కితం ఏడాది అనుకోకుండా యుకె వెళ్లడం, లండన్‌లో తాల్, సిపి బ్రౌన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం జరిగాయి. వ్యక్తిగత పనులపై వచ్చి కుటుంబసభ్యులతో వున్నాను కాబట్టి పైన చెప్పిన మొహమాటాలేవీ లేవు. ఉదయం నేనుండే కొవెంట్రీ నుంచి గంట రైలు ప్రయాణంతో లండన్ చేరడం, మీటింగుకి హాజరు కావడం జరిగాయి. నిర్వాహకులు ఆ రాత్రి బస ఏర్పాటు చేయడమే కాక, ఆ రోజు రెండు ముఖ్యప్రదేశాలు, మర్నాడు నాలుగు దర్శనీయ స్థలాలు చూపించారు. నేను ఫుల్ ఖుష్. సభకు ఆశించినదాని కంటె రెట్టింపు జనం రావడంతో వాళ్లు ఖుష్. మీటింగు తర్వాత కూడా ఓ యిరవై మంది నాతో రెండున్నర గంటల పాటు బాతాఖానీ వేశారు. అంతమంది రావడానికి కారణం ఏమిటాని విశ్లేషించి చూస్తే తేలిందేమిటంటే – నాకున్న గుర్తింపు సాహితీకారుడిగా కాదు. వారిలో నేను రాసిన కథలు చదివినవారు ఎక్కువమంది లేరు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా నాకున్న యిమేజి, గ్రేట్ ఆంధ్రా వంటి పాప్యులర్ వెబ్‌సైట్ ద్వారా నా పేరు అందరికీ తెలియడం చేతనే అంతమంది వచ్చారు. పైగా మీటింగు జరిగిన తీరు కూడా విలక్షణంగా వుంది. పది నిమిషాలలో నా పరిచయం ముగిసిన తర్వాత అప్పణ్నుంచి రెండున్నర గంటల పాటు నేను కబుర్లు చెపుతూ, ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే వున్నాను. ఉపన్యాసమైతే భోజనానంతరం ఆవలించకుండా వినడం మహా కష్టం. నావి యింటరాక్టివ్‌గా వుండే కబుర్లు కావడంతో, వచ్చినవాళ్లంతా అలర్ట్‌గా, ఉత్సాహంగా వున్నారు. నేనూ యిలాటి ప్రయోగం గతంలో చేయలేదు. కష్టపడి, సమయం వెచ్చించి వచ్చినవాళ్లను నిరాశపరచనందుకు నేను ఆనందించాను.
దీని తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నేను అమెరికా సమావేశాల్లో పాల్గొనడమంటూ జరిగితే రెండు గంటలపాటు కబుర్లు చెప్పే యింటరాక్టివ్ కార్యక్రమమైతే ఒప్పుకోవాలి. అమెరికాలో నా పాఠకులు ఎక్కువమందే వున్నారు కాబట్టి సభకు వందకు పైగా వచ్చినా ఆశ్చర్యపడను. వక్తగా కూడా లండన్‌వాసులను మెప్పించాను కాబట్టి సభకు వచ్చినవారిని నిరాశపరచనన్న ధైర్యమూ నాకు వచ్చింది. కానీ యీ ధైర్యం నిర్వాహకులకు వుండదు. మీ ఒక్కడికే రెండు గంటల కార్యక్రమం అంటే కుదరదంటారు. రెండు గంటలు కాదు.. గంట కాదు… గంట సాహిత్యసభలో నాకు పావుగంట కంటె ఎక్కువ కేటాయించడానికి వారు సిద్ధపడరు. నిజానికి నన్ను సాహిత్యకారుడిగా మాత్రమే బ్రాండ్ చేయడం సబబు కాదు. ఈ కబుర్లు శీర్షిక ద్వారా నేను అనేక విషయాలపై వ్యాఖ్యానిస్తున్నాను. ప్రజలకు అనేక అంశాలపై ఆసక్తి కలిగిస్తున్నాను. నా అభిప్రాయాలపై, పరిశీలనలపై బోల్డంత తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నేను స్వయంగా ఎదురైనప్పుడు వాదోపవాదాలు జరిగే అవకాశం వుంది. పైగా నా కృషి బహుముఖాలుగా వుంది కాబట్టి వాటి వివరాలు అడగాలనే కుతూహలమూ వుంది. వాటికి వేదిక కల్పించినప్పుడే నాకూ, సభకు హాజరయ్యేవారికి తృప్తి కలుగుతుంది. (ఇది లండన్ సమావేశం తర్వాత గ్రహింపులోకి వచ్చిన విషయం. 'లండన్ వాళ్లయినా మిమ్మల్ని ఇండియా నుంచి ఖర్చులిచ్చి రప్పించేవారా?' అని ఎవరైనా అడిగితే 'నెవర్' అని సమాధానం యిస్తాను) కానీ కాన్ఫరెన్సులకు యిప్పుడున్న ఫార్మాట్‌లలో నేను ఎక్కడా ఫిట్-యిన్ కాను. అందువలన నేను అమెరికా ఉత్సవాలకు వచ్చే అవకాశాలు లేవు.
