అంతలో అతనికి ఆలోచన వచ్చింది. ఈ హత్యను చారుదత్తుడి మీదకు తోసేస్తే తన పగ కూడా తీరుతుంది కదాని. అక్కణ్నుంచి సరాసరి న్యాయస్థానానికి వెళ్లాడు. దాన్ని అధికరణ మండపం అంటారు. అధికరణికుడు అనేవాడు తీర్పు చెపుతాడు. శకారుడు వెళ్లేసరికి అక్కడ శోధనకుడు అంటే బంట్రోతు కనబడ్డాడు. ఇతను వెళ్లి 'చారుదత్తుడు వసంతసేన నగల కోసం ఆమెను చంపివేశాడని అభియోగం చేయడానికి వచ్చాను' అని చెప్పాడు. అతను యితన్ని కూర్చోబెడుతూండగానే అధికరణికుడు జ్యూరీ సభ్యులతో సహా వచ్చాడు. జ్యూరీ సభ్యులలో ఒక శ్రేష్ఠి (వ్యాపారస్తుడు), ఒక కాయస్థుడు (విషయ లేఖకుడు) వున్నారు. శకారుడు వచ్చాడని వినగానే న్యాయాధీశుడు 'అయితే ఎవడో సజ్జనుడికి మూడి వుంటుంది' అని నిట్టూర్చి ఇవాళ కాదు, రేపు చూస్తానని చెప్పమన్నాడు. బంట్రోతు ఆ మాట చెప్పగానే శకారుడు మండిపడ్డాడు, మా బావగారికి చెప్పి యితని స్థానంలో వేరేవాణ్ని వేయిస్తానని రంకెలు వేశాడు. బంట్రోతు లోపలకి వెళ్లి ఆ మాట చెప్పడంతో న్యాయాధీశుడు నెత్తి కొట్టుకుని 'సరే, కానీ అతన్ని ప్రవేశపెట్టు' అన్నాడు. శకారుడు లోపలకి రాగానే ఆసనంపై కూర్చోమన్నాడు.
'నేను రాజుగారి బావమరిదిని, ఎక్కడైనా కూర్చోగలను.' అంటూ 'శ్రేష్ఠి ఒళ్లో కూర్చోనా, కాయస్థుణ్ని లేపి అక్కడ కూర్చోనా, లేక నీ నెత్తి మీద కూర్చోనా' అంటూ పిచ్చివేషాలు వేసి చివరకు నేల మీద చతికిలపడ్డాడు. 'సరే, నీ వ్యవహారం ఏమిటో చెప్పు' అన్నాడు న్యాయాధిపతి విసుగ్గా. 'నాది గొప్ప వంశం. మా నాన్న రాజుగారికి మావగారు, రాజుగారేమో మా నాన్నకు అల్లుడు. నా సోదరి రాజుగారి భార్య, నేను రాజుగారి బావమరిదిని…' అని తిప్పితిప్పి చెప్పసాగాడు శకారుడు.
'అది సరే, యింతకూ నీ వ్యాజ్యం ఏమిటో చెప్పు.'
'నేను విహరించడానికి మా బావగారైన రాజుగారు పుష్పకరండకం అనే పాత ఉద్యానాన్ని యిచ్చాడు. రోజూ దాని బాగోగులు చూసుకోవడానికి వెళుతూ వుంటాను. అక్కడ ఒక స్త్రీ శవాన్ని చూశాను.'
'అవునా? ఆ స్త్రీ ఎవరో తెలుసా?'
'తెలుసు. వసంతసేన! ఆమెను బాహుబలంతో పీక నులిమి చంపాను.. కాదు, కాదు.. చంపాడు' అని తొట్రుపడ్డాడు శకారుడు.
'కాయస్థా, యితని తడబాటును అదే విధంగా లిఖించు' అన్నాడు న్యాయాధీశుడు. జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను రికార్డు చేస్తున్న కాయస్థుడు నేల మీద సుద్దతో అది రాయగానే (తర్వాత సాక్షి చేత ధృవీకరింప చేసుకుని తాళపత్రాల కవిలె కట్టల్లోకి రాస్తారు) శకారుడు '..చూశాను అనబోయి చంపాను అన్నాను. అదేదో పెద్ద కీలకపదం అయినట్లు మీ హంగామా ఏమిటి?' అంటూ కాలితో ఆ సుద్దరాతను చెరిపివేశాడు.
'ధనం కోసం చంపాడని, పీక నులిమాడని నీకెలా తెలుసు?' అడిగాడు న్యాయమూర్తి.
'ఆమె మెడ బోసిగా వుంది కాబట్టి నగల కోసం చంపి వుంటాడని వూహించాను. మెడ మీద కనబడుతున్న గుర్తుల బట్టి పీక నులిమి వుంటాడనుకుంటున్నాను.'
ఇది విన్నాక న్యాయాధీశుడు వసంతసేన తల్లిని రప్పించాడు. 'వసంతసేన ఎక్కడ?' అని అడిగాడు. 'ఒక స్నేహితుడి యింటికి వెళ్లింది' అందామె.
'ఆ మిత్రుడి పేరేమిటి?' – 'ఇది బహిరంగంగా చెప్పవలసిన విషయం కాదేమో'
'ఒక వ్యాజ్యం విషయంగా అడగవలసి వస్తోంది'
'వ్యాజ్యమా? అయితే చెప్తాను. చారుదత్తుడి యింటికి వెళ్లి యవ్వనపు ఆనందాన్ని అనుభవిస్తోంది.'
న్యాయాధీశుడు కాయస్థుడి కేసి తిరిగి 'వసంతసేన చారుదత్తుడి యింటికి వెళ్లిందన్న విషయాన్ని యీ వ్యాజ్యంలో ప్రథమ అంశంగా లిఖించు' అని చెప్పి చారుదత్తుణ్ని పిలిపించాడు.
బంట్రోతు వచ్చి చెప్పగానే చారుదత్తుడు 'ఇది అపశకునంలాగానే వుంది. ఆర్యకుణ్ని తప్పించానని వేగుల ద్వారా రాజుకి తెలిసి వుంటుంది. సరే కానీ, న్యాయస్థానానికి వెళ్లాల్సిందే కదా' అనుకుంటూ వచ్చాడు. అతను రాగానే కుర్చీ వేసి కూర్చోబెట్టి 'ఈమె వసంతసేన తల్లి, యీమె కూతురుకి నీతో ప్రణయం వుందా?' అని అడిగారు.
ఆవిడను మొదటిసారి చూశాడు కాబట్టి చారుదత్తుడు ఆమెకు నమస్కరించాడు. అతన్ని చూసి ఆమె మా అమ్మాయి అందగాణ్ని, మంచివాణ్ని వరించిందే అని సంతోషించింది.
'ఇంతకీ నీ సమాధానం ఏమిటి?' అని అడిగితే చారుదత్తుడు 'ఒక వేశ్య నాకు నేస్తమని యిందరి ముందు ఎలా చెప్పడం?' అంటూ సిగ్గుపడ్డాడు.
'వ్యాజ్యం విషయంగా అడగవలసి వస్తోంది' అన్నాడు న్యాయమూర్తి.
'వ్యాజ్యమా? దేని గురించి?'
వెంటనే శకారుడు లేచి 'ఓరీ మోసగాడా, వసంతసేనను చంపి వచ్చి యిప్పుడు నాటకాలు ఆడుతున్నావా?' అని అరిచాడు.
'ఏవిటీ అసంబద్ధపు మాటలు' అని చారుదత్తుడు చికాకు పడ్డాడు.
న్యాయమూర్తి 'ఇప్పుడు వసంతసేన ఎక్కడ?' అని అడిగాడు.
'ఇంటికి వెళ్లింది' అని చారుదత్తుడు సమాధానం యిచ్చాడు.
కాయస్థుడు 'తోడుగా ఎవరు వెళ్లారు?' అని ప్రశ్నిస్తే చారుదత్తుడు క్లుప్తంగా 'ఇంటికి వెళ్లింది. అంతకంటె చెప్పడానికి ఏమీ లేదు' అన్నాడు. శకారుడు ఆవేశపడుతూ 'నగలకోసం వసంతసేనను నా ఉద్యానవనంలోనే చంపి పారేసి, యిప్పుడేమో యింటికి వెళ్లిందని దొంగ బుర్లు చెపుతున్నాడు' అని అరవసాగాడు.
చారుదత్తుడికి కోపం వచ్చింది. 'ఓరీ అసంబద్ధ ప్రలాపీ, నీ మొహం చూస్తే అబద్ధం చెప్తున్నావని స్పష్టంగా తెలుస్తోంది'' అన్నాడు.
'ఇలాటి చారుదత్తుడు తప్పు చేశాడంటే నమ్మడం ఎలా?' అన్నాడు న్యాయాధిపతి జనాంతికంగా.
'చూడబోతే మీరు అతని పట్ల పక్షపాతం చూపిస్తున్నట్లుందే' అని శకారుడు తప్పుపట్టాడు. న్యాయమూర్తి వివరించాడు – 'ఇంటికి వచ్చిన అడిగినవారికి తన సొమ్మంతా పంచిపెట్టిన మహానుభావుడతను. సొమ్ముల కోసం ఆమెను సంహరిస్తాడా? వారిద్దరి మధ్య స్నేహం వుందని, వలచి అతని యింటికి వెళ్లిందని ఆమె తల్లి కూడా చెప్తోంది. ఇతను కోరితే ఆమె నగలు యిచ్చివేయడానికి కూడా సిద్ధపడేదేమో. అలాటప్పుడు ఆమెను చంపవలసిన అవసరం అతని కేముంది?'
వసంతసేన తల్లి 'ఇంకొక విషయం. నా కూతురు అతని యింట్లో దాచిన నగలమూట చోరీకి గురైతే దానికి మింజువలె ఖరీదైన రత్నహారాన్ని పంపించిన ఉత్తముడతను. పనికి మాలిన సొమ్ము కోసం యిలాటి అకృత్యం చేస్తాడా? అబద్ధం. అసలు నా వసంతసేనకు ఏమీ జరిగి వుండకపోవచ్చు' అని జోడించింది.
చారుదత్తుడి బండిని పోనిచ్చే వివాదంలో చందనకుడితో తన్నులు తిన్న వీరకుడు అతనిపై ఫిర్యాదు చేయడానికి సరిగ్గా అదే సమయానికి న్యాయస్థానానికి వచ్చాడు. ఎందుకని వచ్చావనగానే సంగతి చెప్పాడు. న్యాయమూర్తి నువ్వు ఆపిన బండి ఎవరిది అని అడిగాడు. 'చారుదత్తుడిది, దానిలో వసంతసేన వుందని, పుష్పకరండక ఉద్యానానికి తీసుకుని వెళుతున్నానని బండివాడు చెప్పాడు' అన్నాడు వీరకుడు. 'ఓహో, చారుదత్తుడిపై అభియోగం మరింత బలపడుతోందే' అనుకున్న న్యాయమూర్తి 'వీరకా, నీ తగవు తర్వాత తీరుస్తాను. ముందుగా పుష్పకరండకానికి వెళ్లి అక్కడ స్త్రీ శవం ఏదైనా వుందా అని చూసిరా'' అని పంపించాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)