ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు – 75

జయలలితకు గ్లామర్‌ వుంది, తెలివితేటలున్నాయి, కష్టపడే స్వభావం వుంది (ఎన్నికల సందర్భంగా ఆమె 7 వేల కి.మీ.లు పర్యటించింది) ఆమెపై జనాలకు మోజుంది అని అందరూ ఒప్పుకుంటూనే బుద్ధిస్థిరత్వం లేని యీమె ముఖ్యమంత్రిగా రాణించగలదా…

జయలలితకు గ్లామర్‌ వుంది, తెలివితేటలున్నాయి, కష్టపడే స్వభావం వుంది (ఎన్నికల సందర్భంగా ఆమె 7 వేల కి.మీ.లు పర్యటించింది) ఆమెపై జనాలకు మోజుంది అని అందరూ ఒప్పుకుంటూనే బుద్ధిస్థిరత్వం లేని యీమె ముఖ్యమంత్రిగా రాణించగలదా అని అనుకున్నారు. ఈమె తలతిక్కగా ప్రవర్తించి తన ప్రభుత్వాన్ని తనే కూల్చుకుంటుందని అనుకున్నారు. ఆమె ఎడిఎంకెలో ఎమ్జీయార్‌ వద్ద మంత్రులుగా పనిచేసిన సోమసుందరం, కృష్ణస్వామి, సెంగోట్టియన్‌, ముత్తుస్వామి, వీరప్పన్‌ వంటి వారితో కాబినెట్‌ ఏర్పరచింది. ఎమ్జీయార్‌లాగే ఎవర్నీ నమ్మకుండా, మరీ దగ్గరకి రానీయకుండా చూసుకుంది. బాల్య స్నేహితుడైన చో రామస్వామిని రాజకీయ సలహాదారుగా పెట్టుకుంది. నటరాజన్‌ను దూరం పెట్టినా అతని భార్య శశికళను దగ్గరకు రానిచ్చింది.

కరుణానిధి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి వేసిన ప్రణాళికలు కొనసాగిస్తానని చెప్పడానికి అధికారంలోకి వస్తూనే పెద్ద పారిశ్రామికవేత్తలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. దానికి టాటా, థాపర్‌, ముత్తయ్య, కొఠారీ, మఫత్‌లాల్‌, శ్రీరాం, టివియస్‌ గ్రూపులకు చెందినవారు హాజరయ్యారు. చక్కటి హోంవర్క్‌తో వారి సమస్యల పట్ల తన అవగాహననను ప్రదర్శించి జయలలిత వారిని ఆశ్చర్యపరచింది.  రూ. 200 కోట్ల ప్రాజెక్టులకు క్లియరెన్సు యిచ్చింది. పెద్ద పెట్టుబడిదారులకు సేల్స్‌ టాక్సు మినహాయింపులు ప్రకటించింది. రాష్ట్రం యిచ్చే కాపిటల్‌ సబ్సిడీని రూ.50 – 100 కోట్ల పెట్టుబడుల విషయంలో రూ. 15 లక్షల నుంచి 25 లక్షలకు, రూ.100 కోట్లకు పై బడిన పెట్టుబడుల విషయంలో రూ.50 లక్షలకు పెంచింది. నష్టాల్లో నడుస్తున్న పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లను ప్రైవేటు సెక్టారుకు అప్పచెప్పింది.

