అనసూయ.. అటు బుల్లితెర ప్రేకకులకు, ఇటు సినీ ఫ్యాన్స్ కు యమ కిక్కిచ్చే పేరు ఇది. ఇంత కాలం బుల్లితెరపై దున్నేస్తూ వచ్చిన అనసూయ సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో వెండితెరపై కూడా తన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించగా సినిమాలు వచ్చేసే సమయమొచ్చేసింది. మరి ఈ స్థాయికి ఎదిగిన అనసూయ 'ఎక్స్ ట్రా' కూడా నటించిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
జూనియర్ ఆర్టిస్టులనే ఎక్స్ ట్రాలుగా వ్యవహరిస్తారు సినీ ఇండస్ట్రీలో. అంటే.. గుంపులో గోవిందలుగా తెరపై కనిపిస్తారే వాళ్లే. డైలాగులు లేకుండా హీరో, హీరోయిన్ల ఫ్రెండ్స్ పాత్రల్లో.. బ్యాక్ గ్రౌండ్ లో జనాల గుంపులో ఒకరిగా కనిపించే వాళ్లను ఎక్స్ ట్రాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి పాత్రను అనసూయ చేసింది. అది 'నాగ' సినిమాలో.
కాలేజీ నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో విద్యార్థుల ట్రూప్ లో అనసూయ కనిపిస్తుంది. డైలాగులేమీ లేకుండా కామెడీయన్లు సునీల్, శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ల డైలాగులకు రెస్పాండ్ అయ్యే గుంపులో అనసూయ కనిపిస్తుంది. కొంచెం క్లోజప్ లో కనిపించడం ఆమెకు అప్పటికి దక్కిన అదృష్టం.
మరి ఎక్స్ ట్రా స్థాయి నుంచి ప్రధాన పాత్ర స్థాయికి రావడం గొప్ప కథే కదా. అంతే కాదు.. అనసూయ కు బాగా ఫేమ్ రావడానికి పూర్వం జగన్ కు చెందిన 'సాక్షి' టీవీలో న్యూస్ యాంకర్ కూడా పనిచేసింది. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ ప్రముఖ యాంకర్ స్వప్నతో కలిసి అప్పట్లో అనసూయ ఒక ప్రోగ్రామ్ చేసింది. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్ గా బిజీ అయ్యే దశలో ఆమె న్యూస్ యాంకర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టింది.