టాలీవుడ్ లో ఓ డిజాస్టర్ సినిమాకు సంబంధించి ఈ రోజు సెటిల్మెంట్ జరుగుతోందని వినికిడి. ఆ మధ్య భారీ అంచనాల నడుమ ఓ సినిమా విడుదలయింది. కానీ బాక్సాఫీసు వద్ద సరిగ్గా క్లిక్ కాలేదు. దీంతో బయ్యర్లకు పది కోట్లకుపైగానే నష్టం వాటిల్లినట్లు వినికిడి. దీంతో ఆ సినిమా తను రెమ్యూనిరేషన్ గా తీసుకున్నదాంట్లోంచి కొంత మొత్తం వదులుకోవడమే కాకుండా, తను కొంత మొత్తం వెనక్కు ఇవ్వాలని ఆ సినిమా దర్శకుడు డిసైడ్ అయినట్లు వార్తలు వినవచ్చాయి.
ఆ మేరకు ఆ దర్శకుడు తన స్వంత ఊరి నుంచి మూడు కోట్ల మేరకు భారీమొత్తం తెప్పించినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని బయ్యర్లకు పంపిణీ చేస్తారట. టాలీవుడ్ లో ఓ దర్శకుడు ఇలా ఇంత భారీ మొత్తం వెనక్కు ఇవ్వడం ఇదే తొలిసారి. సదరు దర్శకుడు ఆ సినిమాకు 11 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని, మూడు కోట్లు వదిలేసుకుని, ఇప్పుడు మళ్లీ మరో మూడు కోట్ల మేరకు వెనక్కు ఇచ్చారు.
నిజానికి రూలు ప్రకారం అయితే చేయక్కరలేదు కానీ, నైతిక బాధ్యతగా ఆయన ఇది చేస్తున్నారు అంటే మెచ్చుకోదగ్గ విషయమే. అంతా బాగానే వుంది. స్వంత ఊరి నుంచి మూడు కోట్లకు పైగా క్యాష్ రూపంలో ఎలా తెప్పించగలిగారో?