ఎమ్బీయస్: కింగా? కింగ్‌మేకరా?

ఇటీవల కాంచీపురంలో జరిగిన రాజకీయ సభలో తమిళ యాక్టర్ విజయకాంత్ భార్య ప్రేమలత తన భర్త అభిమానులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేసింది – ‘‘మీ కెప్టెన్ కింగా? కింగ్‌మేకరా?’’ అని. ‘‘కింగ్.. కింగ్’’…

ఇటీవల కాంచీపురంలో జరిగిన రాజకీయ సభలో తమిళ యాక్టర్ విజయకాంత్ భార్య ప్రేమలత తన భర్త అభిమానులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేసింది – ‘‘మీ కెప్టెన్ కింగా? కింగ్‌మేకరా?’’ అని. ‘‘కింగ్.. కింగ్’’ అని వాళ్లు అరిచారు. ఇక విజయకాంత్ ఫిక్సయిపోయాడు – తనే కింగ్ అని. కొన్ని రోజులు పోయాక బిజెపి కేంద్రమంత్రి జావడేకర్ తనను కలిసి పొత్తు గురించి ప్రస్తావించినపుడు బిజెపికి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాదు, డిఎంకె, ఎడిఎంకె కూటములు రెండిట్లో చేరడానికి ససేమిరా అంటున్నాడు. ఎడిఎంకెలో కింగ్ లేడు కానీ క్వీన్ వుంది. డిఎంకెలో అయితే తన వయసువాడే అయినా స్టాలిన్ వున్నాడు. విజయకాంత్ అలా డిసైడయినా కరుణానిధి ఇంకా ఆశతోనే వున్నాడు. ‘కాయ పక్వానికి వచ్చింది’ అన్నాడు డిఎండికె తమ కూటమిలో చేరే విషయం అడిగినప్పుడు! 

2005లో పార్టీ పెట్టినపుడే విజయకాంత్ తను సినిమాలోనే కాదు, రాష్ట్రానికే కెప్టెన్ అవుతానని ప్రకటించి మరుసటి ఏడు ఎన్నికలలో 234 సీట్లలోనూ పోటీ చేశాడు. తనొక్కడే గెలిచాడు కానీ .3% ఓట్లు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆ తర్వాత నుంచి అన్ని ఎన్నికలలో పోటీ చేస్తూనే వున్నాడు. 2009లో 10% ఓట్లు, 2011లో ఎడిఎంకెతో పొత్తు పెట్టుకుని 7.% ఓట్లతో 29 సీట్లు గెలిచాడు. కానీ జయలలితతో పోట్లాడి విడిపోయాడు. 2014 పార్లమెంటు ఎన్నికలలో వచ్చేసరికి బిజెపితో పొత్తు పెట్టుకుని 5.19% ఓట్లు తెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం అతని బలం ఎంతుందో ఎవరికీ తెలియదు. కనీసపక్షంగా 3%, అధికంగా 5% వుంటుందని అనుకుంటున్నారు. డిఎంకె అంతర్గతంగా చేయించుకున్న సర్వే రెండు ప్రధాన కూటముల బలాబలాలు సమానంగా వున్నాయనీ, డిఎండికె లాటిది తోడయితే త్రాసు మొగ్గు చూపుతుందని చెప్పింది. అందుకని విజయకాంత్‌కై ఇంత వెంపర్లాట. ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నమాట వాస్తవమే అయినా మరీ అంత ప్రస్ఫుటంగా లేదని, ప్రతిపక్షాలు కలవని పక్షంలో జయలలితే మళ్లీ నెగ్గవచ్చని అంటున్నారు. 

విజయకాంత్‌కు వ్యక్తిగతంగా మంచిపేరుంది. సోషల్ నెట్‌వర్క్‌లో అతనిపై జోకులున్నా, పక్కా తాగుబోతని అందరికీ తెలిసినా, వ్యక్తిగా మాయామర్మం తెలియనివాడని, పేదాగొప్పా తేడా పట్టించుకోకుండా అందరితో కలిసిపోతాడనీ అందరూ చెప్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి నచ్చుతాయి. డిఎంకె, ఎడిఎంకెలకు ప్రత్యామ్నాయంగా ఏదైనా కనబడితే 10-15% ఓటర్లు ఓట్లేయడానికి సిద్ధంగా వుంటారని, వారిని ఆకట్టుకుంటే తగినన్ని సీట్లు వస్తాయని పరిశీలకులు అంటారు. దేవర్ కులానికి చెందిన యువతిని పెళ్లాడిన దళితయువకుణ్ని భార్య బంధువులు ఉడుమల్‌పేటలో పరువుకోసం హత్య చేసినపుడు దేవర్ ఓట్లు పోతాయన్న భయంతో డిఎంకె, ఎడిఎంకె రెండూ మౌనంగా వుండిపోయాయి. 

వణ్నియార్ కులస్తుల పార్టీ అయిన పిఎంకె దాన్ని శాంతిభద్రతల సమస్యగా కొట్టి పారేసింది. లెఫ్ట్ కూటమి మాత్రం కులవివక్షత కారణంగానే ఇది జరిగిందని విమర్శించింది. విజయకాంత్ కూడా అదే ధోరణిలో విమర్శించడంతో లెఫ్ట్ కూటమిలో ఆశలు చిగురించాయి. అతను తమతో కలవాలని కోరుతూ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. 

నిజానికి డిఎంకె, ఎడిఎంకె కూటములకు భిన్నంగా వైగో, బిజెపి, లెఫ్ట్, కొన్ని చిన్న పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేద్దామని విజయకాంత్ అనుకున్నాడట. కానీ బిజెపి వున్న కూటమిలో మేం చేరం, నువ్వు కూడా బిజెపి ధ్యాస వదిలిపెట్టి మాతో చేరు అని లెఫ్ట్, వైగో అడుగుతున్నారు. కానీ విజయకాంత్‌కి బిజెపి ధ్యాస పోలేదు. ఫైనల్‌గా పొత్తు పెట్టుకుంటాడో లేదో ఇంకా తేలలేదు. అతను పెట్టుకోకపోతే తను పెట్టుకుందామని పిఎంకె ఎదురు చూస్తోంది. పిఎంకె తరఫున 47 ఏళ్ల డా॥ అన్బుమణి రాందాస్ ముఖ్యమంత్రి కాగోరుతున్నాడు. వాళ్లకు 4-5% ఓట్లున్నాయి. బిజెపితో సంప్రదింపులు సాగిస్తున్నాడు కానీ బిజెపి విజయకాంత్ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)

[email protected]