జయలలిత తన ప్రతాపాన్ని చూపించడంతో అసెంబ్లీ ఎన్నికలలో తనతో పొత్తు పెట్టుకోనందుకు కాంగ్రెసు నాలిక కరుచుకుంది. పొత్తుకు అడ్డుపడిన మూపనార్ బృందాన్ని శిక్షించదలచింది. నిజానికి మూపనార్ సలహా విని కాంగ్రెసు విజయావకాశాలు దెబ్బ తీసిన పొరపాటు రాజీవ్ గాంధీదే. అయితే అధినాయకుణ్ని తప్పుపట్టే సాహసం ఎవరికీ లేదు కాబట్టి మూపనార్‌కు శిక్ష వేయడానికి నిశ్చయించుకున్నారు. ఓటమి తర్వాత కూడా జయలలితతో సర్దుబాటు చేసుకోవడానికి మూపనార్ సిద్ధపడలేదు. మార్చి 25 ఘటన తర్వాత ఆసుపత్రిలో చేరిన జయలలిత అక్కణ్నుంచే 'కాంగ్రెసుతో చేతులు కలిపి డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని' ప్రకటన చేసింది. కానీ దానికి మూపనార్ స్పందించలేదు. అధికారంలోకి వస్తూనే డిఎంకె కాంగ్రెసుకు సన్నిహితుడైన ఎసి ముత్తయ్య (స్పిక్) నుంచి అతని కంపెనీలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఎమ్జీయార్ కాలంలో 77 రాష్ట్ర కార్పోరేషన్లు పెట్టి చైర్మన్లగా, ఆస్థాన కవి, ఆస్థాన నర్తకి వంటి 30 పదవులు సృష్టించి ఆశ్రితులకు, ఎడిఎంకె నాయకులకు, కాంగ్రెసు నాయకులకు పంచిపెట్టాడు. రుణానిధి వస్తూనే అవన్నీ రద్దు చేసి, వాళ్లందరినీ పదవీభ్రష్టులను చేశాడు. అయినా మూపనార్ జయలలితతో చేతులు కలిపి డిఎంకెను ఎదిరించాలని అనుకోలేదు.
ఇది గమనించి రాజీవ్ ఒకప్పటి తన ఆత్మీయుడు మూపనార్‌కు ముకుతాడు వేయడమే కాదు, చెత్తబుట్టలో పడేయడానికి నిశ్చయించుకున్నాడు. చాలా అవమానకరంగా పదవి నుంచి దింపడానికి రంగం సిద్ధం చేశాడు. కాంగ్రెసు కార్మికసంఘం ఐఎన్టియుసి, మరకతం చంద్రశేఖర్ వర్గం, యూత్ విభాగం మూపనార్పై ధ్వజం ఎత్తాయి. మొదటినుంచి మూపనార్‌ను, జయలలిత పట్ల అతని వ్యతిరేకతను బహిరంగంగా విమర్శిస్తూ వచ్చిన వాళప్పాడి రామమూర్తికి ప్రాధాన్యత యివ్వసాగారు. అందరూ కలిసి మూపనార్ గత ఏడాదిగా పార్టీ నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలమయ్యాడని విమర్శలు గుప్పించారు. రాజీవ్ కేంద్రమంత్రి దినేశ్ సింగ్‌ని తమిళనాడు కాంగ్రెసు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా నియమించాడు. అతను వచ్చి జయలలితను కలిసి చర్చలు జరిపాడు. ఆమె మూపనార్‌ను తీసేసి అతని స్థానంలో తనకు అనుకూలుడైన రామమూర్తిని వేయాలని పట్టుబట్టింది. దినేశ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెసులో మూపనార్‌కు వ్యతిరేకంగా వున్నవారిని కలిసి ఢిల్లీకి తిరిగి వచ్చి మూపనార్ స్థానంలో రామమూర్తిని నియమించాలని సిఫార్సు చేశాడు. మూపనార్‌కు ఒక్కమాట కూడా చెప్పకుండా రాజీవ్ అతన్ని తీసేశాడు.
రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడగానే రామమూర్తి మూపనార్‌ను కసిదీరా తిట్టిపోశాడు. ''ఇకపై రాజీవ్ హితైషులకు మాత్రమే పార్టీలో ప్రముఖస్థానం'' అన్నాడు – మూపనార్ రాజీవ్ హితైషి కాదనే అర్థంలో! పిసిసిలో ఇద్దరు తప్ప తక్కిన మూపనార్ మద్దతుదారులందర్నీ తీసిపారేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే పదవి చేపడుతూనే రామమూర్తి చేసిన మొదటి పని – జయలలిత యింటికి వెళ్లి పలకరించి వచ్చాడు. తనే కాంగ్రెసు అధ్యక్షుణ్ని మార్పించానని జయలలిత తన పార్టీ నాయకుల సమావేశంలో గొప్పగా చెప్పుకుంది. అయితే మూపనార్ మనుషులు వూరికే లేరు. రామమూర్తి విరుదనగర్ కి వెళితే మూపనార్ మనుషులు అతని కారుమీద రాళ్లేశారు. మూపనార్ అనుచరులు ఏప్రిల్ 22న సమావేశమయ్యారు. వారిలో 20 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు, జిల్లా అధ్యక్షుల్లో చాలామంది హాజరయ్యారు. ఎందుకంటే కాంగ్రెసు నాయకుల్లో 60% మంది మూపనార్ వెంట 1976లో కాంగ్రెసులో చేరినవారే!
మూపనార్ ఏం గింజుకున్నా కాంగ్రెసు, ఎడిఎంకె 1989 నవంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కలిసి పోటీ చేసి 57% ఓట్లతో 39 సీట్లలో 38 గెలుచుకుని అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నాయి. కాంగ్రెసుకు 27, ఎడిఎంకెకు 11 వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ కూటమి 34% ఓట్లు తెచ్చుకుంది. దానిలో సిపిఐకు 1 రాగా డిఎంకెకు ఒక్క సీటు కూడా రాలేదు. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెసు ఓడిపోయి నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. 1984 ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రాజీవ్ గాంధీ బోఫోర్స్ వివాదంలో యిరుక్కోవడంతో అతని ప్రతిష్ఠ మసకబారి 1989లో దేశంలో చాలాచోట్ల ఓడిపోయాడు. చివరివరకు అతనికి సహచరుడిగా వున్న విపి సింగ్ సరైన సమయంలో బయటకు వచ్చేసి రాజీవ్‌ని అవినీతిపరుడిగా, తనను విశుద్ధవ్యక్తిగా ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారం ఫలించింది. నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రధాని పదవికి చాలామంది పోటీపడ్డారు. ఆ అర్హత తనకే వుందని చంద్రశేఖర్ నమ్మాడు. కానీ అతని వీపుచాటున విపి సింగ్, దేవీలాల్ రహస్య ఒప్పందానికి వచ్చి ఆఖరి నిమిషంలో దగా చేశారు. విపి సింగ్ ప్రధానిగా, దేవీలాల్ ఉపప్రధానిగా అయిపోయారు. విపి సింగ్ కాబినెట్లో కరుణానిధికి మేనల్లుడు, రాజ్యసభ ఎంపి మురసొలి మారన్ మంత్రి అయ్యాడు.
ప్రధాని అయ్యాక విపి సింగ్ అవినీతి నిరోధానికి చేసినదీ, బోఫోర్స్ నిందితులను పట్టించడానికీ చేసినది ఏమీ లేదు కానీ తనకై బిసి ఓటు బ్యాంకు నిర్మించుకోవడానికి మండల్ కమిషన్ నివేదికను అమలు చేశాడు. అది సమాజంలో అశాంతిని రగిలించింది. అతనికి మద్దతు తగ్గింది. అదను చూసి చంద్రశేఖర్ పావులు కదిపాడు. రాజీవ్ మద్దతు సంపాదించాడు. దేవీలాల్‌కు ఉపప్రధాని పదవి ఆశ చూపి తనవైపు తిప్పుకున్నాడు. జనతాదళ్ పార్టీ చీల్చి జనతాదళ్ (ఎస్) పేరుతో వేరే పార్టీ పెట్టి కాంగ్రెసు, ఎడిఎంకె బయటిమద్దతుతో ప్రభుత్వం ఏర్పరచి 1990 నవంబరులో తను ప్రధాని అయ్యాడు. ఇక జయలలిత రుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కాంగ్రెసు ద్వారా ఒత్తిడి తెచ్చింది. ఒకప్పుడు సోషలిస్టు నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యీ దశలో పచ్చి అవకాశవాదిగా తేలాడు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 1991 జనవరి చివర్లో కరుణానిధి ప్రభుత్వాన్ని కూలదోశాడు. దానికి అతనికి దొరికిన కారణం – ఎల్‌టిటిఇకి కరుణానిధి యిస్తున్న మద్దతు. రాజీవ్ హత్య సీరీస్‌లో యీ అంశం గురించి విపులంగా రాశాను. ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే – శ్రీలంకలో తమిళులు తమకు ప్రత్యేక దేశం కావాలంటూ చేస్తున్న పోరాటానికి సాటి తమిళులన్న భావంతో తమిళనాడులోని తమిళులు మద్దతు యిస్తున్నారనే భావంతో ద్రవిడ పార్టీలు శ్రీలంక తమిళులకు మద్దతు యిస్తూ వచ్చాయి. అయితే శ్రీలంక తమిళ పార్టీలు కూడా అన్నీ ఒకలా లేవు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కొందరంటే హింసాత్మక పోరాటం ద్వారా విజయం సాధించాలని కొందరన్నారు. వారందరిలో ఎల్‌టిటిఇ ఆయుధాలు చేతపట్టి శ్రీలంక సైన్యంతోనే కాక, యితర తమిళ సంఘాలతో కూడా పోరాడి, వారిని మట్టుపెట్టింది. దాని ధాటికి తట్టుకోలేక తమిళనాడు వచ్చి తలదాచుకున్న శాంతికాముక శ్రీలంక తమిళనాయకులను చంపసాగింది. ఎల్‌టిటిఇకి మద్దతు యివ్వడంలో ఎమ్జీయార్ కొంత సంయమనం పాటించగా కరుణానిధి వారేం చేసినా తప్పు పట్టకుండా వెనకేసుకుని వచ్చాడు. వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయం కూడగట్టాడు. వారిని అదుపు చేయడానికి రాజీవ్ శ్రీలంకకు ఐపిఎకెఎఫ్ (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) పేర శాంతిసేన పంపగా కరుణానిధి దానికి ఇన్నోసెంట్ పీపుల్ కిల్లింగ్ ఫోర్స్‌గా ముద్ర కొట్టాడు.
డిఎంకెలో కొందరు నాయకులు, దానికి అతి సన్నిహితంగా వుంటే డికెలో చాలామంది నాయకులు ఎల్‌టిటిఇకి పూర్తి మద్దతు యిచ్చారు. 1989లో కరుణానిధి అధికారంలోకి వచ్చీ రాగానే వైగో (వై. గోపాలస్వామి) అనే డిఎంకె నాయకుడు రుణానిధి తరఫున ఎల్‌టిటిఇ ప్రభాకరన్‌ను రహస్యంగా కలిసి వచ్చాడు. నెల్లాళ్లపాటు కనిపించకుండా పోయి తర్వాత బయటకు వచ్చి వెళ్లి ఎల్‌టిటిఇని భారతప్రభుత్వంతో చర్చలకై ఒప్పించానని చెప్పుకున్నాడు. చర్చలు, గిర్చలు జాన్తానై అని మర్నాడే ఎల్‌టిటిఇ ప్రకటించింది. వైగో చర్యపై మీ వ్యాఖ్య ఏమిటని రుణానిధిని అడిగితే దాన్ని ఆమోదించను, తిరస్కరించను అన్నాడు గడుసుగా. కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఎల్టిటిఇది ఆడినది ఆట, పాడినది పాట అయిపోయింది. 1990 జూన్‌లో వాళ్లు ఇపిఆర్ఎల్ఎఫ్ నాయకుడు పద్మనాభను 12 మంది అనుచరులతో సహా నగరం నడిబొడ్డులో కాల్చి పారిపోయారు. దోషులు తప్పించుకుపోవడానికి కరుణానిధి ప్రభుత్వం సహకరించింది. 1991 మేలో రాజీవ్ హత్య జరిగిన తర్వాత వేసిన విచారణ కమిషన్లు యిటువంటి అనేక విషయాలను వెలికిదీసి నిరూపించాయి. కరుణానిధి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని గవర్నరు నుంచి నివేదిక తెప్పించుకుని చంద్రశేఖర్ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాడు. ఇది జరిగిన 5 వారాలకే రాజీవ్ చిన్న సాకు పెట్టి చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించి కూలదోశాడు. 1991 మేలో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించారు. ఆ ఎన్నికల సందర్భంగానే రాజీవ్ తమిళనాడుకు రావడం, హత్యకు గురి కావడం జరిగాయి. (సశేషం)
ఫోటో – వాళప్పాడి రామమూర్తి
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)