ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు 25

జవాబులు – స్కాట్లండ్‌ చరిత్ర గురించి నేను రాసినది ఒకాయన సందేహించారు. ఇంగ్లండు స్కాట్లండ్‌ను ఎన్నడూ జయించలేదని ఆయన విన్నారట. సామాన్య స్కాట్లండ్‌ ప్రజల హృదయాలు గెలవలేదని కవితాత్మకంగా చెప్పినది విన్నారు కాబోలు. నేను…

జవాబులు – స్కాట్లండ్‌ చరిత్ర గురించి నేను రాసినది ఒకాయన సందేహించారు. ఇంగ్లండు స్కాట్లండ్‌ను ఎన్నడూ జయించలేదని ఆయన విన్నారట. సామాన్య స్కాట్లండ్‌ ప్రజల హృదయాలు గెలవలేదని కవితాత్మకంగా చెప్పినది విన్నారు కాబోలు. నేను రాసినదంతా చరిత్రే. స్కాట్లండ్‌లో కొందరు వీరులు తిరుగుబాటు చేస్తూండగా అధికాంశం సామంతరాజులు ఇంగ్లండుకు విశ్వాసపాత్రులుగా వున్న మాట వాస్తవమే. 

రోమన్‌ సార్వభౌముల కథ చాలా రసవత్తరంగా వుంటుంది. స్కాట్లండ్‌ కథలన్నీ వీరత్వంతో, శూరత్వంతో కూడినవి. రోమ్‌ పాలకుల కథలు శూరత్వంతో పాటు రాజకీయాలు, ఎత్తుపైయెత్తులు, కుట్రలు, హత్యలతో కూడినవి. తక్కిన దేశాల్లో రాజుల పాలన కాబట్టి మహా అయితే వారసత్వపు తగాదాలు, తిరుగుబాట్లు, పొరుగురాజులతో పోట్లాటలు వుంటాయి. కానీ రోమ్‌లో ప్రజాప్రతినిథులతో కూడిన సెనేట్‌ దేశంలో ప్రధాన వ్యక్తి అయిన కాన్సల్‌ను నియంత్రిస్తూ వుంటుంది. సెనేట్‌లో బలాబలాలు తారుమారయినప్పుడు పదవులు గల్లంతవడం జరిగేది. రోమన్‌ సమాజంలో ఎన్నో దొంతరలున్నాయి. వారి మధ్య ఘర్షణలుండేవి. అదృష్టవశాత్తూ రోమన్లు తమ చరిత్రను క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి నమోదు చేసి పెట్టారు. అందువలన తారీకులతో సహా రోమన్‌ చరిత్ర మనకు లభ్యమవుతోంది. రోమ్‌ అనగానే అందరికీ జూలియస్‌ సీజర్‌ గుర్తుకు వస్తాడు. అతని యుద్ధవిజయాలు, అతనికి క్లియోపాత్రాకు మధ్య నడిచిన ప్రణయం, అతని హత్య – కథాంశాలుగా అనేక నవలలు, నాటకాలు, సినిమాలు వచ్చాయి. ఆస్టెరిక్స్‌ కామిక్స్‌లో సీజర్‌ది ప్రధాన పాత్ర. రోమ్‌ గాథల్లో అతనిదే మనం విపులంగా చెప్పుకునే మొదటి కథ! 

