ఎమ్బీయస్‌: కలకత్తా యమపురి – 1/2

కలకత్తాలో ఫ్లయిఓవరు కూలింది. కూలే ఫ్లయిఓవర్లలో యిది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. ఇలాటివి జరిగే నగరాల్లో చూసినా కలకత్తా కూడా మొదటిదీ కాదు, చివరిదీ కాదు. మన వూళ్లోనే పంజగుట్టలో కూలింది. 'ఇప్పటికి…

కలకత్తాలో ఫ్లయిఓవరు కూలింది. కూలే ఫ్లయిఓవర్లలో యిది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. ఇలాటివి జరిగే నగరాల్లో చూసినా కలకత్తా కూడా మొదటిదీ కాదు, చివరిదీ కాదు. మన వూళ్లోనే పంజగుట్టలో కూలింది. 'ఇప్పటికి చాలామంది పోయారు, ఎందరో క్షతగాత్రులు… వారందరికీ నష్టపరిహారం యివ్వడం జరుగుతుంది.. తప్పెక్కడ జరిగిందో తేల్చడానికి విచారణ జరుగుతోంది…ఇప్పటికే కొందర్ని అరెస్టు చేశాం… ఎంతటివారైనా సరే దోషులను వదలం.., మానవవిషాదాన్ని రాజకీయాలతో ముడి పెట్టకండి.. కష్టకాలంలో పౌరులంతా ఒక్కటిగా నిలిచి బాధితులను ఆదుకున్నారు.. దుర్ఘటన తర్వాత కూడా జీవితం ఎప్పటిలాగా సాగుతోంది. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని నిబ్బరంగా ముందుగు సాగడమే యీ నగరస్వభావం, అది మరొక్కసారి నిరూపితమైంది..' ఇలాటివి ఎక్కడ ప్రమాదం జరిగినా వినబడతాయి, యిక్కడా వినబడ్డాయి. అవి కాకుండా దీనికి వున్న ప్రత్యేకతలేమిటి అనేదే చూడాలి. ఒకటి – యీ దుర్ఘటన ఎన్నికలు వాకిట్లో వుండగా జరిగింది. ఓటింగు సరళిని, ముఖ్యంగా కలకత్తా నగరపు సరళిని ప్రభావితం చేయడానికి చాలా అవకాశం వుంది. ఇప్పటిదాకా తృణమూల్‌ గెలుస్తుందనుకుంటున్నారు కానీ దీని కారణంగా గండి పడుతుందని ప్రత్యర్థులు ఆశిస్తున్నారు. ఆ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో ఫలితాలు వచ్చాక తెలుస్తుంది. ఎన్నికలు వున్నా లేకున్నా మామూలుగా అయితే అందరూ ప్రభుత్వాన్ని తిట్టడంతో సరిపెడతారు. అయితే యిక్కడ ప్రభుత్వమే ఎదురు తిరిగి కంపెనీని, పాత ప్రభుత్వాన్ని తిట్టింది. అదీ వెరయిటీ. అలా తిట్టడంలో న్యాయం వుందా లేదా అన్నది పరికిద్దాం. 

మమతా అన్నదేమిటి? 'ఇది పాత ప్రభుత్వహయాంలో శాంక్షనైంది, కాంట్రాక్టును బ్లాక్‌లిస్టెడ్‌ కంపెనీకి యిచ్చారు, ప్లాను డిజైను ఎలా వుందో చూపించమని అడిగినా కాంట్రాక్టరు చూపించలేదు.' సుమారు 30 ఏళ్ల క్రితం లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కలకత్తాలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్లాన్లు చెప్పమని జపాన్‌ ప్రభుత్వసంస్థల సహాయం కోరింది. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజన్సీ వచ్చి అధ్యయనం చేసి నగరంలో 12 చోట్ల ఫ్లయిఓవర్లు కట్టాలని సూచించింది. వాటి నిర్మాణానికి కేంద్రం ద్వారా ధనసహాయం చేస్తానంది. ఒకదాని తర్వాత మరొక ఫ్లయిఓవరు నగరంలో రూపు దిద్దుకోవడం మొదలుపెట్టాయి. కానీ నిధుల కొరత వలన నిర్మాణంలో ఎంతో ఆలస్యమౌతూ వచ్చింది. బడా బజార్‌లో (చాలా తెలుగు పత్రికలు బుర్రా బజార్‌ అని రాస్తున్నాయి) కూలిన 2.2 కి.మీ.ల వివేకానంద ఫ్లయిఓవరు (కలకత్తాలో ప్రతిదానికి వివేకానందుడి పేరో, రవీంద్రుడి పేరో పెట్టడం రివాజు)ను నగరాలు, మహానగరాలలో జీవనాన్ని మెరుగు పరచడానికి యుపిఏ ప్రారంభించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎమ్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌) కింద చేపట్టారు. దీన్ని పర్యవేక్షించవలసినది కలకత్తా మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కెఎమ్‌డిఏ). కలకత్తాలో యితర ఫ్లయిఓవర్ల నిర్మాణం కూడా నిధుల కొరత వలన ఆలస్యం అవుతూ వచ్చింది. దీని గతీ అంతే. 

