ఏదైనా కడుతూంటే క్రాక్స్ రావడం, గర్డర్ జారి పడడం, స్లాబ్ విరిగి పడడం యివన్నీ మామూలుగా జరుగుతూంటాయి. కానీ యింత ప్రమాదం జరగడానికి కారణం – పైన పని జరుగుతూంటే కింద నుంచి ట్రాఫిక్‌ను అనుమతించడం. ఆ ప్రాంతాన్నంతా ఎందుకు కార్డన్ ఆఫ్ చేయలేదు, పోనీ పగుళ్లు కనబడ్డాకైనా జనాలను అటు రానీయకుండా ఎందుకు ఆపలేదు? అనే ప్రశ్న అందరూ వేస్తున్నారు. ఇలాటి ప్రశ్నలు వేయడం అతి సులభం. అంతకంటె సులభమైన పని – కాంట్రాక్టు పొందడానికి కంపెనీ సిపిఎం లీడర్లకు లంచాలిచ్చిందని, సర్కారు మారాక పని కొనసాగించడానికి తృణమూల్ లీడర్లకు యిచ్చిందని, అందువలన నాణ్యతపై రాజీ పడి, యీ దుస్థితి తెచ్చిపెట్టిందని తీర్మానించడం! కేవలం అవినీతినే తప్పుపడితే 2008లోనే ప్రారంభించిన పనిని ఎనిమిదేళ్ల తర్వాత కూడా కంపెనీ 55% మాత్రమే ఎందుకు పూర్తి చేసింది? మూడేళ్ల క్రితమే ఏదోలా కట్టేసి పూర్తి చేశామని అనిపించుకుని, పారిపోయి వుండవచ్చుకదా! అది తర్వాత పడిపోతే వాళ్లకు బాధ్యత వుండదు కదా! ఇలా అడుగుతున్నాను కాబట్టి అవినీతి జరగలేదని సర్టిఫై చేయటం లేదు. నేను గమనించినంతవరకు బెంగాల్ సమాజంలో మనంత స్థాయిలో కాకపోయినా అవినీతి వుంది. కానీ కేవలం అవినీతి కారణంగానే యిది జరిగిందనడానికి వీల్లేదని నేను భావిస్తున్నాను.
జనాలను ఎందుకు కట్టడి చేయలేదు అనే ప్రశ్న టీవీ స్టూడియోల్లో కూర్చుని చర్చించేవారు క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించినట్లే! హైదరాబాదులో పాత సిటీలో పనులు జరిపించడం ఎంత కష్టమో మనకు తెలుసు. అక్కడ విద్యుత్ సరఫరాలో నష్టాలు విపరీతంగా వున్నాయని మొన్ననే పేపర్లో వచ్చింది. ఎందుకంటే బిల్లులు కట్టకపోయినా, కరంటు చోరీ అయినా విద్యుత్ శాఖోద్యోగులు అక్కడ ఏమీ చేయలేరు. సైబరాబాదులో గచ్చిబౌలి వద్ద కట్టినట్లుగా అక్కడ ఫ్లయిఓవరు కట్టగలరా? మెట్రో అటు విస్తరించడం ఎంత కష్టం? ఎన్ని అడ్డంకులు? అంతెందుకు సుల్తాన్ బజార్ వద్ద వ్యాపారస్తులు అడ్డుకున్నారనేగా మెట్రో ఆలస్యమౌతోంది! అడ్డుకోవడానికి మామూలు పౌరులైనా చాలు. అమరావతిలో మాత్రం సజావుగా సాగుతోందా? 'అభివృద్ధి కావాలంటారు, మళ్లీ లిటిగేషన్ పెడతారు, ఎలా?' అని చంద్రబాబు విసుక్కున్నారు. 'ఇంటి ఎదురుగా వున్న రోడ్డు విస్తరించాలి, మన యింటికి డిమాండు పెరగాలి, విస్తరణలో రోడ్డుకి అవతలివైపు యిళ్లు కొట్టేయాలి కానీ మనవైపు రాకూడదు, వస్తే కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటాం' – యిదే ప్రతీవాడి ఆలోచనా. అమరావతికై కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 33 వేల ఎకరాల అటవీభూమి కావాలని యిన్నాళ్లకు ఆంధ్రప్రభుత్వం కేంద్రానికి అడుగుతోంది. ఆ పనేదో ముందే చేసి, అక్కడే అమరావతి ప్లాను చేసి వుంటే యీ భూములు లాక్కోవడాలు, యీ లిటిగేషన్లు వుండేవి కాదు కదా! ఒక్క చిన్న కేసు చాలు, వందల కోట్ల పని ఆపేయడానికి.
మామూలు పౌరులకే యింత శక్తి వుంటే మరి వ్యాపారస్తుడికి ఎంత వుంటుంది? హైదరాబాదులో సుల్తాన్ బజారు వ్యాపారస్తులు, రద్దీ వున్న పాత బస్తీవాసులు మెట్రోను యిప్పటికే చాలా ఆలస్యం చేయించగలిగారు కదా. మరి కలకత్తాలోని బడా బజారులో వ్యాపారస్తులూ పుష్కలంగా వున్నారు, రద్దీ కూడా వూహించలేనంత వుంది. ఈ రెండు శక్తులూ కలిస్తే ఏ పనైనా ఎలా సాగుతుంది? 1982-85 మధ్య నేను కలకత్తాలో మూడున్నరేళ్లు పనిచేశాను. మా బ్యాంక్ బ్రాంచ్ బ్రాబర్న్ రోడ్డుకు బడా బజారు బాగా దగ్గర. హోల్‌సేల్ మార్కెట్లన్నీ అక్కడే వున్నాయి. మార్వాడీలు, గుజరాతీలు వందల ఏళ్లగా నివాసం వుంటూ వుంటారు. తరచుగా వెళ్లేవాణ్ని. కిక్కిరిసిన ఆ రోడ్లు, అక్కడి వాతావరణం నాకు సుపరిచితం. 'ఫ్లయిఓవరు కడుతున్నాం, ఒక ఏడాది పాటు రోడ్డు మూసేస్తాం' అని అనగలిగే దమ్ము అక్కడి నాయకులకు లేదు. 'పైన వెల్డింగు జరుగుతోంది, కింద నుంచి ఎవరూ వెళ్లకూడదు, దడి కట్టేస్తాం' అంటే వినే జనం ఎవరూ లేరు. అందుకే అది కూలినప్పుడు సకల రకాల వాహనాలు దాని కిందుగా వెళుతున్నాయి. ప్రమాదం జరిగిన మర్నాడు రాజ్‌దీప్ సర్దేశాయి వెళ్లి అక్కడ తిరిగాడు. ఆ బ్రిజ్ కిందే బడ్డీ కొట్లలో మంచూరియాలు వేసి అమ్మేస్తున్నారు. భయం లేదా? అంటే చావు ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు కదా అంటున్నారు. అంతా భగవాన్ భరోసే వ్యవహారం!
బెంగాల్ సమాజంలోనే క్రమశిక్షణ తక్కువ. కలకత్తాలో కూడా దక్షిణ భాగంలో కొంత ఆర్డర్లీనెస్ కనబడుతుంది కానీ ఉత్తరభాగంలో బొత్తిగా కానరాదు. పేవ్మెంట్ల మీద దుకాణాలే కాదు, కాపురాలూ కనబడతాయి. అధికారులు చెప్తే వినేవాళ్లు లేరు. నేను అక్కడ వుండే రోజుల్లోనే చిత్తరంజన్ ఎవెన్యూలో భూగర్భంలో మెట్రో కట్టేవాళ్లు. మన కోస్తా జిల్లాలలా అక్కడా నేల చాలా మెత్తగా వుంటుంది. గోతులు తవ్వుతూంటే కూలిపోతూండేవి. పక్కనున్న పాత భవంతులు కదిలిపోయేవి, ఒరిగిపోయేవి. ఖాళీ చేసేయండి అంటే ఎవరూ లక్ష్యపెట్టేవారు కారు. ఏదైనా బీట రాగానే మాత్రం గొంతు చించుకుని అరిచేవారు. ఇప్పుడు యీ ఫ్లయిఓవరు కూడా భవంతులకు ఎంత దాపుగా వెళ్లిందో జతపరచిన ఫోటోలో చూడండి. దానికీ, భవంతి కిటికీకి ఆరడుగుల దూరం కూడా వుండదు. ఆ భవంతులకు పెయింటింగు వేయడం జన్మలో జరగదు. వేసే సౌలభ్యం వున్నా, వాళ్లు వేయించుకోరనుకోండి. హౌడా స్టేషన్లో దిగి బ్రిజ్ దాటి వూళ్లోకి వస్తూండగా మిమ్మల్ని పలకరించేవి మసిబారిన, ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని భవంతులు. వాటిల్లో వేటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్టు వుండదు. వందల ఏళ్ల క్రితం కట్టినవి. బిలబిలలాడుతూ మనుష్యులు. ఏ ఏభై యేళ్ల క్రితమో ఫిక్స్ చేసిన అద్దెలు. పెంచడానికి వీల్లేదు. ఏడాదంతా వచ్చే అద్దె బిల్డింగుకు పెయింటు చేయించడానికి సరిపోదు. నివాసయోగ్యంగా లేవు, ఖాళీ చేయండి అంటే చేయరు. అలా అని డబ్బు లేనివాళ్లా అంటే ధనికులంతా అక్కడే వున్నారు.
