సినిమా రివ్యూ: పడేసావే

రివ్యూ: పడేసావే రేటింగ్‌: 2/5 బ్యానర్‌: అయాన్‌ క్రియేషన్స్‌ తారాగణం: కార్తీక్‌ రాజు, నిత్యాశెట్టి, జహీదా శ్యామ్‌, నరేష్‌, రాశి, విశ్వ తదితరులు మాటలు: కిరణ్‌ సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ కూర్పు: ధర్మేంద్ర .కె…

రివ్యూ: పడేసావే
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
అయాన్‌ క్రియేషన్స్‌
తారాగణం: కార్తీక్‌ రాజు, నిత్యాశెట్టి, జహీదా శ్యామ్‌, నరేష్‌, రాశి, విశ్వ తదితరులు
మాటలు: కిరణ్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ధర్మేంద్ర .కె
ఛాయాగ్రహణం: కన్నా కూనపురెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: చునియా
విడుదల తేదీ: ఫిబ్రవరి 26, 2016

జనరల్‌గా బాగుంటే తప్ప తన సినిమాల గురించి కూడా గొప్పగా మాట్లాడని నాగార్జున ఒక చిన్న సినిమాని విపరీతంగా ఎంకరేజ్‌ చేస్తూ, దానిని బాగా ప్రమోట్‌ చేస్తుంటే ఖచ్చితంగా దానిపై ఒక పాజిటివ్‌ ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది.

ఈ శుక్రవారం ఎన్నో సినిమాలు విడుదలైతే జనం దృష్టిని బాగా ఆకట్టుకున్న వాటిలో 'పడేసావే' ఉందంటే దానికి నాగార్జున పబ్లిసిటీనే కారణం. అయితే ఎంచేత ఈ చిత్రాన్ని ఈ రేంజిలో వెనకేసుకొచ్చారనేది తెలీదు కానీ 'కింగ్‌' మాటలు నమ్మి ఈ సినిమాకెళ్తే డంగైపోవాల్సిందే!

మహిళా దర్శకురాలు, ముక్కోణ ప్రేమకథ అంటే కొత్తగా ఉన్నా లేకున్నా కనీసం 'అలా మొదలైంది' తరహాలో ఫన్‌ అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ 'పడేసావే' మొదలైన కాసేపటికే ఆశలు ఆవిరైపోతాయి. 

నాగార్జున ఎంకరేజ్‌ చేసాడంటే ఏదో కారణం ఉండి తీరాలి, ఏదైనా టర్నింగ్‌ పాయింట్‌ ఉండే ఉండాలి అని వెయిట్‌ చేస్తే, లీడ్‌ కాస్ట్‌ అంతా కలిసి మనకేసి చూస్తూ నవ్వుతోన్న షాట్‌ పడి టైటిల్స్‌ రోల్‌ అయిపోతాయే తప్ప నిఖార్సయిన ఒక్క ఎమోషనల్‌ మూమెంట్‌ కానీ, ఆకట్టుకునే ఒక్క సీన్‌ జాడ కానీ దొరకదు. ఏదో ఆబ్లిగేషన్‌ మీదే నాగార్జున ఈ చిత్రాన్ని ఎంకరేజ్‌ చేసి ఉండాలి. లేదంటే స్క్రిప్ట్‌ జడ్జిమెంట్‌పై ఇప్పుడున్న గ్రిప్‌తో ఇలాంటి నాసిరకం సినిమాకి అంతటి సపోర్ట్‌ ఇస్తూ, అన్నిసార్లు ఈ చిత్రం ప్రెస్‌మీట్స్‌లో కనిపించి ఉండేవారు కాదు. 

చిన్ననాటి స్నేహితుడిని (కార్తీక్‌) ప్రేమిస్తున్నా కానీ ఆ సంగతి అతనికి చెప్పదు నీహారిక (నిత్య). అతనికి ఆమెపై స్నేహ భావం తప్ప మరే ఫీలింగ్స్‌ ఉండవు. ఆమె స్నేహితురాలైన స్వాతిని (జహీదా) చూసి కార్తీక్‌ ప్రేమలో పడతాడు. ఒక కన్‌ఫ్యూజన్‌ వల్ల కార్తీక్‌ తనని ప్రేమిస్తున్నాడని భ్రమపడుతుంది నీహారిక. తన స్నేహితురాలు ప్రేమించే వ్యక్తిని తాను ప్రేమించలేనంటుంది స్వాతి. ఈ ముక్కోణ చిక్కుముడి ఎలా విడుతుంది? దీనికి పరిష్కారమేంటి?