నిర్మాణం అప్పగించిన ఐవిఆర్‌సిఎల్‌ పెద్ద కంపెనీయే. వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అనేక పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టింది. ఫ్లయిఓవర్లు, బ్రిజ్‌లు చాలా కట్టింది. ప్రస్తుతం మహారాష్ట్రలో చాలా ప్రాజెక్టులు చేస్తోంది. దానికి 2007లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ కాంట్రాక్టు యివ్వడంలోనే తప్పు జరిగింది అనే వాదన కరక్టు కాదు. ఇక 'కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా లేదు, గత మూడేళ్లలో టర్నోవర్‌ సగానికి తగ్గిపోయింది, ప్రస్తుతం రూ. 10 వేల కోట్ల అప్పుంది. మార్చిలోనే ఋణాలు రీస్ట్రక్చర్‌ చేయించుకుంది, రూ. 2 వేల కోట్ల నష్టంలో వుంది, 5-6 వేల కోట్లు తక్షణం వుంటే తప్ప కష్టాల్లోంచి బయటపడదు' అని వార్తలు వస్తున్నాయి. అనేక ఇన్‌ఫ్రా కంపెనీల పరిస్థితి అలాగే వుంది. ఆర్థికస్థితికి, దుర్ఘటనకు లింకేమిటో నాకు తెలియలేదు. తొమ్మిది డెడ్‌లైన్లు మిస్సయింది అని మరో ప్రముఖ వార్త. ఎవరి కారణంగా అనేది బయటకు రావాలి. చట్టపరమైన చిక్కులు వచ్చాయా? ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదా? చేసినా కంపెనీ ఆ నిధులను వేరే చోటకి మళ్లించి దీన్ని తాత్సారం చేసిందా? అనేది నిర్ధారించుకోవాలి. సంఘటన జరగ్గానే ఆ కంపెనీ అధికారి చాలా అవివేకంగా ఇది 'దేవుడు చేసిన పని' అనడంతో అందరికీ ఒళ్లు మండిపోయింది. ఇదేమీ భూకంపం, సునామీ లాటిది కాదు. మానవ తప్పిదం తప్పకుండా వుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పర్యవేక్షించవలసిన వారెవరు? వారేం చేస్తున్నారు అనేవి తేలాలి. ఈ లోపునే దేవుడి మీద తోసేస్తే ఎలా? అందరూ విరుచుకుపడడంతో కంపెనీ తాలూకు న్యాయశాఖాధికారి వచ్చి ఆయన ఉద్దేశం అది కాదు అని చెపుతూనే, చూస్తూంటే అక్కడ బాంబేదో పెట్టారేమో అన్న సందేహం వ్యక్తం చేశారు. 'జానే భీ దో యారోఁ'' సినిమా గుర్తుకు వచ్చింది. మమత మళ్లీ నెగ్గాక కంపెనీ వాళ్లతో రాజీ పడిపోయి యిద్దరూ కలిసి, మమతను అప్రదిష్ఠపాలు చేయడానికి సిపిఎం వాళ్లే బాంబులు పెట్టారనే కథను చలామణీలోకి తెచ్చినా తేవచ్చు. 

