సినిమాలు, రాజకీయాలంటూ పవన్ కల్యాణ్ ఇంతకాలం రెండు పడవల పైనే ప్రయాణం చేస్తున్నారని అనుకుంటున్నారు జనం. కానీ ఆయన రెండు పార్టీలపై కూడా అటో కాలు, ఇటో కాలు వేశారు. ఆయనకి అవ్వా కావాలి, బువ్వా కావాలి. అందుకే ఇటు బీజేపీతో పొత్తు కొనసాగుతోందని చెప్పారు.
అటు టీడీపీ విషయంలో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు. అసలు పవన్ సంగతేంటి. టీడీపీ కావాలి, బీజేపీ కావాలి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చీలకూడదు. ఇదీ ఆయన పద్ధతి.
బీజేపీ సంగతేంటి..?
పవన్ కల్యాణ్ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని స్టేట్ మెంట్లు ఇస్తున్నా.. ఆయన మిత్రపక్షం బీజేపీ మాత్రం బాబుతో కలిసేందుకు ససేమిరా అంటోంది. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా ఘాటుగా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కుటుంబ పార్టీలతో తాము కలసి పనిచేయబోమని తెగేసి చెప్పారు. 2024లో బీజేపీ, జనసేన కలసి అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇటు పవన్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీతో తాము పొత్తులో ఉన్నామని అంటూనే.. అటు టీడీపీతో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చను అంటూ.. వైసీపీకి ప్రత్యామ్నాయం రావాలంటున్నారు. ఆ విషయంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెబుతున్నారు పవన్ కల్యాణ్. సండే షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి, కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన పవన్.. పొత్తులపై ఇలా చిత్రవిచిత్రంగా స్పందించారు.
ప్రస్తుతం పవన్ బీజేపీతో స్నేహం చేస్తున్నారు. తన స్నేహితుడుకి చంద్రబాబు అనే శత్రువు ఉన్నాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కానీ, స్నేహితుడి శత్రువు తనకి కూడా శత్రువే అవుతాడనే విషయం పవన్ మరచిపోయాడు. అందరం కలసి మిత్రులైపోదాం.. జగన్ చెప్పినట్టు దుష్టచతుష్టయంగా మారి వైసీపీపై దాడి చేద్దామంటున్నారు పవన్.
అయితే మరోసారి ప్యాకేజీకి అమ్ముడుపోడానికి పవన్ సిద్ధంగా ఉన్నా.. టీడీపీ మాయలో పడేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. చివరికి ఆ అద్భుతం ఏంటో.. పవన్ పరిస్థితి ఏంటో.. వేచి చూడాల్సిందే. మొత్తమ్మీద ఒక విషయం మాత్రం పవన్ కల్యాణ్ కి బాగా బోధపడింది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ జనసేన ఒంటరిగా అధికారంలోకి రాలేదు. వాళ్ల కాళ్లో, వీళ్ల గడ్డాలో పట్టుకుని బండి నెట్టుకు రావాల్సిందే.