''ఎమ్బీయస్తో కబుర్లు'' లండన్‌లో జరిగాక పై ప్రశ్న వేస్తూ చాలామంది మెయిల్స్ రాస్తున్నారు. ఎలాగూ సగం దూరం వచ్చేశారు కదా, అట్లాంటిక్ దాటి వచ్చేయండి అన్నారు కొందరు. 'ఇటీవల తెలుగు సంఘాలు చాలా ఆవిర్భవించాయి, రాబోయే నెలల్లో చాలా సమావేశాలు జరగబోతున్నాయి, మీరు వస్తారేమో, అమెరికా వస్తే మా యింటికి రండి, ఓ వారం పాటు ఆతిథ్యం స్వీకరించండి' అని మెయిల్స్ వస్తున్నాయి. ఈ తరహా ఆహ్వానాలు చాలాకాలంగా వస్తూన్నాయి. వారందరికీ సమాధానంగా యీ వ్యాసం! కాప్షన్లో ప్రశ్నకు ముందుగానే ఆన్సరు చెప్పేస్తా – ''…చెప్పలేను'' అని. దానికి కారణం ఏమిటో యీ వ్యాసంలో చెప్తాను. ఇదేదో నా గోలో, ఏడుపో కాదు, నాబోటి అనేకమంది రచయితలు, వ్యాసకర్తలు అమెరికాకు రావడానికి ఎందుకు వెనకాడతారో వివరాలు సేకరించి విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను. నిజానిజాల ప్రస్తావనలో లోపం వుంటే ఎత్తిచూప ప్రార్థన.
అమెరికాలో అనేక తెలుగు అసోసియేషన్లున్నాయి. రెండేళ్ల కోసారి మూడేసి రోజుల పండగ చేస్తారు. భారీ ఎత్తున చేసే ఆ ఉత్సవాలకు చాలా ఖర్చవుతుంది. టిక్కెట్టు కొని వచ్చే ప్రేక్షకులను ఆకర్షించడానికి అగ్రశ్రేణి సినీతారల్ని రప్పించాలి. ఆ ఖర్చు భరించడానికి స్థానికంగా స్పాన్సర్లు కావాలి. వాళ్లు ఆ వేదికపై తమ కళను చూపించాలని ముచ్చట పడతారు. అందువలన సాయంత్రాలు జరిగే ఫంక్షన్లు భారీగా, గ్లామరస్‌గా సగం సినిమావాళ్లతో, సగం స్థానికులతో జరుగుతాయి. తమ టేలంటు చూపేందుకు యింత పెద్ద వేదిక లభించినపుడు ఖర్చు భరిస్తూన్న స్థానికులు యీ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? ఏదో ఒక కారణంతో వేదిక ఎ్కడం సహజం. సభానిర్వాహకులు వారిని కాదనలేరు. సాయంసమయాల్లో యీ ఫంక్షన్లకు హాజరవుతూ తక్కిన సమయాల్లో అందరూ ఒకరి నొకరు పలకరించుకుంటూ, షాపింగు చేసుకుంటూ, వ్యాపార, కుటుంబ బంధాలు నెలకొల్పుకుంటూ, పెంచుకుంటూ వుండే సమయంలో యితర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు తలపెడతారు. బొత్తిగా చీరల, నగల ఎగ్జిబిషన్, స్టార్‌నైట్ అనిపించుకోకుండా వుండాలని కొన్ని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు పొద్దున్న, మధ్యాహ్నాలలో పెడతారు. వీటిలో స్థానిక ప్రతిభావంతుణ్ని ఒక వక్తగా పెట్టి తక్కిన ముగ్గురు నలుగురు వక్తలుగా తెరపై కనబడని సినిమారంగ కళాకారులను, తమతమ రంగాల్లో కృషి చేసిన సాహితీమూర్తులను, కళాకారులను, సామాజిక కార్యకర్తలను తెప్పించి సర్దుతారు. వీళ్లను ఇండియా నుంచి ఖఱ్చులిచ్చి రప్పించి వేదిక మీద కూర్చోబెట్టగలుగుతారు కానీ ప్రేక్షకులను తీసుకునివచ్చి ఆడిటోరియంలో కూర్చోబెట్టడం నిర్వాహకుల తరం కాదు.