ఎన్నో ప్రేమకథల్లో చూసిన ప్లాట్‌నే ఎంచుకున్న దర్శకురాలు చునియా కనీసం వినోదంతో అయినా మెప్పించాల్సింది. పాత కథని నడిపించడానికి తగిన స్టఫ్‌ లేకపోవడంతో లెక్కకు మించి పాటలు, ఫైట్లతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. కామెడీ లేదని కాదు, కానీ అది మనకి కామెడీలా అనిపించదు. ఎమోషనల్‌గా టచ్‌ చేయడానికి ప్రయత్నం గట్టిగానే జరిగింది. స్వాతికి, ఆమె తల్లికి (రాశి) మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ తొలగించడానికి కార్తీక్‌ ఏదో చెప్తాడు. వాళ్లిద్దరూ తెగ బాధ పడిపోయి కలిసిపోతారు. కానీ అతనేం చెప్పాడో, వాళ్లకేం అర్థమయిందో మాత్రం మనకి అర్థం కాదు. అలాంటి సందర్భంలో కదిలించే మాటలు రాయడానికి మంచి స్కోపుంది. కానీ మాట్లాడుతుంది తెలుగులోనే అయినా దాని భావమేంటనేది అర్థం కాని విధంగా సంభాషణలుంటే ఇక ఆ సన్నివేశం ఎలా పండుతుంది? అలాంటిదే మరో సన్నివేశం ఉంది. హీరోలోని టాలెంట్‌ని అతని తల్లిదండ్రులు గుర్తించే సీన్‌లోను ఇదే సమస్య తలెత్తింది. 

ఇక లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన మరీ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రేమే అనేది దర్శకురాలి ఫీలింగ్‌ అయి ఉంటుంది. కానీ అందులో ప్రేమ కంటే వింత ప్రవర్తనే డామినేట్‌ చేసింది. ప్రథమార్థం వరకు పాత్రల పరిచయాలు, పాటలతో కాలక్షేపం చేసినా కానీ ద్వితీయార్థంలో ఏం చేయాలనేది డైరెక్టర్‌కి కూడా అర్థమైనట్టు లేదు. ఆలీ, కృష్ణుడు వగైరా బృందంతో సుదీర్ఘమైన కామెడీ సన్నివేశం సహనాన్ని పరీక్షించడం కాదు, పూర్తిగా హరించేస్తుంది. అదే భారమనుకుంటే క్లయిమాక్స్‌ మరింత గందరగోళంగా మారి కూర్చున్న సీట్లలోనే కూలబడిపోయేట్టు చేస్తుంది. 

కార్తీక్‌ రాజు చూడ్డానికి బాగున్నాడు. కాన్ఫిడెన్స్‌ కూడా చూపించాడు. నిత్యాశెట్టి జూనియర్‌ కలర్స్‌ స్వాతిలాగుంది. మరో హీరోయిన్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నరేష్‌ ఫర్వాలేదు. రాశికి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలో చాలా సందర్భాల్లో అర్థమైనట్టు లేదు. నాగార్జున, నితిన్‌కి తప్ప అనూప్‌ మిగతా సినిమాలకి సరైన బాణీలిచ్చేట్టు లేడు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ వేల్యూస్‌ మాత్రం బాగున్నాయి. ప్రేమకథా చిత్రానికి ఉండాల్సిన కలర్‌ అయితే దీంట్లో ఉంది. చునియా గురించి చాలా చెప్పారు కానీ ఆమె టాలెంట్‌ తెలియజెప్పే మూమెంట్‌ కనీసం ఒక్కటైనా లేకపోయింది. రిలీజ్‌కి ముందు బజ్‌ అయితే తెచ్చుకుంది కానీ బలహీనమైన కథ, కథనాలతో పడేసావే నిలబడలేకపోయింది. 

బోటమ్‌ లైన్‌: పడేసింది, పైనుంచి కిందకి!

గణేష్‌ రావూరి