ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 68

ఇప్పటిదాకా అనేక ముఖ్యపదవులు నిర్వహించి, రాష్ట్ర రాజకీయాల్లో ఘటనాఘటనసమర్థుడిగా వెలిగి, అనేకమంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకుని, బినామీ ముఖ్యమంత్రి పదవిదాకా ఎదిగిన వీరప్పన్‌ కుప్పలుతిప్పలుగా డబ్బున్నా హఠాత్తుగా రాజకీయంగా నిర్వీర్యం అయిపోవడం వింతగా తోస్తుంది.…

ఇప్పటిదాకా అనేక ముఖ్యపదవులు నిర్వహించి, రాష్ట్ర రాజకీయాల్లో ఘటనాఘటనసమర్థుడిగా వెలిగి, అనేకమంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకుని, బినామీ ముఖ్యమంత్రి పదవిదాకా ఎదిగిన వీరప్పన్‌ కుప్పలుతిప్పలుగా డబ్బున్నా హఠాత్తుగా రాజకీయంగా నిర్వీర్యం అయిపోవడం వింతగా తోస్తుంది. అతని జీవితాన్ని పరికిస్తే అతను తెరవెనుక మనిషే కానీ, తెరపై వెలగలేడని అర్థమవుతుంది.  వీరప్పన్‌ 1926 సెప్టెంబరులో పుట్టాడు. 2015 సెప్టెంబరులో 90 వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. (చిరంజీవి 60 వ పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన వ్యాసంలో చెప్పినట్లుగా 60 వ పుట్టినరోజు 60 వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు చేయాలి, 60 పూర్తయ్యాక కాదు) వీరప్పన్‌ పుదుక్కోటై జిల్లాకు చెందిన ధనిక చెట్టియార్‌ కుటుంబానికి చెందినవాడు. సాధారణంగా ఆ కుటుంబాల వారు నాటకాల కంపెనీల్లోకి వెళ్లరు. కానీ వీరప్పన్‌ తన 13 వ యేటి నుంచి టికెఎస్‌ బ్రదర్స్‌ డ్రామా కంపెనీల్లో నటుడిగా చేరాడు. తర్వాత కారైక్కుడికి వచ్చి న్యూస్‌ పేపరు ఏజన్సీ పెట్టాడు. అప్పుడే పెరియార్‌తో పరిచయం ఏర్పడి ఈరోడ్‌కు తన మకాం మార్చాడు. పెరియార్‌ ద్వారా అణ్నాతో, శివాజీ గణేశన్‌తో, కరుణానిధితో పరిచయాలు ఏర్పడ్డాయి. కృష్ణన్‌ డ్రామా కంపెనీగా మేనేజరుగా వుంటూ అది 1950లో మూతపడితే మద్రాసు చేరాడు. 

1953లో ఎమ్జీయార్‌తో పరిచయమైనప్పుడు అతను యితని నిర్వహణాసామర్థ్యాన్ని గుర్తించాడు. తన ఫిల్మ్‌ కంపెనీ ఎమ్జీయార్‌ ఫిల్మ్‌స్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టరును చేశాడు. ఆ బ్యానర్‌ కిందే కాకుండా వీరప్పన్‌ సత్యా మూవీస్‌ అనే సంస్థ పెట్టి ఆ బ్యానర్‌ కింద కూడా అనేక సినిమాలు తీశాడు. విలన్‌గా నటించి , కొన్ని సినిమాలు తీసిన పియస్‌ వీరప్ప వేరే వ్యక్తి. కొందరు పాత్రికేయులు యీ వీరప్పన్‌ను పొరపాటున విలన్‌పాత్రధారిగా పేర్కొన్నారు. ఈయనా నటుడే, కానీ చిన్నచిన్న వేషాలు సరదాగా వేశాడు. ప్రధానవృత్తి చిత్రనిర్మాణం, పార్టీ కార్యకలాపాల, ఎమ్జీయార్‌ అభిమాన సంఘాల నిర్వహణ, తదుపరి రోజుల్లో రాజకీయాల్లో ఎమ్జీయార్‌కు కుడిచేయి. నిర్మాతగా అతనికి చాలా ఘనతే వుంది. ఎమ్జీయార్‌ తరఫున ''అడిమై పెణ్‌'', ''ఉలగం సుట్రుమ్‌ వాలిబన్‌'' వంటి భారీ సినిమాలు తీశాడు. సత్యా మూవీస్‌ బ్యానర్‌ కింద 1964లో తీసిన తొలిచిత్రం ''దైవత్తాయ్‌'' ద్వారా కె బాలచందర్‌ను సినీరంగానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఎమ్జీయార్‌తో తీసిన ''రిక్షాకారన్‌'' ఎమ్జీయార్‌కు జాతీయస్థాయిలో ఉత్తమనటుడు (అప్పట్లో 'భరత్‌' అనేవారు) తెచ్చిపెట్టింది. ఎమ్జీయార్‌ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు మానేసినా వీరప్పన్‌ సినిమాలు తీయడం మానలేదు. శివాజీతో, రజనీకాంత్‌తో, కమలహాసన్‌తో, సత్యరాజ్‌తో, యితరులతో సినిమాలు తీశాడు. చిరంజీవి విలన్‌గా, రజనీకాంత్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ''రాణువ వీరన్‌'' (1982) కూడా వీరప్పన్‌ నిర్మించినదే. అన్నిటినీ మించి సూపర్‌డూపర్‌ హిట్‌ ''బాషా'' (1995)కు కూడా వీరప్పనే నిర్మాత.

1989 జనవరిలో డిఎంకె నెగ్గి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక జానకి వర్గం, జయలలిత వర్గం మార్చి నెలలో కలిసిపోవడంతో ఎడిఎంకె ముఖ్యప్రతిపక్షంగా ఎదిగి, కాంగ్రెసును వెనక్కి నెట్టింది. ఈ రెండూ కలిస్తే తనకు రాబోయే ఎన్నికలలో యిబ్బంది అని భావించిన కరుణానిధి జులై నెలలో డిఎంకె నుండి గతంలో ఎడిఎంకెలో లోకి మారిన నాయకులందరూ మళ్లీ తమ పార్టీలోకి వచ్చేయవచ్చుంటూ ప్రకటించాడు. ఆ విధంగా ఎడిఎంకెను బలహీనపరుద్దామని అనుకున్నాడు. తన వర్గీయులందరూ జయలలితతో చేతులు కలిపాక గత్యంతరం లేక ఒంటరిగా మిగిలిన వీరప్పన్‌ ఎడిఎంకె (ఎమ్జీయార్‌) పేర వేరే పార్టీ పెడదామా అని ఊగిసలాడి, దానికి స్పందన ఎలా వుంటుందో తోచక ఖాళీగా వున్నాడు. ఈ ప్రకటన వచ్చాక, డిఎంకె నుండి తనకు కబురు వస్తుందేమో, జయలలితను అణచడానికి తనను ఉపయోగించుకుంటారేమో అని ఆశపడ్డాడు. ఎప్పుడో 1972లో పార్టీ నుంచి బయటకు వచ్చేశాక, 17 ఏళ్లు పోయాక తన స్థాయి నాయకుడు వెళ్లి వాళ్ల గుమ్మం ముందు నిలబడడం అవమానకరం అనుకున్నాడు. అయితే కరుణానిధి అతన్ని పిలిపించే ప్రయత్నం ఏమీ చేయలేదు. వీరప్పన్‌కు ఉక్రోషం వచ్చింది. అతని మూడ్‌ను గమనించిన జయలలిత తన సహాయకుడు నటరాజన్‌ను అతని వద్దకు పంపి పార్టీలో చేరమని అడిగింది. జయలలిత తన పట్ల చూపిన యీ ఔదార్యానికి వీరప్పన్‌ నిర్ఘాంతపోయాడు. అతను ఎప్పుడూ జయలలితను ఆదరంగా చూడలేదు, రకరకాలుగా అవమానించాడు. అయినా ఆమె అవన్నీ మర్చిపోయి, తన పార్టీలో ద్వితీయ స్థానం యిస్తానంటూ గౌరవంగా పిలుస్తోంది. కాదనడం ఎలా?

