ఉగాండాకు అధ్యక్షుడిగా యూవెరీ ముసెవెనీ మళ్లీ ఎన్నికయ్యాడు. ఫిబ్రవరి మూడోవారంలో జరిగిన ఎన్నికలో ఆ గెలుపు సిద్ధించింది. అతను 30 ఏళ్లగా అదే పదవిలో కొనసాగుతున్నాడు. ఉగాండా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు రెండుసార్లకు మించి ఆ పదవిలో వుండకూడదు. కానీ అతనా చట్టాన్ని మార్చేశాడు. 75 ఏళ్లు పై బడితే పదవిలో వుండకూడదనే మరో నియమం వుంది. 71 ఏళ్ల ముసెవెనీ వచ్చేసారి కూడా పోటీ చేయాలంటే దాన్ని మార్చడం అత్యవసరం. మార్చాలంటే యీ ఎన్నిక నెగ్గాలి. నెగ్గాలంటే ఏదైనా చేయవచ్చు అనే పంథా అతనిది.
1970, 80లలో తను ఈడీ అమీన్‌పై గెరిల్లా యుద్ధం చేసే రోజుల్లో సహచరుడిగా, వైద్యుడిగా వుండి తర్వాతి రోజుల్లో ప్రత్యర్థిగా వున్న కిజ్జా బెసిగియీని గత నాలుగేళ్లలో 34 సార్లు అరెస్టు చేయించి, ఎన్నికలకు ముందు హౌస్ అరెస్టు చేయించాడు. తన వద్ద గతంలో ప్రధానిగా పనిచేసి ప్రత్యర్థిగా మారిన అమామా బాబాజీని కూడా ఎన్నికల ముందు అరెస్టు చేయించాడు. కిజ్జా అధినేతగా వున్న ఫోరమ్ ఫర్ డెమెక్రాటిక్ ఛేంజ్ పార్టీకి కంపాలా ప్రాంతంలో గట్టి పట్టుంది కాబట్టి అక్కడకు పోలింగు సామగ్రి సకాలంలో పంపలేదు. సాయంత్రం ఎప్పుడో ఓటింగు ప్రారంభమైంది.
దేశంలోని 20% పోలింగు బూతులకు చేరిన బాలట్ పేపరు కట్టలకు సీళ్లు లేవు. 33% బూతులలో దొంగ ఓట్లు పడ్డాయి. ఇవన్నీ ఎవరైనా సెల్‌ఫోన్ల ద్వారా ఫోటో తీస్తారేమోనన్న భయంతో పోలింగు బూతులలోకి సెల్‌ఫోన్లు అనుమతించలేదు.
ఇప్పటిదాకా ముసెవెనీ నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. మొదటిసారి ప్రజాదరణతోనే నెగ్గాడు. తర్వాత నెగ్గిన మూడిటిలో యిలాటి అక్రమాలు ఎన్నో చేశాడు. 2006లో గద్దె దిగాల్సినవాడు దిగను పొమ్మంటూ రాజ్యాంగం మార్చేశాడు. ఈ అడ్డగోలు ఎన్నికకు తన అనుయాయి అయిన ఎన్నికల కమిషనర్ చేత ఆమోదముద్ర వేయించాడు.
ముసావెనీ పార్టీ అయిన నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ 60.8% ఓట్లతో నెగ్గాడని ఆ కమిషనర్ ప్రకటించాడు. ఎన్ని అక్రమాలు చేసినా కిజ్జా పార్టీకి 35% ఓట్లు వచ్చాయి. ప్రజాస్వామ్యం ముసుగులో యిలా నియంతృత్వం సాగించడానికి అతనికి వున్న దన్ను – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే అవతరించానని చెప్పుకునే అమెరికా! దానికి ఈ ప్రాంతంలో ఉగాండా అత్యంత సన్నిహిత దేశం. ముసెవెనీ వామపక్ష విప్లవవాదిగా అధికారంలోకి వచ్చినా ఒక సారి గద్దె కెక్కాక అమెరికాకు అనుకూలంగా మారిపోయాడు. బిల్ క్లింటన్ అతన్ని ''ఆఫ్రికాలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, తక్కిన ఆఫ్రికన్ నాయకులు అతన్ని చూసి నేర్చుకోవాలి'' అన్నాడు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంటు ఉగాండాను 'కీలకమైన (కీ) యుఎస్ భాగస్వామి'గా వర్ణిస్తుంది.
