ఫ్యాషన్ డిజైనర్ చెట్టెక్కాడా?

ఫ్యాషన్ డిజైనర్..చాలా కాలంగా వినిపిస్తున్న సినిమా పేరు. సీనియర్ దర్శకుడు వంశీ సూపర్ హిట్ మూవీ లేడీస్ టైలర్ కు సీక్వెల్. ఈ స్క్రిప్ట్ రచయిత తనికెళ్ల భరణి రెడీ చేసారని, అది సూపర్…

ఫ్యాషన్ డిజైనర్..చాలా కాలంగా వినిపిస్తున్న సినిమా పేరు. సీనియర్ దర్శకుడు వంశీ సూపర్ హిట్ మూవీ లేడీస్ టైలర్ కు సీక్వెల్. ఈ స్క్రిప్ట్ రచయిత తనికెళ్ల భరణి రెడీ చేసారని, అది సూపర్ అనీ టాక్ వినవచ్చింది అప్పట్లో. ఆఖరికి అదే అలా వుండిపోయింది. 

ఇటీవల మళ్లీ ఈ వ్యవహారం కదిలింది. నిర్మాత అమ్మిరాజు దగ్గర వున్న ఈ సినిమా స్క్రిప్ట్ హక్కులను నిర్మాత మధుర శ్రీధర్ తీసుకుని, సీనియర్ దర్శకుడు వంశీకి, హీరో రాజ్ తరుణ్ కు అడ్వాన్స్ లు పే చేసారు. సినిమా చేయడం వరకు ఓకె..కానీ స్క్రిప్ట్ బాగుండాలని హీరో రాజ్ తరుణ్ అనడంతో, వంశీ స్క్రిప్ట్ పై కసరత్తు ప్రారంభించారు. కానీ ఓ కొలిక్కి రాలేదు.

దాంతో మరో రచయిత మచ్చ రవికి కూడా అడ్వాన్స్ ఇచ్చి రంగంలోకి దింపారు. ఇద్దరు కలిపి స్క్రిప్ట్ వండడం ప్రారంభించినా, అది కుదరలేదని వినికిడి. దాంతో రాజ్ తరుణ్ తను సినిమా చేస్తాను కానీ, మంచి స్క్రిప్ట్ తెచ్చుకుంటేనే అని ఖరాఖండీగా చెప్పేసాడు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై మధుర శ్రీధర్ యాభై లక్షల వరకు ఖర్చు చేసేసారని వినికిడి. ఇదిలా వుంటే ఈవారం అదే వంశీ అందించిన వెన్నెల్లో హాయ్ హాయ్ విడులైంది. థియేటర్ల దగ్గర కర్ఫ్యూ పెట్టినట్లుంది వ్యవహారం. పిట్ట మనిషి వుంటే ఒట్టు. మరి వంశీ క్రేజ్ అలా పాతాళంలోకి పడిపోతే, ఫ్యాషన్ డిజైనర్ చేయడానికి ఏ హీరో ముందుకు వస్తారు? అంటే మధుర శ్రీధర్ వంశీకి, మచ్చ రవికి ఇచ్చిన అడ్వాన్స్ లు ఇక ఫ్యాషన్ డిజైనర్ పాలేనా?