1989 ఆగస్టులో వీరప్పన్‌ జయలలిత నాయకత్వంలో ఎడిఎంకె పార్టీలో చేరాడు. అతని నిర్వహణాసామర్థ్యాన్ని గుర్తించిన జయలలిత అతనికి పార్టీలో నెంబర్‌ టూ స్థానం యిచ్చింది. వీరప్పన్‌ను అప్పటివరకు ఎదిరించి పోట్లాడిన జయలలిత వర్గీయులకు యిది మింగుడు పడలేదు. కానీ జయలలితను ఎదిరించే ధైర్యం లేదు. 'కరుణానిధిని ఓడించి మళ్లీ అధికారంలోకి రావాలంటే మనం కాంగ్రెసుతో చేతులు కలపాలి. వీరప్పన్‌ కాంగ్రెసు వ్యతిరేకి. ఆ పొత్తు కుదరకుండా చేస్తాడు.' అనసాగారు. దానికి వీరప్పన్‌ 'ఎమ్జీయార్‌ కాలంలో మేం కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోలేదా? అప్పుడు నేను అడ్డుకున్నానా?' అని సమర్థించుకున్నాడు. పార్టీకి జయలలిత కరిజ్మా, వీరప్పన్‌ నిర్వహణ రెండూ కావాలి లేకపోతే కరుణానిధి ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టం అనుకుని అందరూ సర్దుకున్నారు. జయలలిత పూర్తి స్థాయి (అప్పటికి) రాజకీయనాయకురాలు కాదు కాబట్టి, ఏదో తిక్కలో రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే అప్పుడు వీరప్పనే నాయకత్వం వహించి పార్టీ నడుపుతాడని ఆశించారు.

1991లో రాజీవ్‌ మరణం తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని జయలలిత నెగ్గి, ముఖ్యమంత్రి అయ్యాక వీరప్పన్‌కు తన కాబినెట్‌లో మంత్రి పదవి యిచ్చింది. కానీ కాంగ్రెసు జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్‌ను రాజకీయాల్లో దింపడానికి ప్రయత్నించసాగింది. రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లో రావాలని ఊగాడు. జయలలితకు వ్యతిరేకంగా స్టేటుమెంట్లు యివ్వసాగాడు. తన శైలితో విసిగి వున్న వీరప్పన్‌ రజనీకాంత్‌ చేత పార్టీ పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని జయలలితకు అనుమానం తగిలింది. ఎందుకంటే వీరప్పన్‌ రజనీతో సినిమాలు తీస్తున్నాడు. పైగా మంచి మిత్రుడు. అందువలన ఏడాది తిరక్కుండా 1992లో మంత్రి పదవి పీకేసింది. రజనీ రాజకీయాల్లోకి రాకపోవడంతో మళ్లీ కొన్నాళ్లకు నమ్మకం కుదిరి, మంత్రి పదవి యిచ్చింది. 1995 జనవరిలో వీరప్పన్‌ నిర్మించిన ''బాషా'' విడుదలైంది. వెంటనే వీరప్పన్‌కు శిక్ష పడింది. అతన్ని ఆహారశాఖ నుండి పశుసంవర్ధక శాఖకు బదిలీ చేసింది. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. విజయోత్సవ సభలో సినిమాలోని హీరో రజనీకాంత్‌ మాట్లాడుతూ ''రాష్ట్రంలో బాంబుల సంస్కృతి పెరుగుతోంది, శాంతిభద్రతలు కరువవుతున్నాయని ప్రభుత్వాన్ని విమర్శించాడు. వేదికపై వున్న వీరప్పన్‌ రజనీని ఎందుకు ఖండించలేదని జయలలితకు కోపం వచ్చింది. అంతే సెప్టెంబరు 1 న కాబినెట్‌లోంచి తీసేసింది. అతను  పార్టీలోంచి విడిగా వచ్చేసి ఎమ్జీయార్‌ పేర ఒక పార్టీ పెట్టాడు కానీ దాన్ని అతనే సీరియస్‌గా తీసుకోలేదు. గత 20 ఏళ్లగా అతను రాజకీయంగా అచేతనంగా వున్నట్లే లెక్క. మొన్నటి 90 ఏళ్ల సభలో రజనీకాంత్‌ మాట్లాడుతూ తన ''బాషా'' నాటి ఉపన్యాసం కారణంగా వీరప్పన్‌కు నష్టం వాటిల్లిందంటూ బాధ వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో యివన్నీ సహజమే అన్నాడు ఎన్నో ఎగుడుదిగుళ్లు చూసిన వీరప్పన్‌! (సశేషం) ఫోటో – ఆర్‌ఎమ్‌ వీరప్పన్‌ 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives