ఓ అజ్ఞాని పొలిటిక‌ల్ స‌ర్క‌స్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాలు చూస్తుంటే 8 ఏళ్ల క్రితం దివంగ‌త సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అరుణ్‌సాగ‌ర్ “ఒక‌టో నెంబ‌ర్ హెచ్చ‌రిక” శీర్షిక‌తో రాసిన వ్యాసం గుర్తుకొస్తోంది. ప్రశ్నించ‌డానికి, మార్పు కోసం అంటూ పెద్ద‌పెద్ద డైలాగ్‌ల‌తో జ‌న‌సేన…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాలు చూస్తుంటే 8 ఏళ్ల క్రితం దివంగ‌త సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అరుణ్‌సాగ‌ర్ “ఒక‌టో నెంబ‌ర్ హెచ్చ‌రిక” శీర్షిక‌తో రాసిన వ్యాసం గుర్తుకొస్తోంది. ప్రశ్నించ‌డానికి, మార్పు కోసం అంటూ పెద్ద‌పెద్ద డైలాగ్‌ల‌తో జ‌న‌సేన పార్టీని స్థాపించి, ఆ త‌ర్వాత మ‌రెవ‌రి ప‌ల్ల‌కీలో మోయ‌డానికి ముందుకొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో ప్ర‌మాద‌కారి అని గుర్తించిన మొట్ట‌మొద‌టి జ‌ర్న‌లిస్ట్ అరుణ్‌సాగ‌ర్‌. 2014లో ప‌వ‌న్ క‌ల్యాణ్ విధానాల గురించి ఏం రాశారో తెలుసుకుందాం. అలాగే అరుణ్ నాటి హెచ్చ‌రికే నేడు ఎలా నిజ‌మ‌వుతున్న‌దో విశ్లేషిద్దాం.

“ఎన్ని మాటలు గురూ రెండున్నర గంటలపాటూ టేకులూ రీటేకులూ లేని నటనావైదుష్యం. యాడికెల్లొస్తారు గురూ. వీళ్లు మనల్ని ఏమనుకుంటారు. పాపం చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా, రౌండుగా ఒక చక్రంలో చిక్కుకున్న ఆ ప్రదేశముందే అదేవారి ఆకాశం. ఆ పదడుగుల నీరే ఆవాసం. పైగా చేగువేరా బొమ్మొకొటి. ఎగిరితన్నేవాడు లేకపోతే సరి”

తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లికిన సూక్తులు… “వైసీపీ వ్య‌తిరేక ఓటు చీలిపోయి ఆ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఆంధ్రప్ర‌దేశ్ అంధ‌కారంలోకి వెళ్లిపోతుంది. వైసీపీ ప్ర‌భుత్వం ఇదే ర‌క‌మైన పాల‌న కొన‌సాగిస్తే రానున్న ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 15 సీట్లు కూడా వ‌చ్చే అవ‌కాశం లేదు. రాజ‌కీయాల్లో పౌరుషాలుండ‌వు. వ్యూహాలుంటాయి. వైసీపీ నాయ‌కులు ఏమైనా అంటే సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. మేము ఎవ‌రితో పొత్తులు పెట్టుకోవాలో, ఎలా రాజ‌కీయాలు చేయాలో మీరు నేర్పుతారా?”

తాను మ‌ద్ద‌తు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన టీడీపీ ప్ర‌భుత్వం ఏ ర‌క‌మైన పాల‌న సాగించి వుంటే జ‌నం కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితం చేశారో ప‌వ‌న్ ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మ‌ళ్లీ అదే పాల‌న‌ను తీసుకురాడానికి ప‌వ‌న్‌కు ఎందుకంత ప‌ట్టుద‌ల‌? వైసీపీ వ్యూహాత్మ‌కంగానే సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌నే సెటైర్ విసురుతోంద‌ని ప‌వ‌న్‌కు అర్థం కాలేదా? ఏపీకి చంద్ర‌బాబు, జ‌గ‌న్ మిన‌హా మ‌రెవ‌రూ దిక్కులేద‌ని ప‌వ‌న్ చెప్ప‌ద‌లుచుకున్నారా? మ‌రి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌కు ప‌వ‌న్ మాట‌ల్లో త‌ప్ప చేత‌ల్లో స్థానం ఎక్క‌డ‌?