రాజీవ్‌ హంతకులపై ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు చూపకుండా రాష్ట్రమంతా టైగర్ల కోసం, వారి సానుభూతిపరులకోసం వేటాడించింది. కేంద్రం కూడా యీ విషయంలో పట్టుదలగా వుండడంతో, రాష్ట్రపోలీసు వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి తలచుకుంటే ఎంత అద్భుతాలు సాధించగలరో నిరూపించింది. రాజీవ్‌ హత్య సీరీస్‌లో వీటి గురించి విపులంగా రాశాను. రాష్ట్రంలో లక్ష మంది శ్రీలంక తమిళులు వున్నారని అంచనా. వాళ్లు నమోదు చేసుకోవాలని చెప్పింది. అయితే 25 వేల మంది మాత్రమే నమోదు చేసుకోవడంతో చేసుకోనివారిని అరెస్టు చేయమంది. పోలీసులు 3 వేల మందిని అరెస్టు చేశారు. దాంతో తక్కినవారు భయపడి క్యూలు కట్టారు. టైగర్ల కారణంగా చాలాకాలంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది కాబట్టి, ప్రభుత్వ మద్దతుతో వాళ్లు తమను బెదిరిస్తూ వస్తున్నారు కాబట్టి, పోలీసులు సైతం వారి పక్షానే నిలుస్తున్నారు కాబట్టి సాధారణ పౌరులు టైగర్లతో విసిగి వున్నారు. జయలలిత ఆడపులిలా వారిని దునుమాడుతూంటే వాళ్లు కేరింతలు కొట్టారు. డిఎంకెకి ఎల్‌టిటిఇకి వున్న అనుబంధం దృష్ట్యా టైగర్ల నడ్డివిరవడం ఆమెకు రాజకీయంగా కూడా లాభించింది. చిదంబరం గ్రూపుకు చెందిన కాంగ్రెసు నాయకురాలు జయంతి నటరాజన్‌ ''ఆమెలో ఎన్ని లోపాలున్నా, రాష్ట్రం నుండి ఎల్‌టిటిఇని తరిమివేయగలిగిన నాయకురాలు ఆమె ఒక్కతే. ఆ విధంగా ఆమె నాయకత్వం దేశానికి అవసరం.'' అంది. 

జయలలిత తనను ఎమ్జీయార్‌ వారసురాలిగా చూపించుకోవడానికి ప్రయత్నించింది. ఎమ్జీయార్‌ మద్యనిషేధానికి కట్టుబడినా, కల్తీ సారా నిరోధించడానికై  కొన్ని మినహాయింపులు యిచ్చాడు. కరుణానిధి చీప్‌ లిక్కర్‌ స్కీము పెట్టి మద్యాన్ని ప్రవహింపచేశాడు. ఇది గ్రామీణ మహిళలను తీవ్రంగా బాధించింది.  ఆ స్కీము రద్దు చేసి, సారా దుకాణాలను మూయిస్తానని జయలలిత ఎన్నికల వాగ్దానం చేయడంతో మహిళలందరూ ఆమెకు ఓట్లేశారు. అది అమలు చేస్తే ఏటా రూ. 322 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. అయినా అధికారంలోకి వస్తూనే దాన్ని అమలు చేసింది. దానితో బాటు డిఎంకె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా రద్దు చేసింది. ఆదిద్రావిడ హౌసింగ్‌ స్కీము కూడా ఎగిరింది. ఎమ్జీయార్‌ పాలనలో జిల్లాలకు పేరు మారిస్తే, కరుణానిధి వచ్చి వాటి పేరు మార్చాడు. జయలలిత వాటిని మార్చి మళ్లీ పాత పేర్లు పెట్టింది. 

అంతేకాదు, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డిఎంకె పాలనలో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 27 వేల ప్రైమరీ కోఆపరేటివ్‌ సొసైటీలను రద్దు చేసింది. ఈ విధంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె ఎలాటి సంకోచాలు పెట్టుకోలేదు. తామరక్కని అనే ఎడిఎంకె ఎమ్మెల్యే పరమగూండా. ఎమ్జీయార్‌ ముఖ్యమంత్రిగా వుండగా కూడా అతన్ని అదుపుచేసిన వారు లేరు. ఈ ఎన్నికలలో స్వతంత్రుడిగా ఎన్నికై ఎడిఎంకెలో మళ్లీ చేరదామని చూస్తున్నాడు. తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశంలో గవర్నరు ప్రసంగం ప్రారంభించగానే పిఎంకె సభ్యుడు పన్‌రూటి రామచంద్రన్‌ లేచి గవర్నరు పదవి రద్దు చేయాలంటూ పెద్ద కాగితం తీసుకుని చదవనారంభించాడు. తామరక్కని అతనిపై పడి కొట్టాడు. అయినా రామచంద్రన్‌ తన ఉపన్యాసం ముగించి, మరో ముగ్గురు ప్రతిపక్ష సభ్యులతో కలిసి వాకౌట్‌ చేశాడు. మర్నాటి నుంచి పిఎంకె అధ్యక్షుడు రామదాసు నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. తామరక్కని తన చేష్టలతో జయలలితను మెప్పించాననుకున్నాడు కానీ ఆమె అతనిపై, రామచంద్రన్‌పై చర్య తీసుకోమని స్పీకరును కోరడం, ఆయన వాళ్లిద్దరినీ మూడు రోజుల పాటు సస్పెండ్‌ చేయడం జరిగాయి. 

