లోకేష్-ఎన్టీఆర్ ల నడుమ సమరం ఇప్పట్లో సమసి పోయే సూచనలు కనిపించడం లేదు. లోకేష్ తో తెరవెనుక అయినా సరే, వైరం ప్రారంభమైన నాటి నుంచీ జూనియర్ ఎన్టీఆర్ కు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. టైమ్ బాగాలేదో, సినిమాలు బాగాలేవో, తెరవెనుక ఎత్తుగడలు ఫలిస్తున్నాయో కానీ ఎన్టీఆర్ మాత్రం సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు. దానికి తోడు గతంలో ఎన్టీఆర్ సినిమా చూడొద్దంటూ ఎస్ఎస్ఎస్ లు వగైరా ప్రచారం సాగింది.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తోంది..నాన్నకు ప్రేమతో అంటూ దర్శకుడు సుకుమార్, నిర్మాత భోగవిల్లి ప్రసాద్ అందిస్తున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా అమ్మకాలపై లోకేష్ అండ్ బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ కు వున్న విబేధాలు ప్రభావం చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా కయ్యానికి కాలు దువ్వినట్లు, బాలయ్య బాబు సినిమాకు పోటీగా ఎన్టీఆర్ సినిమా రావడం కూడా లోకేష్ అండ్ కో ను కాస్త కవ్వించినట్లు వినికిడి.
సంక్రాంతికి కావచ్చు, మామూలుగా కావచ్చు, అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తే తప్ప, పెద్ద సినిమాలు గట్టెక్కడం కష్టం. హౌస్ ఫుల్స్ వుంటాయి అనుకున్నన్నాళ్లు యూనిఫారమ్ టికెట్ రేటు పెట్టి వీలయినంత కలెక్షన్లు లాక్కోవాల్సిందే. పెద్ద హీరోల సినిమాలకు ఈ రేటు రెండు వందల వరకు వుంటుంది. ఇప్పుడు బాలయ్యకు సినిమాకు పోటీగా విడుదలవుతున్న ఎన్టీఆర్ సినిమా కొనేవాళ్లకు తెరవెనుక ఈ తరహా హెచ్చరికలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది..దాంతో చాలా మంది బయ్యర్లు వెనకడుగు వేస్తున్నరని టాక్ వినిపిస్తోంది.
నాన్నకు ప్రేమతో సినిమా ఓవర్ సీస్ పాత వ్యవహారాలకు గాను ఎప్పుడో ఇచ్చేసారు. పెద్దగా రాబడి లేదు. అందువల్ల నిర్మాతకు ఆంధ్ర, సీడెడ్, నైజాం ఆదాయమే కీలకం. ఇప్పుడు బాలయ్య-ఎన్టీఆర్ విబేధాలు దానిపై ప్రభావం చూపించేలా వున్నాయి. అసలే ఈ సారి సంక్రాంతి పండుగకు సినిమా జోరు కాస్త ఎక్కువగా వుండేలా వుంది. ఫస్ట్ తేదీ నుంచే సినిమాల విడుదల వుంది. బాబాయ్ – అబ్బాయ్ ల సినిమాలకు పోటీగా నాగ్ లేటెస్ట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా కూడా విడుదలవుతోంది.
అలాగే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి నుంచి శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా విడుదలకు రెడీ అవుతోంది. వీటన్నింటి నడుమ థియేటర్ల సమస్య..పైగా ప్రభుత్వ సాయం లేకుండా అధిక ధరలకు టికెట్ లు అమ్మడం, పైరసీని ఎదుర్కోవడం వంటివి కాస్త కష్టం. మరి వీటన్నింటినీ కేవలం సినిమా సూపర్ అనిపించుకోవడం ద్వారానే ఎన్టీఆర్ ఎదుర్కోగలడు..మరి ఆ అవకాశం వుందో లేదో?