వేముల రోహిత్ సంఘటన జరిగిన తర్వాత మానవత్వం మీద ఎన్నో యేల్లుగా నాలో సుడులు తిరుగుతున్న అనుమానాలు, ఆలోచనలు, ఆవేదనలు ఒక్క సారిగా బయటకొచ్చి నేనీవిధంగా స్పందిస్తున్నాను! రెండు వైపులా కొన్ని కొన్ని తప్పులున్నా సహనం మాత్రం ఒక వైపు ఎక్కువగా ఉండాలనేది నా అభిప్రాయం. మిగతా ప్రపంచంలో కూడా చాలా అన్యాయాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి! కాని, నేను నా పరిధిలో, నేను పెరిగిన వాతావరణంలో, నాకు అనుభవమైన సంఘటనలే ఇక్కడ ప్రస్తావిస్తాను! తల్లివైపు మునసబులు, తండ్రివైపు సర్పంచులు. చిన్నప్పుడే చూసాను వెట్టోల్లని కానీ నాసర్ గాడని ఊరంతా అంటుంటే నాసరయ్యని, కన్నెగాడిని కన్నయ్యని, మాదిగోడిని మోషెయ్యని సంభోదించేవాడిని – వాల్లు కూడా నన్ను భుజాల మీద ఎక్కించుకుని ఆడించేవాల్లు, జ్వరమొస్తే ఎత్తుకుని హాస్పిటలుకి పరిగెత్తే వాల్లు! నా క్లాస్మేట్ బీకేని ఇప్పటికీ బీకే అనే పిలుస్తాను, హైస్కూల్లో చదివేటప్పుడు వాడికి మా బస్టాండు హొటెల్లో కాఫీ ఇవ్వకపోతే నేను కూడా హోటెలుకి పోవడం మానేసా!
అమెరికాకు రాకముందు కూడా మా అమ్మ, అమ్మమ్మోల్లు, మేనమామ, పెదనాన్నలు వీలైతే ఏదన్న చెయ్యరా వాల్లకి అనేవాల్లే గాని నిరుత్సాహపరచలేదు, అమెరికా వచ్చిన తర్వాత సరే సరి. 1990 నుండి ఊరికి పోయిన ప్రతిసారి “మన వెంకటయ్య మనవడురా, టెంతులో ఫస్ట్ క్లాస్ వచ్చింది ఒక పదివేలిస్తే ఇంటర్ అయిపోద్ది తర్వాత వాడికి దేవుడేది రాస్తే అదయిద్దీ, “నాసర్ బస్టాండ్ దగ్గర ఇల్లుకట్టుకుంటున్నాడు నువ్వొక పాతికవేలిస్తే బాగుంటుందిరా”, “మోషెయ్య స్థలం కొనుక్కున్నాడురా ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా ఇవ్వరా”, “మార్తమ్మ ఆరోగ్యం బాగలేక కూలికి పోవడం లేదయ్యా ఒక పదివేలివ్వు పాపం”, “డేవిడ్ మంచి పిలగాడురా కెమెరా కొనిపెడితే హైస్కూల్ పిల్లల హాల్టికెట్ ఫుటోలు తీసుకుని బతుకుతాడయ్య” లాంటి ఉదంతాలు కొల్లలు. నాదగ్గరకొచ్చిన సహేతుకమైన ప్రతి కోరికను తీర్చాను. అలాని, దాయాదులకి గాని, చుట్టాలకి గాని, స్నేహితులకి గాని సాయం చేయకుండా లేను. ఏదో గొప్పకి చెప్పటల్లేదు ఇదంతా, సమాజమెలా ఉండేదో, ఉండాలో చెప్తున్నానంతే! చదువుకోని మా అమ్మ, అమ్మమ్మల్లో ఉన్న న్యాయం, బతకనివ్వు అనే భావన నేటి బాగా చదువుకున్నవాల్లలో ఎందుకు కరువవుతున్నది?
తరతరాలుగా అణగారిన వర్గాలివి, ఇప్పటికీ ఊర్లలో మాదిగపాడ్లలోనే, మాలవాడల్లోనే మెజారిటీ ప్రజల నికృష్ట జీవనం. రెక్కాడితేనే డొక్కాడే బతుకులు. గుల్లల్లోకి, పెద్దోల్ల ఇల్లల్లోకి నేటికి కూడా ప్రవేశం లేదు! దోసిట్లోనే అన్నం పైనుండి పడేస్తారు! రిజర్వేషన్లు స్వతంత్రమొచ్చిన నాటినుండి ఉన్నా బాగుపడిన కుటుంబాలకంటే బాధలు పడుతున్న వాల్లే ఎక్కువ. అలాగని, అగ్రవర్ణాల్లో కష్టాలు లేవని కాదు, కనీసం ఎక్కడ కావాలంటే అక్కడ నివాసముండొచ్చు నిమ్న వర్గాలకి ఆ అవకాసం కూడా లేదు. మనస్తత్వశాస్త్రం మీద అవగాహన ఉన్నవాల్లకి దాస్య శృంఖలాల ప్రభావం ఎంటో తెలుస్తుంది ఆ మానసిక స్థితినుండి బయటబడతం తేలిక కాదని. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నాను – నేటి నిమ్న వర్గాల వెతలకి ఎప్పుడో తప్పులు చేసిన అగ్రవర్ణాల కంటే స్వార్ధంతో ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎదిగిపోయిన నిమ్న వర్గాల పాత్రేమి తక్కువ కాదు. క్రీమీలేయర్ విధానాన్ని ఎందుకు అమలుపర్చనివ్వరు? అన్నదమ్ముల్లలో అక్కచెల్లెల్లలో క్రీమీలేయర్ అవసరం లేదు కాని, కొడుకూ కూతుర్లలో క్రీమీలేయర్ అవసరం లేదా? తండ్రి ఐఏఎస్ అయికూడా తన వర్గపు పడే బాధలను కల్లారా చూసుకుంటూ తన సొంత పిల్లలకి రిజర్వేషన్లు వర్తించుకునే వాల్లు రాక్షషులు కాదా? పైకెదిగిన ఈ పెద్దమనుషులు కష్టాల్లో కునారిల్లుతున్న తన సొంత వర్గాల వాల్లకి చేస్తున్న సాయమెంత? నిమ్న వర్గాలకి నాయకత్వమొహిస్తున్న వారిలో ఉన్నది అత్యధికులు నయవంచకులు కాదా, పదవులు అధికారం కోసం బజారులో నిస్సిగ్గుగా అమ్ముడుబోయేవాల్లు కాదా? వాల్లెప్పుడు మారుతారు, అసలు మారుతారా, సమాజపు కష్టాలు వీల్లకి పడతాయా అసలు?
