ఇప్పుడు నేను స్కాట్లండ్‌కు చెందిన విలియం వాలేస్ అనే వీరుడి చరిత్ర చెప్పబోతున్నాను. అతనిపై 1305 ఆగస్టులో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన విచారణలో రాజద్రోహిగా నిర్ణయించారు. టవర్ ఆఫ్ లండన్‌కు తీసుకుని వెళ్లి బట్టలూడదీసి, నగరవీధుల్లో నగ్నంగా గుఱ్ఱానికి కట్టి యీడ్చుకుంటూ స్మిత్‌ఫీల్డ్ వరకు తీసుకెళ్లి అక్కడ ఉరివేశారు. ప్రాణం వుండగానే ఉరి కంబం నుండి కిందకు దింపి అంగాంగాలు ఖండించి, అతని కళ్లముందనే వాటిని కాల్చి, తర్వాత అతనికి శిరచ్ఛేదం చేశారు. రాజద్రోహులకు యిదే గతి అని చాటడానికి శరీరాన్ని నాలుగు ముక్కలుగా తరిగి రాజ్యంలో నాలుగు ప్రాంతాల్లో వేలాడదీశారు. శిరస్సును తారులో ముంచి లండన్ బ్రిజ్‌పై వేలాడగట్టారు. అయితే స్కాట్లండ్ ప్రజలు అతన్ని మర్చిపోలేదు. స్కాట్లండ్ పారతంత్య్రంతో, పరాభవంతో రగులుతున్నప్పుడు ఉద్భవించిన విలియం వాలెస్ స్కాట్లండ్‌కు రాజు కాలేకపోయినా ప్రతీ స్కాట్ గుండెల్లో కొలువై వున్నాడు. స్కాట్లండ్‌కు గుండెకాయ అనదగిన ఎడింబరా (జూఖిరిదీలీతిజీవీనీ) కోట ప్రధాన ద్వారం వద్ద అటుయిటు వున్న రెండు విగ్రహాల్లో చేతిలో కత్తి వున్న విగ్రహం వాలెస్‌ది. కత్తి ఒరలో వున్న రెండో విగ్రహం ఇంగ్లండుపై నిరంతర పోరాటం చేసిన రాబర్ట్ ద బ్రూస్ అనే స్కాట్లెండ్ రాజుది. వాలెస్ కథ తర్వాత అతని కథ చెప్తాను. వాలెస్ ఇంగ్లండు పాలకులపై విజయం సాధించిన స్టర్లింగ్ బ్రిజ్ వద్ద స్కాట్ ప్రజలు 1869లో ఒక స్మారకచిహ్నాన్ని నిర్మించారు. అతనిపై వాల్టర్ స్కాట్ ''హీరో ఆఫ్ స్కాట్లండ్'' అనే నవల రాశాడు. అతని కథపై ఆధారపడి మెల్ గిబ్సన్ హీరోగా, దర్శకుడిగా ''బ్రేవ్‌హార్ట్'' (1995) సినిమా వచ్చి విజయవంతమైంది. సినిమాలో చరిత్రను మార్చేసేరన్న విమర్శ వచ్చింది. ముందుగా చరిత్ర. చివరిలో ఆసక్తి వుంటే సినిమా కథ చదవవచ్చు – వేరే లింకులో!
13 వ శతాబ్దపు చివరి రోజుల్లో స్కాట్లండ్‌కు రాజు లేడు. రాజైన మూడవ అలెగ్జాండర్ గుఱ్ఱం మీద నుంచి పడిపోయి 1286లో చనిపోయాడు. అతని కొడుకులు అతని కంటె ముందే చనిపోయారు. అతని కూతురి కూతురు నాలుగేళ్ల మార్గరెట్‌ను (ఈమెను మెయిడ్ ఆఫ్ నార్వే అంటారు) రాణిగా ప్రకటించారు. కానీ ఆమె చిన్నపిల్ల కాబట్టి, నార్వేలో తన తండ్రి వద్ద పెరుగుతోంది కాబట్టి, స్కాట్లండ్‌లోని ఆరుగురు సామంతరాజులకు రాజ్యాన్ని పాలించే అధికారాన్ని అప్పగించారు. ఈ ఆరుగురు నిత్యం తమలో తాము కలహించేవారు. స్కాట్లండ్‌లో శాంతిభద్రతల కంటె తమ ఆధిపత్యం కోసమే ఎక్కువ ప్రయత్నించారు. నాలుగేళ్లు యిలాగే గడిచాయి. అప్పట్లో ఇంగ్లండుకి రాజుగా మొదటి ఎడ్వర్డ్ (1239-1307) వుండేవాడు. ఇతన్ని ఎడ్వర్డ్ లాంగ్‌షాన్‌క్స్ (సన్నటి, పొడుగుకాళ్ల..) అని వెక్కిరింతగా పిలిచేవారు. 1272లో రాజైన దగ్గర్నుంచి స్కాట్లండ్‌ను, ఇంగ్లండ్‌ను ఏకం చేసి దానికి తను రాజుగా వుండాలని అతని పథకం. ఇప్పుడు అవకాశం కనబడింది. తన కొడుకైన రెండో ఎడ్వర్డుకి, ఎనిమిదేళ్ల మార్గరెట్‌కు పెళ్లి నిశ్చయించాడు. ఎడ్వర్డ్ మనసులో ఏముందో తెలిసిన స్కాట్లండ్ సామంతరాజులు తమ రాణి ఇంగ్లండ్ యువరాజును పెళ్లాడినా, తమ దేశం మాత్రం స్వతంత్రంగానే వుంటుందని స్పష్టం చేశారు. పెళ్లయ్యాక వీళ్ల పని పట్టవచ్చని అనుకున్న ఎడ్వర్డు దానికి సరేనన్నాడు. 1290లో మార్గరెట్ పెళ్లికై నార్వే నుంచి స్కాట్లండ్‌కు వస్తూ దారిమధ్యంలో జ్వరంతో చనిపోయింది.
ఇక దానితో స్కాట్లండ్‌లో రాజబంధువులలో 12 మంది ప్రముఖులు నేనే రాజునవుతా, నాకు హక్కుంది అంటూ గొడవ చేయసాగాడు. ఈ కాలాన్ని ''గ్రేట్ కాజ్'' అన్నారు. స్కాట్లండ్‌లో అంతర్యుద్ధం చెలరేగుతుందని భయపడ్డారు. వీరిలో ఎవరి తగినవారో తేల్చే బాధ్యతను చనిపోయిన స్కాట్లండ్ రాజు అలెగ్జాండరుకు బావ, పొరుగురాజు అయిన ఎడ్వర్డ్‌కి అప్పగిద్దామనుకున్నారు స్కాట్లండ్ సామంతరాజులు. కానీ ఎడ్వర్డ్ అలా అనుకోలేదు. తనను వాళ్లు మానసికంగా మహారాజుగా అంగీకరించారని, లాంఛనాలు మిగిలాయని అనుకున్నాడు. రాజబంధువుల్లో అందరి కంటె ఎక్కువ హక్కు వున్న అనన్డేల్ సామంతరాజ్యపు 5 వ లార్డ్ రాబర్ట్ ద బ్రూస్, జాన్ బలియోల్‌లను తన వద్దకు రప్పించుకున్నాడు. 'నా సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి' అనే షరతు ముందు పెట్టాడు. రాబర్ట్ కుదరదన్నాడు, బలియోల్ సరేనన్నాడు. ఎడ్వర్డ్ బలియోల్‌ను రాజుగా ఎంపిక చేశాడు. ప్రతిగా బలియోల్ 'నేను నీ మనిషిని' అని ఎడ్వర్డ్ ఎదుట శపథం చేసి స్కాట్లండ్ రాజచిహ్నాన్ని నాలుగు ముక్కలు చేసి అతని చేతిలో పెట్టాడు. 1292లో స్కాట్లండ్ సింహాసనం అధిష్టించాడు. అవకాశం కోల్పోయిన తర్వాత రాబర్ట్ ద బ్రూస్(1215-95)లో పశ్చాత్తాపం కలిగిందేమో తెలియదు కానీ తదాది ఎడ్వర్డ్‌కే వత్తాసు పలుకుతూ వచ్చాడు. అతనే కాదు, అతని కొడుకు అనన్డేల్ 6 వ లార్డ్ – అతని పేరూ రాబర్ట్ ద బ్రూస్ (1243-1304)యే – కూడా రాజభక్తుడే. మనుమడు – అతని పేరూ రాబర్ట్ ద బ్రూస్ (1274-1329)యే – మాత్రం కొంతకాలం రాజభక్తుడిగా వుండి తర్వాత ఎదురు తిరిగి పోరాడి, స్కాట్లండ్‌కు రాజై, మళ్లీ రాజ్యభ్రష్టుడై ఇంగ్లండుపై పోరాటం సాగించి అమరుడయ్యాడు. మొదటి యిద్దరి స్పెల్లింగుల్లో చివర ఎస్ వుంటే యితని పేరు స్పెల్లింగులో సిఇ వుంటుంది. అతని విగ్రహమే ఎడింబరా కోట గుమ్మంలో వుంది.
ఒకసారి రాజయ్యాక ఎడ్వర్డ్‌ను లక్ష్యపెట్టనక్కరలేదని అనుకున్న బలియోల్ కంగుతినాల్సి వచ్చింది. మాటిమాటికీ ఎడ్వర్డ్ అతన్ని రప్పించి చివాట్లు వేస్తూండేవాడు. తనను ఎదిరించిన జమీందారుపై బలియోల్ చర్య తీసుకుంటే జమీందారు ఎడ్వర్డ్‌కి చెప్పుకోవడం, ఎడ్వర్డ్ బలియోల్‌ను పిలిచి మందలించడం జరిగేది. ఇదంతా స్కాట్ ప్రజలకు దుర్భరంగా తోచేది. తమ రాజు బలహీనుడు కావడం వారిని బాధించింది. ఎడ్వర్డ్ ఫ్రాన్సుపై యుద్ధానికి వెళుతూ సహాయంగా స్కాట్ సైన్యాన్ని పంపమని ఆజ్ఞాపించినప్పుడు స్కాట్లు సైన్యాన్ని పంపకపోగా, ఫ్రెంచ్‌వారికి సహాయపడతామని చెప్పారు. అంతేకాక, ఆస్థానంలో వున్న ఇంగ్లీషు వారిని తరిమివేశారు. ఈ ధిక్కారాన్ని సహించలేక ఎడ్వర్డ్ స్కాట్లండ్‌పై దండెత్తాడు. స్కాట్ వీరులు బలియోల్‌ను కోటలో బంధించి, అతను లేకుండా యుద్ధభూమికి వెళ్లారు. అయితే స్కాట్‌లందరూ ఐక్యంగా లేరు. చాలామంది సామంతరాజులకు, జమీందార్లకు ఇంగ్లండులోను, స్కాట్లండ్‌లోను భూములున్నాయి. రెండు ప్రాంతాల మధ్య యుద్ధం వస్తే వారికి యిబ్బంది. ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. ఇద్దరిలో తెలివైనవాడు, బలవంతుడు అయిన ఎడ్వర్డ్‌నే ఎంచుకుని అతని తరఫున పోరాడారు. వారిలో రాబర్ట్ ద బ్రూస్ (అనన్డేల్ 6 వ లార్డ్) వున్నాడు. అతనికి బలియోల్‌పై కోపం. తమ వంశీకులు జన్మతః ఒకలా ఇంగ్లీషు, మరొకలా స్కాటిష్ కాబట్టి ఎడ్వర్డ్ తన తండ్రికి యివ్వని అవకాశం తనకి యిస్తాడేమో, బలియోల్ స్థానంలో స్కాట్లండ్ రాజును చేస్తాడేమో అని ఆశపడ్డాడు.
ఎడ్వర్డ్ తన సేనను నడుపుతూ వచ్చి బెర్విక్ వద్ద స్కాటిష్ సైన్యాన్ని ఓడించాడు. కానీ స్కాట్ వీరులు బలియోల్‌ను లొంగనీయలేదు. వచ్చి కప్పం కట్టమని ఎడ్వర్డ్ పంపిన ఆదేశాలను తిరస్కరిస్తూ అతని పేర లేఖ పంపించారు. అది చూసి ఎడ్వర్డ్ మండిపడ్డాడు. ఒక్కో నగరాన్ని, ఒక్కో కోటను జయిస్తూ ముందుకు సాగాడు. సామంతరాజులందరూ అతని ముందు సాగిలబడ్డారు. చివరకు 1296లో మాంట్రోజ్ వద్ద బలియోల్ ఎడ్వర్డ్‌కు ఎదురుపడ్డాడు. నెత్తిమీద కిరీటం లేకుండా, ఒంటిపై రాజచిహ్నాలు లేకుండా ఒక బానిసలా అతని ముందు నిలబడి 'చెడు మాటలు విని చెడిపోయాను, నన్ను క్షమించండి' అని కాళ్ల మీద పడ్డాడు. స్కాట్లండ్‌పై నాకే హక్కూ లేదు, సర్వం మీదే అనేశాడు. వీరుడైన ఎడ్వర్డ్‌కు అతి భీరుడైన బలియోల్ ప్రవర్తన చికాకు తెప్పించింది, అతన్నీ, అతని కొడుకుని ఖైదీలుగా ఇంగ్లండుకి పంపాడు. స్కాట్లండ్ ప్రజలు బలియోల్‌ను అసహ్యించుకుని అతన్ని 'టూమ్ టబార్డ్ (ఎంప్టీ కోట్, పైన పటారం, లోపల డొల్ల అనవచ్చేమో) అనే పేరు తగిలించారు.
యుద్ధం ముగిశాక రాబర్ట్ బ్రూస్ వచ్చి తనకు స్కాట్లండ్ సింహాసనం అప్పగించమని కోరినప్పుడు ఎడ్వర్డ్ మండిపడ్డాడు. 'కష్టపడి రాజ్యాలు గెలిచింది నీ చేతిలో పెట్టడానికా? నాకు వేరే పని లేదా?' అని వెక్కిరించాడు. బ్రూస్ అవమానభారంతో తన జమీకి వెళ్లి భూములు చూసుకోసాగాడు. ఎడ్వర్డ్ స్కాట్లండ్ ఏలడానికి రాజప్రతినిథులను (గవర్నర్లను) నియమించాడు. స్కాట్ కోటలను ఇంగ్లీషు సైనికులతో నింపివేశాడు. స్కాట్ ప్రజలు తమ గతవైభవాన్ని, స్వతంత్రదేశంగా వుండేవాళ్లమన్న సంగతి గుర్తు చేసుకోవడానికి వీల్లేకుండా స్కాట్లండ్ చరిత్ర రాసిన అనేక పుస్తకాలను దగ్ధం చేశాడు. తిరిగి ఇంగ్లండు వెళుతూ వెళుతూ ''స్టోన్ ఆఫ్ డెస్టినీ''ని తీసుకుని పోయాడు. అప్పణ్నుంచి అది వెస్ట్‌మినిస్టర్‌లోనే వుంది. బ్రిటన్‌లో రాజపట్టాభిషేకం జరిగినప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. (సశేషం) (ఫోటోలు – ఎడింబరా కోటగుమ్మం, విలియం వాలెస్ విగ్రహం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)