ఎమ్బీయస్‌: రోహిత్‌ వివాదం – వేడి ఎక్కువ, వెలుగు తక్కువ – 3

సుశీల్‌ కుమార్‌ చెప్పేదేమిటి? 30 మందికి పైగా ఏఎస్‌ఏ నేతలు ఆగస్టు 3/4 అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు. సెక్యూరిటీ వాళ్లు రక్షించడానికి వాహనంలోకి ఎక్కిస్తే అందులోంచి కిందకి లాగి మళ్లీ చితక్కొట్టారు. బలవంతంగా…

సుశీల్‌ కుమార్‌ చెప్పేదేమిటి? 30 మందికి పైగా ఏఎస్‌ఏ నేతలు ఆగస్టు 3/4 అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు. సెక్యూరిటీ వాళ్లు రక్షించడానికి వాహనంలోకి ఎక్కిస్తే అందులోంచి కిందకి లాగి మళ్లీ చితక్కొట్టారు. బలవంతంగా క్షమాపణ పత్రం రాయించి దానిపై సెక్యూరిటీ అధికారితో సంతకం చేయించారు. దెబ్బలు ఎంత తీవ్రంగా తగిలాయి అనేదానిపై వివాదం వుంది. పేగులు దెబ్బ తిని ఆపరేషన్‌ చేయించుకునేటంత తీవ్రంగా తగిలాయి అని సుశీల్‌ తరఫున కొన్ని వార్తలు వెలువడ్డాయి. సెంట్రల్‌ యూనివర్శిటీకి దూరంగా వున్న మదీనాగూడలో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స ఎందుకు చేయించుకున్నాడని సందేహాలు మెదిలాయి. ఆపరేషన్‌పై అబద్ధాలు చెప్తున్నాడు, అతనికి జరిగినది ఎపెండిసైటిస్‌ ఆపరేషన్‌ అని మీడియా బయటపెట్టింది. అప్పుడు అవును, ఎపెండిసైటిసే, కానీ వీళ్లు కొట్టిన దెబ్బల వలననే ఎపెండిసైటిస్‌ ఆపరేషన్‌ అర్జంటుగా చేయించుకోవలసి వచ్చింది అని సుశీల్‌ వివరణ యిచ్చాడు. కొట్లాటేప్పుడు కడుపులో, పొత్తికడుపులో గుద్దితే అలాటి అవసరం పడుతుందో లేదో నాకు తెలియదు. కానీ మదీనాగూడ అర్చనా హాస్పటల్‌వారు దాన్ని మెడికో లీగల్‌ కేసుగానే నమోదు చేసుకున్నారు. ఎడ్మిట్‌ చేసుకున్నపుడు సుశీల్‌కు భుజంపై దెబ్బ వుందని ధృవీకరించారు. చికిత్స పూర్తయి బయటకు వచ్చాక సుశీల్‌, అతని తల్లి యీ వ్యవహారాన్ని దీనితో పోనీయదలచలేదు. వైస్‌ ఛాన్సలర్‌కు ఫిర్యాదు అందింది. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు వర్శిటీకి వచ్చి విసిగా వున్న ఆర్‌ పి శర్మ వద్ద నిరసన తెలిపారు. దాంతో విసి  ప్రోక్టోరియల్‌ బోర్డు వేశారు. అది ఆగస్టు 12 న ఆరోపణకు తగిన ఆధారాలు లేవని, యిరు పక్షాలకు వార్నింగు యిచ్చి వదిలేస్తే చాలనీ అభిప్రాయపడుతూ మధ్యంతర నివేదిక యిచ్చిందట. మళ్లీ వాళ్లే యింకో 19 రోజులకు ఆగస్టు 31 న విచారణ పూర్తి చేసి, ఒక సెమిస్టర్‌ పాటు హాస్టల్‌ నుంచి తప్పించాలని చెప్పింది. 