ముందుగా రోమ్‌ నగర స్థాపకుల గురించి వున్న ఐతిహ్యం చెప్పుకుంటే బాగుంటుంది. యూరోప్‌ గాథలు – 8 లో బ్రిటన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో చెపుతూ రాశాను – 'ఈనియాస్‌ ట్రాయ్‌ వీరుడు. ట్రాయ్‌ రాజుకు వరుసకు సోదరుడైనవాడికి, వీనస్‌ అనే దేవతకు పుట్టినవాడే ఈనియాస్‌. అతను ట్రాయ్‌ యుద్ధంలో సజీవుడిగా మిగిలి, పొరుగుదేశపు రాజు ఆశ్రయం పొందాడు. అతని తరఫున అతని శత్రువైన ఇటలీ రాజుని ఓడించి, అతని కూతుర్ని పెళ్లాడి ఇటలీకి రాజయ్యాడు. రోమ్‌ నగర స్థాపకులైన రోములస్‌ సోదరులు అతని వంశజులే.' అని. ఈనియాస్‌ వారసుడైన న్యూమిటార్‌ రోములస్‌, రీమస్‌ అనే కవల సోదరులకు మాతామహుడు. మధ్య ఇటలీలో వున్న లాటియమ్‌ నగరానికి చెందిన ఆల్బా లాంగ్‌ రాజ్యానికి  రాజు. కోశాధికారిగా వుండే అతని తమ్ముడు అమూలియస్‌ కొన్నాళ్లకు న్యూమిటర్‌ను గద్దె దింపి, ఖైదు చేశాడు. అతని కొడుకులందరినీ చంపేశాడు. రియా సిల్వియా అనే కూతురు కూడా వుండడంతో ఆమెను వెస్టా దేవత ఆలయంలో పూజారిణిగా మార్చాడు. ఆ ఆలయంలో నిరంతరం మండే హోమాగ్నిని ఆరకుండా కాపాడవలసిన బాధ్యత యీ పూజారిణిది. వారు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ విధంగా అన్నగారికి ఎవరూ వారసులు లేకుండా చేశాననుకున్నాడు. అయితే విధి మరోలా తలిచింది. సిల్వియా గర్భవతి అయింది. ఆమె గర్భానికి కారకుడు మార్స్‌ దేవుడని కొందరంటారు. అబ్బే కాదు, ఎవరో బలవంతంగా చెరిచారు అంటారు కొందరు. ఏమైతేనేం, తన గర్భానికి దేవుడే కారణమని ఆమె చెప్పుకుంది. మామూలుగా అయితే పూజారిణి ఎవరితోనైనా శయనిస్తే సజీవంగా పాతిపెట్టాలి. కానీ అలా చేస్తే ఆమెను గర్భవతిని చేసిన దేవుడు తనను శపిస్తాడని భయపడిన అమూలియస్‌ ఆమెను చెరసాలలో పెట్టించి, ఆమెకు కవలలు పుట్టగానే వారిని టైబర్‌ నదిలో పడేయమన్నాడు. అలా అయితే వారిని చంపిన పాపం ప్రకృతిదవుతుంది కానీ తనది కాదని అతని వూహ. అయితే యిలాటి కథల్లో ఎప్పుడూ జరిగేట్లుగానే చంపవలసిన పనివాడికి జాలి కలిగి ఒక బుట్టలో యిద్దర్నీ పెట్టి వదిలేశాడు. 

నదిలో ఆ బుట్ట కొట్టుకుంటూ వచ్చి ఒక చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. ఆ చెట్టు పాలటైన్‌ పర్వతపాదంలో వుంది. లూపా అనే ఆడ తోడేలు యీ కవలపిల్లలను చూసి జాలిపడి పాలిచ్చి పెంచిందిట. ఆడతోడేలు చంటిపిల్లలుగా వున్న యీ సోదరులకు పాలిస్తున్న విగ్రహాలు రోమ్‌లో కనబడతాయి. వాళ్లు దొరికిన పాలటైన్‌ కొండ, దానిపై కట్టిన భవంతి కొలోజియమ్‌కు దగ్గర్లోనే, దాదాపు ఎదురుగా వుంది. తోడేలు పాలివ్వడం ఒక గొఱ్ఱెల కాపరి గమనించాడు. అతనికి పిల్లలు లేకపోవడంతో వీళ్లిద్దరినీ సాకాడు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయి పెంపుడు తండ్రి గొఱ్ఱెలను కాచేవారు. ఒకరోజు అమూలియస్‌ రాజు దగ్గర పనిచేసే గొఱ్ఱెల కాపర్లతో పేచీ వచ్చింది. రీమస్‌ను వాళ్లు బందీగా పట్టుకుపోయారు. అప్పుడు రోములస్‌ మరి కొందరు గొఱ్ఱెల కాపర్లను వెంటపెట్టుకుని వెళ్లి తమ్ముణ్ని విడిపించుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే రాజు అమూలియస్‌ను చంపివేశాడు. వాళ్లు ఫలానా అని తెలిశాక ఆ వూరి ప్రజలు వారికి రాజ్యం కట్టబెట్టబోయారు. కానీ వారు తమ తాత నిమిటార్‌నే మళ్లీ రాజుగా చేసి తమ భుజబలంతో కొత్త నగరం నిర్మించుకుంటామని చెప్పి వచ్చేశారు. ఈ కథ వింటే బలరామకృష్ణులు మేనమామను చంపి, మాతామహుడికి తిరిగి రాజ్యం కట్టబెట్టి, తాము విడిగా ద్వారను నిర్మించుకున్న కథ గుర్తుకు వస్తుంది. 