నేను కలకత్తాలో వుండే రోజుల్లో పెడల్ రిక్షాలతో బాటు మనుష్యులు లాగే రిక్షాలు కూడా వుండేవి. చాలా అమానుషంగా తోచేది. వాటిని రద్దు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడల్లా ''కలకత్తా పారిస్ కాదు, యిక్కడ బీదవాళ్లు కూడా బతుకుతారు'' అని లెఫ్ట్ మంత్రులు గంభీర ప్రకటనలు చేసేవారు. వాస్తవం ఏమిటంటే వారిలో చాలామంది ఆ రిక్షాల ఓనర్లు. పాత కలకత్తాను బాగు చేయలేమనుకుని జ్యోతి బసు ఉత్తర కలకత్తాలోనే సాల్ట్ లేక్ సిటీ అని విశాలంగా కట్టించాడు. 2007లో కలకత్తా వెళ్లినపుడు అక్కడే వున్నాను. అక్కడా పెడల్ రిక్షాలు కనబడ్డాయి. మెట్రో అంటూ మధ్యలో యీ రిక్షాలేమిటి అనిపించింది. ఏ మార్పు తెద్దామన్నా ప్రజలు ఒప్పుకోరు. కాంగ్రెసు, కమ్యూనిస్టు, తృణమూల్ – పాలకులు ఎవరైనా సరే సమాజంలో క్రమశిక్షణ లేనివారిని ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్లకు నచ్చచెప్పి, శాసించే నాయకులు కరువై పోయారు. వాళ్లకు కోపాలు వస్తాయనే భయంతో కట్టడి చేయరు. అందుకే యీ అనర్థం. బడా బజార్లో ఏదైనా సరే కట్టడం అతి కష్టమనే విషయం ఆ ప్రాంతపు కామందుల సంగతి తెలిసున్నవారందరికీ తెలుసు. ఇరుకిరుకు సందులు, విపరీతమైన ట్రాఫిక్. క్రేన్లు అవీ తేవాలంటే అక్కడ మలుపు తిప్పడం మహా కష్టం. అందుకే కష్టమైందని కంపెనీ వాదిస్తోంది.
ఐవిఆర్‌సిఎల్ కంపెనీతో బాటు టెండర్ వేసిన మరో ఇన్ఫ్రా కంపెనీ ఉద్యోగి వివేక్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ''టెండరింగులో పారదర్శకత వుందని చెప్పగలను. వాళ్లది బెస్ట్ టెండర్ కాబట్టే వాళ్లకు పని యిచ్చారు.'' అన్నాడు. నిర్మాణానికి అనుమతి యిచ్చిన ప్రభుత్వం చట్టపరమైన యిబ్బందులు, పౌరసమాజం నుండి వచ్చే యిబ్బందులు పరిష్కరించి మరీ పని అప్పచెప్పాలి. అది జరగలేదు. 'మా యింటికి దగ్గరగా వెళుతోంది' అంటూ వ్యాపారస్తులు కోర్టులో పిటిషన్లు వేశారు. వివాదరహితమైన భూమి దొరకడమే కష్టమై పోయింది. 2013 మార్చిలో జెఎన్ఎన్యుఆర్ఎమ్ వాళ్లు సమర్పించిన యిన్స్పెక్షన్ రిపోర్టులో- 'స్థానిక వ్యాపారస్తుల ప్రతికూలత, పోలీసు అనుమతులు యివ్వకపోవడం వలన ప్రాజెక్టు ఆలస్యమైంది.' అని రాశారు. 18 నెలల్లో పూర్తి చేయాలన్నారు కానీ ఆ పాటికి పని చేయడానికి యివ్వవలసిన భూమిలో 23% మాత్రమే యిచ్చారు. అందువలన కంపెనీ రోజులో కేవలం 6 గంటల పాటు మాత్రమే (పొద్దున్న 11 నుంచి సాయంత్రం 5 వరకు) పని చేసింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడడంతో ఏదైనా చేసి చూపించాలని మమత తొందర పెట్టారు. ఆ ఆతృతలోనే తప్పులు జరిగాయి. 27 మంది ప్రాణాలు పోయాయి. 80 మంది గాయపడ్డారు. పని విషయంలోనే కాదు, ఉపయోగించిన సామగ్రి నాణ్యతలో కూడా రాజీ పడ్డారేమో విచారణలో కాని తెలియదు. కానీ దండన కంపెనీతో ఆగకూడదు. తప్పు జరగనిచ్చిన వారు కూడా శిక్షార్హులే. జనాలకు ఏది మంచో నిష్కర్షగా చెప్పలేకపోయిన నాయకులది అందరి కంటె పెద్ద తప్పు. కలకత్తా వాసులే కాదు, ఏ నగర వాసులైనా సరే క్రమశిక్షణకు, నియమాలకు బద్ధులై వుండకపోవడం అన్నిటి కంటె ఘోరాతిఘోరమైన నేరం. (సమాప్తం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)