***********
మొదటిది సమయానికి సంబంధించినది. ఉదయం తొమ్మిది గంటల నుంచి కార్యక్రమం అంటే అప్పటికి బ్రేక్‌ఫాస్ట్ పూర్తి అయి వుండకపోవచ్చు. కితం రాత్రి స్టార్ నైట్ పొద్దుపోయేదాకా జరిగాక తొందరగా లేవడానికి బద్ధకించవచ్చు. ఈ సమావేశాలకు కుటుంబాలతో వస్తారు కాబట్టి కుటుంబమంతా ఎంజాయ్ చేసే ప్రోగ్రాంలు చూదామనుకుంటారు. పిల్లలకు ఎలాగూ ఆసక్తి వుండదు. భార్యాభర్తల్లో కూడా ఎవరో ఒకరికే టేస్టుండి, మరొకరు బోరని అంటే ప్రోగ్రాంకు రారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే – సాహిత్యం అంటే యిష్టమని జనరల్‌గా అనుకోవడమే తప్ప సాధారణ తెలుగువాడికి తెలిసిన కవీ లేడూ, కథా రచయితా లేడు. ఆధునిక కవుల్లో ఎవరికీ పెద్దగా మార్కెట్ లేదు. కవిత్వపు పుస్తకాలు అమ్ముడు పోవటమే లేదు. కథా, నవలా రచయితల్లో అయితే గతంలో యండమూరి, మల్లాది అనేవారు. ఇప్పుడు అంత డిమాండ్ వున్న రచయిత లేరు. పాతికేళ్లు దాటాక కథలు చదివేవాళ్లు పెద్దగా లేరు. చదివినా రచయిత పేరు గుర్తు పెట్టుకోరు. పెట్టుకున్నా ఆయన ఏం చెప్తాడో విందామన్న ఉబలాటమేమీ వుండదు. జనాలు అష్టావధానాలకు వెళతారు కానీ దాన్ని ఒక సర్కసుగానే చూస్తారు. శతావధానం చేస్తా, వరుసగా పద్యాలు చెపుతా అంటే బాబోయి అంటారు.
ఒక గాయకుడైతే పదిమంది ముందూ పాటపాడి మెప్పించగలడు. కథా/నవలా రచయిత, వ్యాసకర్త పదిమంది ముందూ పేపర్లు ముందేసుకుని రాస్తూ కూర్చోడు కదా. ఏదైనా కథని తను ఎలా రూపకల్పన చేశాడో, ఎలా రాశాడో చెపితే వినడానికి బాగుంటుంది. కానీ రాత నేర్చినవాళ్లందరూ కూత నేర్వలేరు. పెద్దపెద్ద రచయితలు చాలామంది మంచి వక్తలు కారు. వచ్చినాయన మంచి వక్త అయినా ప్రేక్షకుల్లో చాలామంది ఆ కథను చదివి వుంటేనే ఆ వుపన్యాసం రక్తి కడుతుంది. వచ్చినాయన ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో తెలియనప్పుడు రిస్కు తీసుకుని సాహితీసభలో కూర్చోడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఏ పదిమందో వస్తారు, సభ బోసిపోతోందని నిర్వాహకులు దాన్ని రద్దు చేస్తారు. ఇరవై గంటలు విమానంలో కూర్చుని వచ్చిన సాహితీకారుడు వేదిక ఎక్కకుండానే వెనక్కి మరలవస్తుంది. అందువలననే తెరవేలుపులకు తప్ప యితరులెవరికీ యిలాటి సమావేశాలు తృప్తి నివ్వవు. తిరిగి వచ్చి సభల నిర్వహణ బాగా లేదని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తారు. 'ఆయన పేరు చెప్తే అంబ పలకలేదు. శ్రోతల్లో ఆయనకు డిమాండు లేదని తెలియక రానుపోను ఖర్చులిచ్చి, వసతి కల్పించి, తిండీతిప్పలు చూసి పంపించినా యిలా రాస్తాడా, కృతఘ్నుడు' అనుకుంటారు సభానిర్వాహకులు. తెరపై కనబడే చిన్న కమెడియన్‌కు వున్న డిమాండ్ సాహిత్య ఎకాడమీ ఎవార్డు తెచ్చుకున్న సాహితీ మూర్తికి వుండదు. ఈ చేదునిజం హరాయించుకోవడం కష్టం. అమెరికాలోని తెలుగువారందరూ సినిమా వాళ్లని తప్ప వేరెవ్వరినీ ఆదరించరని కాదు. సాహిత్యాభిమానులు, కళాభిమానులు చాలామందే వున్నారు. కానీ యీ సమావేశాలు వారికి అభిమాన రచయితలను కలిసే అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. ఎందుకంటే యివి కుటుంబసమేతంగా పాల్గొనే సంబరాల్లా మారిపోయాయి.
