ఊరించే బదులు.. ఆ ప్లాన్ ఏంటో చెప్పొచ్చుగా పవన్!

ఏటా లక్ష మంది యువతకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం. వారు మరో 10 మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు పార్టీ వద్ద చాలా ఉన్నాయి.…

ఏటా లక్ష మంది యువతకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం. వారు మరో 10 మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు పార్టీ వద్ద చాలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి మరెన్నో ప్రణాళికలు సిద్ధం చేశాం. నన్ను ఆశీర్వదించండి. అందర్నీ అభివృద్ధి చేస్తా.”

ఇవీ పవన్ చెబుతున్న మాటలు. చాలా ప్రణాళికలు ఉన్నాయట. అవేంటో బయటకు చెప్పరట. ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే అప్పుడు చేసి చూపిస్తారట పవన్. ఒక్క ఛాన్స్ అంటూ ఇటీవల పవన్ కూడా కొత్త స్టైల్ అందుకున్నారు. 

ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ స్థితిగతుల్ని మార్చేస్తానంటున్నారు. తన వద్ద ఉన్న ప్లాన్ అమలు చేసి చూపిస్తానంటున్నారు, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తానని నమ్మబలుకుతున్నారు.

జగన్ కూడా అలాగే చెప్పారా..?

నన్ను నమ్మి అధికారం ఇవ్వండి మార్పు తీసుకొస్తానని జగన్ కూడా చెప్పారు కానీ, ఆయన తన ప్రణాళిక ఏంటనేది క్లియర్ గా చెప్పారు. నవరత్నాల్ని ప్రజలకు వివరించారు. అవి నచ్చి ప్రజలు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా పదవీ ప్రమాణ స్వీకారం మరుసటి రోజే నవరత్నాలను అమలులో పెట్టారు. 

కరోనా కష్టాలు వచ్చినా, ఆర్థిక పరిస్థితి మందగించినా, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నా కూడా ముందుకే వెళ్తున్నారు. నవరత్నాల విషయంలో మాత్రం ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తపడ్డారు, ఒకరకంగా దానికోసమే కష్టపడుతున్నారు.

పవన్ సంగతేంటి..?

పోనీ పవన్ నవరత్నాల కంటే మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా..? ఒకవేళ నిజంగానే అలాంటి ప్రణాళిక ఉంటే బయటపెట్టాలి కదా..? నవరత్నాల కంటే తన జన రత్నాలు ఎంత బాగా ఉంటాయో చెప్పాలి కదా, తేడా వివరించాలి కదా..? కాని పవన్ చెప్పరట..? ఎందుకంటే ఆయన చేతికి పగడాలు తప్ప, బుర్రలో ఏ రత్నాలు లేవు కాబట్టి. 

నిజంగా అంత ప్రణాళిక ఉన్నవారే అయితే కచ్చితంగా పార్టీని గాడిలో పెట్టుకునేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత తెలివితేటలు ఉన్నవారే అయితే ముందు జనసేనని జనం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఆ విజన్ లేదు కాబట్టే పార్టీ అలా ఉంది, పవన్ ఇలా ఉన్నారు.

చంద్రబాబుతో వెళ్లడమే పెద్ద తప్పటడుగు..

సింగిల్ గా వచ్చి సింగిల్ సీటు సాధించిన పవన్ పై గతంలో కాస్తో కూస్తో జనంలో సింపతీ ఉండేది. కానీ ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా తన అహంకారంతో దూరం చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు భజన మొదలు పెట్టారు. రాజకీయ నిర్ణయాల్లో అనిశ్చితి వల్లే జనసేన ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 

ఇప్పటికే చాలామంది పవన్ ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చి మోసపోయారు, ఇకపై మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. మరోసారి టీడీపీ దగ్గర పార్టీ పరువు తాకట్టు పెడుతున్నారని తేలిపోయే సరికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నిజంగానే పవన్ వద్ద ప్రణాళికలు ఉంటే… ముందు వారిని బయటకు పోకుండా అడ్డుకోవాలి. ఆ అద్భుతమైన ఆలోచనలతో పార్టీని కాపాడుకోవాలి.