అయితే నగరం ఎక్కడ నిర్మించాలన్న విషయంపై అన్నదమ్ముల మధ్య తగాదా వచ్చింది. టైబర్‌ నది ఒడ్డున తాము దొరికిన పాలటైన్‌ కొండ మీద భవంతి కట్టి దాన్ని రాజధానిగా చేసుకుందామని రోములస్‌ అంటే, అబ్బే, కాదు ఎవెంటైన్‌ కొండ మీద కడదాం అన్నాడు రేమస్‌. రోమ్‌ నగరానికి చుట్టూ వున్న ఏడు కొండల్లోవే యీ రెండూ. టైబర్‌ నది కారణంగా ఆ నదీ తీరాల్లో జనావాసాలున్నాయి. అయితే జనావాసాల మధ్య చిత్తడినేల ఏర్పడి అవన్నీ విడివిడిగా వున్నాయి. ఏ వూరికా వూరు ఒంటరిగా వుంటూ యితరులతో పేచీ పెట్టుకునేది. ఈ ప్రాంతాల మధ్య నిలవ వున్న నీటిని బయటకు పంపించి వేసి బురదను పోగొట్టి, రహదారులు వేసి వీటన్నిటినీ కలిపి ఒక నగరంగా చేస్తే  అదే మహానగరమవుతుంది. అందరూ కలిసి గొప్ప సేనగా మారతారు. అదీ యోచన. దానికి కేంద్రస్థానంగా ఏది వుండాలి అనే దానిపై యిద్దరూ వాదించుకున్నారు. దేవుళ్లు పంపే శకునాల బట్టి స్థలాన్ని నిర్ణయిద్దామనుకున్నారు. పక్షుల రాకపోకల బట్టి ఆ రోజుల్లో శకునాలు చెప్పేవారు. ఇద్దరూ తమతమ పర్వతాల మధ్య పూజలు జరిపి పక్షులకోసం వేచివున్నారు. రీమస్‌ తను ఆరు పక్షులను చూశానని అన్నాడు. రోములస్‌ తను పన్నెండు చూశానన్నాడు.  అందుకే తనదే గెలుపన్నాడు. 'నీ కంటె నేను ముందుగా చూశాను కాబట్టి సంఖ్య తక్కువైనా నా మాటే నెగ్గాలి' అని వాదించాడు రీమస్‌. రోములస్‌ ఒప్పుకోలేదు. తను అనుకున్న చోట పునాదులు తీసి గోడలు లేపసాగాడు. తన మాట చెల్లనందుకు రీమస్‌కు కోపం వచ్చింది. రోములస్‌ కట్టే చోటకి వచ్చి గోడలెక్కి  గెంతుతూ అల్లరి చేసేవాడు, వెక్కిరించేవాడు. ఓ రోజు అలా గెంతడంలో జారిపడి చనిపోయాడంటారు, లేదు రోములస్‌ సేనానికి ఒకడికి ఒళ్లు మండి ఒక పార విసిరేస్తే అది తగిలి తల బద్దలైందంటారు, అబ్బే రోములసే చంపేశాడంటారు. ఏమైతేనేం, రోములస్‌ అతనికి సవ్యంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఇదంతా క్రీ.పూ. 753లో జరిగిందని పురాణం.

తను అనుకున్న నగరం కట్టాక రోములస్‌ తన పేరు మీదుగా రోమ్‌ అని దానికి పేరు పెట్టాడు. రోమ్‌ ఒకరోజులో కట్టబడలేదన్న ఇంగ్లీషు సామెత వుంది. అన్ని రహదారులూ రోమ్‌కే దారి తీస్తాయన్న సామెతా వుంది. ఊళ్ల మధ్య భౌగోళిక, మానసిక అవరోధాలు తొలగించి దారులు వేసుకుంటూ వచ్చారు. వేర్వేరు వూళ్ల వారిని కలుపుకు రావడానికే కాబోలు రోములస్‌ రిపబ్లిక్‌ (గణతంత్ర) వ్యవస్థను ఏర్పరచాడంటారు. ఈ గణతంత్ర వ్యవస్థ మన భారతదేశంలో కూడా వుంది. ద్వారకను పాలించినది కృష్ణుడు కాదు. అతను కులరీత్యా క్షత్రియుడే అయినా అతని పూర్వీకుడు యదుడు తన తండ్రి యయాతి శాపానికి గురై రాజ్యార్హత పోగొట్టుకున్నాడు. అందువలన కృష్ణుడు రాజు కాలేదు. ద్వారకను పాలించిన నగరపెద్దలలో అతను కూడా ఒకడు. సూచనలు మాత్రం యిచ్చేవాడు. చరిత్రకు వస్తే లిచ్ఛవులది గణరాజ్యమే. గణతంత్రం కొనసాగితే చిన్నచిన్న రాజ్యాలుగా వుండి విదేశీయుల దాడిని తట్టుకోరనే వాదనతో చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి చంద్రగుప్తుణ్ని చక్రవర్తిని చేసి అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం చేశాడు. ఇక గణరాజ్యాలు అంతమయ్యాయి. రోమ్‌లో మాత్రం గణతంత్రం చక్కగా సాగింది. ప్రజల సహకారంతో అనేక విదేశాలను జయించారు. గ్రీకు సామ్రాజ్యం తర్వాత అంతకు మించిన ప్రఖ్యాతి పొందిన సామ్రాజ్యంగా, నాగరికతకు మారుపేరుగా రోమ్‌ విలసిల్లింది. (సశేషం) (ఫోటోలు – కవలలకు పాలిస్తున్న ఆడ తోడేలు విగ్రహం, రోమ్‌లో పాలంటైన్‌ కొండపై కట్టిన భవంతి ప్రస్తుత రూపం,)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016) 

[email protected]

Click Here For Spartacus Story

Click Here For Europe Gaathalu Archives