************
దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరైనా సాహితీకారుడు సమావేశాలకు వచ్చిన తర్వాత కొన్ని రోజులుండి తన అభిమానులున్న అయిదారు పరిసర ప్రాంతాలకు వెళ్లి పాతిక ముప్ఫయి మంది పోగయే చిన్నచిన్న సమావేశాల్లో పాల్గొంటూ తనకు, అభిమానులకు సంతోషం చేకూర్చవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. అయితే దీనిలో యిబ్బందేమిటంటే ఇండియాలో అయితే వీక్ డేస్‌లో మీటింగు పెట్టినా ఫర్వాలేదు. జనం వస్తారు. అమెరికాలో అయితే వారాంతాల్లోనే సమావేశం పెట్టాలి. తక్కిన రోజుల్లో పెడితే ఎవరూ రారు. అంటే యీ అదివారం ఒక వూళ్లో సమావేశం పూర్తయితే మళ్లీ శనివారం దాకా వేరే వూళ్లో మీటింగుండదు. అప్పటిదాకా ఎవరింట్లోనో తలదాచుకోవాలి. 'దానికేముంది, మా యింట్లో వుండండి, మాకిది అలవాటే' అంటారు అభిమానులు. 'అబ్బే వద్దు హోటల్లో వుంటాను' అంటే పేలిపోతుంది. ఇండియాలో అయితే హోటళ్లు, కాలనీలు పక్కపక్కనే వుంటాయి. కానీ అమెరికాలో హోటళ్లు డౌన్టౌన్లో వుంటాయి. ఇళ్లు ఎక్కడో దూరంగా వుంటాయి. చాలా వూళ్లల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వుండదు. టాక్సీలకు చచ్చేటంత అవుతుంది. 'అవన్నీ మీరు భరించలేరు. మా యింట్లోనే ఓ గదిలో వుండండి' అంటారు అక్కడివారు. 'మీరు ఇండియా వచ్చినపుడు మా యింట్లో యీ లెవెల్ ఆతిథ్యం యివ్వడం మా తరం కాదు' అని వీరు మొహమాట పడతారు. 'అలాటిది మేం ఎదురుచూడం' అని వారు హామీ యిస్తారు. దానాదీనా వారింట్లో వీరు వుండాల్సి వస్తుంది.