దీనికి కారణం ఆగస్టు 17 న దత్తాత్రేయ లేఖ రాయడం అని ఆరోపణ. ఎబివిపి వారు హైదరాబాదు బిజెపి ఉపాధ్యక్షుణ్ని కలిసి తమ గోడు వినిపించగా ఆయన ఆగస్టు 10 న దత్తాత్రేయకు లేఖ రాశారు – 'ఏఎస్‌ఏ కార్యకలాపాలపై వర్శిటీ విచారణ చేపట్టేలా ఆదేశించండి' అని కోరుతూ. ఆయన ఆగస్టు 17న మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి జరిగిన ఘటనల గురించి రాస్తూ '…యూనివర్శిటీ యాజమాన్యం ప్రేక్షకపాత్ర వహిస్తోంది, యీ వ్యవహారాలను మీ దృష్టికి తెస్తున్నాను' అన్నారు. అది పెద్ద తప్పయిపోయింది కొంతమందికి. ప్రజాప్రతినిథులు తమ వద్దకు వచ్చినవారి అభ్యర్థనలు పైకి పంపడం సర్వసహజం. జరిగిన ఘటన గురించి విచారించి అప్పుడు రాసి వుండాల్సింది అనేది అర్థరహితమైన మాట. ఎవరైనా ఉద్యోగార్థి వచ్చి అడిగితే ఎమ్మెల్యేకాని, ఎంపీ కాని అతని సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి, ఇంటర్వ్యూ చేసి, ఉద్యోగానికి తగినవాడా కాదా అని తేల్చుకుని రికమెండ్‌ చేస్తాడా? ఎవడైనా ఫ్యాక్టరీ పెడతానంటే నీ బాలన్స్‌షీటు స్టడీ చేయనీ అంటాడా? ప్రజలు అడిగారు, 'కైండ్లీ లుక్‌ యిన్టూ యిట్‌' అని ఓ లెటరు జతపరిచి పంపేస్తారు. తక్కిన సంగతులు అవతలివాళ్లే చూసుకుంటారు. దత్తాత్రేయపై విరుచుకుపడుతున్న ప్రజాప్రతినిథులకు యీ విషయాలు తెలియకుండా వున్నాయా? వి హనుమంతరావు కూడా అలాటిదే పంపారని బయటకు వచ్చాక ఏం చెప్పగలిగారు?

ఇక స్మృతి ఇరానీ చేసినదేమిటి? సాటి మంత్రి నుంచి లేఖ వచ్చాక ఆమె శాఖ సెప్టెంబరు 3 న యూనివర్శిటీకి పంపి, సమాధానం పంపమని అడిగింది. ఆ స్థాయి వ్యక్తి నుంచి లేఖ వచ్చాక దానికి ప్రత్యుత్తరం యివ్వవలసిన బాధ్యత వాళ్లకు వుంటుంది కదా, సమాధానం రాకపోతే సెప్టెంబరు 24న, అక్టోబరు 6 న, అక్టోబరు 20న, నవంబరు 19 న రిమైండర్లు పంపింది. ఇది అసహజమని నాకు తోచటం లేదు. తక్కిన విషయాల్లో ఎలా వ్యవహరించారో తెలిస్తే తప్ప దీనిలో ఓవరాక్షన్‌ జరిగిందని తీర్మానించలేం. వీళ్లు ఒత్తిడి చేశారు కాబట్టి అపరాధులు అని విద్యార్థి జాక్‌ అంటోంది. సెప్టెంబరులో విసిగా వచ్చిన అప్పారావు కూడా బిజెపి మనిషి కాబట్టి వాళ్లు చెప్పినట్లు ఆడాడు కాబట్టి ఆయనా అపరాధే అంటూ మొత్తం ముగ్గురూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఆగస్టు 12 నివేదికకు, 31 నివేదికకు తేడా రావడానికి కారణం దత్తాత్రేయ, స్మృతి ల ఒత్తిడే కారణమనుకుంటే వాళ్ల మాట విని ఆ బోర్డు నిర్ణయాన్ని తారుమారు చేయించిన అప్పటి విసి శర్మను కూడా తప్పుపట్టాలి కదా! మరి ఆయన పేరు ఎవరూ తలవటం లేదేం? ఎంతసేపూ అప్పారావు పేరే వినబడుతోందేం? నివేదిక రాగానే అమలు చేశారా? లేదే!  విచారణ సరిగ్గా జరగలేదంటూ రోహిత్‌ వాళ్ల యూనియన్‌ అభ్యంతర పెట్టగానే అమలు నిలిపారు కదా, నిలిపి ప్రొఫెసర్‌ సుధాకరరెడ్డి కమిటీని వేశారు. ఆ కమిటీ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించే అధికారం మాకు లేదు అంటూ చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అంటే విసి లేదా వర్శిటీ యిద్దరు కేంద్రమంత్రుల మాట కంటె రోహిత్‌ యూనియన్‌ మాటకు ఎక్కువ విలువ నిచ్చిందనే అనుకోవాలిగా!

సరే సెప్టెంబరులో అప్పారావు విసిగా వచ్చారు. ఆయన బిజెపి మనిషి, దళితుల పాలిట విలన్‌ గట్రాట! మరి ఆయన వెంటనే  రోహిత్‌ వగైరా మాబాగా దొరికారు అని వెంటనే బోర్డు నిర్ణయాన్ని అమలు చేయకుండా తాత్సారం చేశారేం? నాలుగు రిమైండర్లు పంపేదాకా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారేం? తనను విసిగా సెలక్టు చేసిన బిజెపి నేతలకు కోపం తెప్పిస్తున్నానన్న యింగితం  ఆయనకు లోపించిందేం? ఇంతకీ అప్పారావుని విలన్‌గా ఎందుకు చేశారు?  2002లో క్యాంపస్‌లో జరిగిన అల్లరి కారణంగా 10 మంది దళిత రిసెర్చి స్కాలర్లు రస్టికేట్‌ అయ్యారు, అప్పుడు అప్పారావు చీఫ్‌ వార్డెన్‌ కాబట్టి వారి భవిష్యత్తు నాశనం కావడానికి కారకుడయ్యాడని ఆయన దళిత విలన్‌గా చూపుతున్నారు. వాళ్లు ఆయన్ని కొట్టారన్నమాట చాలామంది కాలమిస్టులు, సంపాదకులు ప్రస్తావించటం లేదు. యూనివర్శిటీలో చాలా అల్లర్లు చూసీ చూడనట్లు వదిలేసేటప్పుడు పదిమందిని ఏకంగా రస్టికేట్‌ చేశారంటే ఆ సంఘటన ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవాలి. నాకు పూర్తి వివరాలు తెలియవు, కానీ అప్పటి ప్రొఫెసర్లు విజ్ఞతతోనే వ్యవహరించి వుంటారని, ఏదైనా పగతో వ్యవహరించి వుంటే ఆ స్కాలర్లు కోర్టుకి వెళ్లి వుండేవారనీ వూహిస్తున్నాను. 

అప్పారావు బిజెపి వ్యక్తి అనడానికి చెప్పే కారణం ఏమిటంటే ఆయన కంటె సీనియర్లున్నా ఆయన సెలక్టయ్యాడట. ఆయన చెప్పేదేమిటంటే – 190 మందిలో 21 మందిని సెలక్టు చేశారు. వారిలో 17 మంది ఎచ్‌సియు ప్రొఫెసర్లు, వారిలో ఒకడైన నాకు 27 ఏళ్ల సర్వీసు, సెర్చ్‌ కమిటీ నన్ను సెలక్టు చేసింది' అని. దీనిలోనే కాదు, అనేక సంస్థల్లో సీనియర్లున్నా జూనియర్లను సెలక్టు చేసిన సందర్భాలు కోకొల్లలు. వారందరినీ బిజెపి వాళ్లనలేం. డబ్బో, పలుకుబడో (ఈయన ఓ కేంద్రమంత్రికి బంధువు అని మరో వార్త… కావచ్చు) వుపయోగించి వుండవచ్చు అని సందేహిస్తే సందేహించవచ్చు. ఎందుకంటే అనేకమంది విసిల నియామకాలు వివాదాలతో ముడిపడి వున్నాయి. తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విసిగా తెలుగు వ్యక్తి జగదీశ్‌ కుమార్‌ సెలక్టు కాగానే ఆయన ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన సైన్సు సదస్సుకి హాజరయ్యారు అని మీడియా తవ్వి తీసి బిజెపి మనిషిగా ముద్ర వేయబోయింది. ఇండో-పాక్‌ ఫ్రెండ్‌షిప్‌ సొసైటీలో చేరితే ఐఎస్‌ఐ ఏజంటు, ఇండో-చైనా ఫ్రెండ్‌షిప్‌ సొసైటీలో చేరిత మావోయిస్టు.. యిలా ముద్రలు కొట్టుకుంటూ పోతే మనం ఎక్కడికి తేలతామో తెలియదు. ఒక్కోప్పుడు తమతో విభేదించినవాళ్లను కూడా తమ సమావేశాలకు పిలిచి తమ వాదన వినిపించమంటూ వుంటారు. ఎవరైనా వ్యక్తి రాజకీయభావాలు ఆయన వృత్తిని ప్రభావితం చేయనంతవరకు వీటిపై మరీ అంత చర్చ ఎందుకో నా కర్థం కాదు. ఇప్పుడు అప్పారావుగారు ఆరెస్సెస్‌ శాఖకో, బిజెపి మీటింగుకో వెళ్లి వుంటే అదో దారి. ఈయన నియామకం జరిగినప్పుడు కేంద్రంలో బిజెపి వుంది కాబట్టి, బిజెపి మనిషి అయిపోతాడా? ఇంతకీ ఆయనేమంటాడు? నాకు లేఖలు వచ్చినమాట నిజమే కానీ, నాకు వాటి ప్రాముఖ్యత బోధపడక పట్టించుకోలేదు అన్నాడు. నాకు ఫోన్లేమీ రాలేదు అన్నాడు. వచ్చే వుంటాయి, రికార్డు బయటకు తీయండి అంటాడు అరవింద్‌ కేజ్రీవాల్‌. అలా ఎవరైనా చేసి బయటపెడితే వాటిలో బెదిరింపులో మరోటో వుంటే అప్పుడు స్మృతిపై, అప్పారావుపై నిందలు వేయవచ్చు. తప్పు చేశారని అప్పటిదాకా ఎలా అనగలం?

సరే అప్పారావు ఏం చేశారు? వ్యవహారాన్ని నానబెట్టారు. దత్తాత్రేయ ఉత్తరం రాసినా, స్మృతి శాఖ నుంచి వుత్తరం వచ్చినా యూనివర్శిటీ తన కొడుకుని కొట్టిన వాళ్లపై చర్య తీసుకోక పోవడంతో సుశీల్‌ తల్లి కోర్టుకి వెళ్లారు. నిజంగా విసి రాజకీయపరమైన ఒత్తిళ్లకు లొంగి వుంటే ఆవిడకు కోర్టుకి వెళ్లవలసిన అగత్యమే వచ్చి వుండేది కాదు. కోర్టు ఆవిడ అభ్యర్థన విని అఫిడవిట్‌ దాఖలు చేయమని వర్శిటీని ఆదేశించింది. అప్పుడు యీయన పాత బోర్డు కంటె విస్తారమైన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు అప్పగించారు. అది విచారణ జరిపి పిఎచ్‌డి పూర్తయ్యేవరకు హాస్టల్‌ సౌకర్యం లేదంటూ నవంబరు 27న తీర్పు యిచ్చింది. కోర్టులో కౌంటర్‌ దాఖలుకు ముందే ప్రోక్టోరియల్‌ బోర్డు తీసుకున్న చర్యలను అమలు చేయాలని సూచించింది. అప్పుడు అప్పారావు మళ్లీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సబ్‌ కమిటీ వేశారు. దీనికి శ్రీవాస్తవ చైర్మన్‌, మెంబర్లలో ఒక దళిత ప్రొఫెసరు వున్నారు. (ఎవరో చెప్పిన మాట విని స్మృతి చైర్మనే దళితుడు అని స్టేటుమెంటు యిచ్చి యిరకాటంలో పడింది) వీళ్లు పూర్తి స్థాయి సస్పెన్షన్‌ తగ్గించి, డిసెంబరు 16 న పాక్షిక సస్పెన్షన్‌ అమలు చేశారు. యూనివర్శిటీ దీన్ని కోర్టుకి నివేదించింది. ఆగస్టు 31 నాటి బోర్డు నిర్ణయానికి దురుద్దేశాలు ఆపాదిస్తున్న మీడియా, తర్వాత వచ్చిన తీవ్ర నిర్ణయం, మళ్లీ దానిలో మినహాయింపుకు ఎవర్ని