చిరంజీవి పాత కాంగ్రెస్ నేత అనే అంశాన్ని గుర్తు చేయడానికి అన్నట్టుగా పెండింగ్ లో ఉన్న ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసు ఒకటి చివరికి కొట్టివేయబడింది! ఈ మేరకు ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు గుంటూరులో ప్రచారం చేస్తూ.. చిరంజీవి ఎన్నికల ప్రచార నియమావళిని ఉల్లంఘించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నేతలపై ఇలాంటి కేసులు నమోదు చేస్తూ ఉంటారు. రాత్రి పది తర్వాత ప్రచారం.. విందులు, వినోదాలు, డబ్బు పంపిణీ వంటి వాటిపై కేసులు నమోదవుతూ ఉంటాయి.
ఇలాంటి కేసులు చాలా మంది నేతలపై ఉంటాయి కూడా! ప్రత్యేకించి ప్రచార నియామవళిని ఉల్లంఘించారనే కేసులు చాలా సహజం. అయితే వీటిపై విచారణల్లో చాలా రకాల వ్యత్యాసాలుంటాయి.
ఇలాంటి నియమావళిని ఉల్లంఘించడం చాలా పెద్ద నేరం కూడా! ఇదే సమయంలో ఇలాంటి కేసులు చాలా మందిపై అలా కొనసాగుతూ ఉంటాయంతే. చిరంజీవి పై తొమ్మిదేళ్ల కిందట నమోదైన ఈ కేసులో కూడా విచారణలు ఏమీ లేవు. ఆ కేసు అలా పెండింగ్ లో ఉండింది. తనపై ఈ కేసును కొట్టి వేయాల్సిందిగా కోరుతూ చిరంజీవి తరఫునే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆ కేసును కొట్టి వేసింది.