రాజధాని అనగానే మరో హైదరాబాదు అవుతుందని అందరూ అనుకున్నారు. అంటే ప్రభుత్వం కొన్ని బిల్డింగులు కడుతుందంతే, తక్కినదంతా హైదరాబాదులాగానే ప్రయివేటు యిన్వెస్ట్‌మెంటు వుంటుంది. అక్కడ మనం బిజినెస్ కాంప్లెక్సులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు కట్టేస్తే బోల్డంత సంపాదించుకోవచ్చు అనుకున్నారు. తీరా చూస్తే బాబు వేరేలా ప్లాను చేశారు. ప్రభుత్వమే 50 వేల ఎకరాల భూమి తీసుకుని దానిలో అన్ని బిల్డింగులూ తామే కట్టిస్తామన్నారు. ప్రభుత్వానికి భూమి అప్పగించమనేసరికి దుఃఖం వచ్చింది. కొత్తగా యీ మధ్య కొన్నవాళ్ల దగ్గర్నుంచే కాదు, రైతుల దగ్గర్నుంచి కూడా భూమి తీసుకుని ఏవేవో వాగ్దానాలు కురిపించారు. అవి ఎంతవరకు నెరవేరతాయో తెలియదు. రాజధాని నిర్మాణం ఆలస్యమౌతోంది. కేంద్రం కనికరించటం లేదు. 2019లోపున పూర్తి కాకపోతే ఎప్పటికవుతుందో, వచ్చే ప్రభుత్వం ఎవరిదో, ఏ మేరకు హామీలు నిలబెట్టుకుంటుందో ఏమీ తెలియని అయోమయ పరిస్థితి. ఇలా రాజధాని ప్రాంతంలో భూములు సమర్పించుకున్నవాళ్లు అయోమయ పరిస్థితిలో పడ్డారు. రాజధాని సరిహద్దు రేఖలు గీసినపుడు దాని బయట వుండి భూములు బచాయించుకున్నవారిని చూసి అసూయ పడుతున్నారు.
ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఇప్పుడు ''సాక్షి'' కొత్తగా చెప్పినదేమిటి? టిడిపి నాయకులు, వారి బినామీలు కీలకమైన స్థలాలు కొనుక్కుని సరిహద్దులను తమకు అనుకూలంగా గీయించుకుని, లబ్ధి పొందుతున్నారని! కొన్నవారు టిడిపి వారు మాత్రమే అంటే సాక్షిని ఏకాక్షి అనాలి. కొన్నవారిలో వైకాపావారే కాదు, కాంగ్రెసు వారు కాదు, కమ్యూనిస్టులు కూడా వుండి వుంటారు. ఏ పార్టీకి చెందనివాళ్లూ వున్నారు. ఎఫెక్టు కోసం కొందరు వైకాపావాళ్ల పేర్లు కూడా వేసి వుంటే, తర్వాత వారు టిడిపిలోకి మారినప్పుడు నిందించడానికి వీలుగా వుండేది. నేటి వైకాపావారే, రేపటి టిడిపివారనేది యీనాటి నానుడి. ఇప్పుడు సర్వే నెంబర్లు అవీ వల్లించి, ఏదో కొత్తగా కనిపెట్టినట్లు హంగామా చేసింది సాక్షి పత్రిక. 'అవును కొన్నాం, తప్పేముంది' అని కొందరు టిడిపి నాయకులు ప్రకటించి దులిపేసుకున్నారు. కొన్ని భూముల విషయంలో మాత్రమే యిలా జరిగింది. బినామీల ద్వారా కొన్నారు అని ఆరోపించినపుడు వాళ్లు బినామీలని ఎందుకు అంటున్నారో సాక్షి చెప్పి వుండాల్సింది, కనీసం ఎవరి పేర వుందో వాళ్లయినా 'నేను ఎవరికీ బినామీ కాదు, నా సొంత ధనంతో కొన్నాను. ఇదిగో నా సోర్సెస్ యివి. నాది మినిస్టర్‌గారి కొడుకు పిఏ ఉద్యోగమే కావచ్చు కానీ కానీ ఫలానా గుఱ్ఱప్పందంలో యింత గెలిచాను, లేదా మా పూర్వీకుల ఆస్తి ఫలానా తారీకులో కొన్నాను' అని ప్రకటించి వుంటే సాక్షి నోరు మూతపడేది. ప్రభుత్వమైనా సర్వే నెంబర్ల వారీగా భూమి ఎవరి పేర వుందో ప్రకటించి వారి పూర్తి వివరాలు యిస్తే బినామీలో కాదో కనీసం ఆ వూళ్లో వాళ్లకు తెలుస్తుంది. అనేక కంపెనీలలో డైరక్టర్లుగా, మేజర్ వాటాదార్లుగా కారు డ్రైవర్లు, అటెండర్లు వుంటారు. ఉన్న విషయం వాళ్లకూ తెలియదు. అడిగితే కాగితాలపై సంతకం పెట్టమంటే పెట్టామని చెప్తారు.
ఇంత సులభమైన మార్గం వదిలేసి, బాబు ఆరోపణల ఖండన మొదలుపెట్టారు. దానిలో కొత్త పుంతలు తొక్కారు. ఇలాటి ఆరోపణల వలన అమరావతి పరువు పోతోందన్నారు. తను కష్టపడి విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ వుంటే యిలాటి బాధ్యతారహితమైన రాతల వలన పెట్టుబడులు వెనక్కి పోతాయని, ప్రజలకు నష్టమని వాపోయారు. అవినీతి ఆరోపణలు రుజువైతే పరువు పోయేది టిడిపికి, వారు నడిపే ప్రస్తుత ఆంధ్ర ప్రభుత్వానికి తప్ప యావత్తు ఆంధ్రకు కాదు. ఈ పాయింటు ఆయనెందుకోగాని గ్రహించటం లేదు. గతంలో ఓటు-నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టుబడినపుడు కెసియార్ ఆంధ్రులందరినీ అవమానించారన్నాడు, అక్కడికి ఆంధ్రులందరూ నేరం చేస్తూ వీడియోలో పట్టుబడినట్లు! తన ఫోన్ ట్యాప్ చేస్తే ఆంధ్రులందరికీ ద్రోహం చేసినట్లే అన్నాడు. ఇప్పుడు ఏం మాయ చేశారో, ఏం బేరం కుదిరిందో కాని సద్దు మణిగినట్లు కనబడింది. మరి ఆంధ్రుల పోయిన ప్రతిష్ఠ తిరిగి వచ్చినట్లేనా? వైయస్ అవినీతిపరుడు అని ఆరోపణలు చేస్తే, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని గోల చేస్తే తెలుగువారందరి పరువు పోయినట్లేనా? ఆ కారణంగా విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయా? విదేశీయులు నొచ్చుకుంటారని, నిధులు తేవడానికి వెనకాడతారని నిజాలు వెల్లడించకూడదా? అవినీతి జరిగిందన్న అనుమానం వుంటే వ్యక్తపరచకూడదా? ఇదెలా వుందంటే తిరుగుబోతు భర్తపై భార్య తిరగబడి, అరిస్తే 'చుట్టుపక్కలవాళ్లల్లో నా పరువు పోతుంది, నోరుమూసుకుని పడి వుండు' అని దబాయించినట్లుంది. ఇప్పుడు గుడ్డకాల్చి మొహం మీద పడేస్తే మేం తుడుచుకోవాలా? అని అడుగుతున్న బాబు మొన్నటిదాకా ప్రతిపక్షంలో వున్నపుడు అవినీతి ఆరోపణలు చేయకుండా వున్నారా? 'అరే, నేను వాటిని ఎత్తిచూపితే పెట్టుబడులు రావు, అంతిమంగా తెలుగువారికే కదా నష్టం' అని తమాయించుకున్నారా?
ఇక్కడ యింకో తమాషా ఐన విషయమేమిటంటే – 'అమరావతికి పెట్టుబడులు రావు' అంటున్నారు. అసలు అమరావతి ఏమిటి? ఆంధ్రకు రాజధాని. రాజధానికి విదేశీ పెట్టుబడులేమిటి? కొత్త భువనేశ్వర్, కొత్త రాయపూర్, గాంధీనగర్.. వీటిల్లో ఏమున్నాయి? రాజధాని అంటే అధికారిక భవంతులు కట్టుకోవడం అనే గ్రహింపు వుంటే వాటిని కట్టడానికి ఎవర్నీ ఆకర్షించనక్కరలేదు. కానీ దానిలో కమ్మర్షియల్ కాంప్లెక్సులు కట్టాలని, అది కూడా ప్రభుత్వమే కట్టించాలనీ అనుకోవడమే యిన్ని చిక్కులు తెస్తోంది. ఇంత హంగామా వలన సాధారణ రాజధాని కూడా అమరకుండా పోతోంది. పెట్టుబడి పెట్టేవాడు ప్రకృతి వనరులు, మానవ వనరులు వంటి అంశాలతో బాటు స్థానిక ప్రభుత్వపు సమర్థతను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. అది అసమర్థమైనదైనా, అవినీతిభరితమైనదైనా వెనకంజ వేస్తాడు. బాబు తన ప్రభుత్వం సమర్థవంతమైనదని చూపించుకోవాలంటే కొద్ది స్థాయిలోనైనా ఏదైనా సాధించి చూపించాలి. కేంద్రం సహకారనిరాకరణతో యిప్పటిదాకా ఏదీ గట్టిగా సాధించడానికి వీలు పడలేదు.
ఇక అవినీతిరహితమని చూపించుకోవాలంటే పారదర్శకంగా పనిచేయాలి. పారదర్శకత వున్న నాడు, ఎందరు ఏమన్నా మొహం బద్దలయ్యేట్టు జవాబివ్వవచ్చు. దురదృష్టవశాత్తూ అదే లోపిస్తోంది. అమరావతి నిర్మాణానికి భారతీయ కంపెనీలు ఎందుకు పనికి రావు (తాత్కాలికానికి పనికి వచ్చాయి కదా) సింగపూరు కంపెనీలను ఎందుకు పిలుస్తున్నారు అంటే జవాబు లేదు, ఆ తర్వాత సింగపూరువి గొంతెమ్మ కోర్కెలంటారు, జపాన్ అంటారు, చైనా అంటారు, వాళ్లతో చేసుకున్న ఒప్పందాలు బహిర్గతం చేయరు, టెండర్లు పిలవకుండా నామినేషన్ల ద్వారా పనులు కానిస్తారు. జలయజ్ఞంలో పనులు ప్రారంభించకుండా మొబిలైజేషన్ ఎడ్వాన్సులంటూ యిచ్చినపుడే అనుమానాలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లలో నీళ్ల కంటె డబ్బులే ఎక్కువ ప్రవహించాయి. అలాటివి ఎన్నో చూసిన ఆంధ్రులు ప్రతి పాలకుణ్నీ అనుమానించడంలో ఆశ్చర్యం లేదు. సందేహాలు వచ్చినందుకు వారిని తిట్టకూడదు, నివృత్తి చేసి ధైర్యం చెప్పాలి. తమపై వచ్చిన ఆరోపణలకు జవాబులు చెప్పాలి తప్ప, జగన్‌పై ప్రత్యారోపణలు చేసి ఏం లాభం? ప్రజలు అతన్ని కాదనే కదా, అతనిపై నమ్మకం లేకపోయే కదా, అతన్ని తిరస్కరించి మీకు పట్టం కట్టారు. అతని వ్యవహారం కోర్టులో వుంది, ఆస్తులు ఎటాచ్‌మెంట్‌లో వున్నాయి. అందువలన ప్రజలకు అతని గురించిన గోల అక్కరలేదు. మీరేం చేస్తున్నారనేదే వాళ్లకు కావాలి.