సోమాలియాలో ప్రజల మద్దతులేని ప్రభుత్వాన్ని కాపాడదామని అమెరికా అనుకున్నపుడు అందరి కంటె ముందుగా సైన్యాన్ని పంపినది ఉగాండాయే! ఆ ఖర్చంతా అమెరికాయే భరించింది. ఉగాండా నుంచి పారిపోయి అజ్ఞాతంలో వుంటూ 'లార్డ్‌స్ రెసిస్టెన్స్ ఆర్మీ' పేర దానితో యుద్ధం సలుపుతున్న జోసెఫ్ కోనీని అణచివేయడానికి ఉగాండా సైన్యానికి మిలటరీ ట్రెయినింగ్, ఆయుధసంపత్తి యిస్తున్నది అమెరికాయే! అమెరికాతో బాటు అది చెప్పినట్లు వినే అనేక యూరోపియన్ దేశాలు రకరకాల పేర్లతో దానికి సహాయం అందిస్తూ వుంటాయి.
ఇటీవల 2014లో స్వలింగసంపర్కులకు యావజ్జీవ శిక్ష వేసే అవకాశం కల్పిస్తూ ఉగాండా చట్టం చేసినందుకు యూరోప్ దేశాలు నొచ్చుకున్నాయి. తాము యిచ్చే 2 బిలియన్ డాలర్ల సహాయాన్ని నేరుగా ప్రభుత్వానికి యివ్వకుండా స్వచ్ఛందసంస్థలకు యిస్తున్నాయి తప్ప సహాయం ఆపేయలేదు. ప్రజల హక్కులను కాలరాసే ముసెవెనీకి వీళ్లంతా ఎందుకు మద్దతిస్తున్నారు అంటే అమెరికా దృష్టిలో అతను రిస్క్-టేకర్. ఏదైనా ధైర్యంగా చేయగలడు.
సోమాలియాలో ఉగాండా ప్రమేయాన్ని నిరసిస్తూ 2010లో అల్ షహాబ్ ఆత్మాహుతి బాంబర్లు ప్రజాస్వామ్యవిరుద్ధం లాటి చాదస్తపు మాటలు చెప్పడు. అతనికి గ్రామీణుల్లో యింకా మద్దతుంది. ఎందుకంటే ఈడీ అమీన్ హయాంలో నెలకొన్న అంతర్యుద్ధంతో పోలిస్తే పరిస్థితులు కుదుటపడ్డాయి. అయితే గత ఆరేళ్లగా ఆర్థిక ప్రగతి కుంటు పడినా, వ్యవసాయరంగం, ఉపాధి రంగం దెబ్బ తిన్నా పల్లెటూళ్లలో యింకా పలుకుబడి వుంది.
అయితే ఓటర్లలో 80 శాతం మంది వున్న యువత అతనికి వ్యతిరేకంగా మారింది. ఆర్మీ జనరల్ ముగీషా ముంటు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఒకనాటి ముసెవెనీ అనుచరులందరూ దూరమై పోయారు. అతను 2006, 2011 ఎన్నికలలో నెగ్గడానికి కుతంత్రాలు పన్నిన గూఢచారి శాఖాధిపతి డేవిడ్ సెజూసా అతనితో విభేదించి లండన్ పారిపోయి 2013లో తిరిగి వచ్చి అతన్ని ఘాటుగా విమర్శిస్తున్నాడు.
2006లో నిజానికి కిజ్జాయే నెగ్గాడని కానీ ముసెవెనీ ఫలితాలను మార్చేశాడనీ, అతనితో చేతులు కలిపిన వ్యక్తిగా తనే సాక్షి అని చెప్తున్నాడు. అలాగే ముసెవెనీ వద్ద ప్రధానిగా పనిచేసి యిప్పుడు ఎదురు తిరిగిన అమామా 2011 ఎన్నికలలో కూడా యిలాటి అక్రమాలే జరిగాయని, దానికి వత్తాసు పలికానని చెప్తున్నాడు.
ఈ సారి ఎన్నికలకు పరిశీలకులుగా వచ్చిన యూరోపియన్ యూనియన్ అబ్జర్వర్స్ మిషన్‌కు చీఫ్‌గా వున్న ఎడ్యురాండ్ కుల్కన్ ఎన్నికల కమిషన్‌కు స్వేచ్ఛ లేదని, పారదర్శకంగా పనిచేయటం లేదని విమర్శించాడు. కామన్‌వెల్త్ దేశాల పరిశీలకుల బృందం ఎన్నికలలో మౌలికమైన ప్రజాస్వామ్య సిద్ధాంతాలు కూడా అవలంబించలేదని కుండబద్దలు కొట్టింది. ఇలా వీళ్లు ఎంత చెప్పినా, ముసెవెనీ ఏం చేసినా అమెరికా అతన్ని సమర్థిస్తూనే వుంది. అదీ అమెరికా డొల్లతనం!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)