ఎమ్బీయస్‌: సినీమూలం- ఇద్దరు మిత్రులు- 2

తెలుగులో – గొప్పవాడి స్థానంలో వచ్చిన పేదవాడు ఆస్తి వ్యవహారాలు ఖచ్చితంగా చూడసాగాడు. భానోజీ కుట్ర బయటపడింది. ఆయువుపట్లన్నీ అతని చేతిలో వున్నాయి కాబట్టి మన అదుపులోకి వచ్చేవరకు సన్నిహితంగా వుండాలి అని మేనత్త…

తెలుగులో – గొప్పవాడి స్థానంలో వచ్చిన పేదవాడు ఆస్తి వ్యవహారాలు ఖచ్చితంగా చూడసాగాడు. భానోజీ కుట్ర బయటపడింది. ఆయువుపట్లన్నీ అతని చేతిలో వున్నాయి కాబట్టి మన అదుపులోకి వచ్చేవరకు సన్నిహితంగా వుండాలి అని మేనత్త హితోపదేశం చేసింది. తండ్రి విల్లు తీసి చదివితే భానోజీ కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే ఆజయ్‌కు ఆస్తి వస్తుందని, నగలన్నీ భానోజీ కూతురు సరళకే వెళతాయనీ వుంది. యీ విల్లు కూడా భానోజీ బనాయించినదే! బెంగాలీలో యీ విల్లు, నగలు గొడవ ఏమీ లేదు. అక్కడ ఆఫీసును చక్కదిద్దడం, భాగస్వామి మజుందార్‌ వచ్చి మెచ్చుకోవడం వుంది. ఆయన కూతురు యితనితో కలిసి పాటలు పాడుతోంది, కారులో షికార్లు కొడుతోంది. 

పేదవాడికి ఎట్టకేలకు మెకానిక్‌ ఉద్యోగం దొరికింది. ఆ తీపి కబురును తన యింటివారి అమ్మాయికి చేరేశాడు. తలిదండ్రులు వేరే సంబంధం చూసినా కాదని, యితనికి ఉద్యోగం దొరికేంతవరకు ఎదురుచూసిన ఆమె ఎంతో సంతోషించింది. తెలుగులో కూడా పేదవాడికి మెకానిక్‌ వుద్యోగం దొరికింది. ఈ దశలో అజయ్‌, విజయ్‌లు యిద్దరూ ఒకసారి కలిసే సందర్భం తెలుగులో కల్పించారు. ఈ సీనులో అజయ్‌ చేతికి వచ్చిన సూటూ, బూటూ తర్వాత అతను డబ్బుకోసం ఆఫీసుకీ, బాంక్‌కీ వెళ్లినపుడు వుపయోగపడ్డాయి. ఈ సీను బెంగాలీలో లేదు. తర్వాత అతనికి సూటూ, బూటూ ఎక్కణ్నుంచి వచ్చాయాన్న ప్రశ్న వస్తుంది. తెలుగులో అయితే లాజికల్‌గా వుంది.

తెలుగులో ఈ మెకానిక్‌కి పద్మ అనే ఓ గర్ల్‌ఫ్రెండు కూడా ఏర్పాటయింది. బెంగాలీలో- డబ్బున్నవాడి స్థానంలో వున్న పేదవాడికి తన పిల్ల నివ్వడానికి మజుందార్‌ ముందుకు వచ్చాడు. అజయ్‌కు దక్కాల్సిన పిల్ల వినయ్‌కి దక్కడం యిష్టం లేని మేనత్త ఆందోళన పడింది. వినయ్‌ను హెచ్చరించింది. దానితో బాధపడిన వినయ్‌ ఓ విరహగీతం పాడుకున్నాడు. తెలుగులో యిలాటి విరహగీతాలకు తావు యివ్వలేదు. విజయ్‌ వేషంలో వున్న అజయ్‌కు, పద్మకు మధ్య ఓ హుషారైన డ్యూయట్‌ పెట్టారు, మరో భావగీతం వంటి డ్యూయట్‌ కూడా పెట్టారు. అంతే కాదు అతని చెల్లెలుకి, బావగారికీ మధ్య హాస్యగీతం కూడా పెట్టారు. బావగారి యింట్లో బోల్డు హాస్య సన్నివేశాలు పెట్టారు. వీటివల్ల బెంగాలీ సినిమాలో కనబడే దరిద్రపు చీకటి తెలుగులో కనబడకుండా పోయింది. 

ఒరిజినల్‌లో లేని ట్విస్టు యిక్కడోటి పెట్టారు. డబ్బున్నవాడి స్థానంలో వచ్చిన బీదవాడు ఆఫీసులో ఖర్చు తగ్గించడానికి కార్లు అమ్మేస్తాడు, పనికి మాలిన ముసలి సెక్రటరీలను తీసేసి కొత్త సెక్రటరీకై యాడ్‌ యిప్పిస్తాడు. ఈ పోస్టుకి పద్మ సెలక్టయింది. అచ్చు తన ప్రియుడిలాగానే వున్న యజమానిని చూసి షాక్‌ తింది. అంతకుముందే అతన్ని భానోజీ కూతురు సరళతో సహా ఓ డాన్సింగ్‌ హాల్లో చూసింది. ప్రియుణ్ని అనుమానించింది. ఇప్పుడు నాలిక్కరుచుకుంది. ఆ సందర్భంగా మరో పాట పెట్టారు తెలుగువాళ్లు. అజయ్‌ స్థానంలో వున్న విజయ్‌ భానోజీ ఉద్యోగం పీకేశాడు. కానీ వాళ్ల కూతుర్ని చేసుకుంటానని ఆశపెట్టి ఊరడించాడు. ఆమెను తీసుకుని భానోజీ బంగళాకు ప్రయాణం కట్టాడు. 

బెంగాలీలో వినయ్‌ చెల్లెలు ప్రియుడికి పాటపాడే అవకాశం వచ్చింది. మొట్టమొదటిరోజు రికార్డింగ్‌లోనే పాట పాడి కూలిపోయాడు. టి.బి. అన్నారు. వైద్యానికి డబ్బు కావాలి. ఎంతమంది వద్ద అడిగినా పేదవాడి వేషంలో వున్న గొప్పవాడికిి డబ్బు పుట్టలేదు.తన స్థానంలో వున్న పేదవాణ్ని అడుగుదామని చూస్తే అతను ఊళ్లో లేడు. దాంతో అతను సూటూ, బూటూ వేసుకుని తన ఆఫీసు కెళ్లి చెక్కుతీసుకుని బ్యాంకు కెళ్లి సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు. వైద్యం కోసం డాక్టరుకి యిచ్చాడు. గొప్పవాడి వేషంలో వున్న పేదవాడు తిరిగి వచ్చి చెక్కు విషయం తెలుసుకున్నాడు. వెంటనే పోలీసు కంప్లయింట్‌ యిచ్చి తన పాత అడ్రసు చెప్పి ఫోర్జరీ చేసినవాడు అక్కడుంటాడు పట్టుకోండి అన్నాడు. ఇది చాలా ఎబ్బెట్టుగా వుందని చెప్పక తప్పదు. అందుకే తెలుగులో మార్చేశారు. 

తెలుగు వెర్షన్‌లో డబ్బు తీసుకోవలసిన అవసరం వేరేలా పడింది. చెల్లెలు గర్భవతి కావడంతో విషయం రట్టయింది. మావగారు డబ్బుకోసం ఒత్తిడి చేశాడు. దాంతో పేదవాడి వేషంలో వున్న గొప్పవాడు పాత డ్రస్‌ వేసుకుని వెళ్లి ఒరిజినల్‌లో లాగానే చెక్కు బుక్‌ తీసుకుని డబ్బు లాగేశాడు. అయితే యిక్కడ ఏమారిపోయినది పద్మ! అది ఆమెను చిక్కుల్లో పడేసింది. అజయ్‌ వూళ్లో లేడని, చెక్కు మార్చుకోవడానికి వచ్చినవాడు మోసగాడని భానోజీ కంప్లయింట్‌ యిచ్చి పోలీసులను రప్పించాడు. పోలీసులు విజయ్‌ స్థానంలో వున్న అజయ్‌ను అరెస్టు చేశారు. అతనికి సహకరించినందుకు పద్మను భానోజీ నిందిస్తే ఆమె అభిమానంతో తాళంచెవులు విసిరేసి వెళ్లిపోయింది. చేతికి చిక్కిన తాళం చెవులతో భానోజీ అజయ్‌ ఆఫీసు గది శోధించాడు. అక్కడ అజయ్‌, విజయ్‌ రాసుకున్న అగ్రిమెంటు అతని చేతికి చిక్కింది. 

బెంగాలీలో – వినయ్‌ చెల్లెలు యజమాని వేషంలో వున్న తన అన్న వద్దకు వెళ్లి డబ్బు యిచ్చేయబోయింది. ఆమెను గుర్తుపట్టనట్టు నటించాడు కానీ తన స్వంత చెల్లెలు గురించే అజయ్‌ యిలా చేశాడని తెలియగానే యితను పశ్చాత్తాప పడి, పోలీసుల వద్దకు వెళ్లి మాట్లాడేసి కేసు తీయించేశాడు. తెలుగులో యీ చెల్లెలి ఘట్టాన్ని కథలో మరో మలుపుకి వుపయోగించుకున్నారు.

విజయ్‌ అతని ప్లానులో భాగమైనట్టు నటిస్తూనే సరళతో పెళ్లి ఏర్పాటు చేయమన్నాడు. పెళ్లి రోజున భానోజీ యింట్లో అతను  దోచేసిన డబ్బంతా బయటపడింది. ఈ లోపున మేనత్త కారణంగా జైల్లోంచి బయటపడిన అజయ్‌ అక్కడికి చేరాడు. ఇద్దరూ కలిసి భానోజీ ఆట కట్టించారు. అతని దురాశ చూసి కూతురే అసహ్యించుకుంది. డబ్బు లేకపోయినా విజయ్‌నే వరిస్తానంది. కథ సుఖాంతం అయింది. ఒరిజినల్‌లో ఇంత గ్రేస్‌ఫుల్‌గా సాగలేదు. వినయ్‌ అజయ్‌ను జైల్లో కలిసి దరిద్రంతో రొమాన్సు తీరిపోయిందా? అని ఎద్దేవా చేశాడు. అజయ్‌ పరాజితుడిలా తల వంచుకున్నాడు. ఏతావాతా చెప్పేదేమిటంటే – యిన్‌స్పిరేషన్‌ ఎక్కడిదైనా కావచ్చు యింప్రవైజేషన్‌లో మన తెలుగువాళ్లు ఘనులు!  (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Part-1