ఒక రోజు రాత్రి చారుదత్తుడు, మైత్రేయుడు కలిసి రేభిలుడనే గాయకుడి గానకచ్చేరికి వెళ్లి ఆలస్యంగా యింటికి వచ్చారు. వాళ్లు వచ్చేవరకు వేచి చూడడంలో వర్ధమానుడు అలసిపోయాడు. వచ్చాక వాళ్లకు కాళ్లకు నీళ్లిచ్చి మైత్రేయుడితో 'ఇప్పటికే బాగా పొద్దు పోయింది. ఇదిగో వసంతసేన యిచ్చిన ఆభరణాల పెట్టె. పగటి పూట కాపలా కాసే పని నాది, రాత్రి ఆ బాధ్యత నీది కాబట్టి నువ్వు తీసుకో, నేను వెళ్లి పడుక్కుంటాను' అని పెట్టె యిచ్చేసి వెళ్లిపోయాడు.
'దీని వలన నా నిద్రకు ముప్పు వచ్చేట్లుందే, అయినా ఊళ్లో దొంగలకు కూడా బద్ధకం పెరిగినట్లుగా వుంది. ఇప్పటిదాకా దీన్ని ఎత్తుకుపోకుండా నా నిద్ర చెడగొడుతున్నారు' అని చమత్కరించి, 'చారుదత్తా, దీన్ని లోపటింట్లో పెట్టనా?' అని అడిగాడు. చారుదత్తుడు 'కులస్త్రీల ఆభరణాలు దాచేచోట వేశ్య ఆభరణాలు పెట్టకూడదు కదా, ఆమెకు యిచ్చేవరకు నీ వద్దే దాచి వుంచు' అని చెప్పి అక్కడే నిద్రలోకి జారుకున్నాడు.
'ఇదో పెద్ద భారం పడిందే' అని తిట్టుకుంటూ పక్కనే మైత్రేయుడు ఆ నగలపెట్టె పట్టుకుని నడుం వాల్చి, అలసటతో నిద్రకు ఉపక్రమించాడు.
ఈ సమయంలో శర్విలకుడనే దొంగ ప్రవేశించాడు. ఇతను బ్రాహ్మణుడు, నాలుగు వేదాలు చదివాడు. ఎవరి వద్దా చేయిచాపనని ఒట్టు వేసుకున్నాడు. కానీ దారిద్య్రం వలన దొంగగా మారాడు. సేవకవృత్తి కంటె యిదే నయం అని అతని అభిప్రాయం. దొంగ పట్టుబడితే తను చేసిన అకృత్యానికి తనే శిక్ష అనుభవించానన్న తృప్తి వుంటుంది. అదే సేవకుడైతే యజమాని చేసిన తప్పులకు కూడా దండన అనుభవించాలి అని అతని తర్కం. అతను వసంతసేన వద్ద మదనిక అనే పరిచారికను ప్రేమించాడు. ఆమెను పెళ్లాడాలంటే వసంతసేనకు డబ్బు యిచ్చి ఆమె దాస్యం నుంచి విడిపించుకోవాలి. ఆ డబ్బు కోసం దొంగతనానికి బయలుదేరాడు.
తన శక్తి సామర్థ్యాల గురించి అతనికి గొప్ప ఆత్మవిశ్వాసం వుంది. నేను గోడలెక్కడంలో పిల్లిని, పరుగు పెట్టడంలో లేడిని, తన్నుకుపోవడంలో డేగను, మనిషి శక్తిని అంచనా వేయడంలో కుక్కను, కన్నంలో పాకడంలో పామును, ప్రమాదం పసిగట్టడంలో కుందేలును, రూపురేఖలు మార్చుకోవడంలో ఇంద్రజాల విద్యను, వివిధ భాషలు మాట్లాడడంలో సరస్వతిని, ఇబ్బంది ఎదురైతే నక్కను, నేలమీద గుర్రాన్ని, నీటిలో పడవను. అని చెప్పుకున్నాడు.
దొంగతనం చేయడంలో కూడా అతని కొన్ని నీతిసూత్రాలు పాటిస్తాడు. ఒక యింటికి వెళితే ఆ యింట్లో మగదిక్కు లేదని వదిలేశాడు. ఆ తర్వాత మరో యింటికి వెళితే అక్కడ యజమాని తన పరిజనంతో కబుర్లు చెపుతున్నాడు. లాభం లేదని బయటకు వచ్చేసి తిరుగుతూంటే యీ యిల్లు పెద్దగా కనబడడంతో యిక్కడ ఏదో దొరుకుతుందని ఆశపడ్డాడు.
ఇక గోడకు కన్నం వేయడంలో మెళకువల గురించి తనకు తెలిసినది స్వగతంగా ప్రేక్షకులకు చెప్తున్నాడు – 'గోడకు తేమ ఎక్కిన చోటు అనుకూలం. ఎందుకంటే కన్నం వేసేటప్పుడు అట్టే చప్పుడు కాదు. అందరికీ కనబడే చోట కాకుండా మరుగైన చోటులో కన్నం వేయాలి. అదీ మరీ పెద్దగా వేయకూడదు, మన శరీరం పట్టేటంతే వేయాలి. ఇటికలు వూడిపోయి, గోడ బలహీనపడిన చోటు కన్నానికి అత్యంత అనుకూలం. కన్నం వేసే గోడకు అవతల ఆడవాళ్ల పడకగది కాకూడదు. వాళ్లు చిన్న అలికిడైనా లేచి అరుస్తారు. ఇక కన్నంలో పలురకాలున్నాయి. కాల్చిన యిటుకలు వుంటే వాటిని పెళ్లగించాలి, పచ్చి యిటుకలుంటే వాటిని తడిపి లాగేయాలి, కర్ర యిటుకలుంటే కోయాలి, కన్నం ఆకారాల్లో కూడా భేదాలున్నాయి. వికసిత పద్మం, సూర్యమండలం, చంద్రరేఖ, దిగుడుబావి, స్వస్తిక, పూర్ణకుంభం, విస్తీర్ణం యిలా ఏడు రకాలున్నాయి. ఈ గోడకు పూర్ణకుంభాకారపు కన్నమే సరైనది. రేపు ఉదయం ఉజ్జయినీ పౌరులు నా కౌశలం చూసి మెచ్చుకోవాలి.'
ఇలా అనుకుని చోరకళపై గ్రంథాలు రాసిన కార్తికేయ, కనకశక్తి, బ్రహ్మణ్యదేవ, దేవవ్రత, భాస్కరనందిలకు నమస్కరించి యోగరోచన అనే లేహ్యాన్ని ఒంటికి పూసుకున్నాడు. అది పూసుకుంటే దొంగ ఎవరకీ కనబడడట, ఏదైనా ఆయుధం తగిలినా గాయం కాదు. అంతలో అతనికి గుర్తుకు వచ్చింది కన్నం వేయడానికి కొలతతాడు తెచ్చుకోలేదని. దాంతో తన యజ్ఞోపవీతాన్నే కొలవడానికి వాడుకున్నాడు. జందెం ఎన్ని విధాల ఉపయోగపడుతుందో తలచుకున్నాడు. దానితో కొక్కాన తగిలించిన ఆభరణాలను లాగవచ్చు, వాకిలి గడియలను ఎత్తివేయవచ్చు, కన్నంలో పాకుతుండగా తేలు వగైరాలు కుడితే విషం పైకి ఎక్కకుండా దానితో గాయం వద్ద కట్టవచ్చు.
కన్నం పూర్తయాక అతను ముందు దాని ద్వారా దిష్టిబొమ్మను లోపలకి ప్రవేశపెట్టాడు. ఎవరైనా దాన్ని గమనించి కేకలు పెడితే తను పారిపోవచ్చని ఆలోచన. అలికిడి ఏమీ కాకపోవడంతో లోపలకి వచ్చి రెండు మంచాల మీద యిద్దరు వ్యక్తులు నిద్రపోతూండడం చూశాడు. అవసరమైతే పారిపోవడానికి వీలుగా వీధి గుమ్మం తెరిచి వుంచాడు. తెరిచినపుడు చప్పుడు కాకుండా మడతబందులలో నీళ్లు చల్లాడు. అప్పుడు అక్కడున్నవారిది నిజమైన నిద్రో, అబద్ధపు నిద్రో తెలుసుకోవడానికి పాము బుసల శబ్దం చేశాడు, పిల్లి కూతలు కూశాడు. కానీ వారిలో చలనం లేదు. అప్పుడు దగ్గరకు వచ్చి మరింత నిశితంగా పరిశీలించాడు. వాళ్ల వూపిరి సమానస్థాయిలో హెచ్చుతగ్గులు లేకుండా సాగుతోందని, కనుగుడ్డులు కదలటం లేదని, మంచం కన్నా పొడుగ్గా కాళ్లూ చేతులు వివశంగా పడి వున్నాయని గమనించి, యివన్నీ నిద్రాలక్షణాలే అని నిర్ధారించుకున్నాడు.
అప్పుడు చుట్టూ తన చూపు సారించాడు. ఇంట్లో వీణ, మృదంగం వంటి వాయిద్యాలు కనబడ్డాయి. ఇది ఏ నాట్యాచార్యుడి యిల్లో అయి వుంటుంది, డబ్బూ దస్కం వుండి వుండదు అని నిరాశపడ్డాడు. అసలు యీ యింట్లో డబ్బు లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి మంత్రించి తన వెంట తెచ్చుకున్న గింజలను నేలపై పెట్టాడు. అవి విచ్చుకోకపోవడంతో అక్కడ డబ్బు లేదని తెలిసిపోయింది.
నిరాశతో వెళ్లి పోతూ వుండగా యింతలో మైత్రేయుడు నిద్రలో పలవరించసాగాడు. 'ఇదిగో మిత్రమా, యింట్లోకి దొంగ ప్రవేశించినట్లు అనిపిస్తోంది. ఈ బంగారుపాత్రను నువ్వే తీసేసుకో.' అన్నాడు.
అది విని శర్విలకుడు ఉలిక్కిపడ్డాడు. తనను గమనించి వెక్కిరిస్తున్నాడా అని సందేహపడుతూనే అతన్ని గమనించి చూశాడు. అతను పలవరిస్తున్నాడని గ్రహించాడు. అతని చేతిలో బంగారు పాత్ర, దానికి మూతగా కట్టిన చిరుగు వస్త్రాన్ని చూశాడు. వీడూ నాలాటి దరిద్రుడే, వీణ్ని దోచుకోవడం తగదు అనుకుని వెళ్లిపోబోయాడు.
అయితే మైత్రేయుడు పలవరింతలు ఆపలేదు. 'ఇదిగో, యీ పాత్ర తీసుకోకపోతే నువ్వు గోబ్రాహ్మణుల శాపానికి గురవుతావు జాగ్రత్త' అన్డాడు. ఇక తీసుకోక తప్పదు అనుకున్న శర్విలకుడు అక్కడున్న దీపాన్ని ఆర్పడానికి తను వెంట తెచ్చుకున్న అగ్గిపురుగును వదిలాడు. అది దీపం ఆర్పివేసిన తర్వాత వెళ్లి పాత్రను అందుకోబోయాడు.
అప్పుడే కన్నం వేసి వుండడం వలన అతని చెయ్యి చల్లగా వుంది. నిద్రలో కూడా దాన్ని మైత్రేయుడు గమనించాడు. 'నీ చేతివేళ్లు చల్లగా వున్నాయే' అన్నాడు. శర్విలకుడు వెంటనే చంకలో చేయి పెట్టుకుని వెచ్చ చేసుకుని కుండను అందుకున్నాడు.
'అమ్మయ్య అందుకున్నావు కదా, యిప్పుడు సరుకంతా అమ్ముడుపోయిన వ్యాపారిలా నేను హాయిగా నిద్రిస్తాను.' అని మైత్రేయుడు అటు తిరిగి పడుక్కున్నాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)