ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 24

ఎన్ని లొంగినా స్టిర్లింగ్‌ కోట మాత్రం లొంగటం లేదు. దాన్ని పట్టుకోవలసిన బాధ్యత బ్రూసు తన సోదరుడు ఎడ్వర్డుకి అప్పగించాడు. కొంతకాలానికి స్టిర్లింగ్‌ గవర్నరు ఒక ప్రతిపాదన చేశాడు. ''ఇంగ్లండు రాజు నుండి సైన్యసహాయం…

ఎన్ని లొంగినా స్టిర్లింగ్‌ కోట మాత్రం లొంగటం లేదు. దాన్ని పట్టుకోవలసిన బాధ్యత బ్రూసు తన సోదరుడు ఎడ్వర్డుకి అప్పగించాడు. కొంతకాలానికి స్టిర్లింగ్‌ గవర్నరు ఒక ప్రతిపాదన చేశాడు. ''ఇంగ్లండు రాజు నుండి సైన్యసహాయం వస్తుందని ఎదురు చూస్తున్నాను. వేసవికాలం నాటికి కూడా రాకపోతే అప్పుడు లొంగిపోతాను.'' అని. ఎడ్వర్డు సరే అన్నాడు.  అది విని బ్రూసుకి కోపం వచ్చింది. ఏడాది గడువుంది, భారీగా ఇంగ్లీషు సైన్యం వచ్చి పడితే వాళ్లతో పోట్లాడడం ఎలా? అని మందలించాడు. 'వస్తే రానీయనీ, మన తడాఖా చూపిద్దాం' అన్నాడు తమ్ముడు. నీ కంత ధైర్యం వుంటే అలాగే కానీ అన్నాడు బ్రూసు. 

వాళ్లూహించినట్లుగానే రెండో ఎడ్వర్డు భారీ సైన్యంతో వచ్చిపడ్డాడు. ఫ్రాన్సు, వేల్స్‌, ఐర్లండ్‌ నుంచి సైనికులు పోగు చేసుకుని స్టిర్లింగ్‌ వచ్చాడు. 1314 జూన్‌ 23 న రెండు సైన్యాలు బ్యానక్‌ నది ఒడ్డున మైదానంలో మోహరించాయి. బ్రూసు మైదానంలో గోతులు తవ్వించి వాటిలో యీటెలు గుచ్చి పైన కొమ్మలు, రెమ్మలు పరిచి కనబడకుండా చేశాడు. ఇంగ్లీషు ఆశ్వికదళం వచ్చినప్పుడు గుఱ్ఱాలు ఆ గోతుల్లో పడి యిరుక్కుపోయాయి. ఆ భీకరయుద్ధంలో 30 వేల మంది ఇంగ్లీషు సైనికులు నశించారు. వాళ్ల రాజు  యుద్ధభూమి విడిచి పారిపోయాడు. చాలామంది సైనికులు ఖైదీలుగా పట్టుబడ్డారు.  బ్రూసు వారిపై కరుణ చూపాడు. వాళ్లలో చాలామంది జమీందార్లు, సామంతరాజులు వున్నారు కాబట్టి వారి బంధువులు డబ్బు చెల్లించి వారిని విడిపించుకున్నారు. ఆ విధంగా చాలా ధనం సమకూరింది. దానికి తోడు ఇంగ్లీషు సైన్యం చాలా సరంజామా విడిచి పారిపోయింది.  తన వద్ద చేరిన డబ్బుతో బ్రూసు ఎనిమిది సంవత్సరాలుగా ఇంగ్లీషు ఖైదులో మగ్గుతున్న తన భార్యను, కూతుర్ని, అక్కాచెల్లెళ్లను, బుచాన్‌ కౌంటెస్‌ వంటి యితర స్త్రీలను విడిపించుకున్నాడు. బాటిల్‌ ఆఫ్‌ బానక్‌బర్న్‌గా పిలవబడే యీ యుద్ధంతో స్కాట్లండ్‌ విముక్తి చెందింది. బ్రూసు మళ్లీ రాజయ్యాడు. చక్కగా పాలన చేయసాగాడు. 

ఆ కాలంలో ఇంగ్లండులో చాలా రాజకీయపరిణామాలు సంభవించాయి. ఈ పరాజయం తర్వాత, కరువు కూడా వచ్చిపడింది. దాంతో రాజుపై విమర్శలు పెరిగాయి. డెస్పెన్సర్‌ రాచకుటుంబానికి చెందిన హ్యూ అనే అనే అతను రాజుకు సలహాదారుడిగా, స్నేహితుడిగా మారాడు. అతని దుర్బోధలకు రాజు లొంగుతున్నాడని భావించిన లంకాస్టర్‌, యితర సామంతరాజులు డెస్పెన్సర్‌ భూములను స్వాధీనం చేసుకుని వారికి బయటకు పంపేయాలని ఉద్యమం నడిపారు. బదులుగా రాజు లంకాస్టర్‌పై దండయాత్ర చేసి అతన్నే ఉరి తీశాడు. హ్యూ సలహా మేరకు 1311 నాటి సంస్కరణలను పూర్తిగా రద్దు చేసి, సర్వాధికారాలు దఖలు పరుచుకుని తనకు వ్యతిరేకంగా వున్న సామంతరాజుల ఆస్తులు, భూములు స్వాధీనం చేసుకున్నాడు. దీనిపై ప్రజల్లో విముఖత పెరిగింది. బయటి దేశాలు దీన్ని అలుసుగా తీసుకుని ఇంగ్లండుపై దాడి చేద్దామని చూడసాగాయి.

