ఆసాంలో గత 15 ఏళ్లగా కాంగ్రెసు ఏలుతోంది. అందువలన ఈసారి ఎన్నికలలో అట్టు తిరగబడి 2011 ఎన్నికలలో 5 సీట్లు (మొత్తం సీట్లు 126) మాత్రమే గెలుచుకున్న బీజేపీ అధికారంలోకి వస్తుందనే అనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు మరో అంశం కూడా తోడయింది. ముఖ్యమంత్రిగా వున్న తరుణ్ గొగోయ్‌కి ఇన్నాళ్లూ రణతంత్రంలో సహాయపడుతూ వచ్చిన హిమంత విశ్వశర్మ 2015 ఆగస్టులో అతనిపై తిరుగుబాటు చేసి 10 మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీలోకి మారిపోవడంతో కాంగ్రెసుకు పెద్ద దెబ్బే తగిలింది. 79 ఏళ్లు వచ్చిన తరుణ్ గద్దె దిగి తనను ముఖ్యమంత్రి చేయాలని 47 ఏళ్ల హిమంత ఆశించి మూడేళ్లగా అధిష్టానం వద్ద మొత్తుకుంటున్నా మాతాసుతులు పట్టించుకోలేదు. ప్రాణం విసిగి అతను బీజేపీలో చేరాడు. తన చాకచక్యాన్ని ఉపయోగించి ఆసాం గణ పరిషత్‌తో సహా అన్ని ప్రతిపక్షాలను కూడగట్టి పొత్తు సాధించాడు. ఒకే ఒక్క ప్రతిపక్షం మాత్రం బీజేపీతో కలవలేదు. అది 2011 అసెంబ్లీ ఎన్నికలలో 13% ఓట్లతో 18 సీట్లు గెలిచిన ఎఐయుడిఎఫ్ అనే ముస్లిము పార్టీ. అగరుబత్తి వ్యాపారి బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించిన ఆ పార్టీ 2014 పార్లమెంటు ఎన్నికలలో 15% ఓట్లతో 3 సీట్లు సాధించింది. కాంగ్రెసుకు 30% ఓట్లతో 3, 37% ఓట్లతో బీజేపీ 7 తెచ్చుకున్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో 35% వున్న ముస్లిములు బీజేపీని నిలవరించడానికి ఎఐయుడిఎఫ్ను ఆదరించారు. కానీ బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ రథానికి అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెసును ఆదరించడమే మంచిదని భావిస్తున్నారుట.
బీజేపీ శిబిరంలో కూడా అంతా సవ్యంగా లేదు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని వున్న తమను కాదని, కొత్తగా కాంగ్రెసు నుంచి వచ్చిన హిమంత అతని అనుచరులకు పెద్దపీట వేయడం చాలామందికి నచ్చటం లేదు. ఆసాం గణపరిషత్తో (ఎజిపి) చేతులు కలిపిన కారణంగా వాళ్లకు 24 సీట్లు కేటాయించి తమ క్యాడర్‌కు టిక్కెట్లు ఇవ్వకపోవడమూ సహించలేకపోతున్నారు. 2011 ఎన్నికల్లో ఎజిపికి 10 వచ్చాయి. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా 53 ఏళ్ల సర్వానంద సోనోవాల్ ముందుకు వచ్చారు. అతను బంగ్లాదేశ్ నుంచి ఆసాంలో స్థిరపడిన శరణార్థులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నాడు. 2014 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మోదీ బంగ్లాదేశ్ శరణార్థులందరూ 2016 మే నాటి కల్లా దేశం విడిచి వెళ్లాల్సిందే అని హుంకరించాడు. ఒకసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ ట్యూను మార్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిములు వెళ్లిపోతే చాలు, హిందువులు వుండవచ్చు అంటోంది. అది ఆసామీయులకు రుచించడం లేదు. వాళ్ల దృష్టిలో హిందువైనా, ముస్లిమైనా విదేశీయుడు వెళ్లిపోవాల్సిందే. వాళ్ల కారణంగా తమ ఉద్యోగాలు పోతున్నాయి, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని వారి బాధ. అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్రా నదిపై కడుతున్న పెద్ద డ్యామ్‌ను బీజేపీ 2014కు ముందు వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చాక దానిపై మెత్తబడింది. వీటిపై ఆసాం ఓటరు ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఎఐయుడిఎఫ్ అధినేత బద్రుద్దీన్ అత్యంత ధనికుడు మాత్రమే కాక, స్వచ్ఛంద సంస్థల ద్వారా దండిగా విరాళాలు ఇస్తూంటాడు. అతన్ని ఒక సాధుపుంగవుడుగా ఆసాంలో భావిస్తారు. ముస్లిములకే కాక గిరిజనులకు, హిందువులకు కూడా టిక్కెట్లు ఇచ్చి వారిని గెలిపించాడు. అతనితో చేతులు కలిపితే హిందువులందరూ బీజేపీవైపు మళ్లుతారనే భయంతో తరుణ్ విడిగానే పోటీ చేద్దామని కాంగ్రెసు హై కమాండ్‌ను ఒప్పించాడు. దానికి తోడు 'బద్రుద్దీన్ ఎవడు?' అని హేళనగా మాట్లాడాడు. దాంతో బద్రుద్దీన్ అతనిపై పగబట్టాడు. 2011లో కాంగ్రెసుకు 78 సీట్లు వచ్చాయి. ఈ సారి ఏ మేరకు తగ్గుతాయో చూడాలి. ఏ పార్టీకి మెజారిటీ రాకుండా త్రిశంకు సభ ఏర్పడుతుందని కూడా కొందరు ఊహిస్తున్నారు. ఆ పరిస్థితిలో బద్రుద్దీన్ ఎవరివైపు మొగ్గితే వారికే అధికారం దక్కుతుంది. ఇటు చూస్తే తరుణ్, అటు చూస్తే బీజేపీ.. ఎవరికి మద్దతివ్వాలన్నా బద్రుద్దీన్కి గడ్డు పరిస్థితే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)