సినిమా రివ్యూ: కథకళి

రివ్యూ: కథకళి రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ తారాగణం: విశాల్‌, కేథరీన్‌, కరుణాస్‌, శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, మైమ్‌ గోపి, జయప్రకాష్‌ తదితరులు సంగీతం: హిప్‌హాప్‌ తమిళ కూర్పు: ప్రదీప్‌…

రివ్యూ: కథకళి
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
తారాగణం: విశాల్‌, కేథరీన్‌, కరుణాస్‌, శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, మైమ్‌ గోపి, జయప్రకాష్‌ తదితరులు
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
కూర్పు: ప్రదీప్‌ ఈ రాగవ్‌
ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం
నిర్మాత: విశాల్‌
రచన, దర్శకత్వం: పాండిరాజ్‌
విడుదల తేదీ: మార్చి 18, 2016

తమిళంలో సంక్రాంతికి విడుదలైన 'కథకళి' చిత్రానికి 'బానేవుంది', 'ఒకసారి చూడవచ్చు', 'గ్రిప్పింగ్‌గానే ఉంది' అంటూ రివ్యూలొచ్చాయి. టాక్‌ కూడా ఓకే అనే వచ్చింది. కానీ నాలుగు సినిమాల మధ్యన వచ్చిన 'కథకళి' నాట్యం మాట అటుంచి కనీసం నిలబడలేకపోయింది. దాంతో జనవరిలోనే విడుదల కావాల్సిన తెలుగు అనువాదం డిలే అయి ఇప్పుడు బయటకొచ్చింది. 'కథకళి' ఖచ్చితంగా చూడతగ్గ చిత్రమే… అందరికీ కాకపోయినా కనీసం మిస్టరీ జోనర్‌ని ఇష్టపడే వారికి! అయితే ఈ చిత్రాన్ని జోనర్‌కి కట్టుబడి మిస్టరీలా నడిపించకుండా అంతవరకు సామాన్యుడిగా చూపించిన విశాల్‌ని సడన్‌గా యాక్షన్‌ హీరోని చేసి మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. దాంతో మిస్టరీ పలచబడింది. 'కథకళి' లయ తప్పింది.

అమెరికాలో నాలుగేళ్లు ఉండి ఇండియాకి వచ్చిన కమల్‌ (విశాల్‌) తన ప్రేయసి మల్లీశ్వరిని (కేథరీన్‌) పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. గతంలో కమల్‌ ఓ రోజు జైలుకి వెళ్లడానికి, తన తండ్రి కాలు పోవడానికి, తన అన్న వ్యాపారం పోవడానికి కారకుడైన సాంబ (మధుసూదన్‌) సరిగ్గా కమల్‌ పెళ్లికి ముందు హత్యకి గురవుతాడు. అది చేసింది కమల్‌, అతని అన్నయ్యేనని పోలీసులు అనుమానిస్తారు. తనకి సాంబ చేసిన అన్యాయానికి అతడిని చంపాలని కమల్‌ ఎప్పుడో అన్న మాటని పట్టుకుని అతని స్నేహితుడే పోలీసులకి చెప్తాడు. తన మెడకి చుట్టుకున్న హత్య కేసునుంచి కమల్‌ ఎలా బయటపడతాడు?

సాంబ హత్యకి సంబంధించిన మిస్టరీ చుట్టూ తిరిగే ఈ కథలో అనుమానితులు చాలా మందే కనిపిస్తారు. అతడిని చంపడానికి అందరికీ ఓ మోటివ్‌ ఉంటుంది, కమల్‌తో సహా! మరి ఇంతకీ అతడిని ఎవరు చంపించినట్టు? మర్డర్‌ మిస్టరీ అంటే ఎప్పుడూ ఆసక్తికర అంశమే. టీవీలో క్రైమ్‌ స్టోరీల్లో చూపించినా, పేపర్లలో రోజుల తరబడి ఇన్వెస్టిగేషన్ల గురించి చదివినా ఇలాంటి అంశాలెప్పుడూ ఆసక్తి కలిగిస్తాయి. సస్పెన్స్‌ కథని మసాలా సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నంలోనే 'కథకళి' కంగాళీ అయింది. అసలు కథలోకి వెళ్లే ముందు కమల్‌, మల్లీశ్వరిల ప్రేమకథ ఫ్లాష్‌బ్యాక్‌లో నడుస్తుంది. చాలా సాదా సీదా ప్రేమకథే. ప్లాట్‌ సీరియస్‌గా మారాక పాటలు పెట్టుకునే వీలు లేదన్నట్టు ఈ లవ్‌ ట్రాక్‌ని అవసరానికి మించి సాగదీసారు. 

కాసేపటికి విసుగు మొదలైనా కానీ మర్డర్‌ సీన్‌ నుంచి కథ రసవత్తరంగా మారుతుంది. కమల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంటే, పాపం అమాయకుడు ఎలా తప్పించుకుంటాడనే ఫీలింగ్‌ వస్తుంది. అంతవరకు అమాయకుడిలా, సామాన్యుడిలా కనిపించిన కమల్‌ సడన్‌గా ఒక చోట పిడికిలి బిగిస్తాడు. అంతే ఒక్కసారిగా టెన్షన్‌ పోయి ఒక మామూలు యాక్షన్‌ సినిమాలా మారిపోతుంది. హత్య చేసిందెవరు అనేది చివరి వరకు సస్పెన్స్‌గానే ఉంచినప్పటికీ అది రివీల్‌ అయ్యే ప్రాసెస్‌ అంతా చాలా మామూలుగా అనిపిస్తుంది. కమల్‌ వైజాగ్‌లో ఫోన్‌ ఆఫ్‌ చేసుకుని పడుకుని ఉంటే, అక్కడికో పిల్లాడు వచ్చి తలుపు కొట్టి లేపి 'కాకినాడ నుంచి ఇన్స్‌పెక్టర్‌ ఫోన్‌ చేసాడు. ఫోన్‌ ఆన్‌ చెయ్యమన్నాడు' అంటాడు. తర్వాత వైజాగ్‌ నుంచి కాకినాడ వచ్చే వరకు అతడిని పోలీస్‌ బస్‌ అరెస్ట్‌ చేసి, అతని కదలికలన్నీ తెలుసుకునే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.

'ఇంతలా ఇరుక్కుపోయాడుగా, ఇప్పుడేంటి పరిస్థితి' అనే టెన్షన్‌ పుట్టించడంలో సక్సెస్‌ అయిన డైరెక్టర్‌ సడన్‌గా పట్టు వదిలేసి ఒక సగటు సినిమాని చేసేసాడు. హీరో క్యారెక్టర్‌ని యాక్షన్‌లోకి దించకుండా, తెలివిగానే తప్పించుకునేట్టు చూపించినట్టయితే కథకి న్యాయం జరిగేది. విశాల్‌ బాగానే చేసాడు కానీ ఈమధ్య అతని సినిమాల్లో చాలా వరకు ఈ తరహాలోనే అనిపిస్తున్నాయి. వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ తన యాక్షన్‌ హీరో ఇమేజ్‌ని విడిచి పెట్టలేకపోతున్నాడు. 'కర్రోడు, కాకిలా ఉన్నావ్‌' అంటూ తనపై కామెంట్స్‌ వేయించుకోవడానికి వెనకాడకపోవడం మెచ్చుకోతగ్గ విషయం. కేథరీన్‌ మంచి నటి. కానీ తన టాలెంట్‌కి తగ్గ క్యారెక్టర్లు రావట్లేదు. పోలీస్‌ పాత్ర చేసిన శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, శత్రు తదితరులంతా పాత్రలకి తగినట్టు ఉన్నారు. కరుణాస్‌ కామెడీ అక్కడక్కడా ఫరవాలేదనిపిస్తుంది. 

లో బడ్జెట్‌లో తీసినా టెక్నికల్‌గా మంచి క్వాలిటీ తీసుకురావడం తమిళ దర్శకుల స్పెషాలిటీ. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్‌కి మంచి మార్కులు పడతాయి. యాక్షన్‌ పార్ట్‌ కూడా వైర్లు, బౌన్సులు లేకుండా సహజంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. 'పసంగ' ఫేమ్‌ పాండిరాజ్‌ ఇలాంటి సీరియస్‌ సినిమాలో కూడా కామెడీకి స్పేస్‌ ఇచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు. రెండు గంటల నిడివి ఉన్న సినిమాలో ఒక గంట సేపు గ్రిప్పింగ్‌గా హోల్డ్‌ చేసాడు. కానీ కమర్షియల్‌ మసాలాల కోసమని ట్రాక్‌ తప్పడం వల్ల ఫైనల్‌గా ఒక యావరేజ్‌ ప్రోడక్ట్‌ అందించాడు. 

మైనస్‌లు ఉన్నప్పటికీ కథకళి ఒకసారి చూడతగ్గ చిత్రమే. ఇంకాస్త కేర్‌ తీసుకుని స్క్రిప్ట్‌ని ఇంకా టైట్‌గా రాసుకుని, కన్విన్సింగ్‌ క్లయిమాక్స్‌ పెట్టినట్టయితే గుర్తుండిపోయే మిస్టరీ సినిమా అయి ఉండేది. లయ తప్పకుండా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 'కథకళి' కదలకుండా కట్టి పడేసేది. 

బోటమ్‌ లైన్‌: మసాలా ఎక్కువైంది!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri