సినిమా రివ్యూ: క్షణం

రివ్యూ: క్షణం రేటింగ్‌: 3/5 బ్యానర్‌: పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: అడివి శేష్‌, అదా శర్మ, అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, సత్యదేవ్‌, బేబీ డాలీ తదితరులు కథ:…

రివ్యూ: క్షణం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: అడివి శేష్‌, అదా శర్మ, అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, సత్యదేవ్‌, బేబీ డాలీ తదితరులు
కథ: అడివి శేష్‌
కథనం: అడివి శేష్‌, రవికాంత్‌ పేరేపు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కూర్పు: అర్జున్‌ శాస్త్రి, రవికాంత్‌ పేరేపు
ఛాయాగ్రహణం: షానీల్‌ డియో
నిర్మాతలు: పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే
దర్శకత్వం: రవికాంత్‌ పేరేపు
విడుదల తేదీ: ఫిబ్రవరి 26, 2016

'క్షణం' ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయినప్పుడే ఆసక్తి కలిగించింది. ఇక ట్రెయిలర్‌తో 'చూడాల్సిన సినిమా' అనే భావన రేకెత్తించింది. ఒక ట్రెయిలర్‌లో రెండు నిమిషాల్లో 'ఏదో ఉంటుంది' అనే ఫీలింగ్‌ తెప్పించడం అంత కష్టమైన విషయమేం కాదు, కానీ ఒక సినిమాలో రెండు గంటల పాటు 'ఏం జరిగింది' అనే మిస్టరీని మెయింటైన్‌ చేయడం మాత్రం అనిపించినంత ఈజీ అయితే కాదు. స్టార్స్‌ ఉన్న సినిమాల్లో విషయం లేకపోయినా చివరి వరకు కూర్చోపెట్టవచ్చు. పాటలనీ, ఫైటులనీ, కామెడీ అనీ ఏదో రకంగా కాలక్షేపం చేయవచ్చు. కానీ స్టార్‌ లేని సినిమాకి థియేటర్‌ వరకు ప్రేక్షకుడిని రప్పించడానికి పబ్లిసిటీ గిమ్మిక్స్‌ వాడుకోవచ్చు, కానీ కదలకుండా చివరి వరకు కూర్చోపెట్టాలంటే మాత్రం కంటెంట్‌ లేకుండా కుదరదు. 

హీరోగా ఇంతకుముందు కూడా శేష్‌ కొన్ని ప్రయత్నాలు చేసాడు కానీ హాఫ్‌ హార్టెడ్‌ అటెంప్ట్స్‌తో సక్సెస్‌ కాలేకపోయాడు. కానీ ఈసారి హీరోగా నిలబడ్డానికి కావాల్సిన సపోర్ట్‌ రచయితగా తనకు తానే అందించాడు. కథగా చెప్పుకుంటే క్షణంలో ఉన్నది చిన్న పాయింటే. ఒక చిన్న పాప కిడ్నాప్‌ అవుతుంది, పాప ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆ తల్లి తన మాజీ ప్రియుడి సాయం కోరుతుంది. ఈ పాయింట్‌ని క్షణక్షణం ఆసక్తి రేకెత్తించేలా చెప్తేనే సక్సెస్‌ అవుతుంది. ఆ పాప అసలు ఉందా, లేదా? నిజంగా కిడ్నాప్‌ అయిందా, కాదా? లేకపోతే ఉందని ఆమె తల్లి ఎందుకు చెప్తున్నట్టు? ఒకవేళ ఉంటే ఆ పాపని కిడ్నాప్‌ చేసి మాయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నట్టు? ఏం జరిగిందనేది తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించడం ఒకెత్తు. ఏం జరిగి ఉంటుందో మనమే గెస్‌ చేస్తూ ట్రావెల్‌ చేయడం ఇంకా గ్రేటు. స్క్రీన్‌ప్లే పరంగా 'క్షణం'కి పక్కా ఫౌండేషన్‌ పడింది. దాంతో ఈ కథని నడిపించడానికి స్టార్ల అవసరమే లేకుండా పోయింది. 