కారకుల్ని చేస్తారో నాకు అర్థం కావటం లేదు. సబ్‌ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయడానికి డిసెంబరు 20 న విద్యార్థుల చేత హాస్టల్‌ ఖాళీ చేయించారు. కోర్టు తీర్పు వచ్చేవరకు వర్శిటీ గెస్ట్‌ హౌస్‌లో వుండేందుకు అనుమతించామని, కానీ తమ ప్రతిపాదనను విద్యార్థి జెఎసి తిరస్కరించిందని విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్‌ కార్యాలయం చెప్పింది. రోహిత్‌, మరో నలుగురు పోరాటబాట పట్టారు. వెలివాడ పేరుతో నిరసన శిబిరం నిర్వహించారు. కానీ దానికి టీచర్ల నుండి కాని, సాటి విద్యార్థుల నుండి కాని ఎటువంటి ఆదరణా లభించలేదు. ఈ పరిస్థితుల్లో 18 న హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం రోహిత్‌, అతని మిత్రులకు వచ్చింది. యూనివర్శిటీలో జరుగుతున్న 'దళిత దమనకాండ'ను కోర్టులో అందరి ఎదుటా దుయ్యబట్టే బ్రహ్మాండమైన అవకాశం వాకిట వుండగా రోహిత్‌ పిరికివాడిలా 17 న ఆత్మహత్య చేసుకోవడం దేనికి? సమాధానం దొరకటం లేదు.

అతను ఆత్మహత్య చేసుకోగానే యిక దళితవాదం ముందుకు వచ్చింది. కేంద్రమంత్రులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాళ్లకు యీ విద్యార్థుల పేర్లు సైతం తెలిసి వుండవు. వాళ్లేమైనా వీళ్లను కులం పేర దూషించారా? అవమానించారా? ఆ చట్టాన్ని చిత్తం వచ్చినట్లు వాడుతూ నిజమైన అత్యాచారాలు జరిగినప్పుడు జనాలు ఖాతరు చేయని పరిస్థితి తెచ్చిపెట్టారు. దళిత కోణం లేకుండా రోహిత్‌ తల్లి, మిత్రులు కేవలం రిసెర్చ్‌ స్కాలర్‌ ఆత్మహత్యగా ఆందోళన చేసి వుంటే విద్యార్థులందరికి సహానుభూతి కలిగేదేమో, కానీ యింత గుర్తింపు రాదనుకున్నారు కాబోలు. రోహిత్‌ శవం వద్ద తల్లి, సోదరుడు, సోదరి కనబడ్డారు కానీ తండ్రి కనబడలేదు. తండ్రి సంగతేమిటన్న సందేహం సహజంగానే వచ్చింది. ఏదో పేపర్లో చదివాను – ఆయనకు మతిస్థిమితం లేదని! పాపం అనుకున్నాను. తీరా చూస్తే టీవీ9లో కనబడి పలనాడు పిడుగురాముడిలా విరుచుకుపడ్డాడు. ఇంటర్‌ చదివాడట, శుబ్భరంగా మాట్లాడుతున్నాడు. కొండలు బద్దలు కొట్టేవాడికి కుండ బద్దలు కొట్టడం ఒక లెక్కా? కుండబద్దలు కొట్టి మేం వడ్డెరలం, ఎస్సీలం కాము, ఇంటర్‌ స్థాయిలో మా వాడు బిసి నుంచి ఎస్సీగా మార్చుకున్నాడు, ఎందుకురా యిదంతా అంటే ఉద్యోగాలకు పనికి వస్తుందిలే అన్నాడు అని చెప్పేశాడు. మీ భార్య కులం ఏమిటని టీవీవాళ్లు అడగలేదు, అడిగి వుంటే ఆవిడ మాల అవునో కాదో తేలిపోయేది. 

రోహిత్‌ అంత్యక్రియల్లో తండ్రి కాని, తండ్రివైపు బంధువులెవరూ కాని హాజరు కాకుండా చూసినదెవరు? తండ్రి వస్తే దళితులు కాదని తెలిసిపోతుందనా? ఈ విషయం గురించి వాసన తగలటం చేతనే మాయావతి రావడం మానేశారా? రోహిత్‌ ఆదివారం చనిపోతే సోమవారం మధ్యాహ్నం వరకు కాని జన్మ నిచ్చిన తండ్రికి కబురే తెలియలేదు. తెలిశాక టిక్కెట్టు లేకుండా రైల్లో రావలసి వచ్చింది. తల్లి, తండ్రి మధ్య వున్న విభేదాలు రోహిత్‌ను కలవరపరచాయా? తెలియదు. అతనికి రావలసిన స్టయిపెండ్‌ నిలిపివేశారన్నదానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా స్టయిపెండులు ఒకటో తారీకు జీతాల్లా వచ్చి పడవు. చాలా డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేయాలి, కొన్ని నెలలది కలిపి ఒక్కసారి యిస్తూ వుంటారు. అతనికి బాకీ నెలకు పాతిక వేల చొప్పున 7 నెలలకు రావాలి, అతని ఆత్మహత్య లేఖలోనే 7 నెలలు అని రాస్తే ఓ కాలమిస్టు ఏడాదిన్నర బాకీ అని రాసేశారు. రోహిత్‌ యివ్వవలసిన డాక్యుమెంట్లు యివ్వకపోవడం చేతనే అది ఆగిందని అప్పారావు చెప్పారు. నిజానికి జూన్‌ తర్వాత రోహిత్‌ రిసెర్చి వర్కు సరిగ్గా సాగలేదని ''హిందూ'' రాసింది. ఆ డాక్యుమెంట్లు రిసెర్చిలో ప్రగతికి సంబంధించినవేమో తెలియదు. జూన్‌ తర్వాత అతను చదువు కంటె ఎక్కువగా యూనియన్‌ కార్యకలాపాల్లో పడ్డాడు లాగుంది. యూనివర్శిటీకి వచ్చిన పని మూలపడింది, యాకూబ్‌లు ముఖ్యమయ్యారు. కొత్తగా చేజిక్కిన దళిత్‌ కార్డు విచ్చలవిడిగా వాడేశాడు. ఆ పేరు పెట్టి విసిపై చతుర్లు విసిరాడు. ఇప్పుడు అతని కులం గురించి విచారణ జరుగుతోంది. దళితుడు కాదని తేలితే ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు వీగిపోతుంది, రోహిత్‌ అసలైన దళితులను మోసగించినట్లు అవగతమౌతుంది. 

ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో అర్థం కావటం లేదు. ఇతరులు అతన్ని పురికొల్పి వుంటారని ఎబివిపి నాయకులంటున్నారు. కొట్టివేసిన వాక్యాలు తెలిస్తే కొంత పట్టు దొరుకుతుందేమో. ఏది ఏమైనా చాలామంది విద్యార్థులు మానసిక సమతుల్యత పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అతి కష్టమైన ఐఐటీలో ఎడ్మిషన్లు తెచ్చుకున్నవాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సవ్యంగా విచారణ సాగితే అన్నీ బయటకు వస్తాయి. కానీ జరగనిస్తారా? విచారణ కమిటీ సభ్యులిద్దరు వస్తే విద్యార్థులు వారిని తరిమివేశారు. ఇలా అయితే అసలు కారణాలు ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడో జుడిషియల్‌ కమిషన్‌ వేశారు. దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రిపోర్టును ఎప్పుడు అమలు చేస్తారో అస్సలు తెలియదు. సత్యమేదో తేలకుండానే అశోక్‌ బాజపేయి గారు సెంట్రల్‌ యూనివర్శిటీ యిచ్చిన డాక్టరేటు వాపస్‌ చేసేశారు. నిజానిజాలు తేలేదాకా ఓపిక పట్టలేనివాళ్ల దగ్గర డాక్టరేట్లు వుంటే వాటి పరువు పోతుంది. అందువలన యీ వాపసీని నేను స్వాగతిస్తున్నాను. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Archives