''మేం 2007లో కంపెనీకి కాంట్రాక్టు యిచ్చినపుడు అది బ్లాక్‌లిస్టు కాలేదు'' అని సిపిఎం లీడరు అన్నది కరక్టే. 2009లో హైదరాబాదు కార్పోరేషన్‌కై పని చేస్తున్నపుడు పనివాళ్ల భద్రతకై జాగ్రత్తలు తీసుకోకపోవడం చేత యిద్దరి ప్రాణాలు పోయాయి. లేబరు డిపార్టుమెంటు కంపెనీని బ్లాక్‌లిస్టు చేయమంది, కానీ కార్పోరేషన్‌ చేయలేదు. అలహాబాదు, కాన్పూరులలో తాగునీరు, మురుగునీరు ప్రాజెక్టులలో వాడిన మెటీరియల్‌లో నాణ్యత పాటించనందుకు ఉత్తర ప్రదేశ్‌ జల నిగమ్‌ 2011లో బ్లాక్‌లిస్టు చేసింది. ఝార్‌ఖండ్‌లో గ్రామాల విద్యుదీకరణ కాంట్రాక్టుకై ముఖ్యమంత్రి మధు కోడాకు రూ. 22 కోట్లు లంచం యిచ్చినట్లు ఆరోపణలు వచ్చినపుడు సిబిఐ దానిపై విచారణ జరిపింది. ''కంపెనీ పని సవ్యంగా చేయలేదు, మేం రూ.750 కోట్లు పరిహారం అడిగాం' అన్నాడు ఝార్‌ఖండ్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు లాయరు. చివరకు 2013లో స్పెషల్‌ కోర్టు సాక్ష్యం ఏదీ దొరక్క కేసు కొట్టేసింది. అయినా ఝార్‌ఖండ్‌ 2015లో దాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టింది. 

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బ్లాక్‌లిస్టులో వున్న కంపెనీ అని మమతకు యిప్పుడే తెలిసిందా? తను అధికారంలోకి రాగానే ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్టు చేసిందని తెలియగానే వీళ్లను తప్పించాల్సింది కదా. తను ఆ పని చేయకుండా కాంట్రాక్టు ఎందుకు కొనసాగించింది? దీనికి సమాధానం చెప్పమంటే తృణమూల్‌ ఎంపీ, మమతకు ఆప్తుడు డెరెక్‌ ''మేం అధికారంలోకి వచ్చేటప్పటికే సగం… అంటే 30-40% వర్క్‌ పూర్తయిపోయింది. మధ్యలో ఎలా మారుస్తాం?'' అన్నాడు. 30% అయిందా, 40% అయిందా అన్నది స్పష్టత లేదు. సరే యిప్పటివరకు ఎంత పని జరిగింది అన్నదానిపై స్పష్టత లేదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ యిచ్చిన దాని ప్రకారం చూస్తే 2.2 కి.మీ.లకు పూర్తయినది 0.9 కి.మీ మాత్రమే. అంటే 40%! కూలిపోగానే వచ్చిన వార్తల్లో 75% అయిపోయింది అని వుంది. తర్వాత కంపెనీ తరఫున కె పి రావు ''బిజినెస్‌ స్టాండర్డ్‌''తో మాట్లాడుతూ ''55% పని జరిగింది. 45% మిగిలింది. 70 స్పాన్లలో 69 కరక్టుగానే కట్టాం. ఇదే కూలిపోయింది.'' అన్నారు. అంటే 2011 నాటికి 30% పని అయిందనుకుంటే గత ఐదేళ్లలో జరిగిన పని 25% మాత్రమేనా? 40% అనుకుంటే 15% మాత్రమే జరిగిందనుకోవాలి. మధ్యేమార్గంగా 20% అనుకుందాం. ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' యిచ్చిన బొమ్మను వారి సౌజన్యంతో జతపరుస్తున్నాను. ఎన్ని రకాల యిబ్బందులు వచ్చిపడ్డాయో ఎందుకు ఆలస్యమైందో అది కొంత ఐడియా యిస్తుంది. 2014 నవంబరు నుండే పని వూపందుకుంటేనే 40% పూర్తయిందని గమనించాలి. 

అంత రద్దీ ప్రదేశంలో కడుతున్న ఫ్లయిఓవరు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పూర్తి కావాలి. 18 నెలల్లో పూర్తి కావాలని గడువు యిచ్చారు. కంపెనీ తొమ్మిది గడువులు దాటబెట్టింది. ఐదేళ్లలో 20% మాత్రమే పూర్తి చేస్తే మరి మమత ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? వాళ్లు ప్లాను, డిజైను యివ్వనని మొరాయిస్తూంటే ఏం చేస్తున్నట్లు? ఎవర్నీ ఖాతరు చేయననే తన యిమేజికి యిది విరుద్ధంగా లేదా? ముందు దానికి సమాధానం చెప్పాలి. డిజైన్‌ గురించి ఆలోచిస్తే – డిజైన్‌ సరిగ్గా లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు అని పేపర్లన్నీ రాస్తున్నారు. టీవీ కెమెరాల ముందు చాలా మంది పౌరులు 'హమే పతా హై, ఠీక్‌ నహీ బన్‌ రహా' అని చెప్పేశారు – పెద్ద సాంకేతిక నిపుణుల్లా! పంజగుట్ట ఫ్లయిఓవరు కూలినప్పుడు అలాగే టీవీ వాళ్లు అక్కడున్న వాళ్లని అడగడం, వాళ్లూ 'దీన్ని యిలా కట్టకూడదండి, ఇది ఎప్పటికీ నిలవదు' అని ఉద్ఘాటించేశారు. ఇప్పుడది పూర్తయి నిక్షేపంలా పనిచేస్తోంది. ఈ ఫ్లయిఓవరు డిజైన్‌ సరిగ్గా వుందో, లేదో సామాన్యులకు తెలియడానికి ఛాన్సు లేదు. ఆర్కిటెక్చరల్‌, స్ట్రక్చరల్‌ యింజనియర్లు మాత్రమే దానిపై వ్యాఖ్యానించగలరు. టీవీవాళ్లు వాళ్లను కూర్చోబెట్టి ప్రశ్నించాలి. నా బోటి వాడిని అడిగి ప్రయోజనం లేదు. 

డిజైన్‌లో లోపముందో లేదో తెలియరాలేదు కానీ పనిలో నిర్లక్ష్యం మాత్రం వుందని అర్థమవుతోంది. 60 పిల్లర్లుంటే 40 వ పిల్లరు గర్డరు వద్ద ముందు రోజు చీలికలు వచ్చాయట. రివెట్లు, బోల్టులు విరిగాయట. నీళ్లు కారాయట. డ్యూటీలో వున్న యింజనియరు ఏదోలా మేనేజ్‌ చేద్దామని వాటిని వెల్డింగ్‌ చేయించేసి, కాంక్రీట్‌ మిక్స్‌ అద్దించేశాడట. ఇది చూసినవాళ్లు టీవీల్లో చెప్పారు. మర్నాడు మధ్యాహ్నానికల్లా కూలిపోయింది. ఎందుకీ తొందర? పని ఆపేయాల్సింది కదా అనిపిస్తుంది. ఐదేళ్లూ నిద్రపోయిన మమత సర్కార్‌ ఆఖరి నిమిషంలో అడావుడి పెట్టడం వలననే యీ అనర్థం అని ఆరోపిస్తున్నారు. పార్క్‌ సర్కస్‌ను ఇఎం బైపాస్‌ రోడ్డును కలిపే 4.5 కి.మీ.ల ఫ్లయిఓవరు 2003లో ప్రారంభమై నిధుల కొరత వలన పదేళ్లపాటు పడకేసింది. మమతా బెనర్జీ హెచ్చరిక చేసి, పరుగులు పెట్టిస్తే చివరకు రూ. 450 కోట్లతో పూర్తయింది. దానికి మమత ''మా'' అని పేరు పెట్టింది. దీన్నీ అలాగే తొందరపెట్టి పూర్తి చేయిద్దామనుకుంది మమతా. ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే ఏప్రిల్‌ 1 కల్లా పూర్తి చేసి తీరాలని మమత అల్టిమేటం యిచ్చిందని ''టెలిగ్రాఫ్‌'' రాస్తే తృణమూల్‌ ఆ మాటలను కొట్టి పారేసింది. తన పార్టీవాళ్లకు సబ్‌-కాంట్రాక్టులు యివ్వాలని కంపెనీపై తృణమూల్‌ ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలున్నాయి. ఆ పార్టీ లీడరు స్మితా బక్షి కుటుంబానికి చెందిన కంపెనీకి సబ్‌ కాంట్రాక్టు యిచ్చిన మాట వాస్తవం. ఇంకా ఎంతమందికి యిచ్చారో తెలియదు.  – (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]