మన భారతావనే కష్టాల పుట్ట. నిరక్షరాస్యత, అధిక జనాభా, అల్పావకాశాలు, అసంఘటిత సమస్యలతో కునారిల్లుతున్న దేశం మనది. 90 శాతం మంది ప్రజలు ప్రామాణికత క్రింద బతుకుతున్నారు. దీనికితోడు కార్పోరేట్ల అత్యాశ – దోపిడీ, రాజకీయ నాయకుల దేశాన్నమ్ముకునే వైఖరి, ప్రజల్ని సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న అధికార వర్గాలు, లంచగొండి న్యాయస్థానాలు, మనకేంటని ముసుగుదన్ని నిద్రపోతున్న సమాజం! ఏమున్నది గర్వించడానికి మనకి? ఈ నిరాశ, అసహనాల్లోంచి పుట్టుకొచ్చిందే వేముల రోహిత్ ఆత్మహత్య. ఎస్సీ విద్యార్ధులు ఉగ్రవాదికి అనుకూలంగా నినాదాలు చేసినా, ఎఫ్సీ విద్యార్ధులు ఎస్సీ విద్యార్ధుల కులం పేరు పెట్టి తిట్టినా – వీటన్నిటికి కారణాలు పైన చెప్పిన సమస్యలతో వచ్చిన అసహనమే! వెలివాడల్లో బ్రతుకెలా ఉంటుందో తెలీని మూర్ఖులు విద్యాలయాల్లో కూడా వివక్ష చూపిస్తే అణచబడ్డ వాడు ఈ సమాజంపై ఏహ్య భావం ప్రదర్శిస్తాడు కాని, తప్పు ముమ్మాటికీ ఈ సమాజానిదే! కాని, అగ్రవర్ణాలలోని “కొంతమంది” ప్రవర్తన నచ్చనంత మాత్రాన నిమ్న వర్గాల వాల్లు ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులని సమర్ధించడం ఖండనీయం.
ఉగ్రవాదానికి మన అగ్రవర్ణ, నిమ్న వర్గ తేడాలు తెలియవు, దాని విషానికి అందరూ నశిస్తారు! అన్ని వర్గాల వారూ విజ్ఞతతో వ్యవహరించితే సగం సమస్యలు తీరుతాయి! చదువుకున్న మూర్ఖులను ఆలోచింపజెయ్యటం ఈ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం! మనం రెండువైపులా మొహరించి కొట్టుకోకుండా సహనంతో వ్యవహరించి లక్ష్యాన్ని గుర్తించి, నిర్ధారించి పోరాడితేనే ఈ విపత్కరమైన పరిస్థితులనుండి బయటపడగలం. లెక్కకు మిక్కిలిగా విదేశీ బ్యాంకులలో నల్లడబ్బుగా మూలుగుతున్న మన దేశ సంపదలో కొంత భాగాన్ని వెంకక్కి తెచ్చుకున్నా, దోపిడీ అవుతున్న గ్యాసు, బొగ్గులాంటి మన సహజసంపదని కొంత మేరకు నివారించగలిగినా, సమాజం ఏమయిపోయినా పట్టకుండా ప్రజా ధనాన్ని దోచుకుంటున్న అధికార రాజకీయ వర్గాలని ఎదిరించి ఆపగలిగినా, ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్న మన జనాభాని తగ్గించగలిగినా కుక్కని కుక్క తినే పరిస్థితిని నశింపచేయగలం! వీటి మీద శ్రద్ధ పెట్టాల్సిన మనం మనలో మనం కొట్లాడున్నామంటే మనకి దశా దిశా లేదన్న మాట! నిమ్న వర్గాలు అగ్రవర్ణాలపై, అగ్రవర్ణాలు నిమ్న వర్గాలపై కాకుండా మన సమాజంలో సమస్యలను సృష్టిస్తున్న ఈ కార్పోరేట్ల, రాజకీయ నాయకుల, అధికార వర్గాలపై పోరాడి, వారి భరతం పట్టి భారతావనిని బంధవిముక్తి చెయ్యడంలోనే ఉంది అసలు సిసలు అద్భుతం!
జాతి మత బేధాలన్నీ స్వార్ధపరుల మోసం! క్షణికమైంది ఈ జీవితమని అర్ధమయ్యేదెందరికి? కొన్నేల్లు గడిస్తే చరిత్ర పుటల్లోకి పోయి దాగుండి ఎవరికీ కనబడని మన బతుకులకి అర్ధమేంది? న్యాయం కోసం, సమసమాజం కోసం పోరాడితే కనీసం ఆత్మతృప్తన్నా ఉండదా? సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజం ఎక్కడికి పోతున్నది?
గురవా రెడ్డి, అట్లాంటా, అమెరికా