ఇది నిజంగా కష్టమైన పని. ఎందుకంటే బంధుత్వం, పూర్వస్నేహం ఏమీ లేకుండా కేవలం కళానుబంధంతో వారింట్లో బస చేయడం, భోజనం చేయడం యిబ్బందే. ఇంటావిడకు సాహిత్యంపై అభిరుచి వుండి, అతిథి రచనలు చదివి, ఆయనపై గౌరవం పెంచుకుంటే ఫర్వాలేదు. కానీ చాలా సందర్భాల్లో యింటాయనకే యిలాటి టేస్టు వుంటుంది. ఇంటావిడకు తెలుగు రాకపోవచ్చు, చదవలేక పోవచ్చు, చదవగలిగినా సాహిత్యం చదివే అలవాటు లేకపోవచ్చు. ఏదో భర్త పిలిచాడు కాబట్టి అతిథిని భరించవలసిన స్థితిలో ఆమె వుంటుంది. భార్యాభర్తలన్నాక యిలాటివి తప్పవు. కానీ అది ఒక పూట భోజనానికో, ఒక రోజు ఓ రాత్రి బసకో పరిమితమైతే ఫర్వాలేదు. ఏకంగా వారం రోజులంటే.. బాబోయ్ అనిపిస్తుంది. వాళ్లింట్లో వుంటూ, వాళ్ల తిండి తింటూన్నాం కాబట్టి ప్రతిగా వాళ్లకు ఏదైనా చేసిపెట్టాలని అతిథి ఫీలవ్వచ్చు. రాత్రుళ్లు ఆఫీసులనుంచి తిరిగి వచ్చాక కాస్సేపు వాళ్లను ఎంటర్టెయిన్ చేయాలని ప్రయత్నించవచ్చు. ఇది కూడా అందరి వలనా కాదు. గాయకుడైతే గంట, గంటన్నర పాటలు పాడి వినిపించవచ్చు. జ్యోతిష్కుడో, వాస్తు విద్వాంసుడో అయితే యింట్లోవాళ్ల జాతకాలు, బీరువా పెట్టిన మూలలు చూసి సలహాలు చెప్పవచ్చు. ప్రవచనకర్త అయితే ఆధ్యాత్మిక విషయాలు చెప్పవచ్చు. చిత్రకారుడైతే వాళ్ల స్కెచ్‌లు గీసి సంతోషపెట్టవచ్చు. సినిమా జర్నలిస్టు అయితే తెరవెనుక విషయాలు చెప్పి రంజింపచేయవచ్చు. మామూలు కథారచయితో, వ్యాసకర్తో అయితే ఏం చెప్తాడు? ఏం చేస్తాడు? వీడికి తిండిదండగ అనుకోవచ్చు ఆతిథ్యం యిచ్చినవాళ్లు. ఎలాగో కష్టపడి వారం గడిపి, మళ్లీ యింకో వూళ్లో యింకోరి యింట్లో మకాం వేయాలి.
ఇలా అయిదారు వారాల్లో పిల్లిపిల్లలా ఆరేడు మజిలీలు చేస్తే కొన్ని ప్రాంతాల్లో కొందరు అభిమానులను కలవగలుగుతారు. దీనికి చాలా ఓపిక, ఓర్పు వుండాలి. అమెరికాలో కుటుంబసభ్యులుంటే సమావేశాలయిపోయాక వాళ్ల యింటికి వెళ్లి వుంటూ వారాంతాల్లో యిలా వూళ్లకు వెళ్లి వస్తూండవచ్చు కానీ లేకపోతే యిలాటి అవస్తలు తప్పవు. నాకు అమెరికాలో బంధుమిత్రులున్నారు కానీ కుటుంబసభ్యులు లేరు. వెళ్లివచ్చినవారి యిబ్బందులు విన్నాక, చదివాక, వెళ్లాలన్న ఆసక్తి కలగలేదు. రానుపోను ఖర్చులు, బస, భోజనాలు నిర్వాహకులవే అయినా మనమూ సమయం, శక్తి ఖర్చు పెట్టాలి కదా. ఎంత ఖర్చుపెట్టినా జనం రాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? జనం వస్తారన్న గ్యారంటీ ఎవరూ యివ్వలేరు. అందువలన నాకు నాలుగైదేళ్లగా ఆహ్వానాలు వచ్చినా ఉత్సాహం చూపలేదు. 2013 తానా సమావేశాలకు వచ్చి తీరాలని తోటకూర ప్రసాద్‌గారు గట్టిగా చెప్పడంతో మొహమాటానికి ఒప్పుకుని వీసాకి అప్లయి చేశాను. అమెరికావాడు యివ్వలేదు. అమ్మయ్య అనుకున్నాను. అమెరికా చూడడమంటారా, ఎపుడైనా సొంత ఖర్చుల మీదే కండక్టడ్ టూరులో వెళ్లి చూడవచ్చు! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)