ఎమ్బీయస్‌: గుండెలు తీసిన మొనగాడు – 1

అగాథా క్రిస్టీ పేరుమోసిన క్రైమ్‌ నవలా రచయిత్రి. ఇంగ్లీషులో ఆవిడ రాసిన నవలలు జగద్విఖ్యాతం. వాటిలో ఒకటి – '..అండ్‌ దెన్‌ దేర్‌ వర్‌ నన్‌' ('టెన్‌ లిటిల్‌ నిగ్గర్స్‌' అనే యింకో పేరు…

అగాథా క్రిస్టీ పేరుమోసిన క్రైమ్‌ నవలా రచయిత్రి. ఇంగ్లీషులో ఆవిడ రాసిన నవలలు జగద్విఖ్యాతం. వాటిలో ఒకటి – '..అండ్‌ దెన్‌ దేర్‌ వర్‌ నన్‌' ('టెన్‌ లిటిల్‌ నిగ్గర్స్‌' అనే యింకో పేరు కూడా వుంది). దాని ఆధారంగా హాలీవుడ్‌లో 1945లో (దాని పోస్టర్‌ యిక్కడ చూడవచ్చు), 1965లో, 1974లో సినిమాలు వచ్చాయి. ఆ నవలను ఆధారం చేసుకుని 1965 లో హిందీలో ''గుమ్‌నామ్‌'' అనే సినిమా తీశారు. ఆ థీమ్‌ను యితర భాషా చిత్రాల్లో అక్కడక్కడ వాడుకున్నారు. మన తెలుగులో ''గుండెలు తీసిన మొనగాడు'' అనే 1974 నాటి సినిమాలో కొంతమేరకు వాడుకున్నారు. ఆ కథా కమామీషూ చెప్పుకునేముందు మొదట ఇంగ్లీషు నవలను, హిందీ సినిమాను పోలుస్తూ కాస్త చెపుతాను.

కొన్ని రకాల నేరాలు వుంటాయి. అవి చట్టానికి దొరకవు. ఉదాహరణకి ఓ ముసలాయన వద్ద పనివాళ్లున్నారు. వేళకి మందు యివ్వడం వాళ్ల పని. వాళ్ల సేవకి మెచ్చి ఆయన తన విల్లులో కొంత ఆస్తి వాళ్ల పేర రాశాడు. కానీ ఆయన ఎంతకీ చావటం లేదు. పనివాళ్లకు దురాశ పుట్టింది. ఓ రోజు వేళకు మందివ్వలేదు. ఆయన చచ్చిపోయాడు. దీనిమీద కేసు పెడితే నిలుస్తుందా? వాళ్లు సమయానికి మందిచ్చారో లేదో ఎవరు కనిపెట్టగలరు? ఇలాటివాళ్లకు శిక్ష పడదు కదా! ఇలాటి కేసులు కొన్ని సేకరించిన ఓ జడ్జి గారు వీళ్లందరినీ శిక్షించాలనుకున్నాడు. ఎవరో పంపించినట్టు ఆహ్వానాలు పంపించి అందర్నీ ఓ దీవిలో సమీకరించాడు. ఓ బంగళాలో బస చేయించాడు. అది నిర్జనమైన దీవి. వీళ్లు తప్ప ఎవరూ లేరు. అక్కడ వీళ్ల పాపాల చిట్టా వినిపించాడు. అందరూ ఒక్కొక్కరీతిలో చావడం ఖాయమని సూచించాడు. దీన్ని హిందీ సినిమాలో కాస్త మార్చి చూపించారు.

ఓ క్లబ్‌ సిల్వర్‌ జూబిలీ ఫంక్షన్‌తో సినిమా ప్రారంభమైంది. ఏడుగురు లక్కీ డ్రా విన్నర్స్‌కి రెండు వారాల ఫారిన్‌ ట్రిప్‌ వుచితం అని ఎనౌన్సు చేశారు. ఆ లక్కీ డ్రా గెలుపొందినవారు ఫలానా ఫలానా అని చెప్పారు. మర్నాడు విమానం బయలుదేరింది. అయితే మధ్యలో ట్రబుల్‌ వచ్చి ఓ నిర్జనమైన దీవి దగ్గర ఆగింది. రెండుగంటల్లో రిపేరు చేస్తాం కాస్త దిగండి అని చెప్పి అందరూ దిగాక తుర్రుమని ఎగిరిపోయింది. అయితే వీళ్లతో బాటు వాళ్ల స్టీవార్డ్‌ కూడా దిగడిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందో నాకేం తెలియదు అన్నాడు. అందరూ కలిసి వెతికితే ఓ యిల్లు దొరికింది. ఆ యింట్లో ఓ బట్లర్‌ కూడా వున్నాడు. వారం రోజులనుండి మీకోసం ఎదురుచూస్తున్నానన్నాడు. మీరు వస్తారని చెప్పి నాకెవరో లెటరు రాసి పంపారన్నాడు. అక్కడో బుక్‌ వుంది. ఆ బుక్‌ తీసి ఆ స్టీవార్డ్‌ చదవడం మొదలెట్టాడు. మీరందరూ హంతకులే. మీరు ఈ దీవి వదిలిపోలేరు అని రాశాడు ఆ పుస్తకంలో. అందరూ హడిలిపోయారు. ఇక అక్కణ్నుంచి హత్యాకాండ మొదలైంది. ఒక్కొక్కరిగా రాలిపోవడం మొదలెట్టారు. బతికున్నవాళ్లకు ఒకరిపై మరొకరికి అనుమానం.

ఇంగ్లీషు నవలలో అక్కడో పద్యం వుంటుంది, మొదటివాడు యిలా ఛస్తాడు, రెండోవాడు యిలా ఛస్తాడు అని రాసి వుంటుంది. అలాగే పోతూ వుంటారు. అందరూ భీతితో తల్లడిల్లి పోతూ వుంటారు. హంతకుడు తమలో ఒకడు అని తెలుసు. కానీ ఎవరో తెలియదు. కొన్ని రోజులకు అందరూ చచ్చిపోతారు. అందరికంటె ఎక్కువ నేరం చేసినామె చివరిదాకా వుండి నానా హింసా పడి ఛస్తుంది. అందుకే పుస్తకం పేరు 'అండ్‌ దెన్‌… దేర్‌ వర్‌ నన్‌'. ఈ కథలో డిటెక్టివ్‌ లేడు, పరిశోధనా లేదు. మరి మిస్టరీ ఎలా బయటపడుతుంది? అదో తమాషా. ఒక్కొక్కళ్లకూ  ఉత్తరాలు రావడంతో నవల  ప్రారంభమౌతుంది. చివరిలో అందరూ చచ్చిపోతారు. ఎవరు యిదంతా చేశారో తెలియదు. అయితే కొన్నాళ్లకు ఓ సీసా ఓ వూళ్లో నది ఒడ్డుకు కొట్టుకుని వస్తుంది. దానిలో జడ్జి గారు రాసిన కన్ఫెషన్‌ లెటర్‌ వుంటుంది. తన వుద్దేశం యిదనీ, వీళ్లందరినీ యీ విధంగా శిక్షించాననీ, చివరిలో ఆత్మహత్య చేసుకున్నాననీ రాస్తాడు. దానివల్ల మనకు మిస్టరీ విడిపోతుంది. అయితే అతను వాళ్ల మధ్యలో వుంటూనే వాళ్లను ఎలా చంపగలిగాడు? తనపై అనుమానం రాకుండా ఎలా చేసుకోగలిగాడు? దానికో ట్రిక్‌ వుంది. హిందీలో కూడా దాన్ని అలాగే పెట్టారు. 

ఇంగ్లీషు నవలలో హీరో లేడు, హీరోయిన్‌ లేదు. అందరూ విలన్‌లే! మన భారతీయ సినిమాలో అలా ఎలా కుదురుతుంది? హీరో హీరోయిన్లను పెట్టి చచ్చినట్టు వాళ్లను బతికించారు. మిగతా చెడ్డవారందరూ చస్తారు. హీరోయిన్‌ పాత్రధారిణి నందా. ఆమె పినతండ్రి హత్య చుట్టూ యీ మిస్టరీ తిరుగుతుంది. నందా పినతండ్రి సేఠ్‌ సోహన్‌లాల్‌. అతని హత్య జరిగింది. ఆ హత్య వెనకాల అనేకమంది వున్నారు – ఒకళ్లకు తెలియకుండా మరొకరు హత్యకు దోహదపడ్డారు. అతని సెక్రటరీ హెలెన్‌. అతని విల్లు తయారు చేసిన లాయర్‌ ప్రాణ్‌. డెత్‌ సర్టిఫికెట్‌ యిచ్చిన డాక్టర్‌ మదన్‌ పురి. లారీతో గుద్దేసిన డ్రైవర్‌ మన్‌మోహన్‌..యిలా. వీళ్లందరినీ కోఆర్డినేట్‌ చేసిన ఖన్నాను ఎవరో వచ్చి కాల్చేశారు.అలా కాల్చేసినది విలన్‌. నిజానికి సోహన్‌లాల్‌, ఖన్నా, యీ విలన్‌ ముగ్గురూ కలిసి స్మగ్లింగ్‌ వ్యాపారం చేశారు. సోహన్‌లాల్‌, ఖన్నా కలిసి విలన్‌ను ఏమార్చి జైలుకి పంపారు. అతని వాటా కొట్టేశారు. అతని చెల్లెల్ని రేప్‌ చేశారు. అతను పగ తీర్చుకుందామని జైలునుండి పారిపోయి వచ్చాడు. ఈ లోగా ఖన్నా సోహన్‌లాల్‌ను చంపాడు. ఇప్పుడు విలన్‌ ఖన్నాను చంపేశాడు.

ఆ తర్వాత అందర్నీ యీ దీవికి తీసుకుని వచ్చాడు. సోహన్‌లాల్‌ విల్లు ప్రకారం వారసత్వంగా ఆస్తి దక్కిన హీరోయిన్‌ను చంపాలి. దానికి ముందు హత్యలో పాలు పంచుకున్న ఒక్కొక్కరినీ చంపడం మొదలెట్టాడు. ఒకరిమీద మరొకరికి అనుమానం వచ్చేట్టు చేశాడు. తను కూడా శర్మాజీ పేరుతో ముసలివాడి వేషంలో వచ్చి గుంపులో కలిశాడు. ఇలా హత్యలు జరుగుతూ పోయాయి. విలన్‌ ప్లాను చేయని అతిథి ఎవరంటే – హీరో. పాత్రధారి మనోజ్‌ కుమార్‌. అతను డిటెక్టివ్‌. సోహన్‌లాల్‌ హత్యను పరిశోధిస్తూ ఈ విమానంలో స్టీవార్డ్‌గా వచ్చి చేరాడు. ఇది ఇంగ్లీషు నవలలో లేని పాత్ర. ఇదే కాకుండా బట్లర్‌ పాత్ర కూడా వుంది. నవలలో యితను, యితని భార్య కూడా హంతకులే. అందువల్ల వాళ్లూ చనిపోతారు. ఇక్కడ బట్లర్‌ పాత్రను హాస్యానికి వాడుకున్నారు. పాత్రధారి మెహమూద్‌. ఇతను వస్తూ వస్తూ తన పిచ్చి చెల్లెల్ని వెంటపెట్టుకుని వచ్చాడు. ఆమె అస్తమానూ 'గుమ్‌నామ్‌ హై కోయీ..' అనే టైటిల్‌ సాంగ్‌ పాడుతూ అందర్నీ అడలగొడుతూ వుంటుంది. వాతావరణమంతా 'యీరీ'గా, భయం కొలుపుతూ వుంటుంది. ఎప్పుడు ఎవరికి మూడుతుందో తెలియదు. మధ్యలో హెలెన్‌, ప్రాణ్‌ రొమాన్సు, హీరో హీరోయిన్ల రొమాన్సు ఒకటి. 

తన ప్లాను అమలు చేయడానికి విలన్‌ ఏం చేశాడంటే డాక్టర్‌తో ఓ ఐడియా చెప్పాడు – 'నేను చనిపోయినట్టు నటిస్తాను. నువ్వు డాక్టర్‌వి కాబట్టి నేను చనిపోయానని కన్‌ఫమ్‌ చేయి. అప్పుడు నేను ఎక్కడో దాక్కుని హంతకుడు ఎవరో కనిపెడతాను' అన్నాడు. డాక్టర్‌ సరేనన్నాడు. ఇతను ఆ తర్వాత విలన్‌ డాక్టర్‌ను చంపేశాడు. ఆ రహస్యం ఎవరికీ తెలియలేదు. ఈ విషయం మనకు చివరిలో తెలుస్తుంది. అప్పటిదాకా శర్మాజీ చనిపోయాడనే మనమూ అనుకుంటాం. అదీ సస్పెన్స్‌. ఈ మధ్యలో హత్యలు జరుగుతూ పోయాయి. తను పెళ్లి చేసుకుందామనుకున్న హెలెన్‌ చనిపోవడంతో ప్రాణ్‌కు పిచ్చెక్కింది. నీ ప్రియుడే నా ప్రేయసిని చంపాడు. అందుకని నిన్ను బలాత్కారం చేసి చంపేస్తా అంటూ హీరోయిన్‌పై పడ్డాడు. అంతలో అతని వీపులో రెండు కత్తులు దిగాయి. నందాను ఎవరో వచ్చి భూగృహంలోకి తీసుకెళ్లారు. ఆమెను వెంటాడుతూ వెళ్లిన తను డిటెక్టివ్‌నని చెప్పుకున్నాడు. విలన్‌తో ఫైట్‌ చేశాడు. కానీ విలన్‌ యిద్దర్నీ కట్టిపడేసి తన కథంతా చెప్పాడు. చివరకు బట్లర్‌ సహాయంతో హీరో రక్షింపబడ్డాడు. చివరిలో విమానంలో వచ్చి పోలీసులు దిగారు, విలన్‌ను తీసుకుని పోయారు. ఈ విధంగా కథ సుఖాంతం అయింది. ఈ సినిమాకు డైరక్టర్‌ రాజా నవాథే. సంగీతం శంకర్‌-జైకిషన్‌. పాటలు చాలా హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌! (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]