…వస్తే, అక్కడక్కడే తచ్చాడుతూ ఎవరైనా నన్ను గుర్తుపట్టి పలకరిస్తే, ముచ్చట్లాడుతూ కాలక్షేపం చేయాలి. 'మీరు దానికి సిద్ధపడి రండి, సమావేశాల మాట పక్కన పెట్టండి, ఆ తర్వాత ఓ నెల్లాళ్లు వుండి, వారమంతా ఎవరింట్లోనే ఒదిగి వుండి, వారాంతాల్లో విజృంభించి ఏదో ఒక వూరు వెళ్లి మాట్లాడి వస్తూ, మళ్లీ యింకో చోట బిచాణా వేస్తూ.. నెలా దాటించేయండి. అమెరికాలో వదాన్యులకు కొదవలేదు. ఉదాహరణకి మాలాటి నలుగురైదుగురు సాయం పట్టి మీ రానుపోను ఖర్చులు భరిస్తాం, మీరు నాలుగు చోట్ల నాలుగు వారాల చొప్పున నెల్లాళ్లు వుండేందుకు ప్రిపేరై రండి' అంటూంటారు హితైషులు. 'ఇంత దూరం నుంచి వస్తున్నాను కదా, నా కోసం ఆ వూళ్లో పాతిక మందో, ముప్ఫయిమందో వారం మధ్యలో ఒక్క రోజు సెలవు పెట్టడానికి సిద్ధపడరా? అలా అయితే రోజుకో వూరు చొప్పున వారంలో నాలుగైదు వూళ్లు చుట్టబెట్టి వచ్చేసే వీలుంటుంది కదా. మీటింగులన్నీ ఒక వారంలో పూర్తయిపోతాయి. పదిరోజుల్లో వెళ్లి వచ్చేయచ్చు.' అని సూచిస్తే 'అలాటి పిచ్చి వూహలు పెట్టుకోకండి. వాళ్లు మీకోసం సెలవు పెట్టడం యింపాజిబుల్' అని జవాబు వస్తుంది. మరి అలాటివారి కోసం నేనెందుకు ఒళ్లు అలవగొట్టుకోవడం?
'అమెరికాలో సమావేశాలకు వస్తే అప్పుడు తమ వూరికి కూడా రమ్మనమని, ఆతిథ్యం యిస్తా'మని ఆఫర్ చేసేవాళ్లలో చాలామంది వ్యక్తిగతంగా పిలుస్తున్నారు కానీ వాళ్లకంటూ సంఘాలు లేవు. సంఘాలు ఏర్పాటు చేయడంలో, చీలకుండా చూసుకోవడంలో తెలుగువాళ్లు నేర్పరులు కారు. ఏర్పాటు చేశాక ఎటువంటి కార్యక్రమాలు చేయాలో – ముఖ్యంగా విదేశాల్లో వున్న పరిమితులతో- ప్లాను చేయడం మహా కష్టం. అందువలన 'సంఘం, సమాజం పిలవాలనకండి, కావాలంటే 'నేను ఫలానా ఖర్చు భరించగలను' అని ఆఫర్ చేస్తూంటారు. వ్యక్తుల నుండి ఆబ్లిగేషన్స్ తీసుకోవడమంటే అదోలా వుంటుంది. కొందరు అభిమానులు కొన్ని సంఘాలలో ఆఫీస్ బేరర్స్‌గా కూడా వుంటారు. కానీ యిప్పటిదాకా వున్న ఫార్మాట్‌ను నా కోసం చెదరగొట్టడానికి వారికీ వీలుపడదు. రకరకాల ఆఫర్లు యిచ్చిన వారందరికీ యీ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ, వాస్తవపరిస్థితిని, పరిమితులను అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే కాదు, నా బోటి సినిమా గ్లామర్ లేని వాళ్లకూ, పెర్‌ఫార్మర్స్ కాని వాళ్లకూ యిదే సమస్య. కుటుంబసభ్యులు అమెరికాలో వున్న