దిల్ రాజు..డిస్ట్రిబ్యూటర్ గా హ్యాపీ..ఎగ్జిబిటర్ గా పిచ్చ హ్యాపీ. కానీ నిర్మాతగానే పాపం గత కొంతకాలంగా హ్యాపీగా లేడు. దిల్ రాజు బ్యానర్ వాల్యూ నానాటికీ తీసికట్టు అన్నట్లుగా వుంది. పోనీ ఎందుకు ఆ బాధ, డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు వస్తున్నాయి..ఎగ్జిబిటర్ గా మనీ మింట్ చేస్తున్నట్లే వుంది అని ఊరుకోలేకపోతున్నాడు. సరైన భారీ సినిమా తీయాలని తెగ తాపత్రయ పడుతున్నాడు.
ఎన్టీఆర్ మీద ఓ రుమాలు వేసి వుంచాడు. పవన్ తో తీయాలనే కోరికను బాహాటంగానే చాలా సార్లు వెల్లడించాడు. రవితేజతో ఒకటి ప్లాన్ చేసాడు. అయినా సరైన ప్రాజెక్టు మెటీరియలైజ్ కావడం లేదు. ఈ చిన్న చిన్న సినిమాలు తీస్తుంటే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ లేదా లాస్ ఎక్కువ అన్నట్లు వుంది.
ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ సినిమా దక్కించుకోవాలని కిందా మీదా పడుతున్నట్లు వినికిడి. సుకుమార్ అంటే తన బ్యానర్ లో ఆర్య నే గుర్తుకు వస్తుందని, అందువల్ల ఈ సినిమా నిర్మించే ఛాన్స్ తనకు ఇవ్వాలని రామ్ చరణ్ పై అన్ని వైపుల నుంచి తన మొహమాటాలు వాడుతూ తెగ వత్తిడి చేస్తున్నాడని వినికిడి.
అయితే దర్శకుడు సుకుమార్ మైత్రీ మూవీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. అందువల్ల వాళ్లకే చేస్తాను అంటున్నాడట. సో..సుకుమార్ కావాలి అంటే రామ్ చరణ్ ఆ సినిమాను మైత్రీకే చేయాలి. కానీ దిల్ రాజు తెగ వత్తిడి తెస్తున్నాడట రామ్ చరణ్ పై. మరో పక్క సుక్కూను వప్పించే ప్రయత్నం కూడా మొదలెట్టినట్లు వినికిడి.
ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.