బాహుబలి వెనుక రాజకీయం

తెలుగు సినిమా చిరిత్రలో బాహుబలి వంటి భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా మరొకటి లేదు. భారీ సెట్టింగ్‌లతో, డిజిటల్ ఎఫెక్టులతో, కళ్లు మైమరిపించే సీన్లతో, తమన్నా సోయగాలతో, గుగుర్పాటు కలిపించే యుద్ద సన్నివేశాలతో ఇలాంటి…

తెలుగు సినిమా చిరిత్రలో బాహుబలి వంటి భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా మరొకటి లేదు. భారీ సెట్టింగ్‌లతో, డిజిటల్ ఎఫెక్టులతో, కళ్లు మైమరిపించే సీన్లతో, తమన్నా సోయగాలతో, గుగుర్పాటు కలిపించే యుద్ద సన్నివేశాలతో ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదు. సినిమా మొదలైనప్పటి నుంచీ చివరి వరకూ సీట్లకు అంటిపెట్టుకుని ఉండేలా రాజమౌళి ఈ సినిమా తీశారు. కాని ఇందులో ప్రజలకు అందిన సందేశమేమీ లేదు. ప్రజలను చైతన్యపరిచే ఘట్టమేమీ లేదు. జాతీయ సినిమాగా ఇంతవరకూ అవార్డులు పొందిన సినిమాల్లో దర్శక ప్రతిభతో పాటు ప్రజలకు మంచి సందేశమిచ్చే సినిమాను ఎంచుకునేవారు. కాని బాహుబలిని ఎందుకు ఎంచుకున్నారు? మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటించిన సినిమాకు నరేంద్రమోదీ ఎందుకు పట్టం కట్టారు?

ఆస్కార్ అవార్డులకు ఈ సినిమా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఇది అసంపూర్ణ సినిమా అని ఆస్కార్ నిర్వాహకులు భావించారు. బాహుబలి రెండో భాగం ఇంకా చిత్రించాల్సి ఉంది. అయినప్పటికీ బాహుబలి గొప్ప సినిమా కాకుండా పోతుందా? ఆస్కార్ అనేక మంచి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదు.. అని వాదించేవారున్నారు. ఏమైనా తెలుగు వారు గర్వించే విధంగా ఒక సినిమాకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉత్తమ జాతీయ సినిమాగా అవార్డు లభించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని భాషల సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అన్ని భాషలకన్నా ఎక్కువ సినిమాలు తెలుగులో తీస్తున్నా. అవార్డుకు అర్హమైన సినిమా మనం తీయలేదు. అందువల్ల తెలుగు సినిమాకే ఇంతవరకూ జాతీయ అవార్డు రాలేదు. కనుక మనం గర్వపడదాం.

బాహుబలిలో సందేశం లేదన్న వాదనను కూడా చాలా మంది కొట్టిపారేస్తున్నారు. చెడుపై మంచి గెలవడం సందేశం కాదా అన్నది వారి వాదన. కాని మొదటి భాగంలో మంచిపైనే చెడు గెలిచింది. కనుక మొదటి భాగానికి ఎలా ఇస్తారు? ఉత్తమ సాంకేతిక సినిమాగా అవార్డు ఇచ్చినా ఒపకునేవారం అని వారంటారు.

అంతేకాదు. హీరో సామాన్య మానవులకు అలవి కాని వీరోచిన కార్యాలు చేయడం, విలన్ భారీ దున్నపోతును మట్టి కరిపించడం, ఎక్కడున్నారో, ఏ భాషలో మాట్లాడుతున్నారో తెలియని కాలేకయులను ప్రవేశపెట్టడం, కథానయకుడు హీరోయిన్‌ను కత్తితో బట్టలు విప్పి వశపరుచుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ సినిమాలోనే కనిపించకుండా పోవడం, ఒకవైపు మంచుకొండల్ని, మరోవైపు హరిత ప్రదేశాల్ని కలిపి చూపించడం, డిజిటల్ ఎఫెక్టులు స్పష్టంగా చిన్న పిల్లలకు అర్థమయ్యేలా తెలియడం జ్యూరీ సభ్యులకు వ్యతిరేకించే విషయాలు కాలేదు.

నిజానికి జ్యూరీ సభ్యులు పూర్తిగా బీజేపీ ప్రభుత్వ భావజాలానికి అనుగుణంగా నడిచారని విమర్శలు వచ్చాయి. ఇప్పటివరకూ మంచి సినిమాలు రాని గుజరాత్‌ను చిత్ర నిర్మాణానికి అనువైన రాష్ట్రంగా గుర్తించారు. పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా అవార్డులను తిరిగి ఇచ్చిన వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటివరకూ కేరళ, బెంగాల్ సినిమాలేక అవార్డులు ఎక్కువ వచ్చేవి. అందులో ఎక్కువ వామపక్ష భావజాలం ప్రతిఫలించేది. ఈ సారి అలాంటి సినిమాలను సమీపానికి రానియ్యలేదు. ఉదాహరణకు కేరళ సినిమా అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా పరిగణన పొందిన ఓజీవుడివసతే కలియాను జ్యూరీ పట్టించుకోలేదు. మనోజ్ కానా, శ్యాంప్రసాద్, బిజుకుమార్ దామోదరన్ మొదలైన వారు సినిమాల ఎంపిక తీరును విమర్శించారు.

ఇక బాహుబలి మాటకొస్తే ఫక్తు పౌరాణికంగా కనిపించే సినిమాకు అవార్డు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. హిందీ సినిమాలకు అవార్డు ఇవ్వాల్సి వస్తే అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ మొదలైన వారు నటించిన ఏ సినిమాకో అవార్డు ఇవ్వాల్సి వచ్చేది. 

అందువల్ల హిందూ పౌరాణిక సినిమాగా కనిపించే బాహుబలిని జ్యూరీ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నది. హిందీ సినిమాల్లో నటించే ముస్లిం నటులకు పోటీగా ఒక హిందూ నటుడిని ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు కనపడుతోంది.

అందే కాదు, ప్రభాస్ వల్ల బీజేపీకి ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రభాస్ పినతండ్రి కృష్ణంరాజు గతంలో బీజేపీ ఎంపీగా ఉన్నారు. బాహుబలి విడుదలయిన కొద్ది రోజులేక జులైలో కృష్ణం రాజు ప్రభాస్‌తో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర బీజేపీ నేతలను కలిశారు. ఢిల్లీలో బీజేపీ నేతలకోసం ప్రత్యేక షో వేశారు. ప్రభాస్‌ను భావి బీజేపీ నేతగా తీర్చిదిద్దేందుకు బీజేపీ అగ్రనేతలు ఎపడో రంగం సిద్ధం చేశారు. తదనుగుణంగానే ప్రభాస్ నటించిన బాహుబలికి అవార్డు లభించింది. అంతకుముందు కర్ణాటక కోటా నుంచి రాజమౌళికి పద్మశ్రీ ఇవ్వడంతో ఆయనకు కూడా గుర్తింపు ఇచ్చినట్లయింది. అంతా ఒక పద్దతి ప్రకారమే జరిగిందని అర్థమవుతోంది.

ప్రభాస్ ఇప్పుడు దేశమంతా గుర్తింపు పొందిన నటుడు. ఆయన అంటే అభిమానుల్లో క్రేజీ ఉన్నది. తెలుగు సినిమాలో ఇపడు చాలా మంది సినిమాలు ఫట్ అయ్యాయి. బాహుబలి తర్వాత ఏ సినిమా అంత హిట్ కాలేదు. కనుక ప్రభాస్‌ను రాజకీయ రంగంలోకి దించేందుకు అన్ని అవకాశాలున్నాయి. బీజేపీకి క్షత్రియుల్లో ఓటు బ్యాంకును పెంచేందుకు ప్రభాస్ రాజు ఎంతో ఉపయోగపడతారు.

ఇప్పటికే కాపు వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఆయన నిర్మించే సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఆ తర్వాత తాను సినిమాల్లో నటించడం మానేస్తానని పవన్ చెప్పారు. అంటే రాజకీయాల్లో ప్రవేశిస్తానని చెప్పక చెప్పినట్లయింది. పవన్ కల్యాణ్ అంటే నరేంద్రమోదీకి ఎంతో ఇష్టం. అయితే ఆయన సినిమాలు మాస్ సినిమాలు కనుక అవార్డులకు పనికి రావని మోదీకి తెలుసు. అయినా ఓట్లు సంపాదించుకోవడానికి పవన్ ఉపయోగపడతారు.

ఒకవైపు పవన్ కాపు, మరో వైపు ప్రభాస్ రాజు ఉండగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఢోకా ఏమిటి? ఎటొచ్చీ తెలుగుదేశం, వైసీపీ పార్టీలే ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఇద్దరు సినిమానటులు, మరికొందరు ఉద్దండులైన రాజకీయ నేతలతో బీజేపీ వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా రంగంలోకి దిగబోతున్నది. మిగతా దృశ్యం రాజకీయ వెండితెరపై వేచి చూడండి.