వాళ్లు మాత్రమే సమావేశాల మాట ఎలా వున్నా నిర్వాహకుల ఖర్చుతో అమెరికా వచ్చి తమవాళ్లను చూసుకున్నాం కదాని తృప్తి పడతారు, లేని నా బోటి వాళ్లం అభిమానులు మమ్మల్ని కలవాలని కోరుకున్నా రాలేము. అమెరికాలోని వివిధ ప్రాంతాలలోని నాలుగైదు అసోసియేషన్లు తమలో తాము సమన్వయం చేసుకుని వచ్చిన అతిథి వారం, పదిరోజుల్లో నాలుగైదు వూళ్లల్లో మీటింగులు ముగించుకునేట్లా ప్లాను చేసి, రానుపోను ఖర్చులు ఏర్పాటు చేయగలిగిన రోజు వచ్చినప్పుడే యీ సమస్యకు పరిష్కారం వుంటుంది. లేకపోతే యిప్పటికింతే!
************
ఒక రచయితగా నేను యిక్కడివరకు రాసి వూరుకోవచ్చు. కానీ యిది ఒక సంపాదకీయంలా ధ్వనిస్తూంది – దుస్సాధ్యమైన విషయాలను సాధించాలని ఉద్బోధ చేసినట్లు తోస్తుంది. ఒక అసోసియేషనులోనే కోఆర్డినేషన్ కష్టం. నాలుగైదు అసోసియేషన్లు సమన్వయం చేసుకుని ఒక అతిథి గురించి ఏర్పాట్లు చేస్తాయా? అది సాధ్యమా? నేను రచయితను కావడంతో బాటు ఆర్గనైజర్‌ను కూడా. మా ''హాసం క్లబ్బు'' శాఖల ద్వారా వివిధ నగరాల్లో నెలనెలా మీటింగులు ఏర్పాటు చేస్తూంటాం కాబట్టి వాటి సాధకబాధకాలు బాగా తెలుసు. ఎవర్ని పిలవాలి, పిలిచినవాళ్లు ఎలా మాట్లాడతారు, వినడానికి జనం వస్తారా రారా, వచ్చిన తర్వాత తృప్తి పడతారా లేదా? ఖర్చులెంతవుతాయి? ఇలా అనేక లెక్కలు వేస్తూంటాం. నేనే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్నయితే యిలాటి రచయితను, అతని అభిమానులను కలపడానికి ఏం చేస్తాను అని ఆలోచించి చూశాను. 'ఫలానా రచయిత యీ సమావేశానికి వస్తున్నారు, సమావేశ స్థలిలోనే ఓ రెండు వందల మంది పట్టే చిన్న హాల్లో రెండు గంటలపాటు ప్రసంగిస్తారు. ఓ యిరవై డాలర్లు ప్రవేశ రుసుము చెల్లించి మీరు ఆ సమావేశంలో పాల్గొనవచ్చు' అని ప్రకటిస్తాను. (ఈ అంకె ఏదో నా నోటికొచ్చిన అంకె) అలా సేకరించిన డబ్బే ఆ రచయితకు పారితోషికం. ఆయన రానుపోను ఖర్చులు ఆయనే పెట్టుకోవాలంటాను. భోజనం, వసతి వగైరాలు తక్కిన అతిథులతో పాటు ఏర్పాటు చేయవచ్చు. హాలుకు విడిగా అద్దె ఎలాగూ వుండదు. వచ్చే రచయితకు టిక్కెట్టు, యితర ఖర్చులకు ఓ రెండు వేల డాలర్లు అవుతుందనుకోండి. ఆ పాటి డబ్బు వస్తుందనుకుంటేనే ఆయన విమానం ఎక్కుతాడు. లేకపోతే రానే రాడు. ఓ వారానికి ముందే బుకింగు క్లోజ్ చేసి 'ఇంత వచ్చింది, ఫర్వాలేదనుకుంటే రండి' అని రచయితకు నిర్మొహమాటంగా చెప్పేయడమే!
ఈ ముందస్తు బుకింగ్ పద్ధతి చాలా మంచిది. లండన్‌లో నా సమావేశానికి ముందే బుక్ చేసుకోండి అని నా కాలమ్ ద్వారా తెలియపరచాను. మంచి స్పందన వచ్చింది. ఊహించనంత స్పందన రావడంతో నిర్వాహకులు ఒక వారం ముందే బుకింగు ఆపేశారు. ఎందుకంటే సమావేశం జరిగే హాలు కెపాసిటీ చూసుకోవాల్సి వచ్చింది. పైగా వాళ్లు ఉచితంగా భోజనాలు కూడా పెడుతున్నారు. అయితే లండన్ సమావేశానికి టిక్కెట్టు పెట్టలేదు. మరి అమెరికాలో తెలుగువాళ్లు డబ్బులిచ్చి మీటింగులకు వస్తారా? తెలియదు. 2007లో హ్యూస్టన్‌కు చెందిన వంగూరి చిట్టెన్ రాజుగారు తన సంస్థ తరఫున హైదరాబాదులో త్యాగరాయగానసభలో ప్రపంచ తెలుగు మహాసభలంటూ సాహిత్యసభ పెట్టి దానికి టిక్కెట్టు పెట్టారు. స్పందన పెద్దగా లేదు కానీ, అసలంటూ కొంత వుంది. హాలు బోసి పోతోందని మర్నాడు టిక్కెట్టు లేకపోయినా అనుమతించారు. వక్తల్లో చాలామంది ఊళ్లో విడిగా సభల్లో కనబడేవారే. అనుకున్నంత స్పందన లేకపోవడానికి అది ఒక కారణం కావచ్చనుకున్నాను. అమెరికాకు వచ్చే వక్తయితే వేలాది మైళ్ల దూరం నుండి వస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం హైదరాబాదు శ్రోత టిక్కెట్టు కొని సాహిత్య సభకు వెళ్లగా లేనిది వారి కంటె ఆర్థిక వసతి మెరుగ్గా వున్న యీనాటి అమెరికా శ్రోత వెళ్లడా!? నాబోటి వాడికే చాలామంది మెయిల్సు రాస్తూ వుంటారు – అమెరికా వస్తే ఎక్కడుంటారో చెప్పండి, వచ్చి కలుస్తాం, మా యింట్లో వుండండి, వారం పదిరోజులైనా సరే, దగ్గరి ప్రదేశాలు తిప్పి చూపిస్తాం అంటూ. ఇలాగే ప్రతి రచయితకు అభిమానులుంటారు కదా. ఇంకో వూరు రావడానికి, యింట్లో పెట్టుకోవడానికి, తిప్పడానికి కనీసం 200 డాలర్లయినా అవదా? ఆ డబ్బుతో యిలాటి సమావేశానికి పది టిక్కెట్లు కొని స్నేహితులకు యివ్వవచ్చు.