తాత్కాలిక రాజధాని పనులు అప్పగించినపుడు మీరు స్థలం యివ్వడంతో బాటు చ.అ.కు యింత రేటు చొప్పున కాంట్రాక్టు యిచ్చామన్నారు. అది చాలా ఎక్కువ అని ప్రతిపక్షాల వారంటారు. కాదని మీరంటున్నారు. మామూలు జనాలకు యిళ్ల విషయంలో రేటు ఎలా వుంటుందో తెలుస్తుంది. ఆఫీసు, అందునా ప్రభుత్వ ఆఫీసు రేటు ఎలా వుంటుందో తెలియదు. ఆ కాంట్రాక్టులో అధికార పార్టీ ఆఫీసు కూడా కట్టి యిచ్చే లోపాయికారీ ఒప్పందం వుందేమోనని అనుమానం మొలకెత్తడం సహజం. ఇలాటి సందర్భాల్లో ఈ రేటులో లోపల ఫర్నిచరుతో సహా మాట్లాడాం అనో, లేక ఫలానా వూళ్లో వీళ్లు యిలాటిది యిదే రేటుకి కట్టారు అని అంకెలు విడుదల చేస్తే సరిపోతుంది. మేం తెలుగువాళ్లం, మీరు తెలుగువాళ్లు, మనంమనం అనుమానించకూడదు అని వాదిస్తే కుదరదు.
మధ్యలో యీ తెలుగు గొడవేమిటని విసుక్కోకండి. బాబు తన జవాబులో యీ లైను తీసుకున్నారు. ''సాక్షి తెలుగువారి పత్రిక, తెలుగువారికి వ్యతిరేకంగా ఎలా రాస్తుంది'' అని వాదించారు. మరి ఈనాడు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాయలేదా? వైయస్‌కు వ్యతిరేకంగా రాయలేదా? ఆంధ్రజ్యోతి యిప్పుడు కెసియార్‌కు వ్యతిరేకంగా రాయటం లేదా? ఈ రకంగా చూస్తే తెలుగు పాలకులకు వ్యతిరేకంగా రాసే అర్హత తెలుగునాట ''వార్త''కు, ''హిందు''కు, ''టైమ్స్ ఆఫ్ ఇండియా''కు తప్ప వేరెవరికి లేదన్నమాట. జాతీయస్థాయికి అన్వయిస్తే ఇండియన్లు షేర్లు కలిగి వున్న ఏ పేపరూ ఇండియాలో అవినీతి గురించి రాయకూడదు. తెలంగాణలో కెసియార్ అవినీతి చేస్తూ వుంటే, కొత్త సెక్రటేరియట్ పేర వృథా వ్యయం చేస్తూ వుంటే సాటి తెలుగువాడు కదాని బాబు పార్టీని మౌనంగా వుంటుందా? ఆంధ్రలో రేపు బాబు గాక మరొకరు అధికారంలోకి వస్తే అప్పుడాయన మౌనంగా వుంటారా? సాక్షి ఆస్తులు ప్రభుత్వానికి ఎటాచ్ అయ్యాయి కాబట్టి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకూడదా!? ఈ లాజిక్ యిప్పటిదాకా ఎవరికీ తోచి వుండదు. ఇంతకీ అది కేంద్రప్రభుత్వం పత్రికా? రాష్ట్రప్రభుత్వం పత్రికా? ఆంధ్ర ప్రభుత్వం ''ఆంధ్రప్రదేశ్'' అనే మాసపత్రిక ప్రభుత్వ వార్తలతో ప్రచురిస్తుంది. దాని సిబ్బందికి జీతాలిస్తుంది. ఇప్పుడు సాక్షి సిబ్బందికి ఏ ప్రభుత్వం జీతాలిస్తోంది? ఎటాచ్ చేసినంత మాత్రాన స్వాధీనం అయిపోయినట్లేనా? ఆగ్రిగోల్డ్ ఆస్తులు ఎటాచ్ అయివున్నాయి, అవి అన్యాక్రాంతమయ్యాయని ఎలా అంటారు అని ఒక పక్క అడుగుతూనే మరో పక్క సాక్షి ఆస్తులు ప్రభుత్వపరం అయిపోయినట్లు ఎలా వాదిస్తున్నారీయన? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)