తమిళనాడుకి కర్ణాటకతో కావేరీ వివాదం ఎప్పుడూ నడుస్తూనే వుంటుంది. ఆ ఏడాది 205 టిఎంసి నీరు తమిళనాడుకి యిమ్మనమని ట్రైబ్యునల్‌ చెప్పినా కర్ణాటక మన్నించలేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెసు ప్రభుత్వమే వుంది కాబట్టి, కేంద్రంలో వున్న కాంగ్రెసు ప్రభుత్వం వారికి నచ్చచెప్పాలంటూ జయలలిత విజ్ఞప్తి చేసింది. అయితే కాంగ్రెసు అలాటి ఆదేశాలివ్వకుండా సుప్రీం కోర్టుకి వెళ్లమంది. దాంతో జయలలితకు ఒళ్లు మండి కేంద్రానిది పక్షపాతబుద్ధి అంది. ఆమెకు సన్నిహితంగా వుండే కాంగ్రెసు నాయకుడు వాళప్పాడి రామమూర్తి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతనికి వ్యతిరేకంగా వుండే చిదంబరం, అరుణాచలంలు మాత్రం తమ పదవులను అంటిపెట్టుకునే వున్నారు. వారిని తమిళద్రోహులుగా జయలలిత ముద్ర వేసింది. దాంతో చిదంబరం తమిళనాడులో పర్యటిస్తూండగా అతని  కారుపై ఎడిఎంకె కార్యకర్తలు దాడి చేశారు. చిదంబరం, జయలలితల మధ్య వైరం అప్పటికీ యిప్పటికీ కొనసాగుతూనే వుంది. 

జయలలిత పగ మర్చిపోయే మనిషి కాదు. పదవిలోకి వచ్చిన మూణ్నెళ్లలోగా  తన పార్టీకి చెందిన కెపి రామలింగం అనే ఎమ్మెల్యేను పోలీసుల చేత అరెస్టు చేయించింది. అతని నేరం ఏమిటంటే 1987లో ఎమ్జీయార్‌ అంతిమయాత్రలో వాహనంలోంచి  తనను బయటకు నెట్టేశాడని జయలలిత పెట్టిన కేసులో అతను నిందితుడు. తర్వాత కేసు కొట్టేశారు, ఎందుకంటే సంఘటన జరిగిన రెండేళ్ల లోపుగా కేసు రిజిస్టరు కాలేదు! ఆ తర్వాత డిఎంకె ప్రభుత్వంలో హోం సెక్రటరీగా చేసిన కె నాగరాజన్‌ను ''తరాసు'' పత్రిక ఆఫీసుపై జరిగిన దాడిలో నిందితుడిగా అరెస్టు చేయించింది. డిఎంకె ప్రతినిథి ఆలడి అరుణ ''నక్కీరన్‌'' పత్రికకు యింటర్వ్యూ యిస్తూ జయలలిత ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తోందని చెప్పాడు. వెంటనే పత్రికపై, అరుణపై పరువునష్టం దావా వేయించింది. ఇలా అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే జయలలిత పాలనాసామర్థ్యంలో, పగతీర్చుకోవడంలో  తను కరుణానిధికి తీసిపోనని నిరూపించుకుంది. (సశేషం) ఫోటో – తొలిసారి ముఖ్యమంత్రిగా జయలలిత చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న భీష్మనారాయణ్‌ సింగ్‌)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]