విశాఖ అంటే జగన్ కి చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలనారాజధాని చేయాలన్నది ఆయన కోరిక. ఆ విషయం పక్కన పెడితే తొలి రెండున్నరేళ్ల పాటు విశాఖ టూర్లు పెద్దగా చేయని జగన్ కొద్ది నెలలుగా విశాఖను చుట్టేస్తున్నారు.
గత నెలలో మూడు సార్లు విశాఖ వచ్చి మరీ రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి మే నెల వస్తూనే మరో మారు విశాఖ వైపు తన ప్రత్యేక విమానం తిప్పేశారు. సీఎం ఈ నెల 12న విశాఖ రానున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాను మూడుగా విభజించాక ప్రత్యేకించి ఏజెన్సీని అల్లూరి జిల్లాగా చేశాక ఫస్ట్ టైమ్ ఆయన అరకు టూర్ కి రానున్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు అధికార అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు అని తెలుస్తోంది. అనధికార కార్యక్రమం అంటే అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ కుమారుడి వివాహానికి సీఎం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
ఇక చాలా కాలానికి అరకు టూర్ చేస్తున్న జగన్ ఈ సందర్భంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష చేయనున్నారు అని చెబుతున్నారు. అదే విధంగా పాడేరు కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లా సమస్యల గురించి కూడా వాకబు చేయనున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి మన్నెం టూర్ కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.