ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 7

ఇతను బంగారుపాత్ర తీసుకుని కదలబోతూండగా లోపల్నుంచి రదనిక వచ్చి దొంగదొంగ అని అరిచింది. శర్విలకుడు ఆమెపై దాడి చేయబోయి, ఆడది కదాని వదిలేసి తను పారిపోయాడు. కన్నం చూసి రదనిక వేసిన కేకలకు మైత్రేయుడు…

ఇతను బంగారుపాత్ర తీసుకుని కదలబోతూండగా లోపల్నుంచి రదనిక వచ్చి దొంగదొంగ అని అరిచింది. శర్విలకుడు ఆమెపై దాడి చేయబోయి, ఆడది కదాని వదిలేసి తను పారిపోయాడు. కన్నం చూసి రదనిక వేసిన కేకలకు మైత్రేయుడు లేచి చారుదత్తుణ్ని కూడా లేపాడు. తలుపు తెరిచి వుండడం, కన్నం వేసి వుండడం గమనించారు. చారుదత్తుడు కన్నం చూసి వేసినవాడు మంచి నైపుణ్యం కలవాడని మెచ్చుకున్నాడు. 'చారుదత్తా, యీ దొంగెవడో పొరుగూరికి చెందినవాడై వుంటాడు. మన వూళ్లో వాళ్లందరికి యిక్కడ ఏమీ లేదని తెలుసు' అన్నాడు మైత్రేయుడు. 'అవునవును, కన్నం వేసి తర్వాత యింల్లో పరిస్థితులు చూసి హతాశుడై పోయి వుంటాడు. ఫలానా వారి యింట కష్టపడి కన్నం వేసి నష్టపోయాను అని సాటివారితో చెప్పుకుని వాపోతాడేమో' అని చారుదత్తుడు దొంగపై జాలిపడ్డాడు. మైత్రేయుడు విసుక్కున్నాడు – 'నీకు వాడి మీద జాలి ఏమిటయ్యా, నీకోసం యిక్కడ లంకెబిందె ఒకటి దాచి వుంచాం అని పిలుచుకుని వచ్చామా ఏమిటి?' అని అంటూండగానే అతనికి బంగారు ఆభరణాల పాత్ర సంగతి గుర్తుకు వచ్చింది. 'నేను చదువులేనివాడిని, తెలివితక్కువ వాడిని అని ఎద్దేవా చేస్తావు కానీ, సమయానికి నీకు నీకా పాత్ర యిచ్చివేయడం వలన అది సురక్షితంగా వుంది, లేకపోతే దొంగాడు పట్టుకుని పోయి వుండేవాడే' అని తృప్తిపడ్డాడు.

చారుదత్తుడు చిరుకోపంతో 'వేళాకోళానికి యిదా సమయం?' అన్నాడు. మైత్రేయుడు నొచ్చుకున్నాడు – 'సమయసందర్భాలు తెలియకుండా పరిహాసమాడతానా? నువ్వు నా దగ్గర నుంచి పాత్ర తీసుకోవడం మర్చిపోయావా? నే చెయ్యి చల్లగా వుందని నేనన్నాను కదా' అని. దాంతో సువర్ణపాత్ర పోయిందన్న విషయం అర్థమైంది. చారుదత్తుడు మూర్ఛపోయాడు. కాస్సేపటికి తెప్పరిల్లి 'నా సంపదలపై దేవుడికి మోహం పుట్టి వాటిని తీసేసుకున్నాడు. ఇప్పుడు నా శీలం మీద కూడా కన్ను పడిందే. అవి పోయాయి అంటే లోకంలో ఎవరు నమ్ముతారు?' అని చింతిల్లసాగాడు. మైత్రేయుడు 'నేనున్నానను కదా, అసలు ఎప్పుడు యిచ్చావు, సాక్షి ఎవరు అని వసంతసేనతో నేను దబాయిస్తాను కదా' అని వూరడించబోయాడు. 'ఇంత బతుకు బతికి యిప్పుడీ అబద్ధం ఎలా ఆడను? బిచ్చమెత్తయినా సరే అవి మరల సంపాదించి ఋణం తీర్చివేస్తాను.' అన్నాడు చారుదత్తుడు.

ఇంతలో రదనిక యింటి లోపలకి వెళ్లి సంగతంతా చారుదత్తుడి భార్య ధూతాదేవికి చెప్పింది. 'దొంగలు పడ్డారా? మా ఆయనకు, మైత్రేయుడికి దెబ్బలేమీ తగలలేదు కదా' అని ఆమె కంగారు పడింది. వారు క్షేమమే కానీ ఆభరణాల పాత్ర పోయిందని చెప్పగానే 'అయ్యో, ఆయన శరీరానికి దెబ్బ తగిలినా బాగుండేది, ఇప్పుడు ఏకంగా శీలానికే తగిలింది. ఆయన ఎలా ఓర్చుకుంటాడు. కావాలనే దొంగ పేరు చెప్పి నాటకం ఆడుతున్నాడని పౌరులు అనుకుంటారన్న వేదన ఆయనకు కలుగుతుంది. ఇప్పుడెలా?' అని బాధపడి 'దీని నుండి బయటపడడానికి ఒక్కటే మార్గం వుంది. మా ఆస్తిపాస్తులన్నీ పోయినా మా పుట్టింటివారు యిచ్చిన రత్నహారం ఒక్కటే మిగిలింది. అది నేను యిస్తానన్నా అభిమానాతిశయం చేత నా భర్త స్వీకరించలేదు. ఇప్పుడు యిచ్చినా పుచ్చుకోడు. అందుకని మైత్రేయుడికి దానం యిచ్చినట్లు యిచ్చేస్తాను. రదనికా, వెళ్లి మైత్రేయుణ్ని పిలు.' అంది.

మైత్రేయుడు రాగానే 'నేను రత్నషష్ఠి అనే వ్రతాన్ని ఆచరించాను. వ్రతసమాప్తి అయింది కాబట్టి ఒక రత్నాన్ని బ్రాహ్మణుడికి దానం యివ్వాలి. నీకు యిస్తున్నాను. తీసుకో' అంది. మైత్రేయుడు విషయం గ్రహించాడు. దానం పుచ్చుకుని బయటకు వచ్చి చారుదత్తుడికి రత్నహారాన్ని చూపించి సంగతి చెప్పాడు. 'నా భార్య నన్ను చూసి జాలిపడే పరిస్థితి వచ్చిందే, స్త్రీధనంపై ఆధారపడేట్లా చేసిన నా దరిద్రాన్ని ఏమనను' అని కాస్సేపు లిధపడి అంతలోనే 'కలిమిలేముల్లో వెంట నిలిచే ధూతాదేవి వంటి యిల్లాలు, తోడు వీడని నీ వంటి చెలికాడు, లోభానికి లొంగని ఋజువర్తన యింకా వున్నాయి. ఇవి వుండగా నేను దరిద్రుణ్ని కాను' అని వూరడిల్లాడు. తర్వాత 'మైత్రేయా, నువ్వు వసంతసేన వద్దకు వెళ్లి చెప్పు – 'మీరిచ్చిన ఆభరణాల పాత్రను చారుదత్తుడు జూదంలో పోగొట్టుకున్నాడు. దానికి బదులుగా యీ రత్నహారాన్ని సమర్పిస్తున్నాడు. దయచేసి స్వీకరించండి' అని ఆదేశించాడు.

మైత్రేయుడికి యిది రుచించలేదు. 'ఆ ఆభరణాలు మనం తినేయలేదు, దొంగలెత్తుకుపోయారు. వాటికి పెద్ద విలువా వుండి వుండదు. దానికి పరిహారంగా యింత ఖరీదైన నగ యివ్వడమా?' అని వాదించబోయాడు. 'ఇది నగల విలువా, రత్నహారం విలువా బేరీజు వేయవలసిన సమయం కాదు. ఇక్కడ చూడవలసినది నమ్మకం విలువ. ఏ నమ్మకంతో ఆ రోజు వసంతసేన తన నగలను మన దగ్గర దాచిందో ఆ నమ్మకానికి నేను చెల్లిస్తున్న మూల్యం – యీ రత్నహారం!' అని చారుదత్తుడు జవాబిచ్చాడు. 'వెళ్లబోయే ముందు యీ కన్నాన్ని పూడ్చివేద్దాం. దీన్ని యిలాగే వుంచి మెచ్చుకుంటూ కూర్చుంటే వేశ్యాధనం కాజేయాలనే మిషతో మనమే కావాలని దీన్ని కల్పించామని లోకం అపనిందలు వేస్తుంది.' అని హెచ్చరించాడు.

ఇలాటి పరిస్థితిలో కూడా స్థిరచిత్తంతో ఆలోచిస్తున్న చారుదత్తుణ్ని మెచ్చుకుంటూ మైత్రేయుడు వసంతసేన యింటికి బయలుదేరాడు.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు  2015)

[email protected]

Click Here For Archives