వందల కోట్లకు సాహసం చేసి రాజమౌళి గెలిచాడు..గ్రామం, దత్తత, ఫ్యామిలీ అటాచ్ మెంట్లతో మహేష్ కూడా గెలిచేసాడు. ఇక కాకతీయుల చరిత్ర, హీరోయిన్ ఓరియెంటెడ్ రుద్రమదేవి గెలవాలి. పైగా 70 కోట్ల మేరకు స్వంతంగా రిస్క్ చేయడానికి సిద్దపడిన గుణశేఖర్ గెలవాలి.
మరో రెండు వారాల్లో రుద్రమదేవి సినిమా విడుదల కాబోతోంది. పైగా బాహుబలి మాదిరిగా యూనివర్సల్ సబ్జెక్ట్ కాకున్నా, కేవలం తెలుగువారికి మాత్రమే పరిమితమైన చరిత్ర అయినా, తమిళ, కన్నడ, మళయాల, హిందీ వెర్షన్లు కూడా విడుదల చేస్తున్నాడు.
అలా చేయకపోతే కేవలం తెలుగులోనే నిర్మాణ వ్యయం అంతా రాబట్టడం కష్టం. త్రీడీ, టూ డీ వెర్షన్లు, స్టీరియో ఫోనిక్ సౌండ్ ఇలా చాలా ఖర్చు చేసేసాడు. పైగా చరిత్రను తలకెత్తుకుని సినిమా తీయడం అంటే సాహసమే.
బాహుబలి, శ్రీమంతుడు రెండు ప్రయత్నాలను మెచ్చుకుని, డబ్బులిచ్చిన ప్రేక్షకులు రుద్రమదేవిని కూడా ఆదరించేస్తే, ఓ పని అయిపోతుంది. కిక్ 2 వగైరా సినిమాలంటారా? అప్పుడు సదా వచ్చే రొటీన్ మాస్ మసాలా ఎంటర్ టైనర్లే కదా.