ఇలాటి సెల్ఫ్-ఫైనాన్సింగ్ సభ వలన ఆర్గనైజరుకి, రచయితకు రిస్కు లేదు. తెలుగు సంఘాలు చీలిపోతున్న కొద్దీ ఆర్థిక వనరులకోసం తడుముకోవలసిన పరిస్థితి వస్తోంది. సినిమావాళ్లను రప్పించడానికి ఎలాగూ బోల్డు ఖర్చవుతుంది. ఇలాటి సభలపైన ఆదా చేసుకోగలిగితే వాళ్లకూ మంచిది. సముద్రాలు దాటి వచ్చే రచయితకైతే వేదిక ఎక్కి తీరతామన్న కనీస ధీమా వుంటుంది. కానీ సభకు వచ్చే శ్రోతకు మాత్రం రిస్కుంది. కాన్ఫరెన్సులో పాల్గొనడానికి 200, 250 డాలర్లతో బాటు యిది అదనంగా కట్టాలి. తీరా కట్టినదాకా వుండి వచ్చినాయన సరిగ్గా మాట్లాడలేకపోతే టిక్కెట్టు డబ్బు నష్టమే కదా! కానీ యిలాటి రిస్కు మనం సినిమాల విషయంలో కూడా తీసుకుంటున్నాం. సినిమా నటుల్ని ఆహ్వానించిన సందర్భాల్లో కూడా వాళ్లు వసతి బాగా లేదనో, సాటి నటుడికి ఎక్కువ ప్రాధాన్యత యిచ్చారనో మొహం మాడ్చుకుని, రెండు మూడు ముక్కలు గొణిగి వేదిక దిగిపోయిన సందర్భాలూ వుంటాయి. గాయకుడి విషయంలో కూడా ఆ రోజు జలుబు చేయవచ్చు, జ్వరం రావచ్చు, మూడ్ సరిగ్గా లేకపోవచ్చు. రస్కు దొరకాలన్నా రిస్కు తీసుకోవాల్సిన రోజులివి. మొన్న నా లండన్ సమావేశంలో క్రిస్‌మస్ ముందు శనివారపు లండన్ ట్రాఫిక్ యీదుకుంటూ రెండు మూడు గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినవారు కూడా రిస్కు తీసుకున్నారు. రచయితను విడిగా రప్పించాలన్నా, లేక సెలవు పెట్టి వెళ్లి వినాలన్నా, దూరప్రయాణం చేసి వెళ్లి సభకు హాజరు కావాలన్నా 20 డాలర్ల కంటె ఎక్కువే ఖర్చవుతుంది. ఇదైతే ఎలాగూ కాన్ఫరెన్సుకి వస్తున్నారు, ఖర్చులో ఖర్చు. మరీ బోరు కొడితే లేచి, యింకో ప్రోగ్రాం చూడవచ్చు! అంతా బాగానే వుంది కానీ 20 డాలర్ల చొప్పున ఓ 200 మంది లేదా 25 డాలర్లు చొప్పున ఓ 100 మంది వస్తారనుకుని ఆశ పెట్టుకుని యిలా ప్రకటించవచ్చా? రమారమి 5వేల మంది వచ్చే కాన్ఫరెన్సులో 100 మంది కూడా స్పందించలేదంటే రచయిత అవమానకరంగా ఫీలవడా? అలా ఫీలవని రచయితతోనే నేను యిలాటి ప్రయోగం చేస్తాను. వచ్చి వేదిక ఎక్కకుండా వెనక్కి వెళ్లేబదులు, మనకు గిరాకీ లేదని, మన పేరు చెపితే టిక్కెట్టు తెగలేదని – ముందే తెలుసుకోవడం ఆయనకూ మంచిదే కదా!
************
ఈ పరిష్కారం మాత్రం ఎడిటోరియల్‌లా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తవచ్చు. 'రేపటి మాట ఎలా వున్నా, 2016లో యిది ఆచరణయోగ్యం కాదు, 'వక్త ఏదైనా రంగంలో నిష్ణాతుడైతే తప్ప (ఏ శశి థరూరో, ఏ జెఠ్మలానీ లాటివాడో అన్నమాట) అమెరికా తెలుగువాళ్లు టిక్కెట్టు కొని సినిమాయేతర సభకు రారు' అనే వాస్తవాన్ని మరచి, నేల విడిచి సాము చేసిన సలహా యిది' అని అమెరికన్ తెలుగువారు ఢంకా బజాయించి చెప్పవచ్చు. వారి మాటే రైటు. ఎందుకంటే నేను అమెరికా వెళ్లలేదు. అక్కడి మనుషుల యిష్టాయిష్టాలపై అవగాహన లేదు. ఇదంతా అక్కడాయిక్కడా విని రాసినదే. అయితే ఒక తెలుగు సాహితీ అభిమానిగా 2026 నాటికైనా యిలాటి ఒక వర్కబుల్ సొల్యూషన్ రూపుదిద్దుకోవాలని ఆశిస్తాను. ఈ వ్యాసంలో అహంభావమో, ద్రాక్షపళ్ల కోసం ఆశపడ్డ నక్క స్వభావమో గోచరిస్తే అది నా భావప్రకటనలో లోపం తప్ప మరేమీ కాదు. ఎయిడ్స్ గురించి కూడా బహిరంగ చర్చను ప్రోత్సహిస్తున్న యీ రోజుల్లో సభా నిర్వహణలో యిరువైపులా వున్న యిబ్బందుల గురించి చర్చించడం తప్పుగా నేను భావించలేదు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)