అడివి శేష్‌ ఇందులో హీరోనే కానీ ఎక్కడా హీరోలా కనిపించడు. పెద్ద పెద్ద ఫీట్లు చేసేయడం, పాప ఆచూకీ కనుక్కోవడానికి షెర్లాక్‌ హోమ్స్‌లా చిన్న చిన్న పాయింట్స్‌ పట్టుకుని ఛేధించుకుంటూ వెళ్లిపోవడం చేయడు. ఒకానొక టైమ్‌లో అతను కూడా హీరోయిన్‌ని అందరిలానే అనుమానిస్తాడు. అతని పాత్ర సంకల్ప బలంతో ముందుకి సాగుతున్నట్టే ఉంటుంది తప్ప సగటు సినిమా హీరోలా అనిపించదు. అభినయానికి అవకాశమున్న పాత్ర అయినా అదా శర్మ ఎమోషనల్‌గా కదిలించలేకపోయింది. ఇంకా ఎక్స్‌ప్రెసివ్‌ యాక్ట్రెస్‌ని ఎంచుకుని ఉండాల్సింది. అనసూయ క్యారెక్టర్‌కి అనుగుణంగా చేసింది. పతాక సన్నివేశాల్లో రాణించింది. సత్యం రాజేష్‌కి ఇది చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌. బాగా చేసాడు. వెన్నెల కిషోర్‌ది సపోర్టింగ్‌ క్యారెక్టర్‌. సపోర్ట్‌ చేసాడు. 

దర్శకుడు తన టెక్నికల్‌ టీమ్‌తో బాగా పని చేయించుకున్నాడు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణంతో పాటు అబ్బూరి రవి సంభాషణలు కూడా బాగా కుదిరాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ, ప్రస్తుతంలో కిడ్నాప్‌ మిస్టరీని స్పేస్‌డ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ టెక్నిక్‌తో చెప్పుకుంటూ వచ్చారు. లవ్‌స్టోరీ ఫ్రెష్‌గా ఉండుంటే ఈ సినిమాకి ఇంకాస్త నిండుదనం వచ్చేది. గతంలోని సీన్స్‌ అన్నీ వర్తమానంలోని మూడ్‌కి అవుట్‌ ఆఫ్‌ సింక్‌లో ఉండడంతో ఆ ట్రాన్సిషన్‌ స్మూత్‌గా జరగలేదు. అసలే లవ్‌స్టోరీ బోరింగ్‌గా ఉందంటే అవసరం లేని పాటలు పెట్టడం వల్ల కథనం మరింత జోరు తగ్గి ఆ కాసేపు కథ కదల్లేదు. ప్రథమార్థంలో పాప మిస్సింగ్‌ డ్రామా, అసలు పాప ఉందా లేదా అనేది విద్యాబాలన్‌ 'కహానీ' (తెలుగులో అనామిక) చిత్రాన్ని తలపిస్తుంది. ఫస్ట్‌ గేర్‌లో స్టార్ట్‌ చేసి నెమ్మదిగా గేర్లు మార్చుతూ వెళ్లినట్టుగా ఉండుండి వేగం పెరిగి 'క్షణం' ముందుకి సాగేకొద్దీ ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. ఎవరు చేసారనేది తెలిసినా, ఎందుకు చేసారనే ప్రశ్నలకి దాదాపుగా చివరి క్షణాల వరకు సమాధానాలివ్వకపోవడం వల్ల సస్పెన్స్‌ బాగా మెయింటైన్‌ అయింది. 

కాకపోతే కిడ్నాప్‌ వెనుక కారణాలని బలంగా, లాజికల్‌గా, నమ్మశక్యంగా చూపిస్తే మరింత బాగుండేది. ఇందులో చూపించిన కారణాలు పూర్తిగా కన్విన్స్‌ చేయలేకపోయాయి. స్టార్స్‌ లేకపోవడం వల్ల ముందేమి జరుగుతుందనేది ఊహించడం కష్టమవుతుంది కనుక ట్విస్టులకి బాగా ఎక్సయిట్‌ అవుతారు. లోపాలున్నా కానీ సినిమాకి వెళ్లిన వారు ఖచ్చితంగా ఇన్‌వాల్వ్‌ అయి చివరి వరకు ఉత్కంఠగా ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ఎదురు చూస్తారు. కొన్ని సినిమాలకి నిలబడి క్లాప్స్‌ కొట్టక్కర్లేదు… చివరి వరకు కదలకుండా కూర్చోవడమే పెద్ద సెల్యూట్‌. తమ కథనంతో జనాన్ని కూర్చోబెట్టిన అడివి శేష్‌, రవికాంత్‌ పేరేపుకి హార్టీ కంగ్రాట్స్‌.

బోటమ్‌ లైన్‌: క్షణక్షణం ఉత్కంఠభరితం!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri