హమ్మయ్యా.. సానియా, సైనాల గొడవ ఉండదులే!

పద్మ అవార్డుల కమిటీ తమకు వచ్చిన సిఫార్సుల విషయంలో కేవలం ఆయా వ్యక్తుల ప్రతిభా పాటవాలనే కాదు… ఇతర సమీకరణాలను కూడా బాగానే లెక్కలేసి ఎంపికలు చేసినట్టుగా ఉంది. ఎవరెవరకి ఏ అవార్డులను ఇవ్వాలి..…

పద్మ అవార్డుల కమిటీ తమకు వచ్చిన సిఫార్సుల విషయంలో కేవలం ఆయా వ్యక్తుల ప్రతిభా పాటవాలనే కాదు… ఇతర సమీకరణాలను కూడా బాగానే లెక్కలేసి ఎంపికలు చేసినట్టుగా ఉంది. ఎవరెవరకి ఏ అవార్డులను ఇవ్వాలి.. ఎవరికి ఏ అవార్డు ఇస్తే ఇంకెవరికి ఏ అవార్డు ఇవ్వాలి.. ఎవరికి ఏ అవార్డు ఇస్తే.. ఎవరు ఫీలవుతారు, ఎవరెవరికి సమన్యాయం చేయాలి.. అనే అంశాలను కేంద్ర ప్రభుత్వం బాగానే అధ్యయనం చేసినట్టుగా ఉంది. అవార్డుల ఫలితాల్లోనే ఈ సమన్యాయం కనిపిస్తోంది!

ఇటు సైనా నెహ్వాల్ ను, ఇటు సానియా మీర్జాను పద్మభూషన్ అవార్డుతో సత్కరించారు. షటిల్ లో ఒకరు, టెన్నిస్ లో మరొకరు దూసుకుపోతున్న ఈ ఇద్దరికీ సమాన స్థాయి అవార్డును ఇచ్చారు. ఇది వరకే పద్మ శ్రీలు అయిన వీళ్లిద్దరికీ ప్రమోషన్లు ఇచ్చారు. ఇక్కడే ప్రభుత్వం తెలివితేటలు బయటపడుతున్నాయి. ఇది వరకూ ఇలాంటి క్రీడాకారుల మధ్య అవార్డుల విషయంలో రచ్చలు రేగిన విషయం దాచేస్తే దాగనిది కాదు. సానియా, సైనాల మధ్యనే ఇలాంటి రచ్చ ఒకటి జరిగింది. సానియాను ప్రభుత్వాలు బాగా ప్రోత్సహిస్తున్నాయని, తనను మాత్రం పట్టించుకోవడం లేదని ఇది వరకూ సైనానే వ్యాఖ్యానించింది. అప్పట్లో దీనిపై పెద్ద పంచాయతీనే జరిగింది. ఈ 'అసహనం' గురించి అసహనం వ్యక్తం అయ్యింది!

మరి అలాంటి పంచాయతీ మళ్లీ వద్దని అనుకున్నారో ఏమో కానీ.. ఈ సారి మాత్రం సానియా, సైనాలకు సమన్యాయం చేశారు. ఇద్దరికీ సమాన అవార్డులతో తగిన గుర్తింపును ఇచ్చారు. ఒకవేళ వీళ్లలో ఒకరికి ప్రమోషన్ ఇచ్చి మరొకరిని పెండింగ్ లో పెట్టి ఉంటే.. దానిపై పెద్ద చర్చే జరిగేది! ఒకవేళ సానియాకు మాత్రమే అవార్డును ఇచ్చి ఉంటే.. బీజేపీ ప్రభుత్వం కూడా మైనారిటీ మెహర్బానీ రాజకీయాలు చేస్తోంది… సైనాను పట్టించుకోవడం లేదు.. అనే విమర్శలు వచ్చేవి. అలాగాక సానియాను పక్కనపెట్టి ఉంటే.. మైనారిటీలకు అంతకు మించిన ద్రోహం లేదు, మోడీ ప్రభుత్వ అ సహనానికి ఇంతకు మించిన రుజువు లేదు అని విరుచుకుపడేవాళ్లు. అందుకే.. ఇద్దరికీ ఇచ్చారు. అవార్డుల విషయంలో సామాజికన్యాయం, సమాన్యాయం పాటించారు. అయితే ఇలాంటి లౌక్యం అవార్డు స్థాయిని దిగజారిస్తే మాత్రం నష్టం ఎవరికి?!