అనుపమ్ ఖేర్.. మోడీ భక్తుల్లో సెలబ్రిటీ! ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకా ఆయన చేస్తున్న పలు పనులు వివాదాస్పదం అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి మోడీకి గట్టి మద్దతుదారు అయిన ఖేర్.. తన భక్తిని అనేక రకాలుగా చాటుకొంటున్నాడు. మంచి నటుడిగా పేరు పొందిన ఖేర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా మొదట్లో మోడీకి అనుకూల ట్వీట్లు పెట్టేవాడు. ఆ మధ్య దేశంలో అసహనం ఎక్కువవుతోంది అని కొంతమంది మేధావులు తమ అవార్డులు వెనక్కు ఇచ్చిన సమయంలో.. అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక ర్యాలీ జరిగింది. అసహనం ఎక్కువవుతోందన్న మేధావుల తీరుపై నిరసనగా ఖేర్ ఈ ర్యాలీని చేపట్టారు. ఆ ర్యాలీ విజయవంతం అయ్యిందని ప్రకటనలు వచ్చిన కొన్ని గంటల్లోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. అక్కడ బీజేపీ ఓటమిపాలవ్వడంతో ఖేర్ అంతకు మించి హల్ చల్ చేయలేకపోయారు!
ఆ సంగతలా ఉంటే… ఇప్పుడు ఖేర్ భలే దొరికిపోయాడు. తాజాగా పద్మ అవార్డు పొందిన ఖేర్ గతంలో ఇవే అవార్డుల విషయంలో చేసిన వ్యాఖ్యానాలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. పద్మ అవార్డులు పూర్తిగా రాజకీయం అయిపోయాయని.. ఇలాంటి అవార్డులు ఇవ్వడం ఎలాంటి శాస్త్రీయతా లేదని, అర్థం లేకుండా వీటి ప్రదానం జరుగుతోందని ఖేర్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఒక ట్వీట్ పెట్టారు.
ఏ అవార్డుల ప్రదానం అయితే అర్థం లేకుండా తయారైందని ఖేర్ విమర్శించారో.. అలాంటి అవార్డునే ఇప్పుడు ఆయన పొందారు! అంతేనా.. ఇప్పుడు కొత్త ట్వీటు కూడా పెట్టాడు. ఈ అవార్డు రావడం తనకు గర్వకారణమని.. తన జీవితంలోనే గొప్ప అచీవ్ మెంట్ అని..భారత ప్రభుత్వం నుంచి తనకు దక్కిన ఈ అవార్డు అమితానందాన్ని కలిగిస్తోంది ఖేర్ చెప్పుకొచ్చాడు. అంటే గతంలో పద్మ అవార్డుల ప్రకటన వస్తే..అది రాజకీయం, అదే తనకు అవార్డు వచ్చినప్పుడు మాత్రం పద్మ అవార్డులు గొప్ప హానర్!
ఈ విధమైన ద్వంద్వ పలుకులతోనే మోడీ భక్తులు విమర్శల పాలవుతున్నారు. ఈ సారి పద్మ అవార్డుల ప్రదానం కూడా రాజకీయాలకు మినహాయింపు కాదని.. అవార్డుల జాబితాను చూస్తుంటే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను చూస్తున్నట్టుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఖేర్ లాంటి వాళ్లు ఇలా మాట్లాడటం చోద్యం. మొత్తానికి పద్మ అవార్డుల ప్రకటన తీరు.. మోడీ ప్రభుత్వాన్ని, ఆయన మద్దతు దారులను మరింత పలుచన చేసినట్టుంది!