గ‌తంలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి… వైసీపీ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా ప‌కడ్బండీ వ్యూహం ర‌చించారు. అంతా చేసినా ఒక‌టిన్న‌ర శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని మూకుమ్మ‌డిగా ద‌క్కించుకున్నారు. టీడీపీ-బీజేపీ క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశాయి. చంద్ర‌బాబు సీఎంగా చేసిన గొప్ప‌త‌నం ఏంటి? ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ ఓట్లు చీల‌కుండా క‌లిసిపోయి పోటీ చేసి, రాష్ట్రానికి ఏం చేస్తామ‌ని హామీ ఇవ్వ‌ద‌లుచుకున్నారో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మాధానం చెప్పాలి.

రాష్ట్రంలోనూ, దేశంలోనూ రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పాగా వేసి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌పై ఆశ‌లు చిగురింపజేసింది. ఇటీవ‌ల‌ పంజాబ్‌లో జాతీయ రాజ‌కీయ పార్టీలు, అలాగే వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన ప్రాంతీయ పార్టీని మ‌ట్టి క‌రిపించి ఆప్ దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింది. స‌మాజ మార్పు, రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నా యాన్ని కోరుకునే వాళ్లెవ‌రైనా కేజ్రీవాల్ త‌ర‌హా రాజ‌కీయాల‌నే కోరుకుంటారు. ప‌వ‌న్ చేస్తున్న‌దేంటి? చేయాల్సిందేంటి?  దేశానికి, రాష్ట్రానికి ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించిన పార్టీల కొమ్ము కాయ‌డానికి తన‌తో పాటు త‌న అభిమానుల‌ను సైతం తాక‌ట్టు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌లా మ‌న‌సులో ఒక‌టి, పైకి మ‌రొక‌టి మాట్లాడుతూ ద్వంద్వ రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఇలాంటి వాళ్లెప్పుడూ ప్ర‌జ‌ల విశ్వ‌స‌నీయ‌త‌, ఆద‌ర‌ణ‌ పొంద‌లేరు. త‌మ కోసం పోరాడే నాయ‌కుల‌ను స‌మాజం ఎప్పుడూ విస్మ‌రించ‌దు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ప్ర‌జానాయ‌కుడికి స‌మాజం ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంది. ఇందుకు కేజ్రీవాల్ రాజ‌కీయ పంథానే నిద‌ర్శ‌నం. రాజ‌కీయాల్లో ఎలా వుండ‌కూడ‌దో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ ఉదాహ‌ర‌ణ‌. పార్టీ నెల‌కొల్పి 9 ఏళ్లు అయ్యింది. ఈ రోజుకు కూడా 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలుపుకోలేని స్థితిలో జ‌న‌సేనాని వున్నారంటే, ఆయ‌న పోరాటం, ఆరాటం ఏంటో తెలుస్తోంది.

ఎక్క‌డైనా అధికారంలో ఉన్న నాయ‌కులు ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవ‌డం చూశాం. ఇదేం విచిత్రమో, క‌నీసం ఒక్క‌చోట కూడా గెల‌వ‌లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకున్నారు. ఈయ‌న చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడ‌నే పేరు స్థిర‌ప‌రుచుకున్నారు. చంద్ర‌బాబుకు కావాల్సిందీ ఇదే. భ‌విష్య‌త్‌లో టీడీపీ, వైసీపీల‌కు ప్ర‌త్యామ్నాయ‌మ‌నే మాట మాట్లాడే అర్హ‌త‌ను చేజేతులా ప‌వ‌నే చంపుకుంటున్నారు. ఇది ఆత్మ‌హ‌త్యా స‌దృశ్యం. బాబు కోసం, బాబు చేత‌ ప‌వ‌న్ రాజ‌కీయం అనే రీతిలో జ‌న‌సేనాని ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

వైసీపీ వ్య‌తిరేక ఓట్లను చీల‌నివ్వ‌నంటే అర్థం చెప్పాల‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్  స‌మాధానం… “రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం, ప్ర‌జ‌ల కోసం, అభివృద్ధి కోసం క‌చ్చితంగా బ‌ల‌మైన ఆలోచ‌నా విధానంతో ముందుకెళ్తాం. భ‌విష్య‌త్‌లో రాష్ట్రంలో ఏదో ఒక అద్భుతం జ‌రుగుతుందని భావిస్తున్నా”

క‌నీసం తానిచ్చిన జ‌వాబు త‌న‌కైనా అర్థ‌మ‌వుతున్న‌దో లేదో మ‌రి. చంద్ర‌బాబు హ‌యాంలో అంతా గొప్ప‌గా జ‌రిగి వుంటే, మ‌రి చివ‌ర్లో ఎందుకు విభేదించారో జ‌నానికి జ‌వాబు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌ర్న‌లిస్ట్ అరుణ్‌సాగ‌ర్ నాడు అన్న మాట‌లు నేటికీ ఎంత సంజీవంగా ఉన్నాయో ఈ రాత‌లు చ‌దివితే అర్థ‌మ‌వుతుంది.

“చీకటి బుర్రలో ప్రమిద వెలగించాలన్నా కొంచెం ప్లేసుండాలి కదరా అన్నయా. పార్టీ విధానమంటే ఏం చేస్తామో చెప్పడం కాదురా బై ఎలా చేస్తామో చెప్పడం. ప్రశ్నించడానికే పుట్టాం. కానీ, ప్రశ్నించాల్సినవేమీ ప్రశ్నించం. కన్వీనియంట్‌గా ఉండే ప్రశ్నల్నే వేస్తాం. బై దివే మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం. తొక్కలో డైలాగులు నాలుగు విసిరి ఎంటర్‌టైన్‌ చేసేస్తే నీ అజ్ఞానానికి మేకప్‌ వేసినట్టేనని భ్రమపడుతున్నావా! “

ఎన్నిక‌ల నాటికి ఏదో అద్భుతం జ‌రిగి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతాయ‌ని ప‌వ‌న్ ఆశిస్తున్నార‌ట‌! భ‌విష్య‌త్ పంథాపై ప్ర‌ణాళిక ఉన్న నాయ‌కుడెవ‌రైనా చెప్పే స‌మాధానం ఇదా? అస‌లు త‌న పార్టీకి, త‌న‌కూ ఒక పంథా అంటూ ఉందా? జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌డ‌మే జ‌న‌సేన ఏకైక ల‌క్ష్య‌మా? చంద్ర‌బాబును సీఎం చేయ‌డ‌మే ప‌వ‌న్ ఆశ‌య‌మా? ఇందుకోసం ప‌వ‌న్ చెప్పిన‌ట్టు అంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి? ఏంటీ పిచ్చివాగుడు?  

ఏపీలో రాజ‌కీయాలు కుళ్లిపోయిన మాట వాస్త‌వ‌మే. టీడీపీ, వైసీపీల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వ్య‌వ‌స్థ రావాల‌ని కోరుకుంటున్న మాట నిజ‌మే. కానీ మ‌ళ్లీ చంద్ర‌బాబునే సీఎం చేసుకోవాల‌ని ప‌వ‌న్ కోరుకుంటున్న‌ట్టుగా, భావ‌దారిద్ర్యంలో ఆంధ్రప్ర‌దేశ్ జ‌నం లేరు. కొత్త‌గా పార్టీ స్థాపించి 2014లో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల కోసం కాకుండా, టీడీపీ-బీజేపీ ప‌ల్ల‌కీ మోసిన మొద‌టి రోజుల్లోనే ప‌వ‌న్‌ను నిల‌దీయ‌క‌పోవ‌డ‌మే నేర‌మైంది.

అప్పుడే ఇవేం రాజ‌కీయాల‌ని నిల‌దీసి వుంటే, నేడు ప‌వ‌న్ పొత్తుల పేరుతో డ్రామాలు ఆడే ప‌రిస్థితి త‌లెత్తేది కాదు. చంద్ర‌బాబు నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంధ‌కార‌మైనా ఫ‌ర్వాలేదు కానీ, అది జ‌గ‌న్ హ‌యాంలో జ‌ర‌గ‌డ‌మే నేర‌మ‌ని ప‌వ‌న్ చెబుతున్న‌ట్టుగా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే చంద్ర‌బాబు, .జ‌గ‌న్‌, ప‌వ‌న్ మాత్ర‌మే కాదు. వీళ్ల‌కు మించి ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు, ఆకాంక్ష‌లున్నాయి. 

అంద‌రికీ బుద్ధి చెప్పేరోజు త‌ప్ప‌క వ‌స్తుంది. అందుకోసం ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా ఎదురు చూసే స‌హ‌నం ఏపీ స‌మాజానికి వుంది. అంతే త‌ప్ప‌, ప‌వ‌న్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్ మాయ‌లో ఇరుక్కుని త‌మ‌ను తాము బ‌లి చేసుకునే దుస్థితిలో జ‌నం లేరు.

సొదుం ర‌మ‌ణ‌