అప్పుడు రాజు తన భార్య అయిన ఇసబెల్లాను 1325లో పుట్టిల్లు ఫ్రాన్సుకి పంపి సైనికసహాయ ఒప్పందం కుదిరేట్లా ప్రయత్నాలు చేయమన్నాడు. ఆమె అక్కడకు వెళ్లాక భర్తకు ఎదురు తిరిగింది. అంతేకాదు, దేశం నుంచి పారిపోయి ఫ్రాన్సులో తలదాచుకున్న రోజర్‌ మార్‌టైమర్‌తో చేతులు కలిపింది. అతను రాజు చేత 1316లో ఐర్లండ్‌కు రాజప్రతినిథిగా నియమించబడ్డాడు. అయితే 1322లో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపి, టవర్‌ ఆఫ్‌ లండన్‌లో ఖైదు చేయబడ్డాడు. అక్కణ్నుంచి అతను తప్పించుకుని పారిపోయి ఫ్రాన్సులో అజ్ఞాతంగా వున్నాడు. అప్పటికే వివాహితుడైన అతనికి, ఇసబెల్లాకు మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి 1326లో ఇంగ్లండుపై దాడి చేశారు. రెండో ఎడ్వర్డు ఓడిపోయి వేల్స్‌కు పారిపోయాడు. అతన్ని పట్టుకుని లండన్‌కు తీసుకుని వచ్చి బలవంతంగా కిరీటం లాక్కుని తమ కొడుకైన 14 ఏళ్ల మూడో ఎడ్వర్డు తల మీద పెట్టించింది. ఆ విధంగా 1327 జనవరిలో మూడో ఎడ్వర్డు రాజయ్యాడు. రెండో ఎడ్వర్డును బెర్కిలీ కోటలో బంధించి వుంచారు. ఖైదులో వుండగానే సెప్టెంబరులో అతన్ని కాపలాదారులు హత్య చేశారు. అది మార్‌టైమర్‌ ఆదేశాల మేరకే జరిగిందని అంటారు. మూడో ఎడ్వర్డు పేరుకి రాజైనా మూడేళ్లపాటు ఇసబెల్లా ప్రియుడిగా మార్‌టైమరే అసలైన రాజుగా వ్యవహరించాడు. మూడో ఎడ్వర్డ్‌కు 17 ఏళ్లు వచ్చేసరికి ధైర్యం వచ్చింది. 1330లో మార్‌టైమర్‌పై ఆరోపణలు చేసి టైబర్న్‌లో ఉరి తీయించాడు. 

1327లో రెండో ఎడ్వర్డు పదభ్రష్టుడు కావడంతో స్కాట్లండ్‌లో రాబర్ట్‌ బ్రూసుకు ధైర్యం వచ్చింది. స్కాట్లండ్‌ను కాపాడుకునే పనిలోంచి ఇంగ్లండును ఓడించే పనిలో పడ్డాడు. 20 వేల సైన్యాన్ని తీసుకుని దండయాత్రకు బయలుదేరాడు. వారి దగ్గర కవచాలు కూడా లేవు. ఓట్‌ అనే కాయధాన్యం నింపిన సంచీ ఒకటి, యినుప పెనం ఒకటి వుంది. ఇంగ్లండుకి వెళ్లే దారిలో తగిలిన ఊళ్లల్లో కనబడిన గొఱ్ఱెలను, మేకలను చంపడం, అక్కడికక్కడ కాల్చుకుని, ఓట్‌తో కలిపి తినడం – యిదే వారి వ్యాపకం. ఇలా అతి తక్కువ సరంజామాతో బయలుదేరిన స్కాట్‌ సైన్యాన్ని ఆనుపానులు కనిపెట్టడం ఇంగ్లీషు సైన్యం తరం కాలేదు. కుర్రవాడైన మూడో ఎడ్వర్డు చేతులెత్తేశాడు. చివరకు బ్రూసుతో నార్త్‌యాంప్టన్‌ వద్ద సంధి చేసుకున్నాడు. దాని ప్రకారం స్కాట్లండ్‌పై సర్వహక్కులు వదులుకోవడంతో బాటు తన చెల్లెలు జోన్‌ ఆఫ్‌ ద టవర్‌ను బ్రూసు కొడుక్కి యిచ్చి పెళ్లి చేశాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే 1329లో బ్రూసు మరణించాడు. అతని కప్పుడు 55 ఏళ్లే. కానీ నిరంతరం పోరాటాలతో అలసి పోయి అతని శక్తి క్షీణించింది. చనిపోతూ అతను రెండు కోర్కెలు కోరాడు. తన కొడుకు డేవిడ్‌ (రెండో డేవిడ్‌ అంటారు)ని తన వారసుణ్ని చేయమని, తను చనిపోయాక తన హృదయాన్ని భద్రపరచి, పాలస్తీనాకు తీసుకెళ్లమని! మొదటి కోరిక నెరవేరింది కానీ రెండోది తీరలేదు. 

ఇక్కడితో రాబర్ట్‌ ద బ్రూస్‌ కథ పూర్తయింది.  ఇక రెండో ఎడ్వర్డు భార్య ఇసబెల్లా గురించి చరిత్ర ఏం చెప్తోందో కూడా చెప్పాను. ''బ్రేవ్‌హార్ట్‌'' సినిమాలో (కథ చదివి వుంటారు) ఆమెను విలియం వాలెస్‌ ప్రియురాలిగా చూపించి కథ మార్చేశారు. అందుకే వివాదం చెలరేగింది. తర్వాతి గాథలు రోమ్‌ గురించి! (సశేషం)  (చిత్రాలు – బాటిల్‌ ఆఫ్‌ బానక్‌బర్న్‌, ఇసబెల్లా)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives