు మెస్సులో బీఫ్‌ పెట్టాలని గొడవలు చేస్తారు. అవి కుదరదంటే దళిత హక్కుల హననం అంటారు. దుర్గాదేవి గురించి జెఎన్‌యులో కరపత్రాలు పంచినప్పుడే స్మృతి ఇరానీ మేల్కొని వుండవచ్చు కానీ అలాటి చేష్టలు ఉస్మానియాలో ఎప్పణ్నుంచో జరుగుతున్నాయి. ఓ పక్క ఐలయ్యలు, మరో పక్క ఫడ్నవీసులు సాధారణ ప్రజలకు ఎలాటి మేలు కలిగిస్తున్నారు? వీరి కారణంగా భారత్‌కు ఎంతో నష్టం కలుగుతోంది. 

మొన్న బ్రస్సెల్స్‌లో యూరోప్‌ యూనియన్‌తో జరిపిన చర్చల్లో వాణిజ్య ఒప్పందం కుదరలేదు. కుదరకపోవడానికి చెప్పిన కారణాల్లో భారత్‌లో మానవహక్కుల పరిరక్షణ బాగా లేదన్న వ్యాఖ్య కూడా వుంది. బాలల హక్కులు హరించబడుతున్నాయి కాబట్టి భారత్‌ ఉత్పాదనలు కొనం అంటారు. రుజువులు సమర్పిస్తే నోబెల్‌ బహుమతులు యిస్తారు. భారతదేశంలో నిజంగా అశాంతి తప్ప మరొకటి లేదా? నిజానికి బాబ్రీ మసీదు కూల్చివేత వలన భారత్‌ కానీ, హిందువు కానీ లాభపడినదేమైనా వుందా? ఉత్తర భారతంలో వున్న దేవాలయాల్ని సరిగ్గా మేన్‌టేన్‌ చేస్తే చాలు, కొత్తగా రామమందిరం కావాలా? కావాల్ట. దానికోసం ఇంకెక్కడా చోటు దొరకనట్లు బాబ్రీ మసీదు కూల్చారు. కూల్చినచోట మందిరం కట్టగలిగారా? లేదే! హిందువులకు ఒరిగినదేముంది? దేవాలయాలను కూల్చిన మధ్యయుగాల ముస్లిములను ఆధునిక యుగంలో అనుకరించారన్న చెడ్డపేరు తప్ప! ఆ ఒక్క సంఘటన సాకుగా పెట్టుకుని ఇస్లాం ఉగ్రవాదులు భారత్‌ను టార్గెట్‌ చేశారు. ఆ అకృత్యం చేసిన నాయకుల జోలికి వెళ్లకుండా, రైళ్లల్లో, బస్సుల్లో తిరిగే మీబోటి నాబోటి వాళ్లను చంపుతున్నారు. 

భారత్‌ అంటే హిందూ, ముస్లిములు కొట్టుకు చచ్చే దేశం అని ప్రపంచానికి ఒక యింప్రెషన్‌ కలిగింది. అది నిజమా? వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి ముస్లిములు భారత్‌ను పాలించారు. ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పశ్చిమాన ఎటు చూసినా ముస్లిము సుల్తానులు కనబడతారు. వాళ్లు హిందువులందరినీ చంపేశారా? అందర్నీ ముస్లిములుగా మార్చేశారా? మార్చేసి వుంటే యిప్పటికీ హిందువులు 85% ఎలా వుంటారు? అలాగే దళితులు. వారు హిందూ సమాజంలో భాగంగా వుంటూనే వివక్షత ఎదుర్కున్నారు. కానీ అగ్రవర్ణ హిందువులే ఆ లోపాన్ని గుర్తించి సవరించుకుంటూ వస్తున్నారు. సమాజం తనను తాను సంస్కరించుకుంటూ వచ్చినపుడే మార్పు బలంగా, గాఢంగా వుంటుంది. ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు కాబట్టి అగ్ర రాజ్యాలవారు తమ సైన్యాన్ని యిక్కడ నిలిపి, వారిని కాపాడాలి అనే పిలుపు నివ్వడానికి సమాయత్తమయ్యేవారి పట్ల జాగరూకులమై వుండాలి. దేశభక్తి పేరుతో అతిరిక్తంగా వ్యవహరించి, వారి చేతికి ఆయుధాలు యివ్వకూడదు. ఇప్పుడు శ్రీనగర్‌ ఎన్‌ఐటి లో కశ్మీరేతర విద్యార్థులు గోరంత అంశాన్ని కొండంతలు చేసి దేశం యొక్క యిమేజిని చెడగొడుతున్నారని నా భయం. వారి వెనుక ఏవో శక్తులు పనిచేయకపోతే వారు యీ స్థాయిలో ఆందోళన చేయలేరు. కశ్మీరులో బిజెపి-పిడిపి పొత్తు మళ్లీ ఏర్పడడం యిష్టం లేనివారెవరైనా దీనికి ఆజ్యం పోస్తూ వుండవచ్చు. ఎవరిపై చర్య తీసుకున్నా అది రాజకీయంగా యిబ్బంది తెచ్చిపెట్టే పరిస్థితిలోకి ముఖ్యమంత్రిని నెట్టారు. పిడిపితో పొత్తుకు మోదీ ఆమోదముద్ర వుంది కాబట్టి, బిజెపిలో మోదీతో విభేదించే అతివాదులు యీ చర్యలకు పాల్పడుతున్నారేమో తెలియదు. వారి చేష్టల వలన అంతర్జాతీయ వేదికలపై మోదీ దోషిగా నిలబడే పరిస్థితి కలుగుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ప్రధాని మోదీమీదే వుంది. లేకపోతే ప్రపంచంలోని యితర దేశాలతో విద్య పరంగా కాని, వాణిజ్యపరంగా కాని వ్యవహరించవలసిన అవసరం పడిన భారతీయులందరూ కష్టనష్టాలు ఎదుర్కుంటారు.(సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Archives